ప్రియాంక చోప్రా: ‘‘నన్ను బాలీవుడ్‌లో కావాలనే పక్కన పెట్టారు... అక్కడ రాజకీయాలు తట్టుకోలేక పోయాను’’

ప్రియాంక చోప్రా

ఫొటో సోర్స్, Priyanka Chopra/Facebook

బాలీవుడ్ రాజకీయాలకు విసిగి పోయి తాను హిందీ సినిమాలకు దూరం అయ్యానని ప్రియాంక చోప్రా అన్నారు.

హిందీ సినిమాల్లో తనకు వచ్చే పాత్రలు సంతోషం కలిగించలేదని అమెరికా పాడ్‌క్యాస్ట్ కార్యక్రమం 'ఆర్మ్‌చైర్ ఎక్స్‌పర్ట్'లో మాట్లాడుతూ ఆమె చెప్పారు.

బాలీవుడ్‌ను వదిలేసి హాలీవుడ్‌లో అడుగు పెట్టడం, భారత్ నుంచి అమెరికాకు వెళ్లిపోవడం, నిక్ జోనస్‌తో ప్రేమ వంటి విషయాల మీద ప్రియాంక చోప్రా మాట్లాడారు.

"బాలీవుడ్ నుంచి బయటకు వెళ్లాలని చూస్తున్న తరుణంలో సంగీతం రూపంలో నాకో అవకాశం దొరికింది. ప్రపంచాన్ని తెలుసుకొనేందుకు మార్గం లభించింది.

బాలీవుడ్‌లో నాకు వచ్చే పాత్రలు సంతోషాన్ని ఇవ్వలేదు. అలాంటప్పుడు పాటలు పాడే అవకాశం వచ్చింది. దాంతో బాలీవుడ్‌ను వదిలేసి అమెరికా వెళ్లిపోయాను" అని ప్రియాంక అన్నారు.

ఆర్మ్‌చైర్ ఎక్స్‌పర్ట్ బృందంతో ప్రియాంక చోప్రా

ఫొటో సోర్స్, Armchair Expert Podcast/Twitter

ఫొటో క్యాప్షన్, ఆర్మ్‌చైర్ ఎక్స్‌పర్ట్ బృందంతో ప్రియాంక చోప్రా

2012లో 'మై సిటీ'తో ఆమె సింగర్‌గా కెరియర్ ప్రారంభించారు.

2018లో హాలీవుడ్ యాక్టర్, సింగర్ నిక్ జోనస్‌ను ప్రియాంక పెళ్లి చేసుకున్నారు. వారు అక్కడే స్థిరపడ్డారు.

బాలీవుడ్‌లో తనను "పక్కన పెట్టేశారని" ప్రియాంక చోప్రా అన్నారు.

"నేను ఇంత వరకు ఈ విషయం ఎక్కడా చెప్పలేదు. మీ వద్ద నేను చాలా సేఫ్‌గా ఫీలవుతున్నాను. కాబట్టి ఆ విషయాన్ని చెబుతాను.

సినిమా పరిశ్రమ(బాలీవుడ్)లో నన్ను పక్కకు నెట్టేశారు. కొన్ని కారణాల వల్ల కొందరు నాకు అవకాశాలు ఇవ్వలేదు. నాకు కొందరితో వివాదాలు ఉన్నాయి. ఆ రాజకీయాలు చేయడం నా వల్ల కాలేదు. అందువల్ల బ్రేక్ తీసుకోవాలని అనుకున్నా. ప్రపంచంలోని మరొక భాగాన్ని చూసే అవకాశం సంగీతం నాకు ఇచ్చింది" అని ఆమె తెలిపారు.

2011లో 'దేశీహిట్స్' కోసం ప్రియాంకతో యూనివర్సల్ మ్యూజిక్ గ్రూప్ ఒప్పందం కుదుర్చుకుంది.

40ఏళ్ల ప్రియాంక చోప్రా ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు. అక్కడ వెబ్‌ సిరీస్‌లు, టీవీ షోలలో నటిస్తున్నారు. హాలీవుడ్ సినిమాల్లోనూ ఆమెకు అవకాశాలు వస్తున్నాయి.

1982లో పుట్టిన ప్రియాంక చోప్రా 2000 సంవత్సరంలో మిస్ వరల్డ్‌గా ఎంపికయ్యారు. తండ్రి భారత సైన్యంలో డాక్టర్ కావడంతో ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఆమె విద్యాభ్యాసం కొనసాగింది.

మిస్ వరల్డ్‌గా గెలిచిన తరువాత ఆమెకు సినిమా అవకాశాలు రావడం మొదలైంది. 2002 నుంచి ఆమె సినిమాల్లో నటించడం ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)