‘‘మిమ్మల్ని చంపటానికి ఎవరైనా వస్తే అందరం కలిసి చనిపోదాం’ అంటూ ముస్లింలు మమ్మల్ని ఆపారు’’ - కశ్మీర్ లోయని వీడి వెళ్లని ఓ కశ్మీరీ పండితుల కుటుంబం కథ

ఫొటో సోర్స్, MAJID JAHANGIR/BBC
- రచయిత, మాజిద్ జహంగీర్
- హోదా, బీబీసీ కోసం, శ్రీనగర్ నుంచి
కశ్మీరీ పండిట్ బద్రీనాథ్ భట్, శ్రీనగర్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న లార్ గ్రామంలో నివసిస్తారు. అక్కడ ఆయనకు మూడు అంతస్థులు ఇల్లు ఉంది. అందులోని కింది అంతస్థులో ఉండే ఆయన ఆశ, నిరాశల మధ్య జీవిస్తున్నారు.
నేను ఆయన ఇంటికి చేరుకున్నప్పుడు, 78 ఏళ్ల బద్రీనాథ్ భట్ నన్ను చూసి ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. ప్రేమగా నన్ను ఇంట్లోకి తీసుకెళ్లారు.
ఆయన గదిలో అనేక హిందూ మత పుస్తకాలు, హిందీలో ఉన్న ఖురాన్ పుస్తకం, శివుని పటం కనిపించాయి.
ఆయన కశ్మీర్ లోయను ఎప్పుడూ విడిచిపెట్టలేదు. దాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వలస వెళ్లలేదు. అక్కడే జీవిస్తున్నారు.
కశ్మీర్‌ను ఎందుకు విడిచి వెళ్లలేదో బద్రీనాథ్ భట్ వివరించారు.
‘‘మన పుట్టిన ఊరును ఎప్పుడూ విడిచి వెళ్లకూడదు. కశ్మీర్ నుంచి వెళ్లిపోవాలని నా మనసుకు ఎప్పుడూ అనిపించలేదు. రెండోది, మా పట్ల మెజారిటీ కమ్యూనిటీ వైఖరి చాలా బాగుంది. జన్మభూమిని విడిచి దూరంగా వెళ్లకూడదని మన శాస్త్రాల్లో కూడా ఉంది. ఈ రెండు కారణాల వల్లే నేను కశ్మీర్‌ను విడిచి వెళ్లలేదు’’ అని ఆయన తెలిపారు.
లార్ గ్రామంలో ప్రస్తుతం ఆరు కశ్మీరీ పండిట్ల కుటుంబాలు నివసిస్తున్నాయి. వారంతా ఒకరికొకరు బంధువులు. ఇరుగు పొరుగునే ఉంటారు.
లార్ గ్రామంలో మొత్తం 25 కశ్మీరీ పండిట్ల కుటుంబాలు నివసించేవి.
బద్రీనాథ్ కుమారులు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తారు. ఆయన కూడా రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి.
ప్రభుత్వం, వారి భద్రత కోసం కొంతమంది పోలీసులను అక్కడ మోహరించింది.
అక్కడే ఆరు కశ్మీర్ పండిట్ల కుటుంబాలు ఉన్నాయి. వారి చుట్టుపక్కలంతా ముస్లిం వారు ఉంటారు.

ఫొటో సోర్స్, MAJID JAHANGIR/BBC
కశ్మీర్‌ను విడవని చాలా కుటుంబాలు
1998లో గాందర్‌బల్‌లోని వంధహామాకు చెందిన 28 కశ్మీరీ పండిట్ల కుటుంబాలు హత్యకు గురయ్యాయి. ఈ హత్యలు తామే చేసినట్లు తీవ్రవాద సంస్థ లష్కరే తోయిబా వెల్లడించింది.
1989లో కశ్మీర్‌లో తీవ్రవాదం ప్రారంభమైన తర్వాత, చాలా మంది కశ్మీరీ పండితులు హత్యకు గురయ్యారు. దీంతో కశ్మీర్ నుంచి పండిట్ల వలస ప్రారంభమైంది.
కశ్మీరీ పండిత్ సంఘర్ష్ సమితి (కేపీఎస్‌ఎస్) ప్రకారం, కశ్మీర్‌లో 800ల కశ్మీరీ పండిట్ల కుటుంబాలు ఉన్నాయి. వీరు కశ్మీర్‌ను విడిచి ఎప్పుడూ వెళ్లిపోలేదు.
బద్రీనాథ్ భట్ భార్య లలితా భట్, వంటగదిలో రోజు వారీ పనుల్లో నిమగ్నమయ్యారు. ఆయన తన భావాలను పంచుకోవడానికి తొలుత సంకోచించారు.
‘‘మేం ఇక్కడ మా పొరుగు ముస్లిం కుటుంబాలతో చాలా ప్రేమగా నివసిస్తున్నాం. ఆ కుటుంబాలకు చెందిన తల్లులు, కూతుళ్లు మా ఇంటికి వస్తుంటారు. మేం వాళ్లింటికి వెళ్తాం. నేనెప్పుడూ ఒకటే చెబుతా, మొదటి ప్రాధాన్యం పొరుగువారు, తర్వాతే బంధువులు అని.
ఈ మధ్యే ఒక పండుగ జరుపుకున్నాం. ఇరుగుపొరుగులో చాలా మంది మా ఇంటికి వచ్చారు. టీ తాగి వెళ్లారు. మా వీధిలోని పొరుగు వారందరం మామూలుగా తమ ఇళ్లలో వండిన కూరలను ఒకరికొకరు పంచుకుంటాం. ఎవరి ఇంట్లో శుభ కార్యం జరిగినా, ఎవరైనా చనిపోయినా, పిల్లలు పుట్టినా మేం అందరం ఒకరి ఇంటికి ఒకరం వెళ్తుంటాం’’ అని ఆయన తెలిపారు.
గత ఏడాదిన్నరగా కశ్మీర్‌లో కశ్మీరీ పండితులను లక్ష్యంగా చేసుకుంటున్న ఉదంతాలు బయటకు వస్తున్నాయి.

ఫొటో సోర్స్, MAJID JAHANGIR/BBC
‘‘ముస్లిం కమ్యూనిటీ మమ్మల్ని వెళ్లనివ్వలేదు’’
ఇటీవలి కాలంలో దక్షిణ కశ్మీర్‌లో సంజయ్ శర్మ అనే కశ్మీరీ పండితుడు హత్యకు గురయ్యారు. కశ్మీర్ నుంచి వలస వెళ్లకుండా కశ్మీర్‌లోనే ఉండిపోయిన పండిట్లలో సంజయ్ శర్మ కూడా ఒకరు.
ఈ హత్య తర్వాత కశ్మీర్ నుంచి వలస వెళ్లని కుటుంబాలు విస్మయం చెందాయి.
బద్రీనాథ్ భట్ మాట్లాడుతూ, ‘‘కశ్మీరీ పండితుల హత్యలు జరుగుతున్నాయి కదా. ఈ పరిస్థితులను చూస్తుంటే లోపల కాస్త భయంగానే ఉంటుంది. ఎవరు వస్తారో? ఏం అవుతుందో? ఎవరు ఎప్పుడు చనిపోతారో? ఎవరు ఎవర్ని చంపుతారో? అని భయంగా ఉంది. కానీ, గ్రామాన్ని విడిచి వెళ్లాలా? వద్దా? అనే విషయాన్ని మేం ఇంకా ఆలోచించలేదు. ఇప్పటికైతే మేం ఇలా ఉన్నాం. చూద్దాం, దేవుడు ఏం చేస్తాడో’’ అని అన్నారు.
మీరు దేనికి భయపడుతున్నారు? అని అడగగా బద్రీనాథ్ సమాధానం ఇచ్చారు.
‘‘ఇక్కడి ముస్లిం ప్రజలు కూడా భయంలోనే బతుకుతున్నారు. ఎవరైనా వస్తే ఇక్కడున్న అందరికీ హాని చేస్తారేమో అని వారు భయపడుతున్నారు’’ అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, MAJID JAHANGIR/BBC
బద్రీనాథ్ భట్ ఇంటి పక్కనే ఆయన అన్న సోమ్‌నాథ్ భట్ కూడా ఉంటారు. కశ్మీర్ నుంచి కశ్మీరీ పండితులు వలస వెళ్లిన సమయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.
‘‘మేం కూడా చాలాసార్లు కశ్మీర్ నుంచి పారిపోవడానికి ప్రయత్నించాం. కానీ, ఇక్కడి ముస్లిం కమ్యూనిటీ వారు మమ్మల్ని వెళ్లనివ్వలేదు. ఒకవేళ మీరు కశ్మీర్‌ను విడిచి వెళ్లిపోతే మేం కూడా మీతో పాటు వచ్చేస్తామని వారు మాతో అన్నారు.
ఒకవేళ ఎవరైనా మీకు హాని చేయడానికి వస్తే అప్పుడు మనం అందరం కలిసి చనిపోదాం అని వారు మమ్మల్ని ఆపారు. వారిని చూసి మేం కూడా అంతా భరించాం. అప్పటి నుంచి వారితో కలిసి సంతోషంగా జీవించాం’’ అని సోమ్‌నాథ్ చెప్పారు.
ప్రధానమంత్రి ప్యాకేజ్ (పీఎం)లో పనిచేస్తోన్న రాహుల్ భట్ అనే కశ్మీర్ పండితుడిని గత ఏడాది, బడ్‌గామ్‌లోని అతని కార్యాలయంలోనే అనుమానిత తీవ్రవాదులు కాల్చి చంపారు.
ఆ తర్వాత పీఎంలో పనిచేసే కశ్మీరీ పండితులందరూ నిరసనలకు దిగారు. కశ్మీర్ బయట, వేరే ప్రాంతానికి తమ ఉద్యోగాలు బదిలీ చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
దాదాపు ఆరు నెలలు నిరసలనలు చేసిన తర్వాత వారు సమ్మెను విరమించారు.
పీఎం ప్యాకేజ్ కింద 4 వేలకు పైగా కశ్మీరీ పండితులు పనిచేస్తున్నారు. వారంతా వివిధ జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్నారు.

ఫొటో సోర్స్, MAJID JAHANGIR/BBC
ఇబ్బందులు ఏంటి?
కశ్మీరీ పండితులకు వివాహం, ధార్మిక కార్యక్రమాలను నిర్వహించడం అంత సులభమైన వ్యవహారం కాదు.
తమకు ఎదురవుతున్న ఇబ్బందుల గురించి బద్రీనాథ్ వివరించారు.
‘‘ఎవరైనా చనిపోతే, అంత్యక్రియలు నిర్వహించే వ్యక్తిని జమ్ములోని బదర్వా నుంచి తీసుకురావాల్సి ఉంటుంది. పెళ్లి కోసం అబ్బాయి లేదా అమ్మాయిలు దొరకడం చాలా కష్టం. పెళ్లి సంబంధాల కోసం జమ్మూకు వెళ్లాల్సి వస్తుంది. ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి’’ అని బద్రీనాథ్ చెప్పారు.
తమ వారెవరైనా చనిపోతే, ఇరుగుపొరుగు ఉన్న ముస్లిం సోదరులే స్వయంగా ఆ పని అంతా చేస్తారని సోమ్‌నాథ్ అన్నారు.
‘‘అలాంటి పరిస్థితుల్లో ముస్లిం సోదరులు ఒక రకంగా బాధ్యత అంతా తమ భుజానికి ఎత్తుకొని పనులన్నీ చేస్తారు’’ అని సోమ్‌నాథ్ వివరించారు.
ఇప్పటివరకు వచ్చిన ప్రభుత్వాలు తమకు చేసిందేమీ లేదని బద్రీనాథ్ అన్నారు. అయితే, తమ జిల్లాకు చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే గత నాలుగేళ్లలో అనేక పనులు చేశారని చెప్పారు.
‘‘ఇక్కడి దేవాలయాల పరిస్థితి అధ్వాన్నంగా ఉండేది. వాటికి మరమ్మతులు చేశారు’’ అని ఆయన వెల్లడించారు.
బద్రీనాథ్ భట్ ఇంటి సమీపంలోనే ఒక చిన్న మందిరం ఉంది. ఆ గ్రామంలో మరో రెండు పెద్ద ఆలయాలు ఉన్నాయి. గ్రామంలో ఉన్న శివాలయాన్ని చూపిస్తానంటూ ఆయన నన్ను తనతో తీసుకెళ్లారు. ఆ దారిలో వెళ్తున్నప్పుడు చాలా మంది ముస్లింలతో ఆయన ఆప్యాయంగా మాట్లాడారు. వారంతా ఒకరినొకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
గ్రామంలోని శివాలయానికి ప్రతీరోజూ తాను వెళ్తానని బద్రీనాథ్ చెప్పారు.
శివాలయం బయట బద్రీనాథ్‌కు ఒక స్థానిక ముస్లిం వ్యక్తి అబ్దుల్ అజీజ్ కలిశారు.
అజీజ్ నాతో మాట్లాడుతూ, బద్రీనాథ్ తనకు 30 ఏళ్లుగా తెలుసు అని చెప్పారు.
‘‘గత 30 ఏళ్లుగా ఈ పండితులతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. నేనెప్పుడు ఏది చెప్పినా వారు అర్థం చేసుకుంటారు. నా మాటకు మర్యాద ఇస్తారు. మేం ఒకరి ఇళ్లకు మరొకరం వెళ్తుంటాం. నాకేదైనా కష్టం వస్తే వీరికి చెప్పుకుంటాను. నాకు ఈయనపై ఉన్నంత నమ్మకం, నా తోటి ముస్లింల మీద కూడా ఉండదు. ఆయనకు ఏదైనా అవసరం వస్తే నాకు చెబుతారు’’ అని బద్రీనాథ్ గురించి అజీజ్ నాతో వివరించారు.
ఆర్టికల్ 370 తొలిగించిన తర్వాత ఏం మార్పులు వచ్చాయి?
ఆర్టికల్ 370 తొలిగించిన తర్వాత ఈ మూడేళ్లలో మీ జీవితంలో ఏం మార్పులు వచ్చాయి ? అని సోమ్‌నాథ్ భట్‌ను అడిగితే, నా జీవితంలో అయితే ఏ మార్పులూ రాలేదని ఆయన బదులిచ్చారు.
దానివల్ల ఏదైనా మార్పు వచ్చిందని మీరు భావిస్తే, ఇంకా తీవ్రవాదం ఎందుకు అంతం కాలేదని ఆయన తిరిగి ప్రశ్నించారు.
‘‘ఇది ఒక రాజకీయ సమస్య. దీని గురించి రాజకీయ నాయకులకు మాత్రమే తెలుసు. మాకైతే ఎలాంటి మార్పు రాలేదు. మేం ముందు ఎలా ఉన్నామో ఇప్పుడు అలాగే ఉన్నాం’’ అని సోమ్‌నాథ్ అన్నారు.
సోమ్‌నాథ్ వృత్తిరీత్యా రైతు. ఆయనకు గ్రామంలో పొలం ఉంది.
ఇటీవల కశ్మీర్ పండితుడు సంజయ్ కుమార్ హత్య జరిగినప్పుడు కశ్మీరీ పండిట్ సంఘర్ష్ సమితి అధ్యక్షుడు సంజయ్ టికోను ఫోన్‌లో బీబీసీ సంప్రదించింది.
ప్రభుత్వాన్ని మీరేం డిమాండ్ చేస్తున్నారు? అని బీబీసీ అడగగా ఆయన సమాధానం ఇచ్చారు.
‘‘నాన్ మైగ్రెంట్ కశ్మీరీ పండితుల కోసం ప్రతీ జిల్లాలో లేదా శ్రీనగర్‌లో ట్రాన్సిట్ క్యాంపులను ఏర్పాటు చేయాలని మేం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ పరిస్థితులు మరింత దిగజారితే మమ్మల్ని కూడా అక్కడికి తరలించాలని కోరుతున్నాం’’ అని ఆయన చెప్పారు.
అయితే, ట్రాన్సిట్ క్యాంప్ వంటి సలహాలు, సూచనలు బద్రీనాథ్‌కు సంతృప్తి ఇవ్వలేదు.
‘‘ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. నేనొక రైతును. కశ్మీరీ పండితుడిని. నాకు ఇక్కడ భూమి, పొలం ఉన్నాయి. ఇదే నేలపై సంవత్సరం అంతా నేను వ్యవసాయం చేస్తాను. నన్ను శ్రీనగర్‌కు తరలిస్తే, అక్కడ నేనేం తినాలి? భూమి లేని వాళ్లు అక్కడికి వెళ్లొచ్చు’’ అని బద్రీనాథ్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
ఇవి కూడా చదవండి:
- పవన్ కల్యాణ్: జనసేన ఆవిర్భావ సభలో స్వరం మార్చిన అధినేత... కులాల చుట్టూ సాగిన ప్రసంగం
- రష్యా జెట్ ఢీకొని సముద్రంలో కూలిన అమెరికా డ్రోన్
- తెలంగాణ: పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ వ్యవహారం ఎలా జరిగింది?
- సిలికాన్ వ్యాలీ బ్యాంక్: భారత స్టార్టప్‌లు దివాలా తీసిన ఆ బ్యాంకులో ఖాతాలు ఎందుకు తెరిచాయి
- టైగర్ నాగేశ్వర రావు రియల్ స్టోరీ ఏమిటి? ఉన్నోళ్లను దోచుకుని, లేనోళ్లకు పంచేవాడా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















