యుక్రెయిన్‌లో ఆరు నెలల పాటు దాక్కుని దొరికిపోయిన రష్యా సైనికుడు

ఫొటో సోర్స్, KHARKIV REGIONAL POLICE DEPARTMENT
- రచయిత, అలిస్ డేవీస్
- హోదా, బీబీసీ న్యూస్
యుక్రెయిన్‌లో యుద్ధానికి వచ్చిన రష్యా సైనికుడు ఒకరు ఆరు నెలల పాటు తను రష్యా సైనికుడన్న విషయం బయటపడకుండా యుక్రెయిన్‌లోనే తలదాచుకున్న ఉదంతం వెలుగు చూసింది.
ఖార్కియేవ్‌లో సదరు రష్యా సైనికుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు.
యుక్రెయిన్ సాయుధ బలగాలు సోమవారం నాడు కుపియాన్‌స్క్ జిల్లాలో పెట్రోలింగ్ చేస్తుండగా.. ఈ 42 ఏళ్ల రష్యా సైనికుడు తారపడ్డాడని తెలిపారు.
పౌర దుస్తుల్లో ఉన్న ఆ వ్యక్తిని ఆపి నిశితంగా ప్రశ్నించినపుడు అతడు రష్యా సైనికుడని తేలిందన్నారు.

ఫొటో సోర్స్, Reuters
ఇంతకుముందు రష్యా ఆక్రమించుకున్న ఈ ప్రాంతాన్ని యుక్రెయిన్ బలగాలు గత సెప్టెంబర్ నెలలో తిరిగి స్వాధీనం చేసుకున్నాయి.
అప్పటి నుంచీ తాను నిర్మానుష్య భవనాల్లో దాక్కుంటూ గడుపుతున్నాని ఆ సైనికుడు పోలీసులకు చెప్పారు.
అతడు మాస్కో ప్రాంత నివాసి అని, రష్యా సైన్యంలోని 27వ సెపరేట్ గార్డ్స్ మోటార్ రైఫిల్ బ్రిగేడ్ సైనికుడని గుర్తించారు.
ఈ సైనికుడిని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.
యుక్రెయిన్ మీద రష్యా గత ఏడాది దండయాత్ర మొదలుపెట్టిన తర్వాత.. ముఖ్యమైన రైల్వే జంక్షన్‌కు కేంద్రమైన కుపియాన్‌స్క్‌లో భీకర యుద్ధం సాగింది.

రష్యా కొన్ని రోజుల్లోనే ఈ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది. రష్యా సైన్యం కొన్ని నెలల పాటు ఈ పట్టణాన్ని ఆక్రమించి ఉంది.
యుక్రెయిన్ బలగాలు గత సెప్టెంబర్‌లో ఈ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నా కూడా.. రష్యా సైన్యం ఈ ప్రాంతాన్ని మరోసారి హస్తగతం చేసుకోవటానికి ప్రయత్నాలు చేస్తోంది.
అస్థిర భద్రతా పరిస్థితుల నేపథ్యంలో ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్లాలని యుక్రెయిన్ అధికారులు మార్చి ఆరంభంలో స్థానిక నివాసులను ఆదేశించారు.
కుపియాన్‌స్క్ నగరంతో పాటు ఈ ప్రాంతంలోని ఇతర పట్టణాల మీద రష్యా సైనిక బలగాలు కాల్పులు జరుపుతున్నాయని ఖార్కియేవ్ ప్రాంత ప్రభుత్వాధినేత ఒలెగ్ సినెగుబోవ్ మంగళవారం నాడు చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
బాఖ్ముత్‌లో భీకర యుద్ధం.. ఇరువైపులా భారీ ప్రాణ నష్టం
మరోవైపు.. తూర్పు యుక్రెయిన్ నగరం బాఖ్ముత్‌లో యుక్రెయిన్, రష్యా బలగాల మధ్య భీకర యుద్ధం సాగుతోంది. ఇరువైపులా భారీగా ప్రాణ నష్టాలు సంభవించినట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ నగరాన్ని హస్తగతం చేసుకోవటానికి రష్యా బలగాలు నెలలుగా ప్రయత్నిస్తూ దాడులు చేస్తున్నాయి. యుక్రెయిన్ బలగాలు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి.
ఈ పోరాటంలో గత కొద్ది రోజుల్లో 1,100 మంది రష్యా సైనికులు చనిపోయారని యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియెన్‌స్కీ చెప్పారు.
అయితే మొన్న ఒక్క రోజులోనే 220 మంది యుక్రెయిన్ సైన్యం తమ దాడుల్లో చనిపోయారని రష్యా చెప్తోంది.
ఇరుపక్షాలు చెప్తున్న సంఖ్యలు సరైనవా కాదా అనేది బీబీసీ తనిఖీ చేసి తేల్చే వీలులేకపోయింది.
ఇవి కూడా చదవండి:
- పవన్ కల్యాణ్: జనసేన ఆవిర్భావ సభలో స్వరం మార్చిన అధినేత... కులాల చుట్టూ సాగిన ప్రసంగం
- రష్యా జెట్ ఢీకొని సముద్రంలో కూలిన అమెరికా డ్రోన్
- తెలంగాణ: పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ వ్యవహారం ఎలా జరిగింది?
- సిలికాన్ వ్యాలీ బ్యాంక్: భారత స్టార్టప్‌లు దివాలా తీసిన ఆ బ్యాంకులో ఖాతాలు ఎందుకు తెరిచాయి
- టైగర్ నాగేశ్వర రావు రియల్ స్టోరీ ఏమిటి? ఉన్నోళ్లను దోచుకుని, లేనోళ్లకు పంచేవాడా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








