'మాకు పెళ్లి అవసరం లేదు, ప్రేమ చాలు' -సహజీవనంలో ఉన్న ఓ మహిళ అనుభవాలు

ఫొటో సోర్స్, KAVITHA GAJENDRAN
- రచయిత, శివకుమార్ రాజకులం
- హోదా, బీబీసీ ప్రతినిధి
"నా స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలను కట్టడి చేయని బంధం కావాలనుకున్నాను. పది సంవత్సరాల ప్రేమ,పెళ్లి ఇవ్వని అవగాహన నాకు సహజీవనం ఇచ్చింది" అని కవితా గజేంద్రన్ చెప్పారు.
చెన్నైకి చెందిన కవిత మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు. ప్రస్తుతం తమిళనాడులో వామపక్ష రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు.
పితృస్వామ్యం వేళ్లూనుకున్న సమాజంలో ప్రేమ పెళ్లిళ్లను ఒప్పుకోవడమే కష్టం. అలాంటి చోట కవిత, తాను ఇమడలేని వైవాహిక జీవితం నుంచి బయటపడి సహజీవనం వైపు అడుగులు వేశారు.
గత నాలుగేళ్లుగా రాజ సంగీతన్‌తో సహజీవనం చేస్తున్నారు. సంగీతన్ వామపక్ష భావాలున్న రచయిత.
కవితకు యవ్వనం నుంచే వామపక్ష రాజకీయాల పట్ల ఆసక్తి ఉండేది.
రాజకీయాలపై అవగాహన, ప్రేమ, వివాహం ఆ తరువాత సహజీవనం, సమాజ స్పందన, కుటుంబ సభ్యులతో అరమరికలు మొదలైన విషయలన్నీ చెబుతూ కవిత తన జీవితానుభవాలను ‘బీబీసీ తమిళం’తో పంచుకున్నారు. అవన్నీ ఆమె మాటల్లోనే..

ఫొటో సోర్స్, KAVITHA GAJENDRAN
కుటుంబం, చదువులు
మాది దిగువ మధ్యతరగతి కుటుంబం. మా నాన్న ఎనిమిదో తరగతి వరకు చదివారు. తరువాత లారీ డ్రైవర్‌గా పనిచేశారు. మా అమ్మ, నాన్న, నేను, తమ్ముడు.. మాది చిన్న కుటుంబం.
నాకు కాలేజీ చదువు పూర్తయ్యేసరికి రాజకీయ రంగప్రవేశం గురించి ఒక క్లారిటీ వచ్చింది. వామపక్ష రాజకీయల్లో పనిచేయాలని, ఎట్టిపరిస్థితుల్లోనూ దీన్ని వదులకూడదని గట్టిగా నిశ్చయించుకున్నాను.
నాకు 26 ఏళ్లు వచ్చాక, ఇంట్లోవాళ్ళు పెళ్లి చేసుకోమని బలవంతం చేశారు. సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. పరిచయం లేని, తెలియని వ్యక్తిని ఎలా వివాహం చేసుకోవాలన్న ఆలోచనతో నాకు ఊపిరాడలేదు.
పది సంవత్సరాలకు పైగా నాకు పరిచయం ఉన్న ఒక స్నేహితుడు కూడా ఇదే అవస్థలో ఉన్నాడు. మేమిద్దరం స్కూలు, కాలేజీ రోజుల నుంచి ఫ్రెండ్స్. కొన్నాళ్లు ప్రేమించుకుని విడిపోయాం. కానీ, మా మధ్య స్నేహం మాత్రం కొనసాగింది.
'మీరిద్దరూ ఎందుకు పెళ్లిచేసుకోకూడదు?' అంటూ ఇతర మిత్రులు అన్నారు. దాంతో, మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం.
మా వివాహ బంధం అనుకున్నట్టు సాగలేదు. మా ఇద్దరి మధ్య మంచి అవగాహన ఉన్నప్పటికీ, కుటుంబం, బంధువులు, సమాజం జోక్యం చేసుకోవడం వలన ఒడుదొడుకులు వచ్చాయి.
వివాహం కారణంగా నా స్వేచ్ఛ పరిమితమైంది. నా పనిలో క్రియాశీలకంగా ఉండలేకపోయాను. కుటుంబం కారణంగా ఒకానొక సమయంలో నా భర్త కూడా నాపై ఆంక్షలు పెట్టే ప్రయత్నం చేయడంతో, ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయి.
ఇద్దరం స్నేహపూర్వకంగా విడిపోవాలని నిర్ణయించుకున్నాం. కోర్టులో విడాకులు తీసుకున్నాం. మా వివాహ బంధం మూడేళ్లకే ముగిసింది. సర్టిఫికెట్లు, కొన్ని బట్టలు, రూ.1500 నగదు తీసుకుని ఇంటి నుంచి బయలుదేరాను.
మొదట మా కజిన్ ఇంట్లో ఒక నెల ఉన్నాను. తరువాత, కొంతమంది స్నేహితులతో కలిసి అపార్ట్‌మెంట్‌కు మారాను.
చెన్నైలోనే ఉన్నా, పుట్టింటికి వెళ్లలేదు. అలా సుమారు రెండేళ్లపాటు నేను గడిపిన జీవితం నేనెవరో నాకు అర్థమయ్యేలా చేసింది. నాకేం కావాలి, నేనేం చేయాలి అన్నది పూర్తిగా అవగాహానకొచ్చింది.
నాకు ఇష్టమైన వామపక్ష రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నాను. సోషల్ మీడియాలో నా భావాలను పంచుకోవడం మొదలుపెట్టాను. అక్కడే రాజ సంగీతన్ అనే రచయిత పరిచయమయ్యారు.
పెరియార్ జయంతి రోజున మేమిద్దరం మొదటిసారి కలుసుకున్నాం. ఆ తరువాత వారం రోజుల పాటు చాలా మాట్లాడుకున్నాం. నేను 2-3 నెలలు ఉత్తర భారతదేశంలో పర్యటించి రాజకీయ ప్రచారాల్లో పాల్గొన్నాను. ఆ సందర్భంలో కూడా మేమిద్దరం కొన్నిసార్లు నేరుగా కలిశాం.
ఇద్దరికీ ఒకే రకమైన రాజకీయ, సైద్ధాంతిక భావజాలం ఉంది కాబట్టి, ఒకరినొకరు అర్థం చేసుకోవడం సులభం. మొట్టమొదట నేనే ప్రపోజ్ చేశాను. గతంలో ఎదురైన చేదు అనుభవాల కారణంగా పెళ్లి అక్కర్లేదని కూడా స్పష్టంగా చెప్పాను.
సుమారు నాలుగేళ్ల పాటు సహజీవనం చేశాం. మా జీవితం మేం కోరుకున్నట్లుగానే సాగింది. మా మధ్య బంధం బలంగా ఉన్నప్పుడు వివాహం చేసుకోవాల్సిన అవసరం లేదు. అందుకే ఆ ఊసే రాలేదు.
అయితే, పాస్‌పోర్ట్, వీసా అవసరాల కోసం గత ఏడాది తప్పనిసరిగా వివాహం చేసుకోవాల్సి వచ్చింది. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. దీనివల్ల మా జీవితాలు ఏమీ మారలేదు.

ఫొటో సోర్స్, KAVITHA GAJENDRAN
పెళ్లి చేసుకోకూడదని ఎందుకు నిర్ణయించుకున్నారు?
వివాహం అనేది స్త్రీలను అణచివేసే వ్యవస్థగా మిగిలిపోయింది. స్త్రీ ఎలా ఉండాలో, ఎలా జీవించాలో అది నిర్వచిస్తుంది. ఈ పితృస్వామ్య సమాజంలో వివాహ ఆచారాలన్నీ స్త్రీ కాళ్లకు సంకెళ్లు వేసి అథఃపాతాళంలోకి తోసేవే.
మొత్తం కుటుంబం స్త్రీ జీవితాన్ని నియంత్రించడానికి ప్రయత్నిస్తుంది. ఇష్టం లేకపోయినా బలవంతంగా కలిసి జీవించేటట్టు చేస్తుంది వివాహ వ్యవస్థ.
ఒక వ్యక్తిగా నన్ను నా పని చేసుకోకుండా నిరోధిస్తుంది ఈ వ్యవస్థ.
ఒక తాడు, ఓ కాగితం ముక్క లేదా ఓ సంతకం ఒక స్త్రీ, పురుషుడి జీవితాన్ని నిర్ణయించలేవు. ఆడ, మగ మధ్య మంచి సంభాషణ జరగాలి. ఇద్దరి మధ్య ఆత్మీయమైన అవగాహన, సాన్నిహిత్యం ఏర్పాడాలి. అవి వారి జీవితాలను నిర్ణయిస్తాయి.
కాలేజీ తరువాత నేను రాజకీయాల్లో చురుగ్గా పనిచేయడం ప్రారంభించాను. నాకు నచ్చినట్టుగా నా జీవితాన్ని మలచుకోవడానికి వివాహం అవరోధంగా మారుతోందని గ్రహించాను.
స్వేచ్ఛగా, స్వతంత్రంగా నాకు నచ్చిన పని చేసుకోవాలంటే, మంచి అవగాహన ఉన్న భాగస్వామి కావాలని అర్థమైంది. అందుకే విడాకులు తీసుకున్నాను.

ఫొటో సోర్స్, KAVITHA GAJENDRAN
బంధాలు, స్నేహాలు తెగిపోయాయి
నా మొదటి వివాహానికి ముందు నా (మాజీ) భర్త, నేను పదేళ్ల పాటు ప్రేమించుకున్నాం. మేమిద్దరం వేర్వేరు కులాలకు చెందిన వాళ్లం కావడంతో మా వివాహానికి ఇంట్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. చాలా గొడవలు జరిగాయి. బంధువులంతా చేరి పంచాయితీ జరిపారు. నా మాటలు కొట్టిపారేశారు.
మా అమ్మను కూర్చోబెట్టి నా మనసులో భావాలను వివరంగా చెప్పాను. ప్రేమ పిరికిది కాదని, పారిపోదని ఆమెకు అర్థమయ్యేలా చెప్పాను. అప్పటి నుంచి ప్రతి విషయాన్నీ అమ్మతో పంచుకోవడం అలవాటైంది.
నా ప్రేమ, పెళ్లి, విడాకులు అన్నీ మా అమ్మకు తెలుసు. నా బాధలు ఆమెకు తెలుసు. మా అమ్మ నన్ను బాగా అర్థం చేసుకున్న వ్యక్తి.
జీవితంలో ఒంటరిగా ఉండాలనుకోవట్లేదు కానీ, వివాహం జోలికి మళ్లీ వెళ్లనని మా అమ్మకు చెప్పాను. నా భాగస్వామి గురించి నాకున్న ఆలోచనలను ఆమెతో పంచుకున్నాను.
నా ఇష్టం వచ్చినట్లు చదువుకోలేకపోయాను, నా వైవాహిక జీవితం విఫలమైంది. ఇది మా అమ్మకి చాలా బాధ. ఆమె మనస్తాపం చెందారు. కానీ, నన్ను అక్కున చేర్చుకున్నారు.
మా అమ్మ మాత్రమే కాదు, ఈ ప్రపంచంలోని తల్లులందరికీ పిల్లల సమస్యలు అర్థం అవుతాయి. కానీ కుటుంబం, సమాజం నుంచి వచ్చే ఒత్తిడి వారి నోరు మూయిస్తుంది.
కానీ, మా అమ్మ ధైర్యంగా నన్ను ఆదరించారు. అమ్మ ఇప్పటికీ నాతోనే ఉంటున్నారు.
మొదట్లో నా లివింగ్ టుగెదర్ లైఫ్‌ని వ్యతిరేకించిన మా తమ్ముడూ కూడా ఇప్పుడు నన్ను అర్థం చేసుకున్నాడు. నాకు తోడుగా నిలబడ్డాడు.
కానీ, బంధువులు, స్నేహితులు నన్ను తప్పుబట్టారు. నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మా అమ్మను కూడా దూరంపెట్టారు. ఆమెతో మాట్లాడకుండా తప్పించుకుని తిరిగారు. అదొక్కటే అమ్మను చాలా బాధపెట్టింది. అమ్మ మా ఇంట్లో ఉంటున్నారన్న ఒకే ఒక్క కారణంతో దగ్గరి బంధువులు కూడా ఆమెను కలవడానికి నిరాకరించిన సందర్భాలూ ఉన్నాయి.
ఇక్కడ ఒక విషయం చెప్పాలి.. లివింగ్ టుగెదర్ జంటగా అద్దెకు ఇల్లు వెతుక్కోవడంలో మాకేం ఇబ్బంది ఎదురవలేదు. నా స్నేహితులలో ఒకరికి చేదు అనుభవాలు ఎదురయ్యాయి కానీ, మాకు అలా జరగలేదు. మేం జంటగా వెళ్లి ఇల్లు అడిగితే కాదన్నవారు లేరు.

ఫొటో సోర్స్, KAVITHA GAJENDRAN
వివాహం అందించని అవగాహన సహజీవనం అందించింది
వైవాహిక జీవితం నా స్వేచ్ఛకు సంకెళ్లు వేసింది. స్త్రీగా నాకు పరిమితులు విధించింది. స్త్రీ అంటే ఇలాగే ఉండాలని కుటుంబం, సమాజం నాపై ఒత్తిడి తెచ్చింది. నా భర్త కూడా అదే బాటలో నడవడం ప్రారంభించినప్పుడు నేను అడ్డుకున్నాను.
మా మధ్య వ్యక్తిగత ద్వేషాలేం లేవు. కానీ, విభేదాలు పొడజూపాయి. ఇదిలాగే కొనసాగితే ప్రయోజనం లేదని గ్రహించాను. ఇందులోంచి బయటపడడమే ఇద్దరికీ ఉత్తమం అని భావించాం.
కోర్టులో విడాకులు తీసుకున్న తరువాత ఇద్దరం నేరుగా రెస్టారెంట్‌కి వెళ్లి భోజనం చేసి వచ్చాం. ఇప్పటికీ మేం మంచి స్నేహితులుగా కొనసాగుతున్నాం.
మనల్ని అర్థం చేసుకునే భాగస్వామి దొరకడం కష్టమే. కానీ, నాకు అలాంటి వ్యక్తి దొరికారు. నా స్వేచ్ఛ, ఆత్మగౌరవం, రాజకీయ భావజాలం ఆయన బాగా అర్థంచేసుకున్నారు. అందుకే మా మధ్య ఆత్మీయత, సాన్నిహిత్యం ఏర్పడింది.
"మనిద్దరం కలిసి ముసలివాళ్లం అవ్వాలి" అని నేను ఆయనతో చెప్పాను.
పదేళ్ల ప్రేమ, పెళ్లి నాకు ఇలాంటి అవగాహన ఇవ్వలేకపోయాయి. సహజీవనంలో నాకు అది దొరికింది.

ఫొటో సోర్స్, KAVITHA GAJENDRAN
సహజీవనం విజయవంతం కావడానికి ఏం కావాలి?
స్త్రీ, పురుషుల మధ్య మంచి అవగాహన ఉండాలి. ఇద్దరూ ఆర్థికంగా స్వతంత్రంగా ఉండడం కూడా అవసరం. ముఖ్యంగా మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం చాలా ముఖ్యం. ఎవరిపైనా ఆధారపడకుండా, తమ కాళ్లపై తాము నిలబడగలగాలి. అందుకే ఉన్నతవర్గాలవారు సహజీవంలోకి వెళితే ఇబ్బందులు ఎదురవ్వవు. సమాజం కూడా అంగీకరిస్తుంది.
కానీ, మధ్యతరగతి మహిళలకు అలా కాదు. నా విషయంలో నేను ఎవరిపైనా ఆధారపడనని స్పష్టంచేశాను. అది నాకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. సహజీవనాన్ని ఎంచుకోవడానికి కావలసిన బలాన్ని అందించింది.
లివింగ్ టుగెదర్ జీవలశైలిని మన సమాజం చెడుగా చూస్తుంది. సంప్రదాయవాదులు దీన్ని పాశ్చాత్య సంస్కృతిగా పరిగణిస్తారు. కులం, మతం అనేవి కుటుంబం ద్వారా బలపడుతుంటాయి. స్త్రీ కుటుంబానికి పునాది అని చెబుతూ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడే బాధ్యత ఆమె నెత్తినపెడతారు.
సహజీవనం వల్ల కుటుంబ వ్యవస్థ ప్రమాదంలో పడుతుందని, తమ ఉనికికి ముప్పు వాటిల్లుతుందనే భయంతో వారు దీనిని ప్రతిఘటిస్తారు.
నా మొదటి వివాహానికి ముందు ప్రేమ కోసం నేను కుటుంబంతో, సమాజంతో ఎంతో పోరాడవలసివచ్చింది. నాకు అభ్యంతరం చెప్పినవారు తరువాత ప్రేమవివాహాలు చేసుకున్నారు.
అలాగే సహజీవనాన్ని కూడా అంగీకరించే సమయం ఎంతో దూరంలో లేదు. లివింగ్ టుగెదర్‌లో ఉన్న నన్ను సంఘం దూరంపెట్టింది. పెళ్లయిన వారిని మాత్రమే స్త్రీలుగా పరిగణిస్తుందీ సమాజం.
నేటి కాలంలో ఊహ వచ్చిన దగ్గర నుంచి పిల్లల చేతుల్లో సెల్‌ఫోన్లు ఉంటున్నాయి. 20 ఏళ్లకే వాళ్లకు ప్రపంచంపై అవగాహన, జీవితంపై స్పష్టత వస్తోంది. కాబట్టి భవిష్యత్తులో సహజీవనాన్ని ఆమోదించేవారి సంఖ్య పెరుగుతుందని ఆశిస్తున్నా.
(గమనిక: కథనంలో అభిప్రాయాలు కవిత వ్యక్తిగతం)
ఇవి కూడా చదవండి:
- ‘అందరిలా నాకు కన్నీళ్లు రావు.. ఏడవలేను కూడా’.. ఏమిటీ సమస్య
- ఏటీఎం జాక్‌పాటింగ్: సినిమాలో పాత్ర అంటూ ప్రజలను పంపించి రూ. 115 కోట్లు డ్రా చేయించారు, అయిదేళ్ల కిందట పుణె బ్యాంకును ఎలా కొల్లగొట్టారంటే..
- డోనల్డ్ ట్రంప్: అమెరికా మాజీ అధ్యక్షుడిపై కేసులో ఏడు ప్రశ్నలు, సమాధానాలు
- బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ దోషులు బీజేపీలో చేరారా..? ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎందుకు కనిపించారు?
- రిలయన్స్, అదానీ, టాటా వంటి పెద్ద సంస్థలతో నష్టం కూడా ఉందా?















