ముస్లింలకు శ్మశానాల కొరత... కబ్జాలు, కాంక్రీటు సమాధుల నిర్మాణమే కారణమా?

ఫొటో సోర్స్, SHURIAH NIAZI
- రచయిత, షురైహ్ నియాజీ
- హోదా, బీబీసీ కోసం
జఫర్ ఎంత దురదృష్టవంతుడు? ఖననం చేయడానికి కు-ఎ-యార్‌లో రెండు గజాల స్థలం దొరకట్లేదు. రానున్న రోజుల్లో భోపాల్‌లో ముస్లింలు అందరి పరిస్థితీ ఇదే కావచ్చు.
దురాక్రమణల కారణంగా శ్మశానవాటికలు కుంచించుకుపోవడం ఒక కారణం అయితే, కాంక్రీటు సమధులు మరో కారణం.
నగరంలోని ప్రధాన స్మశానవాటికలో ఇంతేజామియా కమిటీ ఒక బ్యానర్ కట్టింది.
"శ్మశానవాటికలో స్థలం కొరత ఉంది. ఎవరైనా పొరపాటున మీ వాళ్ల సమాధిని తీసుకుంటే కోపగించుకోవద్దు, దురుసుగా వ్యవహరించవద్దు" అని అందులో రాసి ఉంది.
పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఈ బోర్డు చెబుతుంది.
శ్మశానవాటికలో కాపలా కాసేవారు ఎన్నోసార్లు దురుసు ప్రవర్తనలను ఎదుర్కోవలసి వస్తోంది.

ఫొటో సోర్స్, SHURIAH NIAZI
కాంక్రీటు సమాధులు, మన్ను కొరత...
వక్ఫ్ బోర్డు రికార్డుల ప్రకారం, నేడు భోపాల్ నగరంలో 149 శ్మశానవాటికలు ఉన్నాయి. కానీ, వాస్తవంలో 40 కన్నా తక్కువ శ్మశానవాటికలు ఉన్నాయని జనం అంటున్నారు.
ఇలాంటి కొరత వల్ల, సమాధులను కాంక్రీటుతో నిర్మించవద్దని ఖాజీలు ప్రజలను అభ్యర్థిస్తున్నారు. ఇస్లాంలో అలా లేదని కూడా చెబుతున్నారు.
శ్మశానాల్లో మట్టి కొరత ఉందని కొన్ని సంస్థలు చెబుతున్నాయి.
మరోవైపు, శ్మశానాల భూముల కబ్జా కూడా నానాటికీ పెరిగిపోతుండడంతో, రానున్న కాలంలో ముస్లింలకు రెండెకరాల భూమి కూడా దక్కకుండా పోయే ప్రమాదం ఉంది.
దీనిపై భోపాల్‌కు చెందిన ఖాజీ మౌలానా సయ్యద్ ముస్తాక్ అలీ నద్వీ బీసీతో మాట్లాడారు.
"ఇస్లాంలో కాంక్రీటు సమాధులు నిషేధం. అయినా కూడా, జనం కాంక్రీట్ సమాధులు కడుతున్నారు. శ్మశానవాటిక పాఠాలు నేర్చుకునే ప్రదేశం. కాంక్రీటు సమాధులు కట్టి, విహారం కోసం వెళ్లే స్థలం కాదు. అది మనకు చివరి గమ్యస్థానం. మన సొత్తు కాదన్న సంగతి ప్రజలు గ్రహించాలి. నగరంలో జానాభా నిరంతరం పెరుగుతోంది. ఇలాగే కాంక్రీటు సమాధులు కట్టుకుంటూ పోతే, చాలా ఇబ్బందుల్లో పడతాం. ఇది అందరూ ఆలోచించుకోవాలి" అన్నారు.
2011 జనాభా లెక్కల ప్రకారం, భోపాల్ మొత్తం జనాభా 23.68 లక్షలు. అందులో సుమారు 5.25 లక్షల మంది ముస్లింలు. ఈ సంఖ్య ఇప్పుడు కచ్చితంగా పెరిగి ఉంటుంది.
పెరుగుతున్న జనాభా, స్థలం కొరత వల్ల చాలా నగరాల్లో శ్మశానవాటికల్లో మట్టి పోసి సమాధులను చదును చేశారు.
కానీ, భోపాల్‌లో కాంక్రీటు సమాధుల కారణంగా మట్టి పోసి చదును చేయడం ఇంతేజామియా కమిటీకి అంత సులభం కాదు.

ఫొటో సోర్స్, SHURIAH NIAZI
కాంక్రీటు సమాధులు ఎందుకు కడుతున్నారు?
ఒక భోపాల్ నివాసి తన తల్లికి కాంక్రీటు సమాధి కట్టించారు. తన తల్లి ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండాలని పక్కా సమాధి కట్టించినట్టు చెప్పారు.
"చాలాసార్లు సమాధులను చదును చేస్తారు లేదా తవ్వేస్తారు. మా అమ్మ సమాధికి అలా జరగకూడదని అనుకున్నా. అందుకే కాంక్రీటు చేశాను. ఇస్లాంలో అలా చేయకూడదని చెబుతారు. కానీ, మా అమ్మ విషయంలో నేనలా ఆలోచించలేదు" అన్నారు ఆ వ్యక్తి.
ఒక శ్మశానవాటికకు ఒక ఏడాదికి సుమారు 3000 డంపర్ల మట్టి అవసరం అవుతుందని ఈ రంగంలో పనిచేస్తున్నవారు చెబుతున్నారు.
నగరంలో కొందరు ఈ సమస్యకు పరిష్కారం కోసం పోరాడుతున్నారు.
సామాజిక కార్యకర్త సయ్యద్ ఫైజ్ అలీ కూడా 'ఏక్ తగాడి మిట్టి' అనే ప్రచారాన్ని ప్రారంభించారు. దీని ద్వారా జనం స్మశానాల కోసం మట్టి ఇస్తారని ఆశిస్తున్నారు.
"శ్మశానాల కబ్జా, కాంక్రీటు సమాధుల కారణంగా మట్టి కొరత ఏర్పడుతోంది. ఇప్పుడు ఏదో ఒకలా పని జరుగుతోంది. కానీ, రానున్న రోజుల్లో సమస్య ఎంత తీవ్రం అవుతుందంటే, మేం ఏమీ చేయలేకపోవచ్చు. అందుకే 'ఏక్ తగాడి మిట్టి' ప్రచారాన్ని ప్రారంభించాం. ఇది ప్రజల్లో చైతన్యం తీసుకొస్తుందని, సమస్య ఎంత తీవ్రంగా ఉందో వారు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం" అన్నారు ఫైజ్ అలీ.

ఫొటో సోర్స్, SHURIAH NIAZI
కబ్జాల వల్ల కూడా సమస్య పెరుగుతోంది..
భోపాల్ నగరం నడిబొడ్డున ఉన్న బడా బాగ్ శ్మశానవాటిక అన్ని వైపుల నుంచీ ఆక్రమణకు గురవుతోంది. శ్మశానవాటిక స్థలం రోజురోజుకూ తగ్గిపోతోంది.
స్మశానంలో పార్కింగ్ కూడా చేస్తున్నారు. కాంక్రీటు సమాధుల వలన శవపేటికలను మోసుకురావడం ఇబ్బంది అవుతోంది.
అక్కడ వాహనాలు పార్క్ చేస్తున్నవారితో మేం మట్లాడడానికి ప్రయత్నించాం. కానీ, ఎవరూ స్పందించలేదు.
ముస్లిం శ్మశానవాటికలు వక్ఫ్ బోర్డు పరిధిలోకి వస్తాయి. వాటి నిర్వహణ బాధ్యత కూడా వారిదే. కబ్జా లేదా మరేదైనా దుస్థితి ఏర్పడితే వారు చర్యలు తీసుకోవచ్చు. అయితే దీనికి జిల్లా యంత్రాంగం సహాయం అవసరం. బోర్డుకు సొంత బలగం లేదు కాబట్టి జిల్లా కలెక్టర్‌కు సమాచారం అందిస్తారు. తద్వారా చర్యలు తీసుకుంటారు.
శ్మశానవాటికలను పర్యవేక్షిస్తున్న మధ్యప్రదేశ్ వక్ఫ్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సయ్యద్ షకీర్ అలీ జాఫ్రీ బీబీసీతో మాట్లాడుతూ, కాంక్రీటు సమాధులను నివారించడానికి బోర్డు శాయశక్తులా ప్రయత్నిస్తోందని చెప్పారు.
"ఖాజీ అభ్యర్థనలను బోర్డు సమర్థిస్తోంది. కాంక్రీటు సమాధులు నిర్మించవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. కబ్జాల గురించి జిల్లా కలెక్టర్‌కు, కమిషనర్‌కు లేఖ రాశాం. వక్ఫ్ బోర్డు తీసుకోగలిగిన చర్యలు అన్నీ తీసుకుంటుంది" అని ఆయన అన్నారు.
భోపాల్ చాలా కాలం ముస్లిం పాలకుల పాలనలో ఉంది. అందుకే ఇతర నగరాల కంటే ఇక్కడ ముస్లిం శ్మశానవాటికలు ఎక్కువ. అయినప్పటికీ, ముస్లింలు తమ బంధు మిత్రులు చనిపోయినప్పుడు ఖననానికి స్థలం దొరకక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- గౌతమ్ అదానీపై ఆరోపణలు చేసిన 'హిండెన్‌బర్గ్' నాథన్ ఆండర్సన్ హీరోనా, విలనా?
- క్యాన్సర్ పేషెంట్ తనకు తెలియని భాషలో అనర్గళంగా మాట్లాడారు... ఇదెలా సాధ్యం?
- ఛత్రపతి శివాజీ ‘గ్రేట్ ఎస్కేప్’ - ఔరంగజేబ్ బంధించినపుడు 'ఆగ్రా జైలు' నుంచి శివాజీ ఎలా తప్పించుకున్నారు?
- నందమూరి తారకరత్న: ఒకే రోజు 9 సినిమాలకు సంతకం చేసిన హీరో కెరీర్ ఆ తర్వాత ఎలా సాగింది?
- యుక్రెయిన్ యుద్ధం వల్ల తిరిగొచ్చిన మెడిసిన్ విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది? కేసీఆర్ ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేరడం లేదు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











