ఇంట్లో నమాజ్ చేసినప్పుడు పోలీసులు ఎందుకు చర్యలు తీసుకున్నారు? - గ్రౌండ్ రిపోర్ట్

- రచయిత, అభినవ్ గోయల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఉత్తర్‌ప్రదేశ్ మొరాదాబాద్ లాజ్‌పత్‌నగర్‌లో మార్చి 25న నమాజ్‌పై వివాదం రాజుకొంది. ఈ వివాదానికి కేంద్ర బిందువైన ఇంటికి ప్రస్తుతం తాళం వేసి కనిపిస్తోంది.
ఇంటి బయట ఇనుప గేటుపై రెండు మచ్చలు కనిపిస్తున్నాయి. ఇక్కడ కొన్ని రోజుల ముందు వరకు పోస్టర్లు అతికించారు.
ఆ పోస్టర్‌పై ‘‘రంజాన్ ముబారక్.. ఇక్కడ తరావీహ్ ప్రార్థనలు నిర్వహిస్తున్నాం. రోజూ ఉదయం 8.15కు ‘ఈశా కీ నమాజ్’ ఉంటుంది’’అని రాసి ఉండేది.
ఈ ఇంటి యజమాని పేరు జాకిర్ హుస్సేన్. ఆయన ఇక్కడికి సమీపంలోనే ఉంటారు. కొన్ని సంవత్సరాల క్రితమే ఆయన ఈ ఇంటిని కొనుగోలు చేశారు.
తాళం వేసి కనిపిస్తున్న ఈ ఇంటిని జాకిర్ హుస్సేన్ ఒక గోదాముగా ఉపయోగిస్తున్నారు. ఇక్కడకు సమీపంలోనే ఒక పెద్ద ఇనుప సామగ్రి కొట్టు కూడా ఆయనకు ఉంది.
ఇంటికి రెండు పక్కలా హిందూ కుటుంబాలు జీవిస్తున్నాయి. ఈ ప్రాంతంలోనూ హిందువుల జనాభా ఎక్కువగానే ఉంటుంది.
అయితే, ఇక్కడ అంటించిన పోస్టర్లతోపాటు తరావీహ్ ప్రార్థనలపై శనివారం స్థానిక హిందూ సంస్థ రాష్ట్రీయ బజ్‌రంగ్ దళ్ కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. (విశ్వహిందూ పరిషత్‌కు చెందిన బజ్‌రంగ్ దళ్, రాష్ట్రీయ బజ్‌రంగ్ దళ్.. రెండు భిన్నమైన సంస్థలు.)
ఈ ఇంటిలో తరావీహ్ ప్రార్థనలు తొమ్మిది రోజులపాటు నిర్వహించాలని జాకిర్ హుస్సేన్ భావించారు. కానీ, మూడో రోజే నిరసనల నడుమ ఇక్కడ ప్రార్థనలు నిలిచిపోయాయి.
శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ప్రవర్తించినందుకు ఒక్కొక్కరిపై రూ.5 లక్షల చొప్పున జరిమానా ఎందుకు విధించకూడదని ముస్లిం ప్రతినిధులకు పోలీసులు నోటీసులు పంపారు.
ఈ వివాదంలో రాష్ట్రీయ బజ్‌రంగ్ దళ్ కార్యకర్తలకు కూడా నోటీసులు పంపబోతున్నట్లు అధికారులు చెబుతున్నారు.

అసలేం జరిగింది?
మొరాదాబాద్‌లోని లాజ్‌పత్‌నగర్‌లో నమాజ్ వివాదం గురించి తెలుసుకోవాలంటే.. మొదట తరావీహ్ ప్రార్థనల గురించి అర్థం చేసుకోవాలి.
హిందువులు రామాయణాన్ని పఠించినట్లే.. రంజాన్ మాసంలో ముస్లింలు తరావీహ్ ప్రార్థనలు చేస్తుంటారు.
మొరాదాబాద్‌లోని నాయిబ్ శహరీ ఇమామ్ ముఫ్తీ సయీద్ ఫహాద్ అలీ ఈ విషయంపై బీబీసీతో మాట్లాడారు.
‘‘ముస్లింల పవిత్ర గ్రంథమైన ఖురాన్‌లోని కొన్ని ముఖ్యమైన పేరాలను తరావీహ్ ప్రార్థనల సమయంలో పఠిస్తారు. మీరు కావాలంటే 30 రోజులపాటు రోజూ కొంత చొప్పున పఠించొచ్చు. లేదా రోజుకు మూడు భాగాల చొప్పున పూర్తి చేయొచ్చు కూడా’’ అని ఆయన అన్నారు.
తరావీహ్ ప్రార్థనలను ఇంట్లో కూర్చొని లేదా మసీదులకు వెళ్లి చేయొచ్చు. మొదటగా ఈ ప్రార్థనల్లో హఫీజ్‌లు ఖురాన్ పఠిస్తారు, ఆయన్ను మిగతావారు అనుసరిస్తారు.
జాకిర్ హుస్సేన్ నిర్వహించే తరావీహ్ ప్రార్థనలకు చాలా మంది వస్తుంటారు.
‘‘వరుసగా తొమ్మిది రోజులపాటు తరావీహ్ ప్రార్థనలు నిర్వహించాలని భావించాం. నిజానికి ఇవి మార్చి 31తో ముగియాల్సి ఉంది. కానీ, మూడో రోజు అంటే మార్చి 25న వీటిని నిలిపివేశాం. రాష్ట్రీయ బజ్‌రంగ్ దళ్ నిరసనల వల్ల ప్రార్థనలను నిర్వహించలేకపోయాం’’ అని జాకిర్ చెప్పారు.
‘‘ఇస్లాం మొదలైనప్పటి నుంచి తరావీహ్ ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ప్రతి ముస్లిం ఈ ప్రార్థనలు చేస్తారు’’ అని ఆయన వివరించారు.

ఎలా మొదలైంది?
గోదాముగా ఉపయోగిస్తున్న తన ఇంట్లో మార్చి 23 నుంచి తరావీహ్ ప్రార్థనలు నిర్వహిస్తామంటూ జాకిర్ హుస్సేన్ పోస్టర్లు వేయించారు.
మూడో రోజు మార్చి 25న, రాత్రి ఎనిమిది గంటల సమయంలో చుట్టుపక్కల ఉండే దాదాపు 30 నుంచి 40 మంది ఇక్కడికి తరావీహ్ ప్రార్థనల కోసం వచ్చారు. ఈ ప్రార్థనలు ముగిసేందుకు దాదాపు రెండు గంటల సమయం పడుతుంది.
అయితే, రాత్రి పది గంటల సమయంలో లోపల నమాజ్ కొనసాగుతున్నప్పుడే, బయట దాదాపు 60 నుంచి 70 మంది గుమిగూడారు. వీరు ఆ ప్రార్థనలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. వీరిలో ఎక్కువ మంది రాష్ట్రీయ బజ్‌రంగ్ దళ్ కార్యకర్తలే ఉన్నారు.

ఘటన స్థలానికి పోలీసులు...
నిరసనల నడుమ అక్కడికి పోలీసులు చేరుకున్నారు. మరో అర గంటలో తమ ప్రార్థన పూర్తవుతుందని వారికి జాకిర్ హుస్సేన్ చెప్పారు. దీంతో ప్రార్థనలు మొదట సాఫీగా ముగిసేలా చూడాలని పోలీసులు నిర్ణయించారు.
కానీ, బయట పరిస్థితి హింసాత్మకంగా మారింది. ఇక్కడ ఇకపై తరావీహ్ ప్రార్థనలు నిర్వహించబోమని పోలీసులకు జాకిర్ హుస్సేన్ హామీ ఇచ్చారు. దీంతో పరిస్థితులు శాంతించాయి.
మార్చి 26న శాంతి, భద్రతలకు భంగం కలిగించారనే ఆరోపణలతో పోలీసులు చర్యలు తీసుకున్నారు.
వివాద సమయంలో ఘటన స్థలంలో ఉన్న పది మంది ముస్లింలకు సీఆర్‌పీసీలోని సెక్షన్ 107/116 (శాంతి, భద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యలు) కింద నోటీసులు జారీచేశారు.
శాంతి, భద్రతలకు విఘాతం కలిగించినందుకు ఒక్కొక్కరిపై రూ.5 లక్షల జరిమానా ఎందుకు విధించకూడదో చెప్పాలని నోటీసుల్లో ప్రశ్నించారు. ఈ నోటీసు జాకిర్ హుస్సేన్‌కు కూడా వచ్చింది.
ఈ నోటీసులపై లాజ్‌పత్‌నగర్ కట్‌గఢ్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఆఫీసర్ (సీవో) శైలజా మిశ్ర బీబీసీతో మాట్లాడారు.
‘‘రెండు వర్గాలపైనా చర్యలు తీసుకున్నాం. ఇప్పటికే ఒక వర్గానికి నోటీసులు పంపించాం. రెండో వర్గానికి నోటీసులు పంపే ప్రక్రియ కూడా మొదలైంది’’అని మిశ్ర చెప్పారు.

ఫొటో సోర్స్, FACEBOOK / ROHAN
అభ్యంతరం ఎందుకు?
లాజ్‌పత్‌నగర్‌లో తరావీహ్ ప్రార్థనలు నిర్వహించడంపై రాష్ట్రీయ బజ్‌రంగ్ దళ్ ఎందుకు అభ్యంతరాలు వ్యక్తంచేసింది? సంస్థపై వస్తున్న ఆరోపణలు ఏమిటి?
ఈ ప్రశ్నలపై రాష్ట్రీయ బజ్‌రంగ్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు రోహన్ సక్సేనా మీడియాతో మాట్లాడారు.
‘‘ఇక్కడ ప్రార్థనలు చేస్తామంటూ కొత్త విధానాలు, పద్ధతులను జాకిర్ హుస్సేన్ మొదలుపెడుతున్నారు. స్థానికులు మాకు ఫిర్యాదు చేశారు. వారు అక్కడి పోస్టర్ల ఫోటోలను తీసి మాకు పంపించారు. ప్రార్థనల ఫోటోలను కూడా మాకు పంపించారు’’అని రోహన్ అన్నారు.
‘‘ఇక్కడ ఎలాంటి కొత్త పద్ధతులు మొదలుపెట్టడానికి వీలులేదు. నగరంలో శాంతి, భద్రతలను విఘాతం కలిగిస్తున్న వారిపై కేసు నమోదు చేయాలి. లేకపోతే, రాష్ట్రీయ బజ్‌రంగ్ దళ్ నిరసనలు చేపడుతుంది’’ అని ఆయన హెచ్చరించారు.
‘‘తరావీహ్ ప్రార్థనలు ఇక్కడ ఎప్పుడూ నిర్వహించలేదు. ఇప్పుడు కొత్తగా ఎందుకు వీటిని నిర్వహించడం?’’అని ఆయన ప్రశ్నించారు.
ఈ విషయంపై ఆయన బీబీసీతో మాట్లాడుతూ.. ఇదివరకు చేసిన వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నట్లు చెప్పారు.
తరావీహ్ ప్రార్థనలతో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలుగుతుంది? ఇంటిలో ప్రార్థనలు చేయడం కొత్త పద్ధతా? దీనిపై రాష్ట్రీయ బజ్‌రంగ్ దళ్‌కు అభ్యంతరాలు ఏమిటి? లాంటి ప్రశ్నలకు ఆయన నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.

అధికారులు ఏమంటున్నారు?
తరావీహ్ ప్రార్థనలపై జాకిర్ హుస్సేన్ మాట్లాడుతూ.. ‘‘మాకు మీడియాతోపాటు దేశ, విదేశాల నుంచి ఫోన్లు వస్తున్నాయి. కానీ, మేం ఎవరితోనూ మాట్లాడాలని అనుకోవడం లేదు. మా వాదన ఏమిటో మేం అధికారులకు తెలియజేశాం’’ అని చెప్పారు.
జాకిర్ హుస్సేన్ భార్య సోదరుడు మొహమ్మద్ సైఫీ మాత్రం హిందూ సంస్థలు తమ ప్రార్థనలను మధ్యలోనే ఆపేయడంపై చాలా కోపంతో ఉన్నారు.
‘‘మేం తరావీహ్ ప్రార్థనలను మా ఇళ్లలో, మసీదుల్లో ఏటా చేపడుతూనే ఉంటాం. కానీ, నేడు వీటిని మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. వీటిని పూర్తిచేసేలా అధికారులు చర్యలు తీసుకొని ఉండాల్సింది’’ అని ఆయన అన్నారు.
ఈ అంశంపై మొరాదాబాద్ ఎస్‌ఎస్‌పీ హేమరాజ్ మీనా మాట్లాడుతూ.. ‘‘ఎవరైనా ఇంట్లో పార్థనలు చేపడితే అభ్యంతరాలు వ్యక్తం చేయకూడదు. ఒకవేళ అభ్యంతరాలు వ్యక్తంచేస్తే మొదట వారిపైనే చర్యలు తీసుకోవాలి’’ అని అన్నారు.
ఇంటిలో తరావీహ్ ప్రార్థనలు చేపడితే పోలీసు అధికారులు కూడా అభ్యంతరాలు వ్యక్తంచేయకూడదని అన్నారు.
భారత రాజ్యాంగం ప్రకారం, తమకు నచ్చిన మతాన్ని ప్రజలు స్వేచ్ఛగా అనుసరించొచ్చు. దీనికి సంబంధించిన విధివిధానాలను కూడా స్వేచ్ఛగా పాటించొచ్చు.
కానీ, శాంతి, భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారనే ఆరోపణలపై దాదాపు పది మంది ముస్లిం ప్రతినిధులకు వారు నోటీసులు పంపించారు.
నమాజ్ విషయంలో ఎలాంటి వివాదమూలేదని, ఇక్కడ వివాదం మొత్తం ఆ ఇంటిపైనేనని ఎస్‌ఎస్‌పీ హేమరాజ్ మీనా అన్నారు.
ఈ ప్రశ్నపై ఎస్‌ఎస్‌పీ హేమరాజ్ మీనా మాట్లాడుతూ.. ‘‘ఇంట్లో మీరు ప్రార్థనలు చేసుకోవచ్చు. కానీ, చుట్టుపక్కల వారంతా ఇంట్లోకి వచ్చి ఇక్కడ ప్రార్థనలు చేస్తామంటే ఎలా?’’ అని ఆయన అన్నారు.
ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది?
తరావీహ్ ప్రార్థనలపై వివాదం నడుమ, మొరాదాబాద్‌లోని లాజ్‌పత్‌నగర్‌లో ప్రస్తుతం నిశ్శబ్ద వాతావరణం నెలకొంది.
మొరాదాబాద్ జిల్లాలోని లాజ్‌పత్‌నగర్ జనాభా దాదాపు 25 వేలు ఉంటుంది. వీరిలో 70 శాతం మంది హిందువులు. మిగతావారు ముస్లింలు.
తరావీహ్ ప్రార్థనలకు ముందుగా, ఇక్కడ కొన్ని ఇళ్ల విక్రయాలపై కూడా హిందూ-ముస్లింల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో ప్రస్తుత వివాదానికి ఇక్కడివారు అంత ప్రాధాన్యం ఇవ్వడం లేదు.
ప్రార్థనలు నిర్వహించిన ఇంటి యజమాని జాకిర్ హుస్సేన్ కూడా ఈ విషయాన్ని పెద్దది చేయాలని భావించడం లేదు.
‘‘అధికారులు చెప్పిన చర్యలకు మేం అంగీకరిస్తున్నాం. మేం ఎవరితోనూ గొడవ పడాలని అనుకోవడం లేదు. మేం ఎవరితోనూ మాట్లాడాలని కూడా అనుకోవట్లేదు’’ అని ఆయన అన్నారు.
ఆ ఇంటికి ఎదురుగా కనిపిస్తున్న దుకాణం యజమాని మాట్లాడుతూ.. ‘‘నేను ఒక హిందువును. కానీ, వేరేవారు వచ్చి మనం ప్రార్థనలు చేయకుండా అడ్డుకుంటే చాలా కష్టంగా అనిపిస్తుంది కదా’’ అని ఆయన అన్నారు.
స్థానిక ముస్లిం వ్యక్తి మాట్లాడుతూ.. ‘‘రంజాన్, నవరాత్రి ఒకేసారి జరుగుతున్నాయి. కొందరు కావాలనే శాంతి, భద్రతలకు భంగం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నవారు స్థానికులు కూడా కాదు’’ అని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- సెమాగ్లుటైడ్: బరువు తగ్గించే ఈ ఇంజెక్షన్‌కు అంత డిమాండ్ ఎందుకు?
- తెలంగాణ: ఆదివాసీలు పరిశ్రమలు పెట్టేందుకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం పొందడం ఎలా?
- ‘‘ఆయన నాలుగేళ్లుగా నీళ్లు పోసుకోలేదు... అడవిలోనే ఒంటరి జీవితం... అటవీ ఏనుగులున్నా భయపడలేదు’’
- 'జీన్ ఎడిటెడ్ ఫుడ్' అంటే ఏంటి? అది తినడం ఆరోగ్యానికి మంచిదేనా?
- ప్రియాంక గాంధీ దూకుడు కాంగ్రెస్ పార్టీకి గత వైభవాన్ని తీసుకురాగలదా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















