కేరళ: పులులను చంపేయాలన్న మంత్రి వ్యాఖ్యలపై వివాదం

పులి

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
    • హోదా, బీబీసీ హిందీ

పులుల సామూహిక హననంపై కేరళకు చెందిన ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

కేరళలో పులుల సంఖ్య పెరగకుండా వాటికి సంతాన నిరోధక శస్త్రచికిత్సలు చేయడం కానీ, సామూహికంగా హతమార్చడం కానీ చేయాలని ఆ రాష్ట్ర అటవీ, వన్యప్రాణి సంరక్షణ శాఖ మంత్రి ఏకే శశీంద్రన్ అన్నట్లుగా మీడియాలో కథనాలు వచ్చాయి.

కేరళలో పులి దాడిలో ఓ రైతు మరణించిన తరువాత స్థానిక ఆందోళనలు జరగిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు చెప్తున్నారు.

అయితే, పులి దాడిలో రైతు మరణించిన తరువాత స్థానికులు ఇలాంటి డిమాండ్ చేశారని, ప్రజలు అలా అడుగుతున్నారని మాత్రమే తాను చెప్పానని శశీంద్రన్ ‘బీబీసీ’తో చెప్పారు.

పులుల సామూహిక హననం అనేది చట్టబద్ధం కాదని వన్యప్రాణుల సంరక్షణ కోసం పోరాడేవారు అంటున్నారు.

ప్రపంచంలోని పులులలో 70 శాతం భారత్‌లోనే ఉన్నాయి. దేశంలో 2,976 పులులు ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి.

పులుల సంఖ్య పెరుగుతున్నట్లే వాటి ఆవాసాలూ విస్తరిస్తున్నాయి. పులుల సంఖ్య పెరగడంతో అవి వాటి అభయారణ్యాలను దాటి బయటకొస్తున్నాయని.. మనుషులకు, పులుల మధ్య సంఘర్షణ పెరుగుతోందని అంటున్నారు.

భారత్‌లోని పులుల సంరక్షణ చట్టం-1972 ప్రకారం పులులను బంధించడం కానీ, చంపడం కానీ నేరం.

భారత జాతీయ జంతువుగా గుర్తింపు ఉన్న పులులు ఒకవేళ మనుషులపై దాడి చేసినా వాటిని చంపడం నేరమే అవుతుంది.

వీడియో క్యాప్షన్, పెరుగుతున్న పులులతో అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలేంటి?

కేరళలోని వాయనాడు జిల్లా మనంతవాడి అటవీ ప్రాంతంలో జనవరి 13న పులి 50 ఏళ్ల రైతుపై దాడి చేసింది. ఆ దాడిలో కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలైన ఆ రైతు హాస్పిటల్‌కు తరలిస్తున్నప్పుడు కార్డియాక్ అరెస్ట్ కారణంగా మరణించారు.

ఆయన మృతి తరువాత స్థానికులు అటవీ అధికారులకు వ్యతిరేకంగా ధర్నాలు చేశారు. రైతును చంపిన పులిని చంపాలని వారు డిమాండ్ చేశారు.

దీంతో పులులను చంపడమే ఈ సమస్యకు పరిష్కారమని మంత్రి శశీంద్రన్ అన్నట్లు స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి.

కానీ శశీంద్రన్ బీబీసీతో మాట్లాడినప్పుడు తాను అలా అనలేదని.. అన్ని రాజకీయ పక్షాలు, స్థానికులతో కలిసి నిర్వహించిన సమావేశంలో ఈ సమస్యకు పరిష్కారంగా స్థానికులు ఆ సూచన చేశారని చెప్పారు.

‘ఈ సమస్యకు ఒక పరిష్కారం వెతకాలి. పులులను చంపాలని నేనేమీ తొందరపడడంలేదు’ అన్నారు శశీంద్రన్.

గత 50 ఏళ్లలో దేశంలో సుమారు వెయ్యి పులులు మాత్రమే పెరిగాయని.. ఇది ఈ దేశంలోని అడవుల సామర్థ్యంతో పోల్చితే చాలా తక్కువని వన్యప్రాణి సంరక్షణ ఉద్యమకారుడు డాక్టర్ ఉల్లాస్ కారంత్ అన్నారు. కాబట్టి పులులను చంపాలన్న ఆలోచన సరైంది కాదని ఆయన అన్నారు.

వీడియో క్యాప్షన్, చిరుతలు విదేశాల నుంచి భారత్‌కు వచ్చేస్తున్నాయిలా...

జాతీయ వన్యప్రాణి సంరక్షణ చట్టంలో ఇటీవల చేసిన సవరణ ప్రకారం పులులను మానవాళికి వినాశనం కలిగించే జీవిగా పరిగణించడానికి వీల్లేదని.. కేరళ అటవీశాఖ మంత్రి అన్నట్లు పులులను చంపడమనేది చట్టప్రకారం సాధ్యం కాదని ‘జాతీయ వన్యప్రాణి రక్షణ బోర్డ్’ మాజీ సభ్యుడు ప్రవీణ్ భార్గవ్ చెప్పారు.

అయితే ఎక్కడైనా మనుషులకు పులి వల్ల తీవ్రమైన ముప్పు కలుగుతున్నప్పుడు దానికి మత్తు మందు ఇచ్చి పట్టుకునే ప్రయత్నాలు, అక్కడి నుంచి తరిమేసే ప్రయత్నాలు విఫలమైనప్పుడు ఆ రాష్ట్ర ప్రధాన అటవీ అధికారి దాన్ని చంపడానికి అనుమతి ఇవ్వొచ్చని, అందుకు చట్టంలో వీలుందని ప్రవీణ్ భార్గవ్ అన్నారు.

90 శాతం పులుల ఆవాసాలలో ఇబ్బందులేమీ రావడం లేదని, పులుల సంఖ్య బాగా ఎక్కువగా ఉన్న 10 శాతం ప్రాంతాలలోనే అప్పుడప్పుడు ఇలాంటి సమస్యలు వస్తున్నాయని డాక్టర్ కారంత్ అన్నారు.

దేశంలోని ఈశాన్య రాష్ట్రాలు, తూర్పు రాష్ట్రాలలో వేట కారణంగా ఇప్పటికే పులుల సంఖ్య విపరీతంగా తగ్గిపోయిందని అన్నారు కారంత్.

పులులు మనుషులు ఉండే ప్రాంతాల్లోకి చొరబడి పెంపుడు జంతువులపై దాడి చేసి చంపితే అధికారులు వెంటనే పరిహారం అందించాలని.. ఒకవేళ పులి మనుషులను చంపితే అలాంటి సందర్భాలలో పులిని చంపాలని డాక్టర్ కారంత్ అన్నారు.

అయితే, పర్యావరణవేత్త మాధవ్ గాడ్డిల్ మాత్రం పులుల హననాన్ని కొంత సమర్థించారు. వాటి సంఖ్య పెరుగుతుంటే హేతుబద్ధమైన వేటకు అనుమతించాలని సూచించారు.

‘‘అడవి జంతువులను సంరక్షించేందుకు చట్టం ఉన్న ఏకైక దేశం భారత్. ఇది అహేతుకం, మూర్ఖం, రాజ్యాంగ విరుద్ధం, ఇందులో గర్వించాల్సిన విషయం ఏమీ లేదు. అభయారణ్యాల బయట ఉన్న అడవి జంతువుల రక్షణకు భారత్ తప్ప ఇంకే దేశంలోనూ చట్టాలు లేవు’ అని మాధవ్ గాడ్గిల్ అన్నట్లు ‘ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ తన కథనంలో రాసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)