లెబనాన్: సొంత డబ్బు కోసం బ్యాంకు మీదకు తుపాకీతో దాడి చేసిన మహిళ

అదో ఉద్విగ్నభరిత సన్నివేశం. నల్లని దుస్తులు ధరించిన ఆ మహిళ చేతిలో తుపాకీ పట్టుకుని తన సోదరితో పాటు బ్యాంకులోకి దూసుకొచ్చారు. బ్యాంకు ఉద్యోగులకు తుపాకీ గురిపెట్టి 20,000 డాలర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఆమె ప్రయత్నం ఫలించింది. సలీ హఫీజ్ ఆ విధంగా ఎలాంటి దాడి, హింస లేకుండా 13,000 డాలర్లు పట్టుకుని పారిపోయారు. ఈ ఘటన లెబనాన్్‌లోని ఓ బ్యాంకులో జరిగింది.
బీరట్‌లోని బ్లూమ్ బ్యాంకులోకి సెప్టెంబర్ 14న హఫీజ్ తుపాకితో రావడం, డబ్బు తీసుకువెళ్ళడం అందరినీ ఆశ్చర్యపరిచింది. విచిత్రం ఏమంటే ఆమె చేతిలో ఉన్నది అసలు తుపాకీ కాదు, బొమ్మ తుపాకీ. ఆమె అడిగిన సొమ్ము కూడా తన అకౌంట్లో దాచుకున్నదే.
ఆమె లక్ష్యం ఏమంటే, తన కుటుంబం ఆ బ్యాంకులో దాచుకున్న డబ్బును తన సోదరి క్యాన్సర్ చికిత్స కోసం తీసుకువెళ్ళడం.
ఆమె సాహసం అంతా సోషల్ మీడియాలో ప్రత్యక్ష ప్రసారమైంది. హఫీజ్ రాత్రికి రాత్రే పాపులర్ అయిపోయారు. లెబనాన్‌లో తలెత్తిన ఆర్థిక సంక్షోభంలో ప్రజలు ఎదుర్కొంటున్న నిరాశ, నిస్పృహలకు ఆమె ఒక ప్రతీకగా కనిపిస్తున్నారు.
గత గురువారం ఆమె స్వయంగా వచ్చి పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆమెకు 25 డాలర్ల జరిమానా విధించారు. ఆరు నెలలు ఎక్కడికీ పోకుండా నిషేధం విధిస్తూ బెయిల్ మంజూరు చేశారు.
'నేను అలా చేయడానికి చాలా భయపడ్డాను'
లెబనాన్‌లో ఈ తరహా దాడులు సాధారణమైపోతున్నాయి. ఆర్థిక సంక్షోభం మూలంగా ప్రజల మీద రకరకాల ఆంక్షలు విధించడంతో, వారు అసహనంతో ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.
పౌరులు నెలకు 400 డాలర్లకు మించి డ్రా చేయకూడదనే నిబంధన ఇక్కడ 2019 నుంచీ అమల్లో ఉంది. ద్రవ్యోల్బణం దారుణంగా పెరిగి, లెబనీస్ కరెన్సీ విలువ బాగా పడిపోవడంతో ఆ మొత్తం ప్రజలకు ఏమూలకూ సరిపోవడం లేదు.

ఫొటో సోర్స్, EPA
ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘ కాలంగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన దేశంలో ఒకటిగా లెబనాన్ అవతరించింది. ఈ దేశంలో ఇప్పుడు 80 శాతం మంది పేదరికంలో మగ్గుతున్నారు. నిత్యావసరాల కోసం, మందుల కోసం అలమటిస్తుండడం బీబీసీ జర్నలిస్ట్ డేవిడ్ గ్రిటెన్ స్వయంగా చూశారు.
"నాకు అలా చేయడానికి చాలా ధైర్యం కావల్సి వచ్చింది. అదేమీ సులభమైన పని కాదు. కానీ, నా పరిస్థితి చేయి దాటిపోయింది" అని హఫీజ్ బీబీసీ న్యూస్‌కు చెందిన రాచెల్ థార్న్‌తో అన్నారు. "నా వల్ల భయపడిన వారందరికీ నేను క్షమాపణలు చెబుతున్నాను. కానీ, నా సోదరి ఒక వైపు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. నా బాధ, నిస్పృహ మామూలుగా లేదు. తప్పు పట్టాల్సింది ననన్ను కాదు, బ్యాంకుల్ని" అని ఆమె అన్నారు.
హఫీజ్ ఆ పని చేసిన రోజునే లెబనాన్‌లోని నాలుగో అతిపెద్ద నగరమైన అలేలో మరో వ్యక్తి కూడా తన కుటుంబ అవసరాలు తీర్చడం కోసం అదే పని చేశారు.
మా బాధలు ఎవరూ పట్టించుకోవడం లేదు
బ్యాంకు ఖాతాదారుల హక్కులను కాపాడేందుకు ఏర్పడిన డిపాజిటర్స్ ఔట్ క్రై అనే సంస్థకు చెందిన ఇబ్రహీం అబ్దుల్లా, ఇక్కడి ప్రజల సహనం పూర్తిగా చచ్చిపోయిందని వ్యాఖ్యానించారు. "గత మూడేళ్ళుగా మేం ఎంతో శాంతియుతంగా నిరసనలు తెలిపాం. మా సమస్యలు తీర్చడానికి ఎవరూ ముందుకు రాలేదు" అని ఆయన అన్నారు.
గత నెలలో ఓ వ్యక్తి హఫీజ్ దాడి చేసిన బ్యాంకులోనే సిబ్బందిని ఏడుగంటల పాటు నిర్బంధంలోకి తీసుకుని 35,000 డాలర్లు విత్ డ్రా చేసుకున్నారు. తన తండ్రి ఆస్పత్రి ఖర్చులకు ఆ డబ్బు అవసరమైందని ఆయన చెప్పారు.
అయితే, డబ్బు కోసం ఇలా హింసాత్మక దాడులకు పాల్పడడం సరైన పని కాదని బ్లూమ్ బ్యాంక్ డైరెక్టర్ సాద్ అజహరి అన్నారు. "మనకు చట్టాలు ఉన్నాయి. వాటిని పాటించాలి. ప్రజల ఆగ్రహం ఎందుకో నాకు తెలుసు. కానీ, ఈ దేశంలోని రాజకీయ నాయకులే ఇందుకు బాధ్యత వహించాలి" అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- మంత్రం అంటే ఏంటి? మంత్రాలతో ధ్యానం చేస్తే మెదడుకు మేలు జరుగుతుందా? సైన్స్ ఏం చెబుతోంది?
- ఇరాన్-కర్ణాటక: ఈ వివాదం హిజాబ్‌కు సంబంధించిందా, లేక మహిళల ఇష్టాయిష్టాలకు చెందినదా
- డయేరియాతో బాధ పడుతున్నప్పుడు ఏం తినాలి, ఏం తినకూడదు?
- హిజాబ్ ధరించని మహిళలను ‘వెంటాడి, వేటాడే’ ఇరాన్ మొరాలిటీ పోలీసులు ఎవరు? ఏం చేస్తారు?
- మహాత్మా గాంధీ జయంతి: ‘గాంధీని పూజించడం చాలా ప్రమాదకరం’ అని ఎవరు అన్నారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













