72 మంది ముస్లింలను చంపిన కేసులో ఒక్కరినీ పట్టుకోలేకపోయారా, బాధితులు ఏమన్నారు?

ఫొటో సోర్స్, MOHD ISMAIL
- రచయిత, గీతా పాండే
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఉత్తరప్రదేశ్‌లో 36 ఏళ్ల కిందట జరిగిన ‘‘ముస్లింలపై మతపరమైన హింస’’ కేసులో 41 మంది హిందువులకు విముక్తి కల్పిస్తూ ఇటీవల ట్రయల్ కోర్టు తీర్పు నివ్వడం బాధిత కుటుంబాలను నిరాశ పరిచింది.
1987 మే 23న మేరఠ్ పట్టణానికి శివార్లలోని మల్యానా గ్రామంలో 72 మంది ముస్లింలను ఊచకోత కోశారు. ఈ కేసులో స్థానిక హిందువులతోపాటు పోలీసులపైనా ఆరోపణలు వచ్చాయి.
ఈ అల్లర్లను ప్రజాస్వామ్యానికి చెంపపెట్టుగా విమర్శకులు చెబుతున్నారు. శుక్రవారం నాటి ఆదేశాలను ‘‘న్యాయాన్ని పక్కదారి పట్టించడం’’గా విమర్శిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్ డీజీపీగా పనిచేసిన విభూతి నారాయణ్ రాయ్ మాట్లాడుతూ.. ‘‘ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది’’అని వ్యాఖ్యానించారు.
‘‘అటు పోలీసులు, ఇటు రాజకీయ నాయకులు, ఇంకా మీడియా, న్యాయవ్యవస్థ కలిసి బాధితులకు అన్యాయం చేశారు’’అని బీబీసీతో ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, RASHID KHAN
ఈ అల్లర్లపై విస్తృతంగా వార్తలు రాసిన సీనియర్ జర్నలిస్టు ఖుర్బాన్ అలీ, మరికొందరు బాధితులతో కలిసి రాయ్ 2021లో అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. ట్రయల్ కోర్టులో దర్యాప్తు నత్తనడకన కొనసాగుతోందని, దీనిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
‘‘దర్యాప్తులో మొదట్నుంచీ లోపాలున్నాయి. మూడున్నర దశాబ్దాలు గడిచినా దర్యాప్తు పెండింగ్‌లోనే ఉండేది. అందుకే మళ్లీ కొత్తగా విచారణ చేపట్టాలని, బాధితులకు పరిహారం ఇవ్వాలని మేం అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాం’’అని రాయ్ చెప్పారు.
ఈ ఊచకోతలో పోలీసుల పాత్రపై మళ్లీ విచారణ చేపట్టాలని అలీ డిమాండ్ చేస్తున్నారు. సాయుధ పోరాటాలు, మత-కుల ఘర్షణలను అడ్డుకునేందుకు తీసుకొచ్చిన రాష్ట్ర ప్రొవిన్షియల్ ఆర్మ్డ్ కానిస్టేబులరీ (పీఏసీ-ప్యాక్) సభ్యులే ఈ ఊచకోతను మొదలుపెట్టారని బాధితులు ఆరోపిస్తున్నారు.
మల్యానా అల్లర్లుగా పిలిచే వీటిలో పీఏసీ పాత్రపై ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సహా కొన్ని పౌర హక్కుల సంస్థలు విస్తృతంగా వార్తలు, నివేదికలు ప్రచురించాయి.
కోర్టుకు సమర్పించిన శవపరీక్ష నివేదికల్లోనూ 36 మృతదేహాలకు బుల్లెట్ గాయాలు అయినట్లు పేర్కొన్నారని, ఆ కాలంలో స్థానికుల దగ్గర తుపాకులు లేవని అలీ చెప్పారు.
మల్యానా హింసలో పాత్రపై స్పందించాలని పీఏసీని బీబీసీ కోరింది. దీనిపై ఒక సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ.. ‘‘దీనిపై మేం మాట్లాడకూడదు’’అని అన్నారు.
పీఏసీ ప్రధాన కార్యాలయానికి కూడా మేం ఈమెయిల్ పంపించాం. కానీ, ఎలాంటి సమాధానమూ రాలేదు.

ఫొటో సోర్స్, MOHD ISMAIL
నిందితులుగా 93 మంది హిందువులు..
ఈ ఊచకోత తర్వాత పోలీసులు ఫిర్యాదు నమోదుచేశారు. దీనిలో 93 మంది స్థానిక హిందువులను నిందితులుగా చేర్చారు. వీరిలో 23 మంది విచారణ జరుగుతుండగానే చనిపోయారు. 31 మంది ఆచూకీ తెలియదు.
‘‘ఈ కేసులో అధికారులు విఫలం కావడానికి ప్రధాన కారణం ఏమిటంటే.. ప్రధాన ప్రత్యక్ష సాక్షి పోలీసుల ఒత్తిడితోనే నిందితుల పేర్లు చెప్పానని కోర్టులో చెప్పాడు. మరోవైపు ఏడెనిమిదేళ్ల క్రితమే మరణించిన నలుగురి పేర్లను కూడా నిందితుల జాబితాలో చేర్చారు. ఆస్పత్రి పాలైన ఒక వ్యక్తి పేరు కూడా ఆ జాబితాలో ఉంది’’అని బాధితుల తరఫు న్యాయవాది లాల్ బన్సల్ అన్నారు.
‘‘మల్యానాలో ముస్లింలపై జరిగిన దారుణం చాలా బాధాకరమైనది. ఇలాంటి ఘటనలను మనం ఖండించాలి. కానీ, 36 ఏళ్ల నుంచి ఈ కేసులో బాధితులు ఇంకా భయం అంచునే జీవిస్తున్నారు’’అని ఆయన అన్నారు.
‘‘బాధితుల తరఫు న్యాయవాదితోపాటు దర్యాప్తు అధికారులు కూడా రాష్ట్ర పోలీసు విభాగం, పీఏసీలపై ఆరోపణలు చేశాయి. కానీ, వారి పేర్లు నిందితుల జాబితాలో లేవు’’అని ఆయన వివరించారు.
తాజా 26 పేజీల తీర్పులో ఆనాటి హింస ఎలా చోటుచేసుకుందో వివరించారు. తూటా మెడ నుంచి దూసుకెళ్లడంతో ఒక యువకుడు మరణించాడు, మరో వ్యక్తిని కత్తితో ముక్కలుగా నరికారు, ఐదేళ్ల బాలుడిని మంటల్లో తోసేశారు.. ఇలా చాలా హింసాత్మక ఘటనలు దానిలో పేర్కొన్నారు.
అయితే, నిందితులకు విముక్తి కల్పించడంతో బాధిత కుటుంబాలు షాక్‌కు గురయ్యాయి. నాటి అల్లర్లలో రెండు తూటా గాయాలైన వకీల్ అహ్మద్ సిద్దిఖీ మాట్లాడుతూ.. ‘‘మా వర్గంపై మబ్బులు కమ్ముకున్నట్లు అయింది’’అని వ్యాఖ్యానించారు.
‘‘ఆ రోజు ఎవరు చనిపోయారో.. వారిని ఎవరు చంపారో నాకు బాగా తెలుసు’’అని ఆయన చెప్పారు. 23 మే 1987నాటి ఘటనల గురించి మాట్లాడే ప్రతిసారీ తనకు ఏడుపు వస్తుందని చెప్పారు.
‘‘మా గ్రామంలో కొంత కాలంపాటు ముస్లిం వ్యతిరేక వదంతులు వ్యాపించాయి. కొందరు రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నించారు’’అని ఆయన చెప్పారు.
‘‘మేరఠ్‌లో ఇలాంటి ఘర్షణలు ఎక్కువగా జరిగేవి. కానీ, మా గ్రామంలో అలాంటివి ఎప్పుడూ లేవు. కానీ, ఆ రోజు పీఏసీ సిబ్బంది మూడు వాహనాల్లో వచ్చారు. ముస్లిం ప్రాంతాలను చుట్టుముట్టారు. బయటకు వెళ్లే మార్గాలన్నీ మూసివేశారు. ఆ తర్వాత కొందరు హిందువులు మా ఇళ్లలోకి ప్రవేశించారు. ఆ తర్వాత అన్ని వైపుల నుంచి తూటాలు వర్షంలా కురిశాయి’’అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, PRAVEEN JAIN
కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పిన కొందరిలో సిద్దిఖీ కూడా ఒకరు.
‘‘ఏడాది క్రితం కూడా నేను సాక్ష్యం చెప్పాను. పీఏసీ పాత్ర గురించి వివరించాను. అక్కడకు వచ్చిన వారితోపాటు వారు పట్టుకున్న ఆయుధాలను కూడా గుర్తుపట్టాను’’అని ఆయన తెలిపారు.
కానీ, ఈ కేసులో కోర్టు తీర్పు అందరినీ నిరాశకు గురించేసిందని అన్నారు.
‘‘నిందితులను దోషులుగా గుర్తించేందుకు సరిపడా ఆధారాలు ఉన్నాయి. అసలు ఎక్కడ తప్పు జరిగిందో మొదట గుర్తించాలి. మల్యానా అల్లర్ల గురించి ప్రపంచం మొత్తం వార్తలు వచ్చాయి. కోర్టు మాత్రం చూడకుండా ఎలా ఉంటుంది?’’అని ఆయన ప్రశ్నించారు.
ఈ ఊచకోతలో మొహమ్మద్ ఇస్మాయిల్ 11 మంది కుటుంబ సభ్యులను కోల్పోయారు. వీరిలో 85 ఏళ్ల ఆయన తాతయ్య, తల్లిదండ్రులు, సోదరులు కూడా ఉన్నారు. వేరే ఊరికి వెళ్లడంతో ఆయన ప్రాణాలు మిగిలాయి.
ఘర్షణల వార్త మరుసటి రోజు ఇస్మాయిల్‌కు తెలిసింది. అయితే, ఐదు రోజుల తర్వాత ఆయన ఇంటికి రాగలిగారు. ఎందుకంటే మేరఠ్ మొత్తం కర్ఫ్యూ విధించారు. తిరిగి వచ్చిన తర్వాత, చూసిన దృశ్యాలను ఎప్పటికీ మరచిపోలేనని ఆయన అన్నారు.
‘‘ఇల్లు పూర్తిగా కాలిపోయింది. గోడలపై రక్తం మరకలు కనిపించాయి. ఇరుగుపొరును నుండే కొందరు ముస్లింలు దగ్గర్లోని మదర్సాకు వెళ్లి తలదాచుకున్నారు’’అని ఆయన చెప్పారు.
మేరఠ్‌లో చాలా ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయని వార్తలను ఇస్మాయిల్ విన్నారు. కానీ, తన కుటుంబం దీనికి ప్రభావితం అవుతుందని ఆయన అనుకోలేదు. ‘‘మాకు ఎవరితోనూ శత్రుత్వం లేదు. మేం ఎందుకు ఆందోళన చెందాలని అనుకున్నాను’’అని ఆయన చెప్పారు.
ఘర్షణలకు రెండు రోజుల తర్వాత, జర్నలిస్టు అలీ ఆ ప్రాంతాలను సందర్శించారు. ‘‘పూర్తిగా ధ్వంసమైనట్లు ఆ ప్రాంతం కనిపించింది. చాలా భయమేసింది’’అని ఆయన చెప్పారు.
‘‘అక్కడుండే చాలా మంది ముస్లింలు అయితే, మరణించారు. లేదా ఆసుపత్రుల్లో గాయాలతో చికిత్స పొందుతున్నారు. కొందరికి బుల్లెట్ గాయాలు కూడా అయ్యాయి’’అని ఆయన వివరించారు.
మల్యానాలో చోటుచేసుకున్న ఈ ఘర్షణలను ఏదో అనుకోకుండా జరిగిన ఘటనలా చూడకూడదని ఆయన అన్నారు.
దీనికి కొన్ని వారాల ముందే మేరఠ్‌లో మతపరమైన ఘర్షణలు జరిగాయి. ఏప్రిల్ 14న ఒక మతపరమైన యాత్ర జరుగుతుండగా రెండు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
ఆ ఉద్రిక్తతలో డజన్ల మంది మరణించారు. వీరిలో ముస్లింలతోపాటు హిందువులు కూడా ఉన్నారు. ఆ తర్వాత కర్ఫ్యూ విధించారు. ఆ తర్వాత కొన్ని వారాల వరకు చుట్టుపక్కల ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
అధికారిక లెక్కల ప్రకారం, మొత్తంగా 174 మంది మరణించారు. కానీ, అనధికార అంచనాలు మాత్రం 350 మందికిపైగా మరణించారని, కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ధ్వంసమయ్యాయని పేర్కొన్నాయి.
‘‘మొదట్లో రెండు వైపులా మరణాలు సంభవించాయి. కానీ, ఆ తర్వాత ముస్లింలపై మాత్రమే పోలీసుల ప్రోత్బలంతో హింస చెలరేగింది’’అని రాయ్ చెప్పారు.
మే 22న, మల్యానా ఊచకోతకు ఒక రోజుకు ముందు ఇక్కడకు కేవలం ఆరు కి.మీ. దూరంలోని ముస్లింలు ఎక్కువగా ఉండే హషీంపురాలో భారీగా పీఏసీ సిబ్బందిని మోహరించారు.
వారు దాదాపు 48 మందిని తమతో తీసుకెళ్లారు. వీరిలో 42 మందిని కాల్చి చంపారు. వీరిలో కొందరు మృతదేహాలు పరిసరాల్లోని నది, కాలువల పక్కన కనిపించాయి. ప్రాణాలతో బయటపడిన ఆ ఆరుగురు అప్పుడు ఏం జరిగిందో వివరించారు.
ఫొటో జర్నలిస్టు ప్రవీణ్ జైన్‌ను పోలీసులు తీవ్రంగా కొట్టారు. ఆయనను అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పారు. కానీ, ఆయన అక్కడే పొదల్లో దాక్కుని ఫొటోలు తీశారు. ఆ ఫొటోలో ముస్లింలపై దాడి చేస్తున్న దృశ్యాలు కూడా ఉన్నాయి.
‘‘నేను వెళ్లిపోయిన తర్వాత, వారిని చంపేస్తారని నేను అసలు ఊహించలేదు’’అని ఆయన బీబీసీతో చెప్పారు.
2018లో ఈ ఘటనకు సంబంధించి పీఏసీలో పనిచేసిన 26 మందిని దోషులుగా దిల్లీ హైకోర్టు నిర్ధారించింది. హషీంపురా నుంచి ముస్లింల అపహరణ, హత్య ఆరోపణల్లో వీరు దోషులుగా నిర్ధారణ అయ్యారు.
ముస్లింలకు వ్యతిరేకంగా నడుచుకుంటున్నారని పీఏసీ బలగాలపై మొదట్నుంచీ విమర్శలు ఉండేవని లఖ్‌నవూకు చెందిన సీనియర్ జర్నలిస్టు శరత్ ప్రధాన్ చెప్పారు.
‘‘ఆ బలగాల్లో ఎక్కువ మంది హిందువులే ఉండేవారు. వారికి మతపరంగా తటస్థంగా ఉండాలని ప్రత్యేక శిక్షణ ఏదీ ఇచ్చేవారు కాదు’’అని ఆయన అన్నారు.
రాయ్ చేసిన ప్రయత్నాల వల్లే హషీంపురా ఊచకోతలో బాధితులకు న్యాయం జరిగిందని ప్రధాన్ చెప్పారు. మల్యానా ఊచకోతలో కూడా ఇలానో ఏదో ఒక రోజు బాధితులకు న్యాయం జరుగుతుందని అలీ ఆశాభావం వ్యక్తంచేశారు.
‘‘మేం తాజా తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తాం. దీన్ని ఇక్కడితో వదిలిపెట్టబోం’’అని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ఐపీఎల్ 2023: టోర్నీని రసవత్తరంగా మార్చబోతున్న 'ఇంపాక్ట్ ప్లేయర్' రూల్ ఏంటి?
- సెమాగ్లుటైడ్: బరువు తగ్గించే ఈ ఇంజెక్షన్‌కు అంత డిమాండ్ ఎందుకు?
- తెలంగాణ: ఆదివాసీలు పరిశ్రమలు పెట్టేందుకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం పొందడం ఎలా?
- ‘‘ఆయన నాలుగేళ్లుగా నీళ్లు పోసుకోలేదు... అడవిలోనే ఒంటరి జీవితం... అటవీ ఏనుగులున్నా భయపడలేదు’’
- 'జీన్ ఎడిటెడ్ ఫుడ్' అంటే ఏంటి? అది తినడం ఆరోగ్యానికి మంచిదేనా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















