దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లకు.. ఈ ఊరి బాలికలు పోరాడి కాలేజీకి వెళుతున్నారు - BBCShe

- రచయిత, గుర్‌ప్రీత్ సైనీ, బీబీసీ హిందీ
- హోదా, రితిక, ఫెమినిజం ఇన్ ఇండియా హిందీ
నైనాను మొదటిసారి కలిసినప్పుడు ఆమె, వాళ్ల నాన్నను ఎదురించి నిలవగలదనే ఊహ కూడా మాకు రాలేదు. నైనా, తన కలలను సాకారం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. కాలేజీకి వెళ్లి చదువుకోవడమే ఆమె కల.
కాలేజీకి పంపేందుకు వాళ్ల నాన్న నిరాకరించినట్లు నైనా చెప్పారు. ‘‘కాలేజీకి వెళ్లి చదువుకుంటానని నేను కూడా మొండిగా వ్యవహరించాను. ‘నేనేదైనా తప్పు చేస్తే నా తల నరకండి. కానీ, నేను కాలేజీలో చదువుకోవాల్సిందే..’ అని మా నాన్నతో చెప్పాను’’ అని నైనా తెలిపారు.
ఆ గ్రామంలోని చాలా మంది అమ్మాయిలకు కాలేజీకి వెళ్లి చదువుకోవడం ఒక కల అనే విషయం ఆమెకు తెలుసు. కానీ, ఆ కలను సాకారం చేసుకోవాలని నిశ్చయించుకున్న మొదటి అమ్మాయి నైనా.
తనతో పాటు తన పది మంది అక్కా చెల్లెళ్లకే కాకుండా దేవీపూర్ గ్రామంలోని ప్రతీ అమ్మాయి కాలేజీ చదువుకు ఆమె బాట వేశారు.
దేశ రాజధాని దిల్లీకి 100 కి.మీ దూరంలో దేవీపూర్ గ్రామం ఉంటుంది. హరియాణాలోకి కర్నాల్ జిల్లా దేవీపూర్ గ్రామ బాలికలకు దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కాలేజీకి వెళ్లే భాగ్యం దక్కింది.
కుటుంబీకులతో, గ్రామస్థులతో, పాలక వర్గంతో పోరాడి ఈ బాలికలు, కాలేజీకి వెళ్లాలనే తమ హక్కును ఎలా సాధించారు?
ఇది నైనాతో పాటు మరో 14 మంది అమ్మాయిల ధైర్యం, మొండి పట్టుదలకు సంబంధించిన కథ.
ఈ ఆర్టికల్‌ను బీబీసీ షీ ప్రాజెక్టులో భాగంగా ఫెమినిజం ఇన్ ఇండియా హిందీ, బీబీసీ సంస్థలు కలిసి రాశాయి.

స్వేచ్ఛ వైపు తొలి అడుగు
నైనా కూడా తన గ్రామంలోని ఇతర చాలా మంది అమ్మాయిల తరహాలోనే ఎలాగోలా పాఠశాల విద్యను పూర్తి చేశారు. కానీ, కాలేజీలో చదువడం అక్కడివారికి అంత సులువైన వ్యవహారం కాదు. చాలా షరతులు, పరిమితుల తర్వాతే వారికి ఆ అవకాశం దక్కుతుంది.
కాలేజీకి వెళ్లాలంటే ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకూడదని, మొబైల్ పోన్ అస్సలే వాడకూడదని తనను ఇంట్లో వారు హెచ్చరించినట్లు నైనా చెప్పారు. ఇంటి నుంచి నేరుగా కాలేజీకి, కాలేజీ నుంచి నేరుగా ఇంటికి రావాలని చెప్పారని ఆమె తెలిపారు.
అమ్మాయిలను కాలేజీకి వెళ్లొద్దు అని చెప్పడానికి ఆ గ్రామస్థులందరి వద్ద ఒక బలమైన కారణం ఉంది. దేవీపూర్ నుంచి కాలేజీకి వెళ్లడానికి ప్రజా రవాణా లేదు. పైగా కాలేజీకి వెళ్లే మార్గంలో ఒక వంతెన ఉంటుంది. దాన్ని దాటడం చాలా పెద్ద సవాలు.

వంతెన దాటడం కష్టం
గ్రామంలోని పెద్దలు మాట్లాడుతూ, ‘‘బస్సులు లేకపోవడంతో తమ అమ్మాయిలను కాలేజీకి పంపేందుకు అందరూ వెనుకడుగు వేసేవాళ్లు. ట్రాన్స్‌పోర్ట్ కోసం అమ్మాయిలు నాలుగు కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. వంతెన మీద అబ్బాయిలు, అమ్మాయిలను వేధిస్తుంటారు’’ అని చెప్పారు.
ప్రతి రోజూ బ్రిడ్జి వద్ద అమ్మాయిలకు ఏదో ఒక అసహ్యకరమైన అనుభవం ఎదురవుతుంది. కొంతమంది తుంటరి అబ్బాయిలు అమ్మాయిలపై బురద వేయడం లేదా ఇటుక పెళ్లలతో కొట్టి పారిపోతుంటారు. అసభ్యకరమైన మాటలు వినడం వారికి రోజూవారీ విషయంగా మారింది.
కానీ, బ్రిడ్జిపై అబ్బాయిల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోరు. పైగా ప్రతీ ఇంట్లో మగపిల్లలకు అధిక ప్రాధాన్యత అలాగే కొనసాగుతోంది.
నైనా పెదనాన్న మాట్లాడుతూ, ‘‘నా సోదరుడికి కూడా కుమారుల్ని ప్రసాదించమని భగవంతున్ని వేడుకుంటా. అప్పుడు మేం ఇద్దరం సమానంగా నిలుస్తాం’’ అని అన్నారు. నైనా పెదనాన్నకు ఇద్దరు మగపిల్లలు.

మెజిస్ట్రేట్‌కు లేఖ రాసిన అమ్మాయిలు
కాలేజీ చదువు కోసం నైనా ప్రదర్శిస్తున్న ధైర్యాన్ని చూసి, గ్రామంలోని ఇతర అమ్మాయిలు కూడా ముందుకొచ్చారు. గ్రామం నుంచి కాలేజీకి బస్సు సౌకర్యం ఉంటే తమ సమస్య తీరుతుందని వారంతా భావించారు. అమ్మాయిలంతా కలిసి గ్రామస్థులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇదే విషయాన్ని వారికి చెప్పారు.
కర్నాల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (సీజేఎం) జస్బీర్ కౌర్‌కు వీరంతా తమ సమస్యను తెలుపుతూ గత ఏడాది లేఖ రాశారు.
ఈ గ్రామానికి చెందిన అమ్మాయిలెవరూ, ఇప్పటివరకు కాలేజీలో అడుగుపెట్టలేదనే విషయం తెలిసి సీజేఎం జస్బీర్ కౌర్ ఆశ్చర్యపోయారు.
జెండర్ సమస్యలతో పోరాడుతున్న స్వచ్ఛంద సంస్థ ‘బ్రేక్ థ్రూ’ ద్వారా వారు జస్బీర్ కౌర్‌ను కలిశారు. వెంటనే గ్రామం నుంచి కాలేజీకి బస్సు సౌకర్యం కల్పించాలని ఆమె ఆదేశించారు.
‘‘అమ్మాయిలు మత్తు పదార్థాలు తీసుకోవడం మీరెప్పుడైనా చూశారా?’’
సీజేఎం జస్బీర్ కౌర్, దేవీపూర్ గ్రామానికి వెళ్లారు. అక్కడ బస్సు సర్వీసుతో పాటు ప్రజల ఆలోచనా విధానంలో కూడా సమస్య ఉందని ఆమె గుర్తించారు.
దీని గురించి ఆమె బీబీసీతో మాట్లాడారు. ‘‘ఎంత మంది అమ్మాయిలు బయట మత్తు పదార్థాలు తీసుకోవడం మీరు చూశారని నేను గ్రామస్థులను అడిగాను. అలా ఎవర్నీ చూడలేదు అని వారు చెప్పారు. తర్వాత ఎంతమంది అమ్మాయిలు స్కూల్ నుంచి పారిపోయారు? అని అడిగితే అలా ఎవరూ చేయలేదు అని చెప్పారు. మరెందుకు మీరు అమ్మాయిలను కాలేజీకి పంపట్లేదు. కాలేజీకి పంపితే అమ్మాయిలు చెడిపోతారని మీరెందుకు అనుకుంటున్నారు? అని అడిగాను. చివరకు బస్సులో అమ్మాయిలను కాలేజీకి పంపడానికి వారు ఒప్పుకున్నారు.
బ్రిడ్జి వద్ద అనుచిత ఘటనలు జరుగకుండా, అమ్మాయిల భద్రత కోసం రోజుకు రెండుసార్లు పోలీస్ వ్యాన్ పెట్రోలింగ్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి’’ అని ఆమె వివరించారు.

నైనా పోరాటంలో జ్యోతి పాత్ర
దేవీపూర్ గ్రామం నుంచి బస్సు సర్వీసును ప్రారంభించిన తర్వాత నైనాతో సహా 15 మంది బాలికలు కాలేజీకి వెళ్లడం మొదలుపెట్టారు.
ఈ అమ్మాయిలు కాలేజీకి వెళ్లడంలో కర్నాల్ జిల్లాలోని గడీ ఖజూర్ గ్రామానికి చెందిన దళిత మహిళ జ్యోతి కీలక పాత్ర పోషించారు.
ఆమె బీబీసీతో మాట్లాడారు. ‘‘12వ తరగతి పాస్ అయ్యాక కాలేజీకి వెళ్లాలని నేను నిర్ణయించుకున్నప్పుడు, నా కుటుంబం నాకు మద్దతు ఇచ్చింది. 12వ తరగతి అయ్యాక నగరానికి వెళ్లి కాలేజీలో అడ్మిషన్ తీసుకున్న ఏకైక అమ్మాయిని నేనే. అప్పుడు నా వయస్సు ఉన్న అమ్మాయిలకు పెళ్లి చేసేవారు” అని ఆమె చెప్పారు.
అమ్మాయిలు 12వ తరగతికి మించి ఎందుకు చదవలేకపోతున్నారని తాను గ్రాడ్యుయేషన్ చేస్తున్న సమయంలో ఎప్పుడూ అనుకునేదాన్నని ఆమె అన్నారు.
కాలేజీలో చదువుతున్నప్పుడే వనిత్ర ఫౌండేషన్ అనే ఎన్జీవోలో జ్యోతి చేరారు. గ్రామంలోని హరిజన చౌపల్ (సమావేశ స్థలం)లో ఒక అభ్యసన కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు.

‘‘చదువు చెప్పడానికి నువ్వెవరు?’’
ఒక దళిత అమ్మాయి ‘మేడమ్’గా మారి తమ అమ్మాయిలకు బోధించడం, అత్యున్నత కులాలు అని చెప్పుకునే వర్గానికి చెందిన పురుషులకు నచ్చలేదు.
తన అనుభవం గురించి జ్యోతి వివరించారు. ‘‘రాజ్‌పుత్ కమ్యూనిటీకి చెందిన అబ్బాయిలు, నాపై అనుచిత కామెంట్లు చేసేవారు. లెర్నింగ్ సెంటర్ దగ్గరకు సాయంత్రం మద్యం తాగి వచ్చి దురుసుగా ప్రవర్తించేవారు. చదువు చెప్పడానికి నువ్వెవరు? అని అడిగేవారు. అందుకే లెర్నింగ్ సెంటర్‌ను నేను సమావేశ స్థలం నుంచి ప్రభుత్వ పాఠశాలలోకి మార్చాను. ఇలా చేయడం వల్ల సమావేశ స్థలంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే మా పని ఆగదు అనే ఉద్దేశంతో లెర్నింగ్ సెంటర్‌ను మార్చాను’’ అని ఆమె తెలిపారు.
ప్రస్తుతం, ఆమె ‘బ్రేక్ థ్రూ’ సంస్థతో కలిసి ఎనిమిది గ్రామాల బాలికలకు ఉన్నత విద్య అందించేందుకు పని చేస్తున్నారు.
గడీ ఖజూర్ గ్రామానికి చెందిన షన్నో దేవి కనీసం స్కూలుకు కూడా వెళ్లలేదు. కానీ, ఇప్పుడు జ్యోతి సహాయంతో ఆమె మనమరాలు సలోని, బీఏ చదువుతున్నారు.
షన్నో దేవి తన మనమరాలు సాధించిన ట్రోఫీని చూస్తూ సంతోషపడుతూ ఇలా అన్నారు. ‘‘ఆమె చదువుకుంటే, తర్వాతి తరం కూడా బాగుపడుతుంది. పెళ్లి చేసుకున్నాక ఆమె అడుగు పెట్టిన కుటుంబంలో ఆమె వల్ల మార్పు వస్తుంది. చదువు వల్ల తన కాళ్లపై తాను నిలబడగలుగుతుంది. అప్పుడు ఎవరి వద్ద చేయి చాచాల్సిన అవసరం రాదు’’ అని అన్నారు.

బస్సు సౌకర్యమే పరిష్కారం కాదు
బస్సు సర్వీసులు ప్రారంభమైన తర్వాత అమ్మాయిలు, కాలేజీకి వెళ్తున్నారు. కానీ, సాయంత్రం లోపు తమ అమ్మాయిలు ఇంటికి తిరిగి రావాలని గ్రామస్థులు కోరుకుంటున్నారు.
గ్రామానికి రాకపోకలు సాగించే బస్సు ఒకటే ఉంది. సాయంత్రం 6 గంటలకు అది వెళ్లిపోతుంది. కాబట్టి, అమ్మాయిలు సాయంత్రంలోపు ఇంటికి చేరుకోవడానికి ప్రతిరోజూ కొన్ని తరగతులను కోల్పోవాల్సి వస్తోంది.
దేవీపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ కృష్ణ కుమార్ మాట్లాడుతూ, “బస్సు టైమింగ్ సమస్యగా ఉంది. దీని గురించి అధికార యంత్రాంగంతో మాట్లాడేందుకు ప్రయత్నించాం. కానీ, ఇంతవరకు ఈ సమస్య పరిష్కారం కాలేదు’’ అని ఆయన అన్నారు.
‘‘మార్పు రాత్రికి రాత్రే రాదు’’
దేవీపూర్ గ్రామంలోని అమ్మాయిలను మరోసారి కలిసి వారు ఎదుర్కొంటున్న బస్సు సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని సీజేఎం జస్బీర్ కౌర్, బీబీసీతో అన్నారు.
కానీ ఇంత ప్రయత్నించినప్పటికీ, కేవలం 15 మంది అమ్మాయిలే కాలేజీకి ఎందుకు వెళ్తున్నారు? మిగతా వారికి కాలేజీ చదువు ఇంకా కల తరహాలోనే ఎందుకు ఉందన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.
దీనిపై జస్బీర్ కౌర్ మాట్లాడుతూ, “మార్పు అనేది రాత్రికి రాత్రే సంభవించదు. అలాగే బలవంతంగా కూడా మార్పును తీసుకురాలేం. కాలేజీకి వెళ్లే అమ్మాయిల సంఖ్య 15కి మాత్రమే పరిమితం కాకూడదని నేను కోరుకుంటున్నా’’ అని అన్నారు.
(నిర్మాత - సుశీల సింగ్, సిరీస్ నిర్మాత- దివ్య ఆర్య, బీబీసీ)
- ఆస్కార్-ఆర్ఆర్ఆర్: వైఎస్ జగన్ ‘‘తెలుగు జెండా’’ అంటే ప్రాంతీయ వాదం అవుతుందా?
- కే హుయ్ క్వాన్: ఒకప్పుడు శరణార్థి...నేడు ఆస్కార్ విజేత
- మాతృత్వం: ‘మా అమ్మ వయసు 50 ఏళ్లయితే మాత్రం.. రెండవ బిడ్డను కనడానికి ఎందుకు సిగ్గుపడాలి?’
- కర్నాటక: ‘‘మైకుల్లో ప్రార్థించకుంటే అల్లాకు వినపడదా..’’ బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు... మరి నిబంధనలు ఏం చెబుతున్నాయి
- లావణి డ్యాన్స్: మహిళలను ప్రైవేటుగా బుక్ చేసుకునే ఈ నృత్యం ఏంటి? ఈ జీవితం మీద ఆ మహిళలు ఏమంటున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















