మెడికో ప్రీతి కన్నుమూత - ప్రకటించిన నిమ్స్ వైద్యులు

ప్రీతి

ఫొటో సోర్స్, UGC

ఆత్మహత్యా యత్నం చేసిన వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ మెడికో ప్రీతి మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.

అయిదు రోజులపాటు హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న ప్రీతి, ఆదివారం రాత్రి 9.10 గం.ల ప్రాంతంలో మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు.

వివిధ విభాగాలకు చెందిన వైద్యులు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఆమె ప్రాణాలు కాపాడలేకపోయామని నిమ్స్ ఆసుపత్రి అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో సీనియర్ విద్యార్థి వేధింపుల కారణంగా జూనియర్ పీజీ వైద్య విద్యార్థిని ధరావత్ ప్రీతి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది.

నిమ్స్ వైద్యులు విడుదల చేసిన ప్రకటన

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, నిమ్స్ వైద్యులు విడుదల చేసిన ప్రకటన

అయితే, ప్రీతి మృతికి నిరసనగా ఆమె బంధువులు, గిరిజన సంఘాలు నిమ్స్ ఎదుట ఆందోళనకు దిగారు.

ప్రీతికి న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని ఇక్కడి నుంచి కదలినివ్వబోమని గిరిజన సంఘాల నాయకులు హెచ్చరించారు.

ఆందోళన చేస్తున్న గిరిజన సంఘాలు, బంధువులు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, ఆందోళన చేస్తున్న గిరిజన సంఘాలు, బంధువులు

మృత్యువుతో పోరాడుతూ డాక్టర్ ప్రీతి తుది శ్వాస విడవడం అత్యంత బాధాకరమని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖమంత్రి టి.హరీశ్ రావు అన్నారు.

‘‘ఆమెను కాపాడేందుకు నిమ్స్ వైద్య బృందం నిర్విరామంగా, శక్తి వంచన లేకుండా శ్రమించింది. పూర్తి అరోగ్య వంతురాలై వస్తుందని అనుకున్న డాక్టర్ ప్రీతి, తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోవడం నా మనసును తీవ్రంగా కలిచి వేసింది. ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’’ అని ఆయన ఒక ప్రకటనలో అన్నారు.

బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హరీశ్ రావు హామీ ఇచ్చారు.

అయితే, రాష్ట్రంలో రోజు రోజుకు శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రీతి ఆత్మహత్యలాంటి పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని ఆయన అన్నారు.

గిరిజన వైద్య విద్యార్థిని, ఎంతో గొప్ప భవిష్యత్ ఉన్న ప్రీతి ఆత్మహత్య అత్యంత బాధాకరమని, ఈ కేసులో అన్ని కోణాలలో విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

ప్రీతి మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.

ప్రీతి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియాగా అందించనున్నట్లు తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు. ఈ ఘటన పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు ఆయన తెలిపారు.

ప్రీతి

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, ప్రీతి

అసలేం జరిగింది?

సీనియర్ విద్యార్థి వేధింపుల కారణంగా ఫిబ్రవరి 22 న వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఆత్మహత్యాయత్నం చేశారు డాక్టర్ ప్రీతి.

ప్రీతికి సీనియర్ అయిన సైఫ్ వేధింపుల వల్లే ఆమె ఆత్మహత్యాయత్నం చేసిందని పోలీసులు కూడా నిర్ధారణకు వచ్చారు.

ఆత్మహత్యయత్నానికి ముందు డాక్టర్ ప్రీతి గూగుల్ సెర్చ్ లో ఓ ఇంజక్షన్‌కు సంబంధించి వివరాలు వెతికినట్టుగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

ఈ కేసులో రాజకీయ హస్తం ఉందన్న ఆరోపణలను వరంగల్ సీపీ రంగనాథ్ ఖండించారు.

డాక్టర్ సైఫ్ సాధారణ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ నుండి వచ్చారని, సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నట్లు రాజకీయ కుటుంబాలతో బంధుత్వం లేదని తమ విచారణలో తెలిసిందని అన్నారు.

‘‘డాక్టర్‌ సైఫ్‌, ప్రీతిని పనిగట్టుకుని అవమానించడం, వేధించడంలాంటివి చేసినట్లు కాలేజ్ వాట్సప్ గ్రూపుల్లోని చాట్‌ల ద్వారా అర్థమైంది. ఈ కేసులో లైంగింక వేధింపుల కోణం లేదు. సీనియర్‌గా సైఫ్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేశాడు. ప్రీతి ప్రశ్నించే మనస్తత్వం సైఫ్‌కు మింగుడుపడలేదు. ఈ కేసులో పోలీసులు ఎక్కడా తాత్సారం,నిర్లక్ష్యం చేయలేదు’’ అని సీపీ రంగనాథ్ మీడియాతో అన్నారు.

ప్రీతి

ఫొటో సోర్స్, UGC

వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ లో జూనియర్, సీనియర్ విద్యార్థుల మధ్య ఫ్రెండ్లీ వాతావరణం స్థానంలో అంతరాలు ఉన్నాయని, సీనియర్లలో బాసిజంలాంటి ధోరణులు ఉన్నట్లు పోలీసుల అంతర్గత విచారణలో తేలింది.

‘‘పైకి జూనియర్ స్టూడెంట్ ను గైడ్ చేస్తున్నట్టుగా చెబుతున్నా, సైఫ్ ఉద్దేశ్యాలు వేరే విధంగా ఉన్నాయని అతని చాట్స్ ద్వారా తెలిసింది. ఈ అమ్మాయి ఎక్కువ చేస్తోంది, ఆమెకు సహకరించొద్దని కాలేజీ గ్రూపుల్లో సైఫ్ చాట్ చేశాడు’’ అని సీపీ రంగనాథ్ అన్నారు.

ఈ కేసులో ఎవరి నిర్లక్ష్యం బయటపడ్డా చర్యలు తీసుకోవడానికి వెనకాడే ప్రసక్తి లేదని రంగనాథ్ స్పష్టం చేశారు.

ప్రీతి ఎవరు ?

జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొంగ్రాయి గిర్నీ తాండకు చెందిన ప్రీతి కుటుంబం కొంతకాలంగా హైదరాబాద్‌లో నివాసం ఉంటోంది.

తండ్రి ధరావత్ నరేందర్ వరంగల్‌ రైల్వే పోలీస్‌లో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు.

ప్రీతి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. గత ఏడాది నవంబర్‌లో వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో అనస్తీషియా పీజీ కోర్స్‌లో జాయిన్ అయ్యింది.

గత రెండు నెలలుగా కాకతీయ మెడికల్ కాలేజ్ బోధనాసుపత్రి అయిన ఎంజీఎం ఆసుపత్రిలో ప్రొఫెసర్లు, సీనియర్ విద్యార్థుల పర్యవేక్షణలో విధులు నిర్వహిస్తోంది.

కొద్దిరోజులుగా అనస్తీషియా సీనియర్ విద్యార్థి సైఫ్ అలీ, ప్రీతికి మధ్య డ్యూటీ సందర్భంగా పొరపొచ్చాలు వచ్చాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.

డ్యూటీలో వేధింపులు, ర్యాగింగ్ వల్లే ప్రీతి ఆత్మహత్యాయత్నానికి దారితీసిందన్న వార్తలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అయిదు రోజుల చికిత్స జరిగినా ఆమె ప్రాణాలు కాపాడలేకపోయారు. ఆదివారం సాయంత్రం ఆమె మృతి చెందారు.

ఇవి కూడా చదవండి: