ఇరాన్ నిరసనలు: ‘నీ ఫోన్ గ్యాలరీ ఉన్న ఫోటోలో ఆమె పద్ధతిగా దుస్తులు వేసుకోలేదు ఎందుకు?’

ఇరాన్ నిరసనలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఖోర్సో కల్బాసీ ఇస్ఫహానీ
    • హోదా, బీబీసీ మానిటరింగ్

‘‘ఫోన్‌ పాస్‌వర్డ్ చెప్పు’’ అని నిరసనకారుడిని బెదిరిస్తూ ఇరాన్ భద్రతా దళంలో పనిచేస్తున్న ఓ సీనియర్ అధికారి గట్టిగా అరిచారు. మొహంపై గట్టిగా కొడుతున్నారు కూడా.

ఆ నిరసనకారుడు దాదాపు 20 ఏళ్ళ వయసులో ఉన్నారు. టెహ్రాన్‌లో అక్టోబరులో నిరసన తెలిపినందుకు ఆయనను అరెస్టు చేశారు.

‘‘ఒక అమ్మాయిని అరెస్టు చేసేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. ఆమె తప్పించుకునేందుకు నేను సాయం చేశాను. అప్పుడే ఓ అధికారి పట్టుకున్నారు’’అని ఆ నిరసనకారుడు తెలిపారు.

‘‘ఇద్దరు అధికారులు నన్ను బలంగా నేలకేసి కొట్టారు. వీపుపై అలానే నిలబడి కొన్ని నిమిషాల పాటు కొట్టారు’’అని ఆయన వివరించారు.

ఆ తర్వాత ఫోన్‌ ఇవ్వమని అడిగారు. వెంటనే ఆయన ఫోన్ ఇచ్చేశారు.

ఫోన్‌ పాస్‌వర్డ్ కూడా తెలుసుకున్న తర్వాత, ఆయనను వ్యాన్‌లోకి ఎక్కించారు.

భద్రతా కారణాల దృష్ట్యా ఆ నిరసనకారుడితోపాటు ఈ కథనంలో ఇతరుల పేర్లను కూడా వెల్లడించడం లేదు.

ఇరాన్ నిరసనలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అయతొల్లా అలీ ఖమేనీ

‘‘వారు నన్ను కొడుతున్నప్పుడే మరో అధికారి నా ఫోన్ అన్‌లాక్ చేశారు. మొత్తం నా ఫోన్‌ను వారు జల్లెడపట్టారు’’అని ఆ నిరసనకారుడు బీబీసీతో చెప్పారు.

‘‘కొన్ని నిమిషాల తర్వాత అందులో ఏమీలేదని ఓ అధికారి తేల్చారు. దీంతో వారు నన్ను విడిచిపెట్టారు’’అని ఆయన వివరించారు.

‘‘నిరసనల దృశ్యాలు ఏమైనా రికార్డు చేశానేమోనని ఫోన్ గ్యాలరీని వారు చెక్ చేశారు’’అని ఆయన తెలిపారు.

నిజానికి ఒకవేళ నిరసన దృశ్యాలు రికార్డు చేసుంటే.. ‘‘దేశానికి వ్యతిరేకంగా కుట్ర’’ పేరుతో ఆయనపై కూడా అధికారులు ఆరోపణలు మోపేవారు. ఇలాంటి ఆరోపణలతో చాలామందిని వారు అదుపులోకి తీసుకున్నారు.

ప్రస్తుతం నిరసనలను ఫోన్లలో రికార్డు చేయకుండా అడ్డుకునేందుకు ఇరాన్ ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరిస్తోంది.

‘‘నేరాల’’ ఫుటేజీని రికార్డు లేదా షేర్ చేయడాన్ని నేరంగా పరిగణించే ఒక బిల్లును ప్రస్తుతం ఇరాన్ పార్లమెంటు పరిశీలిస్తోంది.

ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే, ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించే ఉంది. అక్రమంగా చేపట్టే నిరసనలను కూడా నేరంగా ఈ బిల్లులో పేర్కొన్నారు.

నిరసనలకు కారణమయ్యేలా ఎవరైనా సెలబ్రిటీలు ‘‘అబద్ధపు’’ వ్యాఖ్యలు చేస్తే, వారికి కూడా 15 ఏళ్ల జైలు శిక్ష విధించేలా చట్టంలో ప్రతిపాదించారు.

ఇరాన్ నిరసనలు

ఫొటో సోర్స్, Getty Images

ఇన్‌స్టా మరణశిక్ష

‘‘సైబర్ స్పేస్’’ను కూడా యుద్ధ క్షేత్రంగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ తరచూ చెబుతుంటారు. ‘‘సైబర్ స్పేస్‌లో శత్రువులనూ కట్టడి చేయాలని’’ భద్రతా దళాలకు ఆయన సూచిస్తుంటారు.

ఎక్కడైనా అసమ్మతి అనేది అమెరికా, వారి మిత్రపక్షాలకు లబ్ధి చేకూరుస్తుందని ఖమేనీ వివరిస్తుంటారు.

మరో నిరసనకారుడు మాతో మాట్లాడుతూ ‘‘ఫోన్లు అన్‌లాక్ చేయకపోతే మా కుటుంబ సభ్యులకు అత్యాచారాలు, అరెస్టు, ఉరిశిక్ష లాంటి తప్పవని బెదిరించేవారు’’అని చెప్పారు.

గత సెప్టెంబరులో 300 మంది ఇతరులతోపాటు ఆయన్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. బలవంతంగా వారితో చేయని నేరాలను ఒప్పించారు.

ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలు, ఆన్‌లైన్ చాట్‌ల ఆధారంగా ఓ టీనేజర్‌కు కూడా మరణిశిక్ష విధించారు. కోర్టు తీర్పులో ఆ ఇన్‌స్టా స్క్రీన్‌షాట్‌లను కూడా పబ్లిష్ చేశారు.

‘‘ఎనిమిటీ ఎగైనెస్ట్ గాడ్’’ ఆరోపణలతో ఈ కేసులో 19 ఏళ్ల మొహమ్మద్ బొరోఘనీను దోషిగా నిర్ధారించారు. ఒక భద్రతా అధికారిని కూడా కత్తితో పొడిచాడని, నిరసనల్లో పాలుపంచుకోవాలని కూడా అతడు సోషల్ మీడియాలో చాలా మంది ప్రోత్సహించాడని ఆరోపణలు మోపారు.

జనవరిలో అతడి కేసు విచారణ జరుగుతున్న జైలు వెలుపల పెద్దయెత్తున ప్రజలు గుమిగూడారు. దీంతో ఈ కేసును సమీక్ష కోసం సుప్రీం కోర్టుకు పంపించారు.

ఇరాన్ నిరసనలు

ఫొటో సోర్స్, Getty Images

మొబైల్ ఫోన్లతో

నేరాలకు మొబైల్ ఫోన్లే కారణమని ఇరాన్‌ ప్రభుత్వం భావించడం ఇటీవల మరింత ఎక్కువైందని హార్వర్డ్ యూనివర్సిటీలో టెక్నాలజీ, లా, హ్యూమన్ రైట్స్ రీసెర్చర్ అఫ్సానా రిగోట్ చెప్పారు.

పశ్చిమ ఆసియా, ఉత్తర అమెరికాలో ఎల్‌జీబీటీక్యూ వర్గాల అణచివేతలో డిజిటల్ మీడియా పాత్రపై ఆమె దశాబ్దం నుంచి పరిశోధన చేపడుతున్నారు.

ఫోటోలు, వీడియోలు, కొన్ని యాప్‌లను కూడా ‘‘అక్రమంగా స్వాధీనం’’ చేసుకొని డిజిటల్ సాక్ష్యాలు రూపంలో కోర్టుల్లో సమర్పించడం ఎక్కువైందని ఆమె వివరించారు. ఇక్కడ బ్రౌజింగ్ హిస్టరీని కూడా సాక్ష్యాలుగా చూపిస్తున్నారని చెప్పారు.

‘‘ఎల్‌జీబీటీక్యూ చర్యలను నేరంగా పరిగణించే ఇరాన్‌లాంటి దేశాల్లో ప్రతిఘటన, స్వేచ్ఛ లాంటి వాటికి చోటుండదు. నేరం రుజువుకాకముందు నిర్దోషిగా చూడాలనే ప్రశ్నే ఉండదు. ముందుగానే మీరు దోషులుగా వారు భావిస్తారు. ఆ తర్వాత వారి ఆరోపణలకు సరిపడే ఆధారాలను సేకరిస్తారు’’అని ఆమె వివరించారు.

వీడియో క్యాప్షన్, మోరల్ పోలీసింగ్ క్రూరత్వంపై మహిళల ఆగ్రహం

ఎలక్ట్రానిక్ పరికరాలే లక్ష్యం

ఎలాంటి వారెంట్లు లేకుండా, చట్టపరమైన విధానాలను అనుసరించకుండా ఇక్కడ ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకుంటారు.

టెహ్రాన్‌లోని ఓ జర్నలిస్టు కుటుంబం నివసించే ఇంటిపై అక్టోబరులో ఇలానే డిజన్ల మంది నిఘా మంత్రిత్వ శాఖ అధికారులు దాడిచేశారు.

ఆ తర్వాత ఆ జర్నలిస్టును కూడా అరెస్టుచేసి, వారాలపాటు అదుపులో ఉంచారు.

ఆ రోజు ఇంట్లో అందరి ఫోన్లను అధికారులు తీసుకున్నారు. డిజిటల్ ఎవిడెన్స్ కోసం వారి ఫోన్లను జల్లెడపట్టారు.

‘‘వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్‌స్టా చాట్‌లను వారు పరిశీలించారు. సోషల్ మీడియా పోస్టులను కూడా చూశారు. మొదట మాత్రం ఫోటో గ్యాలరీలను పరిశీలించారు’’అని ఆ జర్నలిస్టు కుటుంబ సభ్యుడు ఒకరు తెలిపారు.

‘‘నా గ్యాలరీలోని ఒక ఫోటోలో ఒక మహిళ ‘సంప్రదాయబద్ధంగా’ బట్టలు ఎందుకు వేసుకోలేదని అడిగారు’’ అని ఆయన చెప్పారు.

‘‘వెంటనే ఆ ఫోటోలు మా ప్రైవేటు ఫోటోలని నేను వాదిస్తుండగా ఒక అధికారి వచ్చారు. కేవలం నిరసనల ఫోటోలు, వీడియోలను మాత్రమే చూడండి.. ప్రైవేటు ఫోటోల జోలికి వెళ్లొద్దని అన్నారు’’ అని ఆయన వివరించారు.

‘‘నిరసనల వీడియోలు, ఫోటోలు ప్రపంచం చూడకూడదని వారు భావిస్తున్నారు’’ అని ఆయన అన్నారు.

నిరసనకారులకు ఉరి శిక్షలు విధించడంతో వీధులకు బదులుగా అంత్యక్రియల వద్ద ప్రజలు తమ నిరసన తెలియజేస్తున్నారు.

వీడియో క్యాప్షన్, పరువు పేరుతో జరుగుతున్న హత్యల సంఖ్యలో పెరుగుదల ఆందోళనకరం అంటున్న హక్కుల సంఘాలు

ప్రధాన మీడియాపైనా ఇరాన్ తన పట్టు మరింత పెంచింది.

అన్ని చానెళ్లలో వచ్చే వార్తలనూ ప్రభుత్వం నియంత్రిస్తోంది. మరోవైపు అధికారిక వార్తా పత్రికలు ప్రభుత్వ వాదనను పదేపదే పునరుద్ఘాటిస్తున్నాయి.

ప్రభుత్వాన్ని విమర్శించే పత్రికలపై నిషేధం, అరెస్టులు లాంటి చర్యలతో బెదిరిస్తున్నారు. ప్రధాన మీడియా మొత్తం ప్రభుత్వ ఆధీనంలో ఉండటంతో, వార్తల కోసం శాటిలైట్ టీవీలు, ఇంటర్నెట్‌ను ప్రజలు ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు.

దేశ జనాభాలో 70 శాతం మంది ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అయితే, ప్రముఖ సోషల్ మీడియా వేదికలు, మెసేజింగ్ సర్వీసులపై ఇక్కడ ఆంక్షలు అమలులో ఉన్నాయి.

ఈ ఆంక్షలను తప్పించుకునేందుకు కొందరు ప్రాక్షీ నెట్‌వర్క్‌లను ఇక్కడి ప్రజలు ఆశ్రయిస్తున్నారు. అయితే, చాలామందికి వీటి గురించి పెద్దగా తెలియదు.

 ‘‘ఇరాన్ ప్రభుత్వం చేతిలో డిజిటల్ ఎవిడెన్స్ అనేది ప్రమాదకర అస్త్రంగా మారుతోంది’’అని అఫ్సాసా చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)