ఈజిప్ట్‌: కోడి కాళ్లు తినాలని ప్రజలకు ప్రభుత్వం ఎందుకు చెబుతోంది?

ఈజిప్ట్ ఆర్థిక సంక్షోభం
    • రచయిత, యోలాంద్ నీల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

‘‘దేవుడా, కోడి కాళ్లు (చికెన్ ఫీట్) తినే స్థితికి మమ్మల్ని తీసుకురావొద్దు’’ అంటూ గిజా మార్కెట్‌లో పౌల్ట్రీ అమ్మకందారులతో పాటు ఒక వ్యక్తి వేడుకుంటున్నాడు.

ఈజిప్ట్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. తమ కుటుంబాలకు మూడు పూటల అన్నం పెట్టేందుకు కూడా అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

కుక్కలు, పిల్లులకు ఆహారంగా పక్కన పడేసే కోడి కాళ్లు వండుకుని తినాలని, దానిలో ప్రొటీన్లు అధికంగా ఉంటాయంటూ ఇటీవల ఆ దేశ ప్రభుత్వం ప్రజలకు పోషకాహార సూచన చేసింది.

ఈ సూచనపై ఆ దేశ ప్రజల నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

చాలా దేశాలు ప్రస్తుతం పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో కొట్టుమిట్టాడుతున్నాయి. ద్రవ్యోల్బణం పెరుగుతోన్న దేశాలలో ఈజిప్ట్ కూడా ఒకటి.

చాలా మంది వ్యక్తులకు ప్రస్తుతం నిత్యావసరాలైన వంటనూనె, చీజ్ వంటివి కొనలేని లగ్జరీ వస్తువులుగా మారిపోయాయి. కొన్ని ఉత్పత్తుల ధరలు నెలల వ్యవధిలోనే రెండింతలు, మూడింతలు పెరిగిపోయాయి.

‘‘నేను నెలలో ఒకసారి మటన్ తింటాను లేదంటే అసలు కొనను. కానీ, వారంలో ఒకసారైనా చికెన్ తింటాను’’ అని ముగ్గురు పిల్లల తల్లి వేదాద్ చెప్పారు. కానీ, ఇటీవల కాలంలో ఒక్క గుడ్డు ధర కూడా 0.16 డాలర్లు అంటే రూ.13కి పైగా పెరిగిపోయినట్లు తెలిపారు.

దీనికి కారణం ఈజిప్ట్ ఎక్కువగా ఆహార వస్తువుల దిగుమతులపైనే ఆధారపడటం.

10 కోట్ల మందికి పైగా ఉన్న తన జనాభాకు ఈజిప్ట్ తన దేశంలో పండే ఉత్పత్తుల కంటే ఎక్కువగా పక్క దేశాల నుంచే ఆహార వస్తువులను దిగుమతి చేసుకుంటోంది.

తమ దేశంలో కోళ్లకు అందించే మేతను కూడా ఇతర దేశాల నుంచే సరఫరా చేసుకుంటోంది.

గత ఏడాది 12 నెలల కాలంలో ఈజిప్టియన్ పౌండ్ విలువ డాలర్‌తో పోలిస్తే సగానికి పైగా కోల్పోయింది.

జనవరిలో ప్రభుత్వం తన కరెన్సీని మరోసారి డివాల్యూ చేసినప్పుడు, దిగుమతుల వ్యయాలు భారీగా పెరిగాయి.

ఈజిప్ట్ ఆర్థిక సంక్షోభం

గత ఏడాది క్రితం వరకు వేదాద్ తనకొచ్చే నెలవారీ పెన్షన్ 5,000 ఈజిప్టియన్ పౌండ్ల(రూ.13,540)తో చాలా సౌకర్యవంతంగా జీవించేవారు.

తనకు తానుగా మధ్యతరగతి వ్యక్తిగా అభివర్ణించుకున్నారు. అయితే, ప్రస్తుతం ఇతర ఈజిప్టియన్ల మాదిరిగానే ఆమె కూడా తన నిత్యావసరాలను తీర్చుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

‘‘ఒక అమ్మకందారుడు కిలో చికెన్ ధర 160 ఈజిప్టియన్ పౌండ్లు(రూ.433)గా చెప్పాడు. కొందరు 175గా, 190గా, 200 ఈజిప్టియన్ పౌండ్లుగా చెబుతున్నారు.’’ అని తాను తిరిగిన దుకాణాల ధరలను వేదాద్ చెప్పారు.

కోడి కాళ్లు 90 ఈజిప్టియన్ పౌండ్లు పలుకుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం చికెన్ బోన్స్ కూడా అమ్ముడుపోతున్నాయన్నారు. కోడి కాళ్ల ధర ఎంతో తెలుసా?.. కేవలం 20 ఈజిప్టియన్ పౌండ్లంటూ ఆమె ఒక నవ్వు నవ్వారు.

2011లో ఈజిప్ట్‌లో నెలకొన్న తిరుగుబాటు, వేగంగా పెరిగిన జనాభా వంటి కారణాలతో ప్రస్తుతం దేశం ఈ ఆర్థిక సంక్షోభాన్ని చవిచూస్తోందని అధ్యక్షుడు అబ్దుల్ ఫతాహ్ అల్-సిసి అన్నారు. అలాగే కరోనా మహమ్మారి, యుక్రెయిన్ యుద్ధం వంటివి కూడా ఈ పరిస్థితికి కారణమన్నారు.

గత ఏడాది మార్చిలో యుక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభించిన తర్వాత ఈజిప్ట్ ఆర్థిక పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది.

గోధుమలను దిగుమతి చేసుకుంటున్న రెండో అతిపెద్ద దేశంగా ఈజిప్ట్ ఉంది. రష్యా, యుక్రెయిన్ దేశాలే ఈజిప్ట్‌కు ప్రధాన సరఫరాదారులు.

ఈ యుద్ధం వల్ల ఎగుమతులపై ప్రభావం పడినప్పుడు, గోధుమల ధరలు భారీగా పెరిగిపోయాయి. దీంతో పాటు బ్రెడ్ ధరలు కూడా ఎగిశాయి.

రష్యా, యుక్రెయిన్ నుంచి సందర్శకులు ఎక్కువగా ఈజిప్ట్ వస్తూ ఉండేవారు. కానీ, యుద్ధం తర్వాత పర్యాటక రంగం కూడా బాగా దెబ్బతింది.

ఆ దేశ జీడీపీ(స్థూల దేశీయోత్పత్తి)కి 5 శాతం సహకారం అందించే పర్యాటక రంగం అప్పటికే కరోనా మహమ్మారితో తీవ్రంగా ప్రభావితమైంది. ఆ తర్వాత వచ్చిన యుద్ధం కారణంగా, పర్యాటక రంగం కుదేలైంది.

ఈజిప్ట్ ఆర్థిక సంక్షోభం

ప్రభుత్వం తీసుకునే తప్పుడు నిర్ణయాలు ఈ పరిస్థితిని మరింత ప్రమాదకరంగా మార్చాయని అనలిస్ట్‌లు అన్నారు.

అధ్యక్షుడు సిసి పదవిలోకి వచ్చిన తర్వాత ప్రెసిడెన్సీ, మిలటరీ, సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ ఏజెన్సీల అధికారం, ప్రభావం బాగా పెరిగిందని మధ్య ప్రాచ్య తహ్రీర్ ఇన్‌స్టిట్యూట్ పొలిటికల్ ఎకనమిస్ట్ తిమోథి కల్దాస్ అన్నారు.

ప్రభుత్వ సంస్థల విస్తరణ ద్వారా ఇది జరిగిందని కల్దాస్ చెప్పారు. ఉదాహరణకు మిలటరీ విషయంలో తీసుకుంటే, భారీ ఎత్తున చేపట్టే మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కాంట్రాక్టులు ప్రభుత్వానికే దక్కాయన్నారు.

ప్రైవేట్ రంగ ప్రమేయం భారీగా తగ్గిపోయింది. ఫలితంగా కంపెనీలు ఈ ప్రభుత్వ పాలనలో పోటీని ఇవ్వలేకపోయాయి. చాలా మంది విదేశీ పెట్టుబడిదారులు కూడా ఈజిప్ట్‌ను విడిచి బయటికి వెళ్లిపోయారు.

తాము పడుతున్న ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించాలని గత ఆరేళ్లలో నాలుగు సార్లు అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్)ను ఈజిప్ట్ కోరింది. దేశం ఆర్జించే సగం రెవెన్యూలు అప్పులు తిరిగి చెల్లించేందుకే వెళ్తున్నాయి. జీడీపీలో అప్పులు 90 శాతంగా ఉన్నాయి.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా లాంటి గల్ఫ్ దేశాలు ఆ ప్రభుత్వ ఆస్తులను కొనుగోలు చేసి, ఈజిప్ట్‌కు సాయపడ్డాయి. కానీ, తదుపరి పెట్టుబడులకు మాత్రం ఆ దేశాలు తమ షరతులను మరింత కఠినతరం చేశాయి.

మధ్య ప్రాచ్యలో అత్యధిక జనాభా ఉన్న ఈ దేశం కనుక దివాళా తీస్తే ఎలా అని పక్కనున్న పశ్చిమ, గల్ఫ్ సరిహద్దు దేశాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఈజిప్ట్ ఆర్థిక సంక్షోభం

ఇంతకుముందు కూడా ఈజిప్టులో తలెత్తిన ఆర్థిక సంక్షోభాలు నిరసనలకు దారితీసి, మాజీ అధ్యక్షులు హోస్ని ముబారక్, మొహమ్మద్ మోర్సిలు తమ పదవుల నుంచి తప్పుకునేందుకు కారణమయ్యాయి.

ఇప్పటికే ఆర్థిక పరిస్థితిపై ప్రజల్లో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

‘‘మేము మీకు ఓటు వేయడానికి వెళ్లిన రోజును బ్లాక్ డేగా పరిగణిస్తూ.. మహిళలుగా మేమెంత పశ్చాత్తాపపడుతున్నామో మీకు చెప్పలేం’’ అని ఒక ఈజిప్ట్ గృహిణి, అధ్యక్షుడు సిసికి వ్యతిరేకంగా అన్న మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

‘‘మీరు మా జీవితాలను నరకంలోకి నెట్టేశారు’’ అని ఆ మహిళ బాధపడ్డారు.

తన పర్సులో చిల్లర తీసి లెక్కించుకోవాల్సి వస్తుందని, వీటితో తమ పిల్లలకు ఎలా ఆహారం అందించగలమని ఆమె ప్రశ్నించారు.

అయితే, మరికొన్ని రోజుల్లో రంజాన్ నెల ప్రారంభం కాబోతున్న సమయంలో, పెరుగుతున్న ధరల గురించి వేదాద్ ఆలోచిస్తున్నారు. ఎందుకంటే, రంజాన్ నెలలో పొద్దుట నుంచి రాత్రి వరకు ఉపవాసం ఉంటారు.

‘‘ఈ ఏడాది ఏం చేయాలి?’’ అని వేదాద్ తనను తాను ప్రశ్నించుకుంటున్నారు. తమ మెనూ నుంచి చికెన్‌ను త్వరలోనే తొలగించాల్సి వస్తుందని ఆమె భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)