హైదరాబాద్: ఆ 35 ముస్లిం కుటుంబాలు రోడ్డుపైనే రంజాన్ దీక్షలు ఎందుకు చేస్తున్నాయి?

- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
హైదరాబాద్ లక్డీకాపూల్ ఏసీ గార్డ్స్ ప్రాంతంలో 35 ముస్లిం కుటుంబాలు రంజాన్ ఉపవాస దీక్షలు రోడ్డు పక్కన ఫుట్‌పాత్ పైనే పాటిస్తున్నాయి.
వీరి ఇళ్లను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూల్చివేయడంతో కుటుంబాలన్నీ రోడ్డు పడ్డాయి.
ఫుట్‌పాత్‌పై చెట్ల నీడనే నివాసం ఉంటూ పవిత్ర రంజాన్ మాసపు ఉపవాస దీక్షలను(రోజా) ఆ కుటుంబాలు కొనసాగిస్తున్నాయి.
వారు ఉంటున్న ప్రాంతానికి బీబీసీ ప్రతినిధి వెళ్లారు.
ఆ సమయంలో ఏడెనిమిది కుటుంబాలకు చెందిన వ్యక్తులు రోడ్డు పక్కన కానుగ చెట్టు కింద ఉంటున్నారు. వారి సామాను, వంట వస్తువులు, మంచాలు, ఇతర ఫర్నీచర్, దుస్తులు.. అన్నీ అక్కడే ఉన్నాయి.
మండుతున్న ఎండలో చెట్టు నీడన వండుకుంటూ తింటూ జీవితం గడుపుతున్నారు.
రాత్రిళ్లు రోడ్డు పక్కనే మంచాలు వేసుకుని, చెక్కతో బల్ల మాదిరిగా ఏర్పాటు చేసుకుని పడుకుంటున్నారు.
మిగిలిన కుటుంబాల వారంతా సమీపంలో ఇళ్లకు అద్దెకు వెళ్లినట్లు వారు బీబీసీకి చెప్పారు.
సాయంత్రం వారంతా ఉపవాస దీక్షలు ముగించేందుకు ఫుట్‌పాతే దిక్కయ్యింది.
బీబీసీ ప్రతినిధి వెళ్లిన సమయంలో దాదాపు 16 మంది మహిళలు ఒక్కొక్కరుగా రోడ్డు పక్కన బకెట్లలో ఉంచిన నీటితో కాళ్లు చేతులు, ముఖం కడుక్కొని వస్తూ కనిపించారు.
"రంజాన్ మొదలైనప్పటి నుంచి మా ఉపవాస దీక్షలు ఇలాగే జరుగుతున్నాయి. రోజాంతా ఉపవాసం ఉంటున్నాం. ఇళ్లలో పని చేసుకుని బతుకుతున్నాం. సాయంత్రం ఉపవాస దీక్షలు ముగించే సమయంలో, రోడ్డు పక్కన ఫుట్‌పాత్ పైనే పరదాలు, దుప్పట్లు వేసుకుని కూర్చుంటున్నాం. ఇక్కడే అల్లాను ప్రార్థించి రోజా ముగిస్తున్నాం" అని షమా అనే మహిళ బీబీసీకి చెప్పారు.

వీరంతా ఎందుకు రోడ్డున పడ్డారు?
ఏసీ గార్డ్సు-బిస్తివాడ మధ్యలో సుమారు ఎకరం స్థలంలో ఆట మైదానం ఉంది.
ఇందులో బిస్తివాడ వైపు భవనాలు ఉన్నాయి. కొంత మేర మాత్రమే ప్రహరీ కట్టి ఉండేది.
ఏసీ గార్డ్సు వైపు దారిలో కొన్నేళ్లుగా దాదాపు 35 కుటుంబాలు ఇళ్లు కట్టుకుని జీవిస్తున్నాయి. వీరిలో మహిళలు ఇళ్లలో పనిచేస్తుండగా, కొందరు మగవారు ఆటోలు, కారు డ్రైవర్లుగా పనిచేస్తున్నారు.
వీరందరినీ ఫిబ్రవరి 14 తెల్లవారుజామున మున్సిపల్ అధికారులు ఒక్కసారిగా ఖాళీ చేయించారు.
పొక్లెయిన్లు, బుల్డోజర్లు, ఫైరింజన్లు తీసుకువచ్చి.. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఇళ్లను కూలగొట్టించారు.
కట్టుబట్టలతో ఇంట్లోని సామగ్రితో కుటుంబాలన్నీ రోడ్డున పడ్డాయి. తలదాచుకునే చోటు లేక పిల్లాపాపలతో రోడ్డున పడ్డారు. వీరిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉన్నారు.

ఈ విషయంపై ఫౌజియా సుల్తానా అనే మహిళ బీబీసీతో మాట్లాడారు.
"మాకు రెండు, మూడు రోజులు టైం ఇవ్వమని అడిగాం. ఫస్ట్ మమ్మల్ని పిలిచినప్పుడు 17వ తేదీ వరకు టైం ఉందని మున్సిపల్ అధికారులు చెప్పారు. సడెన్‌గా తెల్లవారుజామున 3 గంటలకు పోలీసులు, ఫైర్, మున్సిపల్ అందరూ వచ్చారు. అన్ని దారులూ మూసేశారు. బయట వాళ్లు లోపలికి రానివ్వకుండా.. లోపలివాళ్లు బయటకు రానివ్వకుండా ఆడ, మగ పోలీసులను కాపలా పెట్టి మా ఇళ్లన్నీ కూలగొట్టారు. మేం బతిమాలుకున్నాం. అయినా వాళ్లు మాకు హెల్ప్ చేయలేదు" అని ఫౌజియా సుల్తానా చెప్పారు.
ప్రస్తుతం కొందరు అద్దె ఇళ్లకు వెళ్లే స్థోమత లేక అక్కడే రోడ్డు పక్కనే ఉంటున్నారు.
ఈ విషయంపై చాంద్ అలీ అనే వృద్ధుడు బీబీసీతో మాట్లాడారు.
"30-40 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాను. పక్షులు, పెంపుడు జంతువులకు పంజరాలు చేసి విక్రయిస్తుంటాను. ఇప్పుడు చిన్న బడ్డీ కొట్టు పెట్టుకుని జీవితం గడుపుతున్నా. రాత్రికిరాత్రే పెద్ద సంఖ్యలో గవర్నమెంట్ అధికారులు వచ్చి మా ఇళ్లన్నీ కూల్చివేయించారు. నా బడ్డీ కొట్టు సామాను తీసుకుని, ఇక్కడే రోడ్డు పక్కన ఉంటున్నా. పక్కనే ఉన్న స్కూల్ ప్రిన్సిపల్ కొంత కిరాణా సరకులు ఇచ్చి ఆదుకుంటున్నారు" అని చాంద్ అలీ చెప్పారు.

అసలు ఏంటీ వివాదం?
నిజాం కాలంలో భద్రతా సిబ్బంది ఆఫ్రికన్ ఆశ్వ దళం నివాసం ఉండేందుకు ఆఫ్రికన్ కావల్రీ(ఏసీ) గార్డు ప్రాంతాన్ని కేటాయించారు.
ఆఫ్రికా నుంచి వచ్చిన సుమారు ౩౦౦ మంది యువకులు నిజాం కుటుంబాన్ని కాపాడేందుకు గార్డులుగా పనిచేసేవారు.
వీరు ఆశ్వదళంలో పనిచేసేవారని చరిత్రకారులు చెబుతున్నారు.
వారిలో ఆరు కుటుంబాలకు చెందిన వారుసులుగా చెప్పుకొంటూ ఏసీ గార్డ్సులోని బిస్తివాడ ప్రాంతంలో 35 కుటుంబాలు కొన్నేళ్లుగా నివాసం ఉంటున్నాయి.
తమతోపాటు తమ పూర్వీకులు కలిసి దాదాపు 70 ఏళ్లుగా అదే ప్రాంతంలో నివాసం ఉంటున్నట్లు కొన్ని పత్రాలు చూపిస్తున్నారు.
ఆ స్థలం ప్రభుత్వానికి చెందినది చెబుతూ అధికారులు తమను ఖాళీ చేయించారని వారు అంటున్నారు.

ఈ స్థలంపై తొలుత 1996లో వివాదం మొదలైందని, దానిపై కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నామని అక్కడి వారు చెప్పారు.
తమ వద్ద గతంలో కట్టిన వాటర్, కరెంటు, మున్సిపల్ ట్యాక్సు బిల్లులు కూడా ఉన్నట్లు చూపిస్తున్నారు.
"1951లో మా గ్రాండ్ ఫాదర్‌కి ల్యాండ్ దొరికింది. అప్పటి నుంచి ఉంటున్నారు. 1981లో మాకు రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఆ తర్వాత మంచిగానే ఉన్నాం. ఇప్పుడు గవర్నమెంట్ అధికారులు వచ్చి ఇది ఏసీ గార్డ్సు కాదు, బిస్తివాడ అంటున్నారు. 70 ఏళ్లుగా మేము, మా ముందు తరాలు ఇక్కడే ఉంటున్నాం. ఇప్పుడు సడెన్ గా వచ్చి ఏసీ గార్డ్సు కాదు, బిస్తి వాడ అని చెప్పి వెళ్లిపోమంటే ఏం చేయాలి చెప్పండి?" అని ఇల్లు కోల్పోయిన ఫౌజియా సుల్తానా వాపోయారు.
తనకు డిగ్రీ చదివే కుమార్తె ఉందని, ఇల్లు లేక దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
"ఇక్కడికి దగ్గర్లోనే రెండు గదులు తీసుకుని, ఆడవాళ్లందరం అక్కడికే వెళ్లి స్నానం చేసి వస్తున్నాం. పిల్లలు చదువుకునేందుకు వీల్లేకుండా ఉంది. ఇద్దరు, ముగ్గురు పిల్లలు పదో తరగతి పరీక్షలు రాయాల్సి ఉంది. వారు పరీక్షలు ఎలా రాస్తారో తెలీదు" అని ఫౌజియా సుల్తానా చెప్పారు.

హైకోర్టు ఏం చెప్పిందంటే..
ఈ స్థల వివాదంపై బిస్తివాడ యూత్ స్పోర్ట్స్ అసోసియేషన్, ప్రభుత్వం మధ్య హైకోర్టులో కేసు(డబ్ల్యూపీ(పిల్) నం.37 ఆఫ్ 2022) నడిచింది.
గతేడాది ఏప్రిల్ 19న ఆ స్థలం క్రీడామైదానానికి కేటాయించాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది.
అంతకుముందు 2012 నాటి కేసును డిస్పోజ్ చేయడంతో పాటు ఆ స్థలంలో ఉన్న ఆక్రమణలను నాలుగు నెలల్లో తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.
ఈ ఆదేశాల ప్రకారమే ఆక్రమణలు తొలగించాలమని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు.
కానీ, అక్కడ ఉంటున్న వారికి పునరావాసం చూపించకుండా రాత్రికి రాత్రి ఖాళీ చేయిండచంతో అక్కడి వారు రోడ్డున పడ్డారు.
దీనిపై జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ మోహన్ రెడ్డి బీబీసీతో మాట్లాడారు.
"హైకోర్టు ఆదేశాల ప్రకారమే బిస్తివాడలో ఆక్రమణలు తొలగించాం. అది ప్రభుత్వ ఆట స్థలం. వారు చూపిస్తున్న డాక్యుమెంట్లు కూడా నకిలీవి. వారికి పునరావాసం బాధ్యత రెవెన్యూ అధికారులు చూసుకోవాలి" అని చెప్పారు.
ఇదే విషయంపై ఆసిఫ్ నగర్ తహసీల్దారు పర్వీనా బీబీసీతో మాట్లాడారు.
"బిస్తివాడలో ఆక్రమణలు తొలగించే ముందే, వారు వేరొకచోటకు వెళ్లిపోయారని" చెప్పారు.
ఇప్పటికీ అక్కడ కొందరు రోడ్డు పక్కన ఉంటున్నారు కదా అని బీబీసీ ప్రశ్నించగా.. "రెవెన్యూ సిబ్బందిని పంపించి ఎన్ని కుటుంబాలు ఉంటున్నాయో సర్వే చేయిస్తాం. వారి విషయాన్నికలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయించేందుకు ప్రయత్నిస్తాం" అని ఆమె చెప్పారు.


ప్రస్తుతం ఆ స్థలం ఎలా ఉంది?
ఇళ్లు కూల్చివేసిన స్థలం చుట్టూ ప్రహరీ గోడ నిర్మించారు. దానిపై ఆరు అడుగుల ఎత్తయిన ఫెన్సింగ్ పెట్టారు.
ప్రస్తుతం అక్కడ ఇళ్లు కూల్చివేసిన ఆనవాళ్లు, మట్టి పెళ్లలు, రాళ్లు గుట్టలుగా పడి ఉన్నాయి.
ఆ స్థలం ఆట మైదానం అని చెప్పేలా జీహెచ్ఎంసీ అధికారులు రెండు చోట్ల బోర్డులు ఏర్పాటు చేశారు.
"ఈ భూమి జీహెచ్ఎంసీకి చెందినది. అక్రమార్కులపై విచారణ చేపడతాం" అని రాసి ఉంది.
"సంజయ్ గాంధీ ప్లే గ్రౌండ్, బిస్తివాడ, సి-17, ఖైరతాబాద్, డబ్ల్యూపీ పిల్ నం.37-2022" అని కమిషనర్ జీహెచ్ఎంసీ ప్రకటించినట్లు బోర్డు కింద రాసి ఉంది.
ఇవి కూడా చదవండి:
- ఐపీఎల్ 2023: టోర్నీని రసవత్తరంగా మార్చబోతున్న 'ఇంపాక్ట్ ప్లేయర్' రూల్ ఏంటి? ఒక బ్యాట్స్‌మన్ ఔటైతే, ఈ ఆటగాడితో బ్యాటింగ్ చేయించొచ్చా?
- అర్షమొలలు: మలద్వారం నుంచి రక్తం ఎందుకు వస్తుంది, తగ్గాలంటే ఏం చేయాలి?
- రిలయన్స్, అదానీ, టాటా వంటి పెద్ద సంస్థలతో నష్టం కూడా ఉందా?
- ‘అందరిలా నాకు కన్నీళ్లు రావు.. ఏడవలేను కూడా’.. ఏమిటీ సమస్య
- ఏటీఎం జాక్‌పాటింగ్: సినిమాలో పాత్ర అంటూ ప్రజలను పంపించి రూ. 115 కోట్లు డ్రా చేయించారు, అయిదేళ్ల కిందట పుణె బ్యాంకును ఎలా కొల్లగొట్టారంటే..















