కొలోడియన్ బేబీ: ‘‘పుట్టినప్పుడు ఈ పాపను పెంచి సమయం వృథా చేసుకోవద్దన్నారు. కానీ, ఇప్పుడు ఆమెకు 23 ఏళ్లు"

భార్గవి
    • రచయిత, హేమా రాకేశ్
    • హోదా, బీబీసీ కోసం

తను పుట్టినప్పుడు ఎక్కువ రోజులు బతకదని అందరూ చెప్పారు. అయితే, తను ప్రాణాలను నిలబెట్టుకోగలిగింది.

కానీ, స్కూళ్లు ఆమెను చేర్చుకొనేందుకు సంసిద్ధత వ్యక్తంచేయలేదు. ఆ తర్వాత వారు స్వీకరించినా తోటి పిల్లల్లా ఆమె త్వరగా పాఠాలు నేర్చుకోలేపోయేవారు. ఆటలకూ వెళ్లలేకపోయేవారు.

మొత్తానికి ఆ సవాళ్లన్నీ ఆమె అధిగమించారు. నేడు కామర్స్‌లో ఆమె పీజీ చేస్తున్నారు. గాయని అయ్యేందుకు శిక్షణ కూడా తీసుకుంటున్నారు.

ఇది తమిళనాడు మదురైకి చెందిన 23 ఏళ్ల భార్గవి కథ.

భార్గవి

‘‘కొలోడియన్ బేబీ’’

కొలోడియన్ ఒక అరుదైన జన్యుపరమైన వ్యాధి. ఈ వ్యాధి సోకిన వారి చర్మం పొలుసుల్లా ఊడిపోతుంటుంది. ప్రతి లక్ష మందిలో ఒకరికి ఇలాంటి రుగ్మత వస్తుంటుంది.

ఈ వ్యాధితో పుట్టే పిల్లలు వారాలకు మించి బతకడం కష్టమని వైద్య చరిత్ర చెబుతోంది. ఆ కష్టాలను తట్టుకొని బతికినవారు కూడా జీవితాంతం ‘‘ఇథ్యోసిస్’’గా పిలిచే చర్మ రుగ్మతతో గడపాల్సి ఉంటుంది. అంటే వీరి చర్మం పొడిగా, పొలుసుల్లా కనిపిస్తుంది.

ఈ రుగ్మత భార్గవి ఎముకలకు కూడా పాకింది. అందుకే ఆమె చేతులతో రాయడం, వేగంగా కదలడం కాస్త కష్టం అవుతుంది. ఎండలో కాస్త ఎక్కువసేపు గడిపితే, ఆమె చర్మం నుంచి రక్తం కారుతుంది.

అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేద, సిద్ధ లాంటి చాలా విధానాల్లో చికిత్సను తన కోసం కుటుంబం ప్రయత్నించిందని, కానీ ఫలితం కనిపించలేదని భార్గవి చెప్పారు.

‘‘ఇది జన్యుపరమైన వ్యాధి. దీనికి చికిత్స లేదు’’అని డాక్టర్లు చెప్పేవారని ఆమె వివరించారు.

అయితే, ‘‘మొహం మీద చర్మాన్ని ప్లాస్టిక్ సర్జరీతో సరిచేయొచ్చని చెప్పారు. కానీ, ఆ చికిత్సను భరించే స్తోమత మా కుటుంబానికి లేదు’’ అని ఆమె వివరించారు.

భార్గవి

చదువులోనే విశ్రాంతి

కొలోడియన్ రుగ్మతతో చర్మం పొలుసుల్లా మారడంతో భార్గవిని ప్రజలు వింతగా చూసేవారు. దీంతో ఆమెలో ఆత్మన్యూనతా భావాలు చాలా ఎక్కువయ్యాయి. ఆమె ఎవరితోనూ మాట్లాడేవారు కాదు. ఇంటి నుంచి కాలు బయట పెట్టేవారు కాదు.

కానీ, ఈ వ్యాధి నుంచి తప్పించుకునే మార్గం ఆమెకు లభించలేదు. దీంతో వ్యాధితో కలిసి జీవించడాన్ని ఆమె అలవాటు చేసుకునేవారు. అలా నెమ్మదిగా తన దృష్టి పుస్తకాల మీదకు మళ్లింది. చదువుతోనే తనకు విశ్రాంతి లభిస్తుందని ఆమె చెబుతున్నారు.

ఆమెను స్కూలులో చేర్పించేందుకు తల్లిదండ్రులు ప్రయత్నించారు. కానీ, ఆమెకు స్కూలులో అడ్మిషన్ అంత తేలిగ్గా దొరకలేదు. ఒకవేళ ఆమెను స్కూలులో చేర్చుకుంటే, మిగతా పిల్లలకూ ఈ వ్యాధి సోకుతుందని కొందరు స్కూల్ ప్రతినిధులు చెప్పారు. కానీ, ఆమె తల్లిదండ్రులు వెనక్కు తగ్గలేదు. నెలలపాటు చాలా స్కూళ్లకు వారు తిరిగారు. మొత్తానికి మదురైలోని ప్రభుత్వ పాఠశాలలో ఒకటో క్లాసులో ఆమెను చేర్చుకున్నారు.

ఈ రుగ్మత వల్ల తోటి పిల్లల్లా ఆమె వేగంగా రాయలేకపోయేవారు. వేగంగా నడవలేకపోయేవారు. దీంతో టీచర్లు ఆమెకు అండగా నిలిచారు. వారు ఆమెను ఒత్తిడి చేసేవారు కాదు. ‘‘వారు చూపించిన ప్రేమే చదువుపై నా ఆసక్తిని మరింత పెంచింది. వేసవిలో నాకు చెమటలు చాలా ఎక్కువగా పట్టేవి. కానీ, అందరిలా నేను చెమటలు తుడుచుకోలేను. అందుకే కొందరు టీచర్లు ఫ్యాన్‌కు దగ్గరగా నన్ను కూర్చోబెట్టేవారు’’అని భార్గవి వివరించారు.

ప్రత్యేక ప్రతినిధుల సాయంతో పది, 12వ తరగతి పరీక్షలను ఆమె రాశారు. ఆ తర్వాత మదురైలోని ఒక కాలేజీలో డిగ్రీ పూర్తిచేశారు. ప్రస్తుతం అదే కాలేజీలో ఆమె మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నారు.

వీడియో క్యాప్షన్, 'నా చర్మం పొరలుగా ఊడిపోతుంది.. మళ్లీ కొత్త చర్మం వస్తుంది'

సంగీతమంటే ప్రాణం

చదువుతోపాటు సంగీతమంటే భార్గవికి చాలా ప్రేమ. చిన్నప్పటి నుంచీ ఆమె గాయని కావాలని అనుకునేవారు. స్కూలులో ఉండేటప్పుడు తను కొన్ని పాటల పోటీల్లో పాల్గొని అవార్డులు కూడా గెలుచుకున్నారు.

‘‘కానీ, నేను ప్రొఫెషనల్ సింగర్ కావాలని అనుకుంటున్నాను. దీని కోసం ప్రత్యేక శిక్షణ తీసుకోవాలి. ఈ విషయం మా అమ్మానాన్నలకు చెప్పినప్పుడు మ్యూజిక్ క్లాస్‌లో వారు నన్ను చేర్పించారు. మూడేళ్ల నుంచీ నేను సంగీతం నేర్చుకుంటున్నాను’’ అని ఆమె చెప్పారు.

తను రేడియో జాకీ కూడా కావాలని అనుకుంటున్నట్లు భార్గవి చెప్పారు. రేడియో జాకీ అయ్యేందుకు యూట్యూబ్‌లో వీడియోలు చూస్తుంటానని తెలిపారు. ‘‘అవకాశాల కోసం కొన్ని రేడియో స్టేషన్లకు వెళ్లాను. కానీ, వారి నుంచి నాకు ఫోన్ రాలేదు’’అని ఆమె చెప్పారు.

భార్గవి

‘‘నేను పెద్దగా చదవలేకపోయాను.. మా అమ్మాయి అయినా చదువుకోవాలి’’

భార్గవికి తల్లి, అమ్మమ్మ పూర్తి సహకారం అందిస్తున్నారు.

స్కూలుకు బస్సులో వెళ్లడం భార్గవికి సాధ్యం కాకపోవడంతో ఆమె తల్లి భువనేశ్వరి మోటార్ సైకిల్ నడపడం నేర్చుకున్నారు. ఆమె భార్గవిని రోజూ స్కూలుకు తీసుకెళ్లి, ఇంటికి తీసుకొచ్చేవారు. ఇప్పుడు కాలేజీకి కూడా ఆమె తీసుకెళ్తున్నారు.

‘‘నేను పదో తరగతి వరకు చదువుకున్నాను. ఇంకా చదువుకోవాలని అనుకున్నాను. కానీ, పరిస్థితులు అనుకూలించలేదు. మా అమ్మాయి పుట్టినప్పుడు ఇలాంటి పాపను పెంచడం కష్టమని అందరూ అన్నారు. కానీ, నేను అవేమీ పట్టించుకోలేదు. మా పాపకు కావాల్సినవన్నీ నేను, నా భర్త సమకూరుస్తాం. ఆమె బాగా చదువుకోవాలి’’అని భువనేశ్వరి చెప్పారు.

‘‘ఇలాంటి పాపను పెంచుతూ సమయం వృథా చేస్తున్నామని కొందరు అన్నారు. కానీ, నేడు మా అమ్మాయి ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి చేస్తున్న ప్రయత్నాలను మేం చూస్తున్నాం’’ అని ఆమె అన్నారు.

ఎన్ని అడ్డంకులు ఎదురైనా తాను గాయని అవుతానని భార్గవి చెబుతున్నారు.

వీడియో క్యాప్షన్, నిఖత్ తండ్రి: నెలరోజులుగా ఎంత కష్టపడ్డదంటే...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)