థైరాయిడ్ సమస్య ప్రమాదకరంగా ఉన్నా.. ఏడాదిన్నరలో బాడీ బిల్డింగ్ చాంపియన్ అయిన మహిళ

ప్రతిభా థాప్లియాల్

ఫొటో సోర్స్, BHOOPESH THAPLIYAL

    • రచయిత, రాజేశ్ డోబ్రియాల్
    • హోదా, బీబీసీ కోసం

బీజేపీ మహానగర్ మహిళా మోర్చా ఆదివారం డెహ్రాడూన్‌లోని ఒక హోటల్‌లో ‘సుష్మా స్మరాజ్ అవార్డు’ పేరిట ఒక సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించింది.

వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన 26 మంది మహిళలను వారు సత్కరించారు.

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామితో పాటు బీజేపీలోని పలువురు మహిళా నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

కానీ, ఈ కార్యక్రమంలో సత్కారం పొందిన ఒక మహిళా అథ్లెట్‌తో ఫొటోలు తీసుకునేందుకు అందరూ పోటీపడ్డారు.

ఆ అథ్లెట్ పేరు ప్రతిభా థాప్లియాల్. పౌరీలోని యమకేశ్వర్ బ్లాక్‌లో నివసించే ప్రతిభా థాప్లియాల్, ఈ నెలలోనే మధ్యప్రదేశ్‌లో జరిగిన జాతీయ స్థాయి బాడీ బిల్డింగ్ పోటీల్లో సీనియర్ మహిళల కేటగిరీలో స్వర్ణ పతకాన్ని సాధించారు.

ఉత్తరాఖండ్ నుంచి ఈ ఘనతను సాధించిన తొలి మహిళ ప్రతిభ. ఆమె మరో ప్రత్యేకత ఏంటంటే, బాడీ బిల్డింగ్ చేయడం ప్రారంభించిన 16 నెలల్లోనే ఆమె ఈ స్థాయికి చేరుకున్నారు.

గతేడాది, కేవలం మూడున్నర నెలల శిక్షణ తర్వాత ఆమె తన జీవితంలో తొలిసారిగా బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొన్నారు. సిక్కింలో జరిగిన నేషనల్ చాంపియన్‌షిప్‌లో ప్రతిభ నాలుగో స్థానంలో నిలిచారు.

ప్రతిభ

ఫొటో సోర్స్, BHOOPESH THAPLIYAL

అనారోగ్యం నుంచి ఫిట్‌నెస్ వరకు

బాడీ బిల్డింగ్‌లోకి ఆమె అనూహ్యంగా వచ్చారు. అనారోగ్యమే ఆమె ఈ మార్గంలోకి రావడానికి కారణమైంది.

2008లో రెండో సంతానంగా కుమారుడు జన్మించిన తర్వాత ప్రతిభ ఆరోగ్యంలో మార్పులు వచ్చాయి. ఎక్కువ అలసటతో పాటు బీపీ తగ్గినట్లు ఆమె గుర్తించారు.

ఇద్దరు పిల్లల్ని చూసుకోవడంతో పాటు ఇంటి పని వల్ల ఇలా జరుగుతుందని ఆమె అనుకున్నారు. కానీ, ఆమె సమస్య పెరుగుతూనే ఉంది.

ప్రతిభ భర్త భూపేశ్ థప్లియాల్, డెహ్రాడూన్‌లో దుస్తుల వ్యాపారం చేస్తారు. ఆయనకు రెండు దుకాణాలు ఉన్నాయి.

భర్తకు వ్యాపారంలో కూడా ప్రతిభ సహాయం చేయడం ప్రారంభించారు. మహిళల దుస్తుల దుకాణాన్ని ప్రతిభ చూసుకుంటారు.

2014 వరకు ఇల్లు, వ్యాపారం, పిల్లల బాధ్యతలతో పాటు అలసట, బీపీ సమస్యలతో ఆమె పోరాడుతూనే ఉన్నారు. ఈ సమస్యలు భరించలేనంతగా మారడంతో డాక్టరును సంప్రదించారు. అప్పుడే ఆమెకు థైరాయిడ్‌ వ్యాధి ప్రమాదకర స్థాయికి పెరిగిపోయిందని తెలిసింది.

థైరాయిడ్ స్థాయిలు సాధారణంగా 5 పాయింట్లకు మించకూడదు. కానీ, తనకు 50 పాయింట్లకు చేరుకుందని ప్రతిభ చెప్పారు. వ్యాధి నియంత్రణ కోసం వెంటనే ఎక్కువ మోతాదు ఉన్న మందులు వాడటం ప్రారంభించాల్సి వచ్చింది.

థైరాయిడ్‌ను మందులతో అదుపు చేయవచ్చని ఆమె నమ్మారు. కానీ, బరువును ఆమె నియంత్రించలేకపోయారు. 2014- 2018 మధ్య ఆమె బరువు 60 కిలోల నుంచి 85 కిలోలకు పెరిగారు.

దీంతో డాక్టర్ సలహా మేరకు ఆమె జిమ్‌లో చేరారు. ఆమెతో పాటు భర్త భూపేష్ కూడా జిమ్‌కు వెళ్లడం మొదలుపెట్టారు.

ప్రతిభ

ఫొటో సోర్స్, BHOOPESH THAPLIYAL

ఫొటో క్యాప్షన్, భర్త భూపేశ్‌తో ప్రతిభ

వాలీబాల్, క్రికెట్‌లో జాతీయ స్థాయి ప్లేయర్

ప్రతిభ రిషికేశ్‌లో పెరిగారు. అక్కడే చదువుకున్నారు. హిందీలో ఎంఏ చేశారు. చదువుకునే సమయంలో ఆమె క్రీడల్లో కూడా చురుగ్గా ఉండేవారు.

ఉత్తరాఖండ్ వాలీబాల్ జట్టుకు ఆమె కెప్టెన్‌గా వ్యవహరించారు. అయిదుసార్లు ఆమె నార్త్ జోన్ క్రీడల్లో పాల్గొన్నారు. అంతేకాకుండా క్రికెట్‌లో కూడా ఆమె నాలుగుసార్లు ఆలిండియా స్థాయిలో పోటీల్లో ఆడారు.

కాబట్టి, జిమ్‌లో చెమటోడ్చటం ఆమెకు కొత్తేమీ కాదు. అయితే, జిమ్‌ వల్ల తనకు పెద్దగా ప్రయోజనం కలుగుతుందని తొలుత ఆమె అనుకోలేదు. కానీ, మూడు నాలుగు నెలల్లోనే ఆమె బరువు 85 కిలోల నుంచి 60 కిలోలకు తగ్గింది.

కరోనా తర్వాత 2021 జూన్‌లో థాప్లియాల్ దంపతులు మరోసారి జిమ్‌లో చేరారు. అప్పుడు బాడీ బిల్డింగ్ చేయగల సామర్థ్యం ప్రతిభకు ఉందని ఆమె భర్త భూపేశ్ గ్రహించారు.

ప్రతిభ

ఫొటో సోర్స్, BHOOPESH THAPLIYAL

ఎలా గుర్తించారు?

ప్రతిభకు బాడీ బిల్డర్ అయ్యే అవకాశం ఉందని తాను ఎలా గ్రహించారో భూపేశ్ వివరించారు. ‘‘ఆమె శరీరం, బాడీ బిల్డింగ్‌కు అనుకూలంగా ఉన్నట్లు నేను భావించాను. ఎందుకంటే, ఆమె బరువులెత్తడం మొదలుపెట్టగానే ఆమె శరీరంలో కండలు రావడం కనిపించింది. ఆమెకు కాస్త ప్రిపరేషన్ అవసరం అనిపించింది’’ అని ఆయన చెప్పారు.

ఆమెను బాడీ బిల్డర్‌గా మార్చాలనే ఉద్దేశంతో నవంబర్ నెలలో భూపేశ్ ఆమెను మరో జిమ్‌లో చేర్చారు. ఉత్తరాఖండ్ బాడీ బిల్డింగ్ సంఘంలో ఆఫీస్ బేరర్‌గా ఉన్న వ్యక్తికి చెందిన జిమ్‌లో ఆమెను చేర్చారు.

అయితే, 2022 మార్చిలో జరుగనున్న నేషనల్ చాంపియన్‌షిప్ కోసం ప్రతిభను తయారు చేయడం కంటే తన సప్లిమెంట్లను అమ్ముకోవడంపైనే జిమ్ నిర్వాహకులు ఆసక్తి చూపుతున్నట్లు భూపేశ్ గ్రహించారు.

అంతేకాకుండా ‘నీకు థైరాయిడ్ వచ్చింది. వయస్సు పెరగడం వల్ల మజిల్ వచ్చినట్లు కనిపిస్తోంది’’ అంటూ జిమ్ వారు ప్రతిభను నిరుత్సాహపరిచారు.

ఈ ఘటన తర్వాత ప్రతిభకు కావాల్సిన శిక్షణ, డైట్, సప్లిమెంట్స్ అన్నీ భూపేశ్ చూసుకున్నారు.

వీడియో క్యాప్షన్, ‘బిడ్డకు పాలిస్తూ హాకీ ప్రాక్టీస్ చేసి బంగారు పతకం సాధించా’

బికినీ, స్పాన్సర్‌షిప్

భూపేష్ పర్యవేక్షణలో ప్రతిభ చాంపియన్‌షిప్ కోసం సిద్ధం అయ్యారు. కానీ, ఆమె చాంపియన్‌షిప్‌లో ధరించే దుస్తుల విషయంలో ఇబ్బంది పడ్డారు. నిజానికి, బాడీ బిల్డింగ్ చాంపియన్‌షిప్‌లో టూ పీస్ బికినీలో ప్రదర్శన ఇవ్వాలి. కానీ, టీషర్ట్, షార్ట్‌లు ధరించడాన్ని ప్రతిభ సౌకర్యంగా భావిస్తారు. ఇదే విషయంలో ఆమె సంకోచించారు.

అయితే ఇది అసలు సమస్యే కాదని భూపేష్ ఆమెకు నచ్చజెప్పారు. తన భర్త నుంచి అందిన నిరంతర ప్రోత్సాహం కారణంగా తనకు ఆ సంకోచం పూర్తిగా మాయమై పోయిందని ఆమె చెప్పారు.

2022 మార్చిలో సిక్కింలో జరిగిన చాంపియన్‌షిప్‌లో ప్రతిభ నాలుగో స్థానంలో నిలిచారు.

కేవలం మూడున్నర నెలల శిక్షణతో ఎన్నో ఏళ్లుగా ప్రాక్టీస్ చేస్తున్న మహిళలను వెనక్కి నెట్టి జాతీయ చాంపియన్‌షిప్‌లో నాలుగో స్థానంలో నిలవడం చిన్న విషయం కాదని ఆమె భర్త భూపేశ్ ప్రశంసించారు.

ఈ ఘనత తర్వాత ఆమెకు రోజులో ఒకపూట డైట్‌ను స్పాన్సర్ చేసేందుకు ఒక స్థానిక హోటల్ ముందుకు వచ్చింది. అలాగే ఒక జిమ్ యజమాని ఆమెకు తన సౌలభ్యం మేరకు ప్రాక్టీస్ చేసుకునేందుకు అనుమతిచ్చారు.

ఈ ఏడాది మార్చి 4, 5 తేదీల్లో మధ్యప్రదేశ్‌లోని రత్లామ్‌లో జరిగిన జాతీయ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం గెలుపొందిన ప్రతిభ దేశం దృష్టిని తన వైపుకు ఆకర్షించింది.

ప్రతిభ

ఫొటో సోర్స్, RAJESH DOBRIYAL/BBC

తల్లికి సహాయంగా బ్రేక్‌ఫాస్ట్ తయారు చేస్తోన్న పిల్లలు

ఆమెకు ఈ విజయం అంత సులభంగా లభించలేదు. ఏడాదంతా ప్రతిభ కఠిన శ్రమతో పాటు క్రమశిక్షణతో ప్రాక్టీస్ చేశారు. ఆమె కుటుంబం కూడా పూర్తిగా సహకరించింది.

భర్త భూపేశ్ ఏడాదంతా ఆమెకు కోచ్‌గా మెంటార్‌గా పనిచేశారు. ఇప్పుడు 12వ తరగతి, పదో తరగతి చదువుతున్న కుమారులు కూడా ఆమెకు తమ వంతు సహకారం అందించారు.

తన చిన్నకుమారుడు ఆమ్లెట్, శాండ్‌విచ్ చేయడం నేర్చుకున్నారని ఆమె చెప్పారు. వారి బ్రేక్‌ఫాస్ట్ కోసం తాను ఆందోళన చెందకూడదనే ఉద్దేశంతో వారే బ్రేక్‌ఫాస్ట్ చేసుకొని తినడం మొదలెట్టారని చెప్పారు.

మరోవైపు, చాంపియన్‌షిప్‌కు ఒక నెల రోజుల ముందు తన సమయాన్ని అంతా ప్రతిభకే కేటాయించడం కోసం భూపేష్ తన దుకాణాన్ని మూసివేశారు.

బాడీబిల్డింగ్ ఖరీదైన క్రీడ. బాడీ బిల్డర్ డైట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన చెప్పారు.

ఒకానొక సమయంలో తమ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా మారిందని, ఆ సమయంలో తన ఇద్దరు సోదరులు, ఒక సోదరి తమకు సహాయం చేశారని ప్రతిభ చెప్పారు.

వీడియో క్యాప్షన్, 17 ఏళ్ల విద్యార్థినిపై ఇద్దరు పిల్లల తండ్రి అత్యాచారం.. మహిళా సర్పంచి ఏం చేశారంటే

విశ్వాసం, సవాళ్లు

ప్రతిభ ఇప్పుడు ఆసియా, ప్రపంచ చాంపియన్‌షిప్‌ల కోసం సన్నద్ధం అవుతున్నారు. ప్రపంచ వేదికపై భారతదేశానికి పేరు తెస్తాననే విశ్వాసం తనకు ఉందని, అయితే డబ్బు ఏర్పాటు చేసుకోవడమే తమకు సవాలుగా మారిందని ఆమె అన్నారు.

ప్రభుత్వం, సమాజం నుంచి సహాయం అందుతుందని ఆశిస్తున్నట్లు భూపేశ్ చెప్పారు.

ప్రస్తుతం సన్మానాలు, మీడియా ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్న ప్రతిభ రాబోయే పెద్ద సవాళ్లను ఎదుర్కొనేందుకు మళ్లీ జిమ్ బాట పట్టాల్సి ఉంది.

‘నన్ను చంపినా మీ పోరాటం ఆపొద్దు’

కాగా ఇమ్రాన్ ఖాన్ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో సందేశం విడుదల చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)