సీక్రెట్ : మనం చెప్పిన అబద్ధాలే మన రహస్యాలా?

సీక్రెట్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, డహ్లియా వెంచురా
    • హోదా, బీబీసీ న్యూస్ వరల్డ్

ఒక రహస్యం కంటే బరువైనది ఇంకేమీ ఉండదని 17వ శతాబ్దానికి చెందిన ఫ్రెంచ్ కవి జీన్ డి లా ఫైంటేన్ అన్నారు.

మనిషి జీవితంలో అలాంటి రహస్యాలపై అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీకి చెందిన సైకాలజిస్ట్ మిషెల్ స్లెపైన్ పదేళ్లుగా అధ్యయనం చేస్తున్నారు.

ఎన్నో రకాలుగా, ఎంతో మంది నుంచి స్లెపైన్ సమాచారం సేకరించారు. దాదాపు 26 దేశాలకు చెందిన సుమారు 50 వేల మందితో మాట్లాడారు.

వారి జీవితంలోని ఆంతరంగిక విషయాలను మిషెల్ లోతుగా పరిశీలించారు.

''నిజంగా మనుషులు ఇలా ఆలోచిస్తారా అని నా అధ్యయనంలో అనిపించింది'' అని స్లెపైన్ తెలిపారు.

''సీక్రెట్స్ గురించి ఆలోచిస్తున్నప్పుడు వాళ్లు భారంగా ఫీలవ్వడాన్ని స్పష్టంగా గమనించాను. అలాగే భౌతికంగా బరువు పెరిగినట్టుగా భారంగా అనిపిస్తుందని చాలా మంది చెప్పారు'' అని స్లెపైన్ అన్నారు.

సైకాలజిస్టుగా విషయాన్ని లోతుగా పరిశోధించాలని భావించిన స్లెపైన్, సీక్రెట్స్‌పై శాస్త్రీయ అధ్యయనం కోసం ప్రయత్నించారు. "అందులో మనకు నిజంగా ఏమీ తెలియదని ఆయన రియలైజ్ అయ్యారు."

అలాగని వాళ్లు ఏమీ చెప్పలేరని కాదు. కానీ, రహస్యాలు ఎలా ఉంటాయో తమకు తెలుసని సైకాలజిస్టులు భావిస్తారు. వాస్తవ ప్రపంచంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసుకోకుండా ల్యాబ్‌లో వాటిపై అధ్యయనం చేస్తారు.

''మన వద్ద కొన్ని సాధారణ ప్రశ్నలకు కూడా సంతృప్తికర సమాధానం లేదు. ఎలాంటి రహస్యాలు దాచేస్తారు? ఇతరులకు తెలియకుండా ఎలా ఉంచుతారు? సీక్రెట్స్ గుర్తొచ్చినప్పుడు ఏం జరుగుతుంది అనే ప్రశ్నలకు సమాధానం లేదు'' అని స్లెపైన్ తెలిపారు.

అందుకే వాటిని కనుక్కోవాలనుకున్నట్టు చెప్పారు.

సీక్రెట్

ఫొటో సోర్స్, Getty Images

అసలు సీక్రెట్ అంటే ఏంటి?

సీక్రెట్ అనేది వినడానికి మామూలుగానే ఉన్నా దాని గురించి ఆలోచించాల్సిందే. మనం వేటి గురించి అయితే మాట్లాడకూడదని అనుకుంటామే అవన్నీ రహస్యాలేనా?

''జీవితంలో మనకు ఎన్నో రకాల ఆలోచనలు, అనుభవాలు ఎదురవుతుంటాయి. వాటి గురించి పెద్దగా పట్టించుకోం. కానీ, అవన్నీ సీక్రెట్స్ అని కాదు''

కొన్ని విషయాలు అత్యంత సన్నిహితుల దగ్గర మాత్రమే చెప్పుకునేవి, మరికొన్ని నిర్దిష్ట ప్రదేశాల్లో వెల్లడించని, చర్చించని విషయాలు ఉంటాయి. '' కానీ, అవి ఎక్కువగా గోప్యంగా ఉంచాలనే భావనతో ఉంటాయి''

''ఏదైనా సమాచారాన్ని ఇతరులకు తెలియకుండా ఉద్దేశపూర్వకంగా దాచి ఉంచడాన్ని రహస్యంగా భావిస్తాను. ఎప్పుడైతే ఒక విషయం ఇతరులకు తెలియకుండా ఉంచాలని అనుకుంటామో అప్పుడు సీక్రెట్ అనేది పుడుతుంది'' అని స్లెపైన్ నిర్వచించారు.

మీరు మౌనంగా ఉండాల్సిన పరిస్థితిలో ఉన్నారా, లేదా అనే దానిపై అది ఆధారపడి ఉండదు.

''ఎందుకంటే, మామూలు సంభాషణల్లో దాచడానికి సీక్రెట్‌ ఏమీ లేకపోయినా, మీ వద్ద సీక్రెట్స్ ఏమీ లేవని కాదు.''

''అయితే, మాట్లాడుకునేటప్పుడు రహస్యాన్ని దాచాల్సిన సందర్భాలు కూడా అరుదుగా ఎదురవుతుంటాయి. కానీ, సీక్రెట్ గురించి తమలో తాము గుర్తు చేసుకోవడం, అదే విషయం గురించి ఆలోచిస్తూ ఉండడం సాధారణంగా జరిగే విషయమే'' అన్నారు.

సీక్రెట్

ఫొటో సోర్స్, Getty Images

సీక్రెట్స్ 38 రకాలు

సుమారు వెయ్యి మందిని సీక్రెట్లు అడగడంతో స్లెపైన్ తన అధ్యయనాన్ని ప్రారంభించారు.

ఎక్కువ మంది దాచిన ముఖ్యమైన 5 సీక్రెట్స్‌లో, మనం చెప్పే అబద్ధాలు ఇతరులకు తెలియకూడదని కోరుకునే వారే 69 శాతం మంది ఉన్నారు. ప్రేమ వ్యవహారాలు 61 శాతం మంది, శృంగారం గురించి 58 శాతం మంది, ఆర్థిక వ్యవహారాలను 58 శాతం మంది సీక్రెట్‌గా ఉంచేందుకు ఇష్టపడుతున్నారు.

''ఆ వెయ్యి మంది చెప్పిన వివరాలతో సీక్రెట్స్‌ను 38 విభాగాలుగా విభజిస్తూ ఓ లిస్టును రూపొందించారు.''

ఆ తర్వాత మరో వెయ్యి మందిని ఇదే విషయంపై ప్రశ్నించారు. వాళ్లు ఆ సీక్రెట్స్ లిస్టును సమర్థించారు.

''మీరు ఎలాంటి రహస్యాలను చెప్పకుండా దాచారని ప్రశ్నించగా, అందులో 92 శాతం సీక్రెట్స్ లిస్టులోని 38 విభాగాలకు చెందినవే ఉన్నాయి.

సీక్రెట్స్ లిస్టును చూపించి ప్రశ్నించగా, తమ సీక్రెట్స్ అన్నీ దాదాపు అందులో ఉన్నవేనని 97 శాతం మంది చెప్పారు. యావరేజ్‌గా 13 సీక్రెట్స్ లిస్టులో ఉన్నాయన్నారు'' అని స్లెపైన్ బీబీసీ ప్రపంచంతో చెప్పారు.

ఒక వ్యక్తిని మానసికంగా లేదా భౌతికంగా ఇబ్బంది పెట్టడం, తమకు తాము హాని చేసుకోవడం, డ్రగ్స్ వాడడం, దొంగతనం, ఇతరులకు సర్‌ప్రైజ్ ఇవ్వాలనుకోవడం వంటి 38 రకాల సీక్రెట్స్ ఈ లిస్టులో ఉన్నాయి.

సీక్రెట్

ఫొటో సోర్స్, Getty Images

పాజిటివ్ సీక్రెట్స్..

''ఆరోగ్యానికి హాని చేయనివి, మనలో ఉత్సాహం కలిగించే వాటిని పాజిటివ్ సీక్రెట్స్ అంటాను. అవి మనల్ని మెరుగుపరుస్తాయి. అవి మనల్ని ఉల్లాసంగా, ఉత్సాహంగా మారుస్తాయి. వివాహ ప్రతిపాదనలు, గర్భం దాల్చిన విషయాలకు సంబంధించిన సీక్రెట్స్. అవి మనకు సంతోషం కలిగించేవి''

ఇతరులకు చెప్పినా అర్థం చేసుకోలేరని దాచి ఉంచే సీక్రెట్స్ మరికొన్ని ఉంటాయి. చిన్నపిల్లల కార్టూన్లు చూడడం, ఉల్లాసం కలిగించే డ్రగ్స్ వాడడం వంటివి.

''అలాంటి సీక్రెట్స్‌ను దాచినప్పుడు మంచిగా ఫీల్ అవుతారు. అలాగే తాము తప్పుడు నిర్ణయాలు తీసుకోలేదని భావిస్తారు. తమ నిర్ణయాలు తాము తీసుకునే స్వేచ్ఛ, ఇతరుల నుంచి విముక్తి పొందడం వంటి విషయాలు ఇతరులకు తెలియాలని అనుకోకపోయినా, వాటిని దాచడం ద్వారా వారు సంతోషంగా ఫీల్ అవుతారు.''

అయితే, మనుషులు ఎలాంటి సీక్రెట్స్‌ను దాచి ఉంచుతారనేది స్లెపైన్ లక్ష్యం కాదు. ఒక సైకాలజిస్టుగా ఎలాంటి సీక్రెట్స్ మనుషులను భారంగా ఫీల్ అయ్యేలా చేస్తాయి. వాటి నుంచి బయటికి తీసుకొచ్చి వారిపై భారం తగ్గించడమెలా అనే విషయాలపై స్లెపైన్, ఆయన బృందం అధ్యయనం చేసింది.

అందరి నుంచి సమాచారం సేకరించిన తర్వాత స్లెపైన్, అతని టీమ్ ఆ డేటాను విశ్లేషించడం మొదలుపెట్టింది.

తమ అధ్యయనంలో తేలిన 38 రకాల సీక్రెట్స్‌ను ప్రాధాన్య క్రమంలో చేర్చడంతో పాటు, అందులో కనిపించని విషయాలను విశ్లేషించేందుకు 3 డైమెన్షనల్ మ్యాప్‌ను రూపొందించింది.

ఆ సీక్రెట్స్‌ను ప్రాధాన్యతా క్రమంలో ఉంచాలని సాధారణ వ్యక్తులను అడిగినప్పుడు, స్లెపైన్ ప్రధానంగా మూడు విషయాలను గుర్తించారు. సీక్రెట్స్ గురించి ఆలోచించడం వల్ల హాని కలగడం తప్ప వేరే ప్రయోజనం లేదని భావించడమే అందుకు కారణంగా తేలింది.

'' ఒక నైతిక పరమైన విషయానికి సంబంధించిన సీక్రెట్ బయటపడితే సిగ్గుపడాల్సి రావడం.

ఏదైనా బంధానికి సంబంధించిన సీక్రెట్ (మరొకరి ప్రమేయం ఉండడం) బయటకు చెబితే ఒంటరి కావడం.

మన లక్ష్యాలు, కోరికలు మరొకరికి తెలిస్తే అభద్రతాభావానికి గురవడం, లేదా ఏం చేయాలో తెలియకపోవడం.'' వంటి కారణాలతో కొన్ని విషయాలను సీక్రెట్‌గా ఉంచడానికి కారణాలుగా స్లెపైన్ గుర్తించారు.

సీక్రెట్స్ మనల్ని సిగ్గుపడేలా, అందరి నుంచి వేరు చేసేలా, నిజాయితీ లేని వ్యక్తిగా ఫీల్ అయ్యేలా చేస్తాయని తేలింది.

అయితే, తమను బాధపెట్టిన ఒక సీక్రెట్.. దానిని మరింత సమర్థంగా ఎదుర్కొనేలా, దాన్ని పరిష్కరించుకునేందుకు కొత్త దారి వెతుక్కునేలా చేసిందని దాదాపు 95 శాతం మంది అభిప్రాయపడినట్టు మిషెల్ తెలిపారు.

గతంలో చేసిన తప్పులు మళ్లీ చేయకుండా తమ ప్రవర్తనలో మార్పు రావడం, సీక్రెట్ చెబితే ఎక్కడ మనం ప్రేమించే వ్యక్తులు బాధపడతారని చెప్పకుండా ఉండడం మరింత కష్టమని, చెప్పేయడం వల్ల రిలీఫ్‌గా ఫీల్ అవుతారని తేలింది.

సీక్రెట్

ఫొటో సోర్స్, Getty Images

సీక్రెట్స్ భారం తగ్గించే సీక్రెట్

''మీ వద్ద ఇబ్బందికరమైన రహస్యాలు ఉంటే బయటికి చెప్పేయడం, ఒప్పుకోవడం వంటివి ప్రేరణనిస్తాయి.

అయితే అది అన్నిసార్లూ సాధ్యం కాదు. సీక్రెట్స్ చెప్పేయడం వల్ల నిజాయితీగా మనం ఫీల్ అయినా.. అది ఎదుటి వ్యక్తులపై తీవ్ర ప్రభావం చూపించొచ్చు. లేదా ఎలాంటి ఇబ్బందులు తొలగిపోకపోగా నిందలు పడాల్సి రావొచ్చు.

అలా అని, చెప్పకుండా ఉండాలనుకోవడం కూడా సరికాదు.

ఒక సీక్రెట్ గురించి ఎక్కువగా ఆలోచించడమంటే హానికరమైన మార్గాలను కనుగొనడమేనని, సీక్రెట్ గురించి ఎవరితో చర్చించకపోవడం వల్ల కలిగే సమస్య ఇదే'' అని స్లెపైన్ నొక్కి మరీ చెప్పారు.

సొంతంగా ఎలాంటి పరిష్కారం దొరకనప్పుడు సీక్రెట్స్ గురించి ఇతరులతో మాట్లాడడం ద్వారా వాటి భారం తగ్గించుకోవచ్చు. మనం సీక్రెట్స్ గురించి చర్చించినప్పుడు ఇతరుల మద్దతు లభించే అవకాశం ఉంది.

అయితే, అలా చెప్పేముందు అది కేవలం మీ ఒక్కరికి సంబంధించిన విషయం మాత్రమే కాదనే విషయం గుర్తుంచుకోవాలి. అలాగే ఇతరులను మన సమస్యలోకి లాగేలా ఉండకూడదు.

''సీక్రెట్స్ పంచుకునేందుకు సరైన వ్యక్తిని ఎంపిక చేసుకోవాలి. వారితో సీక్రెట్స్ పంచుకోవడం ద్వారా అంతకు ముందున్న భారం తగ్గించుకోవచ్చు''.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)