కర్ణాటకలో ఆవులను తీసుకెళ్తున్న ముస్లిం డ్రైవర్‌పై 'గోరక్షకుల' మూక దాడి, హత్య: అసలేం జరిగింది?

పునీత్ కెరెహెల్లి

ఫొటో సోర్స్, PUNEETH KEREHALLI @ FACEBOOK

ఫొటో క్యాప్షన్, పునీత్ కెరెహెల్లి
    • రచయిత, ఇమ్రాన్ ఖురేషి
    • హోదా, బీబీసీ కోసం

కర్ణాటకలో ఆవులను తన వాహనంలో తీసుకెళ్తున్న ఓ ముస్లిం డైవర్‌పై మూకదాడితో హత్య చేసిన ఘటన రాజకీయ రంగు పులుముకుంది.

ఆవులను ఆ డ్రైవర్ కర్ణాటక నుంచి తమిళనాడులోని ఒక మార్కెట్‌కు తీసుకెళ్తున్నారు. ఆయన దగ్గర కొనుగోలుకు సంబంధించిన బిల్లు ఉంది. అయితే, గోరక్షకులుగా చెప్పుకొనే కొందరు దాడిచేసి ఆయన్ను హత్య చేశారు. దీంతో కర్ణాటకలో రాజకీయాలు వేడెక్కాయి.

నెల రోజుల్లో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతుండటంతో ఈ ఘటన మరింత ప్రాధాన్యం సంతరించుకొంది.

మరణించిన డ్రైవర్ ఇద్రీస్ పాషా (39) శరీరంపై లోతైన గాయాలు కనిపిస్తున్నాయి. రామనగర్ జిల్లా సథ్నుర్‌లో సంతెమాలాలా సర్కిల్ పరిధిలో ఏప్రిల్ 1 అర్ధరాత్రి ఆయన శరీరాన్ని పోలీసులు గుర్తించారు..

పాషాతోపాటు వచ్చి 37 ఏళ్ల ఇర్ఫాన్, 40 ఏళ్ల సయ్యద్ జహీర్‌లపైనా గోరక్షకులు దాడి చేశారు. వీరిద్దరూ ప్రస్తుతం వీరి సొంత ఊరైన మదదుర్‌లో చికిత్స పొందుతున్నారు.

ఈ కేసులో నమోదైన మూడు ప్రాథమిక విచారణ నివేదిక (ఎఫ్ఐఆర్)లపై దర్యాప్తు చేపట్టేందుకు రామనగర్ పోలీసులు రెండు బృందాలను ఏర్పాటుచేశారు.

ఈ ఘటనకు సంబంధించి మొదట నిందితుడు, గోరక్షకుడు పునీత్ కెరెహెల్లిపై ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది. పాషా హత్యపై రెండో ఎఫ్ఐఆర్ నమోదైంది. మూడో ఎఫ్ఐఆర్‌ను పునీత్ నమోదు చేయించారు. దీనిలో ఆ ఆవులను వధించేందుకు తీసుకెళ్తున్నట్లు ఆయన ఆరోపణలు చేశారు.

రెండో ఎఫ్ఐఆర్‌ను ఇద్రీష్ పాషా సోదరుడు యూనుస్ పాషా ఇచ్చిన ఫిర్యాదుపై నమోదు చేయించారు. మదదుర్‌లో ఒక వ్యాపారి నుంచి ఆ ఆవులను కొనుగోలు చేశామని, వీటిని తమిళనాడులోని కృష్ణనగర్‌ మార్కెట్‌లో విక్రయించేందుకు తీసుకెళ్తున్నట్లు ఆయన చెప్పారు.

అయితే, మార్గమధ్యంలో పునీత్, పవన్, గోపి, పిలింగా అడ్డగించి దాడి చేశారని ఫిర్యాదులో యూనుస్ ఆరోపించారు.

కర్ణాటక

ఫొటో సోర్స్, AFP

బెంగళూరు సెంట్రల్‌లో ఇదే తొలి దాడి

ఈ ఘటనపై బెంగళూరు సెంట్రల్ రేంజ్ ఐజీపీ రవికాంత్ గౌడ బీబీసీతో మాట్లాడారు.

‘‘నిందితులపై ఇదివరకు నమోదైన కొన్ని పాత కేసులపైనా ప్రస్తుతం దృష్టి సారిస్తున్నాం’’అని ఆయన చెప్పారు.

బెంగళూరు సెంట్రల్ జోన్‌లో ఇది తొలి మూకదాడి. బెంగళూరుకు చుట్టుపక్కల జిల్లాలన్నీ ఈ జోన్ పరిధిలోకి వస్తాయి.

సథ్నుర్‌.. రామనగర జిల్లాలో ఉంటుంది. ఈ ప్రాంతంలో ‘‘వొక్కలిగ’’ కులానికి చెందినవారు ఎక్కువగా జీవిస్తారు. కర్ణాటకలోకి ప్రధాన అగ్రవర్ణాలలో లింగాయత్‌ల తర్వాత స్థానం వీరిదే.

అయితే, జిల్లా వ్యాప్తంగా స్పల్ప స్థాయిల్లో ముస్లింలు జీవిస్తున్నారు. వీరు ఎక్కువగా పట్టుపురుగుల పెంపకంతో జీవనోపాధి పొందుతుంటారు. ఇక్కడ హిందు-ముస్లింల మధ్య మంచి సంబంధాలున్నాయి.

రామనగర జిల్లాతోపాటు ఈ ప్రాంతంపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్, జనతా దళ్ (సెక్యులర్) చీఫ్ హెచ్‌డీ కుమారస్వామిలకు పట్టుంది.

ఒకప్పుడు పాత మైసూరు జిల్లాలో భాగమైన ఈ ప్రాంతంలో ప్రాబల్యం కోసం బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

కర్ణాటకలోని కోస్తా జిల్లాల్లో హిందూ రాజకీయాలకు పెట్టింది పేరుగా చెప్పుకునేవారు. ఒకప్పుడు ఇక్కడ గోరక్షకులు క్రియాశీలంగా పనిచేసేవారు.

ఏప్రిల్ 2016లో బజ్‌రంగ్ దళ్, హిందూ జాగరణ్ వేదికకు చెందిన కొందరు ప్రవీణ్ పూజారి అనే యువకుడిపై మూకదాడి చేసి హత్య చేశారు.

గోవధకు ఆవులను తరలిస్తున్నారనే ఆరోపణలపై ప్రవీణ్‌పై అప్పట్లో దాడి చేశారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని బిసాహడాలో ఫ్రిడ్జ్‌లో గోమాంసం దాచిపెట్టారనే ఆరోపణలపై మహమ్మద్ అఖ్లాక్‌ను హత్యచేసిన ఏడు నెలల తర్వాత, ప్రవీణ్ పూజారి హత్యకు గురయ్యారు.

ఆవులు

ఫొటో సోర్స్, Getty Images

తాజా కేసులో ఏం జరిగింది?

ఇర్ఫా, జహీర్‌లపై దాడి చేసిన తర్వాత పునీత్‌, ఆయనతోపాటు వచ్చినవారు సథ్నుర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదుచేశారు. అయితే, శనివారం ఉదయం సంతెమాలా సర్కిల్ పరిధిలో పాషా మృతదేహం లభ్యమైంది.

మరోవైపు సోషల్ మీడియాలో పునీత్ ఒక వీడియోను కూడా విడుదల చేశారు. ‘‘నేను ఎవరో మీకు తెలుసు. తెలియదా? అయితే, గుర్తు పెట్టుకోండి. నా పేరు పునీత్ కెరెహల్లి. మీరు 2 లక్షలు ఇస్తేనే ఇక్కడి నుంచి కదులుతారు’’అని వీడియోలో ఆయన వ్యాఖ్యానించారు.

అయితే, తాము డ్రైవర్లం మాత్రమేనని, ఆ 15 ఆవులకు సంబంధించిన పత్రాలు తమ దగ్గరున్నాయని పునీత్‌కు చెప్పినట్లు బాధితులు వెల్లడించారు. అయితే, మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారని అడిగినప్పుడు.. ‘‘మీరు పాకిస్తాన్ వెళ్లిపోండి’’అని పునీత్ బెదిరించారని, ఆయన దగ్గర తుపాకీ కూడా ఉందని వివరించారు.

వీడియో క్యాప్షన్, ఈ మహారాష్ట్ర గ్రామస్తులు తమను కర్ణాటకలో కలపాలని ఎందుకు కోరుతున్నారు?

పాషాకు సమీప సంబంధువు అబ్దుల్ మజీద్ బీబీసీతో మాట్లాడారు. ‘‘ఆవులకు సంబంధించిన రసీదు కూడా వారు చూపించారు. కానీ, వదిలిపెట్టలేదు. వెంటపడి చావగొట్టారు’’అని ఆయన చెప్పారు.

‘‘ఇర్ఫాన్, జహీర్ వారి దగ్గర నుంచి తప్పించుకున్నారు. పాషా పొదల్లో చిక్కుకుపోయారు. అక్కడే ఆయన్ను దారుణంగా కొట్టారు. ఆయన తల, ఛాతి, చేతులపై తీవ్రమైన గాయాలను మేం చూశాం. ఇటీవల కాలంలో ఇలాంటి దాడులు ఎక్కువయ్యాయి’’అని ఆయన చెప్పారు.

అయితే, గాయాలు ఎలా అయ్యాయి? ఆయన ఎలా చనిపోయారు? లాంటి వివరాలు శపరీక్ష నివేదిక వస్తేనే తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు.

‘‘మేం ఈ కేసును చాలా సీరియస్‌గా తీసుకుంటున్నాం. శవపరీక్షను ఇద్దరు కాదు ముగ్గురు డాక్టర్లు చేపట్టారు’’అని బెంగళూరు సెంట్రల్ రేంజ్ ఐజీపీ రవికాంత్ గౌడ చెప్పారు.

‘‘ఐదుగురు నిందితులూ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వారిని త్వరలోనే అరెస్టు చేస్తాం. నిష్పాక్షికంగా ఈ కేసులో దర్యాప్తు జరుగుతుంది’’అని ఆయన స్పష్టంచేశారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడైన పునీత్ ఒక రైట్ వింగ్ యాక్టివిస్టు. ఇదివరకు ఇక్కడ హలాల్ బాయ్‌కాట్ ప్రచారంలోనూ ఆయన పాల్గొన్నారు. దీనిలో భాగంగా ముస్లిం వ్యాపారుల దగ్గర ఏమీ కొనొద్దని చెప్పారు.

‘‘రాష్ట్ర రక్షణ్ పాడే’’ సంస్థను పునీత్ నడిపిస్తున్నారు. ఆవుల రక్షణ కోసం ఆ సంస్థ పనిచేస్తోంది.

పునీత్‌పై చాలా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిపై విచారణ చేపడుతున్నామని ఓ పోలీసు అధికారి బీబీసీతో చెప్పారు.

ఘటన జరిగిన రోజు అర్ధరాత్రి నుంచి ఉదయం 5.30 వరకు తాను పోలీసులతోనే ఉన్నట్లు చెబుతూ పునీత్ సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశారు. ‘‘ఆవులను తరలిస్తున్న డ్రైవర్లపై కేసులు నమోదుచేయించడం, ఆవులను గోశాలకు అప్పగించడం కోసం నేను పోలీసుల దగ్గరే ఉన్నాను. ఆవులను రక్షించేందుకు నేను కృషి చేస్తూనే ఉంటాను’’ అని ఆయన వీడియోలో చెప్పారు.

వేడెక్కిన రాజకీయాలు..

ఈ ఘటన నేపథ్యంలో కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకుడు డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్ధారామయ్యతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడారు. బీజేపీ, శ్రీ రామ్ సేనకు చెందిన ప్రధాన నాయకులతో పునీత్ కలిసి దిగిన ఫొటోలను ఆయన మీడియా ముందు ఉంచారు.

‘‘ఇలాంటి ఘటనలను ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, హోం మంత్రి జ్ఞానేంద్ర ప్రోత్సహిస్తున్నారు. వెంటనే హోం మంత్రి రాజీనామా చేయాలి. మైనారిటీలను చిత్రహింసలకు గురిచేస్తూ సమాజంలో చిచ్చు పెట్టాలని చూస్తున్నారు’’అని శివకుమార్ వ్యాఖ్యానించారు.

‘‘ఎన్నికలకు ముందుగా ఓటర్లను విభజించేందుకు, మత కలహాలు రెచ్చగొట్టేందుకు పక్కా ప్రణాళికతో చేసిన దాడి ఇది’’ అని సిద్ధరామయ్య ఆరోపించారు.

తాజా ఘటనను ‘‘ఎన్నికల ముందు కుట్ర’’గా జేడీఎస్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి వ్యాఖ్యానించారు.

ఎన్నికల సమయంలో మతసామరస్యాన్ని దెబ్బ తీసేందుకు యత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఇటు ముఖ్యమంత్రిగాని, అటు హోం మంత్రిగాని ఈ ఘటనలపై స్పందించలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)