బంగారం అమ్మకాలు, కొనుగోళ్ల మీద ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనలు అమలు.. వీటిపై ఆందోళనలు ఎందుకు వ్యక్తమవుతున్నాయి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, పవన్ కాంత్ దిగవల్లి
- హోదా, బీబీసీ ప్రతినిధి
రెండు గ్రాములకు మించి బంగారం కొనాలన్నా, అమ్మాలన్నా హాల్‌మార్కింగ్ తప్పనిసరి అంటూ కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనలను అమలు చేయనుంది. హాల్‌మార్క్ లేని బంగారు అమ్మకాలు, కొనుగోళ్లు ఏప్రిల్ 1 నుంచి నిషేధం.
బంగారం హాల్‌మార్కింగ్ విధానంతో అమ్మకాలను, కొనుగోళ్లను కేంద్ర ప్రభుత్వం ట్రాక్ చేయగలదు.
బంగారం కొనుగోళ్లలో మోసపోతున్న వినియోగదారులను ఈ నూతన హాల్‌మార్కింగ్ విధానం రక్షిస్తుందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలశాఖ అదనపు కార్యదర్శి నిధి ఖరే చెప్పారు.
హాల్‌మార్కింగ్ అంటే ఏమిటి?
మీరు కొనే బంగారం స్వచ్ఛత, నాణ్యతలను నిర్ధరించేదే హాల్‌మార్క్. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలశాఖ పరిధిలోని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) చట్టానికి లోబడి భారత్‌లో 2000వ సంవత్సరం నుంచి బంగారానికి, వెండికి హాల్‌మార్కింగ్ చేస్తున్నారు.
ప్రస్తుతం నాలుగు అంకెల, ఆరు అంకెల హాల్‌మార్కింగ్ నడుస్తోంది. ఇలా రెండు వేర్వేరు పద్ధతులు అనుసరిస్తుండటంతో వినియోగదారుల్లో గందరగోళం ఏర్పడుతోంది. కొత్త విధానంతో ఈ సమస్య ఉండదు.
నూతన నిబంధనల ప్రకారం అక్షరాలు, అంకెలు కలిసి ఉండే (ఆల్ఫా న్యూమరిక్) సిక్స్ డిజిట్ హాల్‌మార్కింగ్ తప్పనిసరి. దీనినే హాల్‌మార్క్ యునీక్ ఐడెంటిఫికేషన్ (HUID) అంటారు.

ఫొటో సోర్స్, World Gold Council Hallmark
హాల్‌మార్కింగ్ ఎవరు చేస్తారు?
బంగారం లేదా బంగారు ఆభరణాలను పరీక్ష చేయడానికి భారత ప్రభుత్వం సర్టిఫై చేసిన హాల్‌మార్కింగ్ కేంద్రాలుంటాయి. ఇవి ఒకరకంగా బంగారాన్ని పరీక్షించే లేబొరేటరీల్లాంటివి. ఈ కేంద్రాలకు బంగారు దుకాణదారులు బంగారాన్ని తీసుకెళ్లి ముందుగా అది ఎన్ని కేరట్ల బంగారమో డిక్లేర్ చేయాలి. తర్వాత ఆ బంగారాన్ని పరీక్షిస్తారు. ఇతర లోహాలను వేరు చేసి బంగారం స్వచ్ఛతను, నాణ్యతను లెక్కిస్తారు.
బంగారు దుకాణానికి చెందిన నంబరు, హాల్‌మార్కింగ్ పరీక్షా కేంద్రానికి చెందిన నంబరు కలిపి లేజర్ ప్రింటింగ్ ద్వారా బంగారంపైన యునీక్ ఐడెంటిఫికేషన్ నంబర్ వేస్తారు. బీఐఎస్ ముద్ర, బంగారం స్వచ్ఛత, నాణ్యత వివరాల ముద్ర కూడా ఉంటాయి.

ఫొటో సోర్స్, Srivivas Lakkoju
హాల్‌మార్కింగ్ ఉపయోగాలేంటి?
బంగారం స్వచ్ఛతను, నాణ్యతను హాల్‌మార్కింగ్ నిర్ధరిస్తుంది కాబట్టి వినియోగదారుకు భరోసా కలుగుతుంది.
బంగారం కొనాలంటే మనలో ఎన్నో ప్రశ్నలు మెదులుతుంటాయి. నాణ్యమైన బంగారాన్నే కొంటున్నామా? దుకాణదారు మోసం చేస్తున్నారా? తక్కువ రకం బంగారానికి మన దగ్గర ఎక్కువ డబ్బు లాగేస్తున్నారా?- ఇలా అనేక ప్రశ్నలు వస్తుంటాయి. తరచూ 18 కేరట్ల బంగారాన్ని 22 కేరట్ల బంగారమని చెప్పి మనకు అమ్మేస్తూ ఉంటారు.
ఉదాహరణకు కొంత కాలం క్రితం ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని బంగారు దుకాణాల్లో తూనికలు, కొలతల శాఖ అధికారులు సోదాలు నిర్వహించినపుడు ఇలాంటి మోసాలు చాలా బయటపడ్డాయి.
ఆభరణాల బరువును కొలిచే పద్ధతుల్లో అవకతవకలకు పాల్పడుతున్నారని ఆరోపణలతో చాలా దుకాణదారులపై కేసులు నమోదయ్యాయి. ఇలాంటి మోసాలకు హాల్‌మార్కింగ్ అడ్డుకట్ట వేస్తుంది.
హాల్‌మార్కింగ్‌లో మోసాలుంటాయా?
హాల్‌మార్కింగ్‌ను టాంపర్ చేస్తూ ఫేక్ గోల్డ్ అమ్మకాలు జరిపిన ఘటనలూ భారత్‌లో జరిగాయి. ఫేక్ హాల్‌మార్కింగ్ ఉన్న బంగారాన్ని కొని మోసపోయిన వినియోగదారులున్నారు. కాబట్టి బంగారు ఆభరణాలపైన హాల్‌మార్కింగ్ నిజమైనదేనా, కాదా అనే అనుమానం కొనుగోలుదారుల్లో సహజంగానే ఉంటుంది. అందుకే మనం కొనే ఆభరణాల హాల్‌మార్కింగ్‌ను మనమే నేరుగా వెరిఫై చేయొచ్చు.
హాల్‌మార్కింగ్‌ను వెరిఫై చేయడం ఎలా?
హాల్‌మార్కింగ్‌ను వెరిఫై చేసుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన BIS Care appని మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. దుకాణాల్లో బంగారాన్ని కొనే ముందు, దాని మీద ముద్రించిన యునీక్ ఐడెంటిఫికేషన్ నంబర్‌ను అందులో ఎంటర్ చేసి, అది నిజమైన హాల్‌మార్కేనా, కాదా అనేది నిర్ధరించుకోవచ్చు.

ఫొటో సోర్స్, Srivivas Lakkoju
విమర్శలు ఏమిటి?
నూతన హాల్‌మార్కింగ్ నిర్ణయం బడా కార్పొరేట్ కంపెనీలకే మేలు చేస్తుందనే ఆందోళన చిన్న తరహా బంగారు వ్యాపారుల్లో వ్యక్తమవుతోంది.
హాల్‌మార్కింగ్‌పైన రాష్ట్ర స్థాయిల్లోని చిన్న, మధ్య తరహా బంగారు వర్తక సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. హాల్‌మార్కింగ్‌ను స్వాగతిస్తూనే హెచ్‌యూఐడీ విషయంలో వ్యతిరేకత ఉందంటున్నాయి.
"మా వద్ద వినియోగదారులు కొనే ప్రతీ వస్తువుకూ హాల్‌మార్కింగ్ వేయించాలంటే ఎలా కుదురుతుంది" అని తూర్పు గోదావరి జిల్లా సువర్ణ వర్తక సంఘం కార్యదర్శి గంటా ప్రకాశ్ ప్రశ్నించారు.
పట్టణాలు, గ్రామాల్లోని ప్రజలు సాధారణంగా తమ వద్దనున్న పాత బంగారాన్ని తీసుకొచ్చి బంగారం దుకాణాల్లో మార్చుకోవడం లేదా, మరికొంత బంగారం దానికి జోడించి ఏదైనా వస్తువు చేయించుకోవడం జరుగుతుంటుంది. మరి గ్రామీణ ప్రజలు బంగారం దుకాణాల్లో మార్చుకొనే బంగారానికి హాల్‌మార్కింగ్ ఎలా చేయించాలని కొందరు వ్యాపారులు అడుగుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.
అమ్ముడైన వస్తువుల్లో మార్పులు కష్టమా?
కొత్త హాల్‌మార్కింగ్ విధానం బంగారు వ్యాపారులకు మేలే చేస్తుందని ఇండియా బులియన్ అండ్ జువెల్లర్స్ అసోసియేషన్ అంటోంది.
"ఈ నిర్ణయంతో దేశంలోని బంగారు వ్యాపారులపైన సానుకూల ప్రభావమే పడుతుంది. ఇంకా రిజిస్టర్ కాని వేల బంగారం దుకాణాలన్నీ తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకుంటాయి. బంగారం కొనాలనుకునే వినియోగదారుల్లో బంగారు వ్యాపారులపై నమ్మకం పెరుగుతుంది'' అని ఆ అసోసియేషన్‌కు చెందిన తాన్యా రస్తోగీ చెప్పారు.
హెచ్‌యూఐడీ కారణంగా అమ్ముడైన బంగారంలో చిన్న చిన్న మార్పులు చేయడానికి, మరమ్మతు చేయడానికి వీలు కాదని తాన్యా రస్తోగీ అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఏం చేయాలనేదానిపై ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు.
హెచ్‌యూఐడీ వల్ల హాల్‌మార్కింగ్ కేంద్రాల్లో ఆలస్యం జరుగుతుందని, దీనివల్ల వినియోగదారులకు వస్తువులను సమయానికి ఇవ్వలేకపోతున్నామని కొందరు బంగారం వ్యాపారులు చెబుతున్నారు.
ఇలాంటి అనేక అభ్యంతరాలపై ఆల్ ఇండియా జ్యువెల్లర్స్ అండ్ గోల్డ్‌స్మిత్ ఫెడరేషన్(ఏఐజేజీఎఫ్) సభ్యులు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలశాఖతో చర్చలు జరిపారు. నూతన హాల్‌మార్కింగ్ నిబంధనల అమలు చేసే ముందు కొంత గడువు ఇవ్వాలని గత ఏడాది ప్రభుత్వాన్ని ఫెడరేషన్ కొరింది.

ఫొటో సోర్స్, Getty Images
అధికారులు ఏమంటున్నారు?
కొత్త హాల్‌మార్కింగ్ నిబంధనలతో గ్రామీణ ప్రాంతాల్లో వినియోగదారులకు చాలా మేలు జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ తూనికలు, కొలతల శాఖ జాయింట్ కంట్రోలర్ బి.రామ్ కుమార్ చెప్పారు.
"సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో చిన్నస్థాయి బంగారు వ్యాపారులు కేరట్లను నిర్దిష్టంగా చెప్పరు. అందుకు కావాల్సిన తూచే యంత్రాలు కూడా వాడరు. దాంతో బంగారం కొనే వినియోగదారును గ్రామీణ ప్రాంతాల్లో చాలా తేలికగా మోసం చేయగలరు. ఇప్పుడీ కొత్త హాల్‌మార్కింగ్ వల్ల అలాంటి మోసాలన్నీ తగ్గిపోతాయి" అని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- కేజీఎఫ్: రియల్ రాకీ భాయ్ ‘‘థంగం రౌడీ’’ ఎవరు? ఆయన్ను ‘‘జూనియర్ వీరప్పన్’’ అని ఎందుకు పిలుస్తారు?
- పాత బ్యాటరీల్లో దాగిన లోహ సంపద - రష్యా నుంచి సరఫరా తగ్గడంతో రీసైక్లింగే పరిష్కారమా
- బంగారం కొంటున్నారా? మోసపోకుండా ఉండేందుకు మీరు తెలుసుకోవాల్సిన 8 అంశాలివే...
- కళ్లు ఎందుకు అదురుతాయి? మీ ఆరోగ్యం గురించి మీ కళ్లు ఏం చెప్తున్నాయో తెలుసుకోండి...
- 10 తులాల బంగారం పోయింది.. ఎలుకల సాయంతో ఎలా పట్టుకున్నారంటే
- నిజాం రాజుల దగ్గర ఉన్న 12 కేజీల భారీ బంగారు నాణెం ఇప్పుడు ఎక్కడుంది?
- పెట్రోల్-డీజిల్ ధరలు: కర్ణాటక బోర్డర్ వద్ద ఏపీ పెట్రోలు బంకులు ఎందుకు మూతపడుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














