ముస్లిం అమ్మ, హిందూ బిడ్డలు.. చనిపోయిన పనిమనిషి పిల్లలను పెంచి ప్రయోజకులను చేసిన తల్లి

కేరళ సినిమా

ఫొటో సోర్స్, CV LENIN

కేరళకు చెందిన ఒక ముస్లిం మహిళ కథ ఆధారంగా కొత్త సినిమా తెరకెక్కింది. కుటుంబ సంబంధాలు తెరమరుగైపోతున్న ఈ రోజుల్లో, హిందూ మతానికి చెందిన పిల్లలను తన సొంత బిడ్డల్లా పెంచిన ఓ ముస్లిం అమ్మ కథతో ఈ సినిమా రానుంది. ఆ పిల్లలతో బీబీసీ ప్రతినిధి ఇమ్రాన్ ఖురేషి మాట్లాడారు.

జాఫర్‌ఖాన్ మొదటిసారి చూసినప్పుడు ఎన్ను స్వంతం శ్రీధరన్‌ (యువర్స్ ట్రూలీ, శ్రీధరన్) ఏడుస్తూ కనిపించాడు. కన్నీళ్లు పెట్టుకుంటున్నాడని ఆయన చెప్పారు.

''ఆపకుండా ఏడుస్తూనే ఉన్నాడు'' అని అన్నారు.

ఒకే పేరుతో పిలుచుకునే 49 ఏళ్ల జాఫర్‌ఖాన్, శ్రీధరన్‌కు ఎలాంటి రక్త సంబంధం లేదు. జాఫర్‌ఖాన్ ఓ ముస్లిం, శ్రీధరన్ ఒక హిందూ.

కానీ, శ్రీధరన్ గురించి జాఫర్‌ఖాన్‌ని అడిగినప్పుడు.. ''ఆయన నా సోదరుడు. అంతకంటే ఎక్కువ. ఎప్పుడూ నాతోనే ఉంటాడు. ఆయన ఎవరనేది నాకు అనవసరం. ఆయన నా సహచరుడు'' అన్నారు.

శ్రీధరన్ తల్లి మరణించడంతో..

జాఫర్‌ఖాన్ తల్లి తెన్నదాన్ సుబేదా వాళ్లిద్దరినీ పెంచి పెద్ద చేశారు. ఆమె 2019లో మరణించారు. మతపరమైన అడ్డంకులను దాటి మానవత్వానికి మారుపేరుగా నిలిచారామె. భారత్‌లో మతపరమైన వైరుధ్యాలు ఎక్కువగా ఉన్న రోజుల్లోనే ఆమె అలాంటి నిర్ణయం తీసుకున్నారు.

సుబేదా ఇంట్లో శ్రీధరన్ తల్లి చక్కి పనిచేసేవారు. 1976లో ఆమె చనిపోయారు. నాలుగో బిడ్డ ప్రసవం సమయంలో శ్రీధరన్ తల్లి మరణించారు. ఆ బిడ్డ కూడా బతకలేదు. అప్పటి నుంచి శ్రీధరన్, ఆయన ఇద్దరు అక్కలు లీల, రమణిల బాధ్యత సుబేదా తీసుకున్నారు.

సుబేదా వారిని చట్టబద్దంగా దత్తత తీసుకోలేదు. అప్పట్లో ఆ చట్టాలు అంత స్ట్రిక్ట్‌గా ఏమీ లేవని సోదరులు చెప్పారు. ఆ సమయంలో పిల్లల బాధ్యత తీసుకునేందుకు వారి బంధువులు కూడా ముందుకు రాకపోవడంతో పిల్లలను సుబేదాకు ఇచ్చేందుకు వాళ్ల నాన్న కూడా అంగీకరించారు. పిల్లల బాధ్యతలు చూసుకోలేని పరిస్థితుల్లో ఉన్నానని ఆయన చెప్పారు.

సుబేదాకు అప్పటికే ఇద్దరు కొడుకులు జాఫర్ ఖాన్, ఆయన అన్న షానవాజ్ ఉన్నారు. నాలుగేళ్ల తర్వాత కూతురు జోషినా పుట్టారు. పిల్లలందరూ కలిసిమెలిసి పెరిగారు. ఎంతో సామరస్యంగా ఉండేవారు.

కేరళ శ్రీధరన్

ఫొటో సోర్స్, CV LENIN

'ఉమ్మ' అని పిలవడంతో అనుమానించిన జనం

2019లో సుబేదా మరణానంతరం మొదటిసారి ఈ కథ వార్తల్లోకెక్కింది. తమ ఉమ్మ (మలయాళ ముస్లింలు అమ్మను ఇలా పిలుస్తారు)కి నివాళి అర్పిస్తూ శ్రీధరన్ తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ భావోద్వేగ పోస్ట్ పెట్టారు.

''స్వర్గంలోకి ఘన స్వాగతం'' లభించాలని ప్రార్థనలు చేయాలని ఆయన తన స్నేహితులను కోరారు. శ్రీధరన్ ప్రస్తుతం ఒమన్‌లో పనిచేస్తున్నారు.

హిందూ పేరుతో ఉన్న ఓ వ్యక్తి ముస్లిం మహిళను ఉమ్మ అని సంబోధించడం అందరి దృష్టినీ ఆకర్షించింది. చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

''నువ్వు హిందువా? లేక ముస్లిమా? అని కొందరు ప్రశ్నించారు. నా పేరు శ్రీధరన్ అని ఉండటంతో చాలా మందికి అర్థం కాలేదు'' అని శ్రీధరన్ అన్నారు.

అలాంటి ప్రశ్నలకు అంతే లేదు. కొన్ని అసహ్యకరమైన ప్రశ్నలు కూడా వచ్చేవి. తల్లిని కోల్పోయిన బాధలో ఉన్నప్పటికీ, శ్రీధర్ వాటన్నింటికీ చాలా సహనంతో సమాధానమిచ్చారు.

సుబేదా కానీ, ఆమె భర్త అబ్దుల్ అజీజ్ హాజీ కానీ ఎప్పుడూ తాము పెంచుకున్న పిల్లలను మతం మార్చుకోవాలని అడగలేదని చెప్పారు.

''కులం, మతం గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని మా తల్లిదండ్రులు ఎప్పుడూ చెబుతూ ఉండేవారు'' అని అన్నారు.

శ్రీధరన్ హిందూత్వం ఆచరించేవారా? ఇస్లాం ఆచరించేవారా?

''మంచితనం కావాలి. మన విశ్వాసాల్లోనూ మార్పులు రావాలి'' అని సుబేదా నమ్మేవారు. ఆమె అలాగే బతికారు. తన పిల్లను కూడా అలాగే పెంచి పెద్ద చేశారు.

అమ్మ తనను గుడికి తీసుకెళ్లేవారని, ''నేనెప్పుడు అడిగితే అప్పుడు'' అని 51 ఏళ్ల లీల చెప్పారు. అప్పట్లో రవాణా సదుపాయాలు కూడా అంతగా ఉండేవి కావు. అందువల్ల పండుగల సమయంలో ఒక సమూహంగా వెళ్లేవాళ్లు అని చెప్పారు.

''హిందూత్వం, ఇస్లాం, క్రిస్టియానిటీలో నువ్వు ఏది ఆచరిస్తావనేది విషయం కాదు. ప్రతి ఒక్కరినీ ప్రేమించాలని, గౌరవించాలనే ప్రతి మతం బోధిస్తుందని మా అమ్మ ఎప్పుడూ చెబుతూ ఉండేది'' అని శ్రీధరన్ చెప్పారు.

తమ చిన్నతనంలో జరిగిన సంఘటనల గురించి వారి సోదరులకు కూడా చాలా జ్ఞాపకాలు ఉన్నాయి.

ఆ రోజు రెండేళ్ల శ్రీధరన్‌ను తీసుకుని అమ్మ ఇంటికి వచ్చారని షానవాజ్ గుర్తు చేసుకున్నారు.

''లీల, రమణి ఆమె వెనక ఉన్నారు. వాళ్లను చూసుకోవడానికి ఎవరూ లేరు. ఇప్పటి నుంచి వాళ్లు మనతో ఉంటారని అమ్మ చెప్పింది.'' అని ఆయన చెప్పారు.

ఆ తర్వాత వాళ్లంతా ఒక కుటుంబమయ్యారు.

ఎన్ను స్వాంతం శ్రీధరన్

ఫొటో సోర్స్, SIDDIK PARAVOOR

'అమ్మకి శ్రీధరన్ అంటేనే ఎక్కువ ఇష్టం'

చిన్నతనంలో తామంతా నేలపై ఒకరి పక్కన మరొకరు పడుకునేవాళ్లం. నాలుగేళ్ల తర్వాత జోషినా పుట్టినప్పుడు చాలా సంతోషించామని షానవాజ్ గుర్తు చేసుకున్నారు.

పెరుగుతున్న కొద్దీ శ్రీధరన్, జాఫర్‌ఖాన్ మరింత క్లోజ్ అయ్యారు. కవలలు అనుకునేంతలా కలిసిపోయారు. ఏం చేసినా ఇద్దరూ కలిసే చేసేవాళ్లు.

అప్పుడప్పడూ గొడవపడినప్పటికీ ''అమ్మకు శ్రీధరన్ అంటే చాలా ఇష్టం''. ప్రత్యేకంగా చూసుకునేది అని షానవాజ్, జాఫర్‌ఖాన్ చెప్పారు.

''తను నాలాగ కాదు. శ్రీధరన్ అన్ని పనులు చాలా నిజాయితీగా చేసేవాడు. అమ్మ ఎక్కువ ప్రేమ చూపించడానికి కారణం అదేనేమో'' అంటూ నవ్వేశారు జాఫర్ ఖాన్.

జీవితానికి సంబంధించిన చాలా ముఖ్యమైన పాఠాలు కూడా తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నామని వాళ్లు చెప్పారు. కులం, మతం అనేవి చూడకుండా ఇతరులకు అమ్మ సాయం చేసేదని షానవాజ్ గుర్తు చేసుకున్నారు.

ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతోంది?

''చదువు కోసమనో, వివాహమో, లేక ఆరోగ్య సమస్యలతో ఎవరైనా ఆర్థిక సాయం కోసం వస్తే అమ్మ సాయం చేసేది. కొన్నిసార్లు అప్పు చేసి మరీ సాయం చేసేది. అందుకోసం పూర్వీకుల నుంచి వచ్చిన భూమి అమ్మి ఆ అప్పులు తీర్చింది.'' అని ఆయన చెప్పారు.

ఈ కథ ఆధారంగానే సిద్దిక్ పరవూర్ దర్శకత్వంలో 'ఎన్ను స్వాంతం శ్రీధరన్' సినిమా తెరకెక్కుతోంది.

శ్రీధరన్ ఫేస్‌బుక్‌ పోస్ట్ చూసి ఇనస్పైర్ అయిన వారిలో పరవూర్ కూడా ఒకరు.

''ఈ కథలో చాలా మానవత్వం ఉంది. ఇప్పటి సమాజానికి ఇది చాలా అవసరం '' అని ఆయన అన్నారు. మానవ సంబంధాల్లోని గొప్పతనాన్ని ఈ సినిమా ద్వారా ఆవిష్కరించాలనుకుంటున్నానని ఆయన చెప్పారు.

జనవరి 9న కేరళలోని ఓ థియేటర్‌లో ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ సినిమాను విడుదల చేసేందుకు అవసరమైన నిధులు సమీకరించే ప్రయత్నంలో పరవూర్ ఉన్నారు.

సుబేదా పిల్లలు ఇప్పుడు వేర్వేరు నగరాల్లో జీవిస్తున్నారు. మా అమ్మకు ఇంతకు మించిన నివాళి ఏముంటుందని వారు అంటున్నారు.

''నాకు మా అమ్మ గురించి మంచి జ్ఞాపకాలున్నాయి. కొన్ని మాత్రమే ఉన్నాయని భాధ ఉండేది. కానీ ఈ సినిమా ఆ జ్ఞాపకాలను గుర్తు చేయడం సంతోషంగా ఉంది'' అని లీల చెప్పారు.

''అమ్మ చనిపోయాక మా మధ్య తేడాలు వస్తాయని అంతా భావించారు. కానీ, మేం ఇప్పటికీ అలానే ఉన్నాం'' అని షానవాజ్ అన్నారు.

ఇవి కూడా చదవండి