డోనాల్డ్ ట్రంప్: పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు డబ్బు చెల్లింపు కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడిపై క్రిమినల్ అభియోగం

ఫొటో సోర్స్, Getty Images
పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు జరిపారనే కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై క్రిమినల్ అభియోగం నమోదు కానుంది. ఆయనపై నిర్దిష్టంగా ఎలాంటి అభియోగాలు నమోదు చేయనున్నారనేదానిపై ప్రస్తుతం స్పష్టత లేదు.
ఆయన 'ఇండిక్ట్‌మెంట్'కు మాన్‌హటన్ గ్రాండ్ జ్యూరీ ఆమోదం తెలిపింది. క్రిమినల్ అభియోగాలతో ఇండిక్ట్‌మెంట్ ఎదుర్కొంటున్న తొలి మాజీ అధ్యక్షుడు ట్రంపే. 235 సంవత్సరాల అమెరికా చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారని బీబీసీ ఉత్తర అమెరికా ప్రతినిధి ఆంథోనీ జుర్చర్ చెప్పారు.
ఒక వ్యక్తి నేరానికి పాల్పడ్డారనే రాతపూర్వక అభియోగమే ఇన్‌డిక్ట్‌మెంట్. సాధారణ అభియోగాలను ఎవరైనా ప్రాసిక్యూటర్ ముందుకు తెస్తారు. ఇండిక్ట్‌మెంట్ అనేది ఒక 'గ్రాండ్ జ్యూరీ' ప్రొసీడింగ్స్ తర్వాత జరుగుతుంది.
విచారణ ప్రారంభించడానికంటే ముందే ప్రాసిక్యూటర్ సమర్పించే ఆధారాలను పరిశీలించే కొందరు వ్యక్తుల బృందాన్ని గ్రాండ్ జ్యూరీ అంటారు. అవసరమైతే సాక్షులను ఈ జ్యూరీ విచారిస్తుంది. అభియోగం మోపేందుకు తగినంత ఆధారం ఉందా, లేదా అనేది జ్యూరీ సభ్యులు రహస్య ఓటింగ్ ద్వారా నిర్ణయిస్తారు.
ఇండిక్ట్‌మెంట్ జరిగిన వ్యక్తిపై ఇంకో జ్యూరీలో ప్రత్యేకంగా క్రిమినల్ విచారణ జరుగుతుంది.
తనతో ట్రంప్ సెక్స్‌లో పాల్గొన్నారని, ఆ విషయం బయటపెట్టకుండా ఉండేందుకు తనకు డబ్బు చెల్లించారని స్టార్మీ డేనియల్స్ ఆరోపిస్తూ వస్తున్నారు. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు ఈ చెల్లింపు జరిపినట్టు ఆరోపణలు ఉన్నాయి.
స్టార్మీ డేనియల్స్‌కు ట్రంప్ జరిపిన చెల్లింపును వ్యాపార ఖర్చు(బిజినెస్ ఎక్స్‌పెన్స్)గా చూపించారని, ఇది బిజినెస్ రికార్డులను తప్పుగా నమోదు చేయడమేననే ఆరోపణలు ఉన్నాయి. న్యూయార్క్‌లో బిజినెస్ రికార్డులను ఇలా చూపించడం చట్టవిరుద్ధం.
రానున్న రోజుల్లో ట్రంప్ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఈ కేసు విషయంలో అధికార యంత్రాంగానికి సహకరిస్తానని ట్రంప్ ఇప్పటికే సంకేతాలిచ్చారు.
ట్రంప్ వచ్చే వారం లొంగిపోవచ్చని ఆయన న్యాయ బృందం చెబుతోంది. తనపై ఆరోపణలను ట్రంప్ తోసిపుచ్చుతున్నారు.
ట్రంప్ ఏ నేరమూ చేయలేదని, ఈ రాజకీయ వేధింపుపై కోర్టులో పోరాడతామని ఆయన న్యాయవాదులు సుసాన్ నెచకెలెస్, జోసెఫ్ టకోపినా ఒక ప్రకటనలో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ట్రంప్ స్పందన ఏమిటి?
తనపై క్రిమినల్ అభియోగం నమోదు వార్తలపై ట్రంప్ స్పందిస్తూ- ఒక సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు. అలాగే అమెరికా మీడియా సంస్థ ఏబీసీ న్యూస్‌తో ఫోన్‌లో మాట్లాడారు.
ఇది రాజకీయ వేధింపు అని, అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడమేనని ఆయన ఆరోపించారు.
"మన దేశ చరిత్రలో ఇలాంటిది ఎప్పుడూ జరగలేదు. ఇది మన దేశంపై దాడి," అని ఆయన వ్యాఖ్యానించారు.
తనను దెబ్బతీసేందుకు డెమోక్రాట్లు అబద్ధాలు చెప్పారని, మోసం చేశారని ఆరోపించారు. ఇప్పుడు ఆలోచనకే అందని రీతిలో ఈ పనిచేశారని విమర్శించారు. తాను అమాయకుడినని, తనపై క్రిమినల్ అభియోగం నమోదు చేయడం ఎన్నికల్లో జోక్యం చేసుకోవడమేనని చెప్పారు.
అధ్యక్షుడు జో బైడెన్ తరపున మాన్‌హటన్ డిస్ట్రిక్ట్ అటార్నీ అల్విన్ బ్రాగ్ తప్పుడు పని చేస్తున్నారని విమర్శించారు. అల్విన్ బ్రాగ్ డెమొక్రటిక్ పార్టీ సభ్యుడు. అయితే ట్రంప్‌పై చర్యల వెనక రాజకీయ కక్ష సాధింపు ఏమీ లేదని ఆయన చెప్పారు. వాస్తవాలు, ఆధారాలు, చట్టం ప్రాతిపదికగానే తాము కేసులపై నిర్ణయాలు తీసుకొంటామని వ్యాఖ్యానించారు.
2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు.
తాజా పరిణామాల నేపథ్యంలో ట్రంప్‌కు రిపబ్లికన్లు మద్దతు పలుకుతున్నారు.
రాజకీయ ప్రత్యర్థులపై దాడికి డెమోక్రాట్లు ప్రభుత్వాన్ని ఆయుధంగా వాడుకొంటున్నారని, తాజా పరిణామం దీనికి ఒక ఉదాహరణ అనిహౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్ మెజారిటీ పక్షం నాయకుడు స్టీవ్ స్కాలైజ్ ఆరోపించారు.
ఎట్టకేలకు ట్రంప్ తన ప్రవర్తనకు తాను జవాబుదారీ కావాల్సిన పరిస్థితి వచ్చందని కొందరు డెమోక్రాట్ నాయకులు వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
స్టార్మీ డేనియల్స్ ఏమన్నారు?
తనకు మద్దతుగా నిలిచినవారికి స్టార్మీ డేనియల్స్ ధన్యవాదాలు చెప్పారు. తనకు చాలా మెసేజీలు వస్తున్నాయని, వాటికి స్పందించలేనని చెప్పారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
2006లో తనతో ట్రంప్ సెక్స్‌లో పాల్గొన్నట్లు స్టార్మీ డేనియల్స్ ఆరోపిస్తున్నారు.
ఈ విషయం గురించి మాట్లాడకుండా ఉండేందుకు 2016 అక్టోబరులో ఆమెకు ట్రంప్ న్యాయవాది మైఖేల్ కోహెన్ 1.3 లక్షల డాలర్లు చెల్లించారని 2018లో ద వాల్‌స్ట్రీట్ జర్నల్ పబ్లిష్ చేసిన ఒక కథనం చెప్పింది.
ట్రంప్ 2016 నవంబరులో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
స్టార్మీ డేనియల్స్ ఎవరు?
స్టార్మీ డేనియల్స్ అసలు పేరు స్టెఫానీ క్లిఫర్డ్. ఆమె 1979లో లూసియానాలో జన్మించారు.
ఆమె అడల్ట్ సినిమాల్లో నటించారు. 2004లో ఆమె డైరెక్టర్ అయ్యారు. రచయితగా కూడా మారారు.
అరెస్టుకు ప్రొటోకాల్
అమెరికాలో మాజీ అధ్యక్షుడిని అరెస్టు చేయడానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఫ్లోరిడాలోని మార్-ఏ-లాగో వద్దనున్న తన ఇంటి నుంచి ట్రంప్ న్యూయార్క్ సిటీ కోర్టుకు రావాల్సి ఉంటుంది. ఆయన ఫొటోలు, వేలిముద్రలు తీసుకుంటారు.
కేసు బుక్ అయితే, జడ్జిని ఎంపిక చేస్తారు. నిందితుడి ట్రయల్ సమయం, ప్రయాణ ఆంక్షల వర్తింపు, బెయిల్ వంటి మిగిలిన వివరాలు ఆ తర్వాత తెలుస్తాయి.
సాధారణంగా నిందితులు కోర్టుకు వచ్చే దృశ్యాలు మీడియాలో కనిపిస్తాయి. ఒకవేళ ట్రంప్ గోప్యతను కాపాడాలనుకుంటే ప్రైవేటు మార్గంలో తీసుకొచ్చేందుకు కోర్టు అనుమతించొచ్చు.
ట్రంప్‌కు భద్రత కల్పిస్తున్న అమెరికా సీక్రెట్ సర్వీస్, ఇతర సంస్థలు కూడా అరెస్టుకు తగినట్లుగా అత్యవసర ప్రణాళికలను సిద్ధం చేయాల్సి ఉంటుంది.
విచారణలో నేరం చిన్నది అని తేలితే జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ నేర తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు రుజువైతే ట్రంప్‌కు గరిష్ఠంగా నాలుగేళ్లు జైలు శిక్ష పడుతుంది.
ఇవి కూడా చదవండి:
- డోనల్డ్ ట్రంప్ నివాసంలో ఎఫ్‌బీఐ సోదాలు: మళ్లీ అధ్యక్ష పదవికి పోటీపడకుండా అనర్హుడిగా ప్రకటించే అవకాశం ఉందా?
- అమెరికా: జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ ల్యాప్‌టాప్‌లో ఉన్న రహస్యాలేంటి, ఏమిటీ వివాదం?
- అమెరికాను పాలించడం ఎవరివల్లా కాదా? ఈ దేశం ముక్కలైపోతుందా?
- చరిత్రలోనే ‘అత్యంత సుదీర్ఘ యుద్ధం’: మొదలై 70 ఏళ్లు దాటినా ఇంకా ఎందుకు సమాప్తం కాలేదు?
- అఫ్గానిస్తాన్‌లో అమెరికా వైఫల్యానికి కారణం ఎవరు.. బుష్, ఒబామా, ట్రంప్ లేదా బైడెన్?
- అఫ్గానిస్తాన్, తాలిబన్, అమెరికా: రెండు దశాబ్దాల యుద్ధంలో 10 ముఖ్యాంశాలు
- ‘ప్రపంచానికి నాయకత్వం వహించే దేశం‘గా అమెరికా తన ప్రతిష్ఠను కోల్పోయిందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








