Emotional Infidelity: జీవిత భాగస్వామి కాకుండా మరొకరికి మానసికంగా దగ్గరవడం 'చీటింగ్' అవుతుందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కేటీ బిషప్
- హోదా, బీబీసీ వర్క్‌లైఫ్
ఒక బంధంలో 'చీటింగ్' అనే దాని మీద ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి.
సాంప్రదాయిక వివాహ పద్ధతులను పాటించే వాళ్లు, తమ భాగస్వామి మరొకరితో లైంగిక సంబంధం పెట్టుకోవడాన్ని 'మోసం'గా చూస్తారు.
బహిరంగ స్నేహాలు అంటే 'ఓపెన్ రిలేషన్‌షిప్స్' కొనసాగిస్తున్న జంటలు కూడా ఏదీ శారీరకంగా మోసం అవుతుంది, ఏది కాదనే విషయంలో తమకంటూ కొన్ని నిబంధనలు ఏర్పరచుకున్నాయి.
మరి 'ఎమోషనల్ ఇన్ఫిడిలిటీ' సంగతి ఏంటి? ఫిజికల్ ఇన్ఫిడిలిటీ మాదిరిగా దీన్ని నిర్వచించడం కష్టం.
ఎమోషనల్ ఇన్ఫిడిలిటీ అంటే ఒక బంధంలో ఉన్న వ్యక్తి మనసు మరొకరికి దగ్గర కావడం. వారిని మీ ఆలోచనల్లో నింపుకొని ఎమోషనల్‌గా ప్రస్తుత భాగస్వామిని 'మోసం' చేయడం.
మీరు బాగా ఇష్టపడే వారితో కలిసి తరచూ తాగడం, ఎప్పుడూ మరొక వ్యక్తితో చాటింగ్ చేస్తూ ఉండటం... కొత్త వాళ్ల సోషల్ మీడియా పోస్టులకు 'కవ్వించేలా' కామెంట్స్ పెట్టడం... వీటిని ఎమోషనల్ ఇన్ఫిడిలిటీగా భావించే వాళ్లు ఉన్నారు.
కానీ, ఈ ఎమోషనల్ ఇన్ఫిడిలిటీ అంటే అన్వయించుకోవడంలో అర్థం చేసుకోవడంలో భాగస్వాముల మధ్య ఉండే వైరుధ్యాలు సమసల్యకు దారి తీస్తుంటాయి. అవి వారి బంధాన్ని ప్రమాదంలో పడేస్తుంటాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఆధునిక ఆలోచన విధానం
ఈ ఎమోషనల్ ఇన్ఫిడిలిటీ అనేది కాస్త కొత్త కాన్సెప్ట్.
సమాజంలో వస్తున్న మార్పుల వల్ల భాగస్వాముల మీద అంచనాలు పెరిగిపోతున్నాయి. వారి నుంచి ఎక్కువ ఆశించడం మొదలవుతోంది.
తమ బంధంలో 'భావోద్వేగపరమైన సాన్నిహిత్యం' కూడా ఉండాలని కోరుకునే వారి సంఖ్య పెరుగుతోంది. భాగస్వామి మనసులో తమకే ఎక్కువ స్పేస్ ఉండాలనేది వారి ఆలోచన.
తన భాగస్వామితో కాకుండా మరొకరితో ఎమోషనల్‌గా దగ్గర కావడాన్ని ఎమోషనల్ ఇన్ఫిడిలిటీ అంటారు. ఇందులో శారీరక సంబంధం ఉండాల్సిన పని లేదు.
'చారిత్రకంగా చూస్తే పెళ్లి అనే దానిలో ఎమోషనల్ నీడ్స్ అనేవి ఉండవు. ఆర్థికభద్రత, కుటుంబ బంధాలు, సంతానోత్పత్తి వంటి విషయాలు పెళ్లిలో కీలకంగా ఉంటాయి.
పెళ్లి అనే బంధంలో ప్రేమ దొరకని వారు తమ ఎమోషనల్ నీడ్స్ కోసం మరొక చోట వెతుకుతారు' అని అమెరికాలోని విట్‌మన్ కాలేజీలో సోషియాలజీ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న మిషెల్లీ జానింగ్ అన్నారు.
గత 200 ఏళ్లలో బంధాలను అర్థం చేసుకోవడంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రేమ సంబంధాలు సాధారణం. గత 100 ఏళ్లలో 'వ్యక్తివాదం' బాగా పెరిగింది. అంటే తన గురించి తాను కేర్ తీసుకోవడం, తన అవసరాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం అనేది ఇందులో ప్రధానంగా ఉంటుంది.
నేడు ఒక బంధంలోని భాగస్వామి తమ ఎమోషనల్ నీడ్స్ తీర్చాలని మరొక భాగస్వామి ఆశిస్తున్నారు. మూడో వ్యక్తి ఎమోషనల్ నీడ్స్ తీర్చడాన్ని 'ద్రోహం'గా చూస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
డిజిటల్ శకానికి ముందు... ఆ తరువాత...
టెక్నాలజీ ఇంతగా లేని రోజుల్లో ఎమోషనల్ ఇన్ఫిడిలిటీ పరిధి తక్కువగా ఉండేది.
దగ్గరి స్నేహితులు, ఆఫీసు కొలీగ్స్ వంటి వారితో మాత్రమే ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేవారు. పార్టనర్‌కు తెలియకుండా రహస్యంగా వారిని కలుసుకుంటూ ఉండేవారు.
కానీ నేటి డిజిటల్ యుగంలో దాని పరిధి మరింత విస్తృతమైంది.
ఇతరులతో కనెక్ట్ కావడానికి అనేక మార్గాలను టెక్నాలజీ అందుబాటులోకి తీసుకొచ్చింది. వ్యక్తిగత గుర్తింపును గోప్యంగా ఉంచుతూ కమ్యూనికేట్ చేసే మార్గాలు కూడా అందుబాటులోకి వచ్చాయి.
'స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా వల్ల సులభంగా బంధాలు ఎమోషనల్ ఇన్ఫిడిలిటీకీ దారి తీస్తున్నాయి.
సోషల్ మీడియాలో పాత స్నేహితులతో టచ్‌లోకి రావడం, కొత్త వాళ్లతో మాటలు మొదలు పెట్టడం, ఇతరుల ఫొటోలను లైక్ చేయడం వంటివి ఇందుకు కారణమవుతాయి' అని సైకాలజిస్ట్ అమీరా జాన్సన్ తెలిపారు.
ఒక వ్యక్తి ఫొటోలను మాత్రమే లైక్ చేయడాన్ని కొందరు 'మోసం'గా భావిస్తే, మరికొందరు అదేమీ పెద్ద పట్టించుకోవాల్సిన విషయం కాదు అనుకుంటారు.
మెసేజీల రూపంలో ఇతరులను 'కవ్వించడం' అంటే ఫ్లర్ట్ చేయడం కొందరికి సమ్మతం కావొచ్చు. మరికొందరికి కావకపోవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
పరిష్కారం ఏంటి?
సాధారణంగా 'ఎమోషనల్ ఇన్ఫిడిలిటీ' కంటే 'సెక్సువల్ ఇన్ఫిడిలిటీ'ని ఎక్కువ మంది సమస్యాత్మకంగా భావిస్తారు.
2015లో బ్రిటన్‌లో చేసిన ఒక సర్వే ప్రకారం తమ పార్టనర్ మూడో వ్యక్తితో ఎమోషనల్‌గా కనెక్ట్ కావడాన్ని 'మోసం'గా చూస్తామని 44శాతం తెలిపారు. తాము ఎమోషనల్ ఇన్ఫిడిలిటీకి పాల్పడినట్లు 15శాతం మంది వెల్లడించారు.
ఎమోషనల్ ఇన్ఫిడిలిటీ విషయంలో చాలా మంది కావాలని కమిట్ కారాని అమీరా జాన్సన్ అంటున్నారు.
'ఒక బంధంలో తమ పార్టనర్ ఇవ్వాల్సిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని లేదా సమయం కేటాయించడం లేదని మరొక పార్టనర్ భావించినప్పుడు... వారు ఆ ఫీలింగ్స్ కోసం వేరొక చోట వెతుకుతారు.
ముందు తమ ఎమోషనల్ సపోర్ట్ కోసం స్నేహం మొదలు పెడతారు. ఆ తరువాత అది అనుకోకుండా ఎమోషనల్ ఇన్ఫిడిలిటీకి దారి తీయొచ్చు' అని అమీరా జాన్సన్ వివరించారు.
ఒకోసారి ఎమోషనల్ అఫైర్స్ లైంగిక సంబంధాలకు దారి తీస్తాయి. మరి కొందరు ఎమోషనల్ ఇంటిమసీ కోసం ఒక వ్యక్తి మీదనే ఆధారపడకుండా తమ బంధం బయట ఇతరుల మీద కూడా డిపెండ్ అవుతారు.
ఒక బంధం బయట స్నేహితులు, మద్దతుదారులు ఉండటం ఒకోసారి మంచిదే. అది మన ఆరోగ్యానికి మంచి చేస్తుంది. అయితే భాగస్వామి నొచ్చుకునేలా ఆ స్నేహం మరొక బంధానికి దారితీస్తే అది సమస్యగా మారుతుంది.
చాలా వరకు ఒక బంధంలోని భాగస్వాముల మధ్య దూరం పెరగడం వల్లే ఎమోషనల్ ఇన్ఫిడిలిటీ తలెత్తుతుంది.
ఒక బంధంలో ఒకరు సంతోషంగా లేకపోవచ్చు. లేదా ఆ పార్టనర్ నుంచి దూరంగా వెళ్లి పోవాలని భావిస్తూ ఉండొచ్చు. తమ విలువలు, నమ్మకాలు, అభిరుచులు, లక్ష్యాలకు మరింత దగ్గరగా ఉన్న వ్యక్తులతో చేరువ అయ్యేందుకు ప్రయత్నించొచ్చు.
ఒక బంధంలో ఏది 'మోసం' కిందకు వస్తుందే ముందే పార్టనర్స్ మాట్లాడుకోవాలని జానింగ్ సూచిస్తున్నారు. విషయాన్ని అర్థం చేసుకోవడంలోనూ అన్వయించుకోవడంలోనూ ఏకాభిప్రాయం లేకపోవడం సమస్యలకు దారి తీస్తుందని చెబుతున్నారు.
ఒక బంధంలో నియమాలు ఏంటి? హద్దులు ఎలా ఉండాలి? అనేవి పార్టనర్స్ ముందుగానే నిర్ణయించుకోవాలనేది జానింగ్ చెబుతున్న మాట.
ఇవి కూడా చదవండి:
- మొబైల్ ఫోన్లు చోరీ అయితే పోలీసులు ఎలా వెతికి పట్టుకుంటారో తెలుసా?
- తెలంగాణ: ‘చూపు పోయింది.. వరంగల్‌లో అడుక్కుని బతకమన్నారు.. 50 ఏళ్లుగా నేను ఏం చేస్తున్నానంటే..’
- శ్రీకాకుళం జిల్లా: బట్టలు ఉతకం అన్న రజకులు.. ఇతర కులాల సహాయ నిరాకరణ.. ఏం జరిగింది? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- అస్సాం: ఆ కుటుంబంలో మూడు తరాలుగా అందరూ అంధులే... ఎందుకిలా?
- డయేరియాతో బాధ పడుతున్నప్పుడు ఏం తినాలి, ఏం తినకూడదు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













