బ్రా వేసుకోకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయి?

స్తన్యాన్ని పరీక్షించుకొంటున్న ఒక మహిళ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రుతుస్రావం తర్వాత ప్రతి నెల మహిళలు తమ రొమ్ములను పరీక్షించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
    • రచయిత, దివ్య జయరాజ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మహిళల్లో రొమ్ము ఆరోగ్యం గురించి చాలా మందికి పలు సందేహాలు, అనుమానాలు ఉంటాయి. ముఖ్యంగా 'బ్రా' ధరించడంపై అనేక అపోహలు వినిపిస్తుంటాయి. ఏవి నిజం, ఏవి కావు అనేది తెలుసుకోలేక గందరగోళంగా ఉంటుంది.

మహిళలు తమ దుస్తులను సౌకర్యవంతంగా ధరించడానికి బ్రాలు సహాయపడతాయి. పాఠశాల స్థాయి నుంచి అమ్మాయిలు బ్రాలు ధరిస్తారు. కొత్తగా బ్రా వేసుకోవడం మొదలుపెట్టినవారికి లెక్కలేనన్ని సందేహాలు వస్తుంటాయి.

బ్రా ధరించడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందని నమ్మేవాళ్లూ ఎక్కువే. బ్రా ధరించడం అసౌకర్యంగా భావించే మహిళలూ ఉంటారు.

బ్రా వేసుకోపోతే మహిళల శరీర నిర్మాణంలో మార్పులు వచ్చి, స్తనాలు వదులు అవుతాయని మరికొందరు తికమకపడుతుంటారు.

బ్రా ధరించడం లేదా ధరించకపోవడం స్త్రీ శరీర ఆకృతిని నిజంగా మారుస్తుందా? మహిళలు తమ రొమ్ముల గురించి తెలుసుకోవలసిన విషయాలు ఏంటి? వైద్యులు ఏం చెబుతున్నారు?

'రొమ్ములను అర్థం చేసుకోవడం అవసరం'

మహిళలు తమ శరీరాన్ని అర్థం చేసుకోవాలని, రొమ్ములపై అవగాహన కలిగి ఉండాలని గైనకాలజిస్ట్ బాలకుమారి అంటున్నారు.

"స్త్రీ రొమ్ములు కొవ్వు, క్షీర గ్రంథులను కలిగి ఉన్న కణజాలంతో నిర్మాణమై ఉంటాయి. లాలాజలాన్ని స్రవించడానికి నోటిలో కొన్ని గ్రంథులు ఉన్నట్లే, పాలు స్రవించడానికి రొమ్ములలో గ్రంథులు ఉంటాయి.

కొంత మందిలో క్షీర గ్రంథులు ఎక్కువగా, కొవ్వు తక్కువగా ఉంటుంది. మరికొంతమందికి కొవ్వు ఎక్కువగా, క్షీర గ్రంథులు తక్కువగా ఉంటాయి. ఇది ఒక్కొక్కరి శరీర నిర్మాణాన్ని బట్టి మారుతుంది.

క్షీరగ్రంథులు వయసుతో పాటు క్షీణిస్తాయి. వయసు పెరిగేకొద్దీ స్తనాలు కుంగిపోవడం సహజం. అంతే తప్ప, బ్రా ధరించకపోతే సాగిపోతాయని కాదు" అని ఆమె వివరించారు.

అలాగే, బిగుతుగా ఉండే బ్రాలు ధరించడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందన్నది కూడా అపోహేనని ఆమె తెలిపారు.

"లోదుస్తులు చాలా బిగుతుగా ధరిస్తే, అక్కడ చర్మ సమస్యలు రావచ్చు. గాలి తగలక, చెమట పట్టడం వలన దురద, చికాకు వస్తాయి.

బాగా బిగుతుగా ఉండే బ్రా ధరిస్తే రొమ్ములో నొప్పి రావచ్చు. అందుకే, సరైన సైజు బ్రాలను ఎంచుకుని ధరించాలి. దీని వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందని భయపడాల్సిన అవసరం లేదు" అని ఆమె చెప్పారు.

"పెద్ద రొమ్ములు ఉన్న స్త్రీలకు అవి కిందకు వేలాడడం సహజం. దీనివల్ల వెన్నునొప్పి రావచ్చు.

స్తనాలనుబ్రా సరైన స్థానంలో నిలబెడుతుంది. వెన్నునొప్పికి దూరంగా ఉండవచ్చు.

తాత్కాలిక సౌకర్యం కోసమే బ్రా ధరిస్తామన్న విషయాన్ని మహిళలు అర్థం చేసుకోవాలి. అది అసౌకర్యంగా ఉంటే వాడడం మానేయవచ్చు. అందులో ఎలాంటి ప్రమాదం లేదు.

బ్రా సౌకర్యం కోసం తప్పితే, ఇందులో లాభనష్టాలు ఉండవు. అది స్తనాలపై ఎలాంటి ప్రభావం చూపించదు" అని డాక్టర్ బాలకుమారి చెప్పారు.

రొమ్ము వదులు కాకుండా ఉండటానికి క్రీములు ఉన్నాయా?

రొమ్ములు వాడిపోవడం లేదా కుంగిపోవడం అనేది సహజమైన ప్రక్రియ అని మహిళలు అర్థం చేసుకోవాలంటున్నారు డాక్టర్ కావ్య కృష్ణన్.

"మహిళలే కాదు, పురుషులకూ ఈ అవగాహన అవసరం. స్త్రీల శరీరాలపై పురుషుల అంచనాలే కొందరు మహిళల్లో నిస్తేజాన్ని, అలసటను కలిగిస్తాయి" అని ఆమె అన్నారు.

"రొమ్ములు వదులు కాకుండా ఉండడానికి పరిష్కారం అంటూ ఆన్‌లైన్‌లో రకరకాల క్రీములు దొరుకుతున్నాయి. అదంతా బూటకం. క్రీములు కచ్చితంగా రొమ్ము కుంగిపోకుండా నిరోధించలేవు. వైద్యపరంగా దీనికి రుజువు లేదు.

ఇలాంటి ప్రకటనలు చూసి ప్రజలు మోసపోకూడదు. శరీరంలో సహజంగా జరిగే మార్పులను అంగీకరించేంత పరిణతి సాధించాలి.

స్త్రీలకు వయసు పెరిగే కొద్దీ రొమ్ములు వాడిపోవడం సాధారణం. పాలిచ్చే తల్లులకు కూడా రొమ్ములు వదులు అవుతాయి. ఇది ప్రపంచంలోని స్త్రీలందరికీ జరిగే విషయమే. ఎవరూ మినహాయింపు కాదు. కాబట్టి దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

అలాగే, రొమ్ములు వదులు కావడానికి తల్లిపాలు పట్టడమే కారణమని మరొక అపోహ ఉంది. కానీ అది కూడా నిజం కాదు. తల్లి పాలు బిడ్దకు మేలు చేస్తాయి. మహిళల శరీరానికి ఎలాంటి హాని కలిగించవు" అని ఆమె వివరించారు.

చిన్న రొమ్ములు

ఫొటో సోర్స్, Getty Images

చిన్న రొమ్ములు ఉంటే?

చిన్న రొమ్ములున్న కొందరు స్త్రీలలో ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్‌ కనిపిస్తుందని, కానీ ఇది చింతించాల్సిన విషయం కాదని డాక్టర్ బాలకుమారి చెప్పారు.

"ఒక్కొక్కరికీ ఒక్కో రకం శరీరాకృతి ఉంటుంది. అది ప్రకృతి సహజంగా వస్తుంది. సరైన ఆకృతి అంటూ ఏదీ లేదు. రొమ్ము పరిమాణం లేదా శరీర నిర్మాణం వల్ల అసౌకర్యం కలిగితే దానికి కొంతవరకు చికిత్స చేయించుకోవచ్చు.

ఉదాహరణకు, పెద్ద రొమ్ములను కలిగి ఉన్న మహిళలకు, వెన్నునొప్పి లేదా భుజం నొప్పి వస్తుంది. వారు శస్త్రచికిత్స ద్వారా వారి రొమ్ము పరిమాణాన్ని తగ్గించుకోవచ్చు. దీన్ని ‘బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ’ అంటాం.

అదే విధంగా, చిన్న రొమ్ములు ఉన్నవారు కావాలనుకుంటే, రొమ్ము పెద్దది కావడానికి శస్త్రచికిత్స చేయించుకోవచ్చు.

ఇవేమీ వైద్యులు సిఫార్సు చేయడానికి ఇష్టపడరు. ఇవి పూర్తిగా వ్యక్తిగత ప్రాధాన్యాలు. వారి అవసరాలపై ఆధారపడి ఉంటాయి.

ఇక్కడ ఇంకో విషయం గుర్తుంచుకోవాలి. చిన్న రొమ్ములు ఉన్న స్త్రీలకు తక్కువ పాలు స్రవిస్తాయని, పెద్ద రొమ్ములు ఉంటే ఎక్కువ పాలు వస్తాయన్నది పూర్తిగా అపోహ.

నిజం ఏమిటంటే, ప్రతి స్త్రీకి బిడ్డకు పాలివ్వడానికి కావలసినన్ని క్షీర గ్రంథులు ఉంటాయి. రొమ్ము పరిమాణానికి చనుబాలివ్వడానికి సంబంధం లేదు" అని ఆమె వివరించారు.

రుతుస్రావం తరువాత రొమ్ముల స్వీయ పరీక్ష తప్పనిసరి

రొమ్ము క్యాన్సర్ నుంచి రక్షించుకోవడానికి మహిళలు నెలకోసారి ఇంట్లోనే స్వీయ పరీక్ష చేయించుకోవాలని డాక్టర్ మను చెప్పారు.

“రుతుస్రావం తర్వాత ప్రతి నెల, మహిళలు తమ రొమ్ములను పరీక్షించుకోవాలి. చేతులతో రొమ్ములను మెల్లిగా నొక్కుతూ పరిశీలించాలి. ఏదైనా భిన్నంగా అనిపించినా లేదా కణితిలా కనిపిస్తే, వెంటనే వైద్యులను సంప్రదించాలి. ముఖ్యంగా 30 ఏళ్లు పైబడిన మహిళలు ప్రతి నెలా ఈ పరీక్ష చేయించుకోవాలి.

40 ఏళ్లు పైబడిన మహిళలు ఒకసారి మామోగ్రామ్ చేయించుకోవాలి. క్యాన్సర్ లక్షణాలు ఏవైనా కనిపిస్తే వెంటనే చికిత్స చేయించుకోవాలి.

మహిళలు తమ ఆరోగ్యానికి ప్రాధాన్యమివ్వడం చాలా అవసరం. దానివల్ల అనేక సమస్యల నుంచి తమను తాము రక్షించుకోగలుగుతారు" అని ఆమె అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)