బండి సంజయ్ అరెస్ట్: పదోతరగతి ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ఏ-1గా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు.. అసలేం జరిగింది?

ఫొటో సోర్స్, Facebook/Bandi Sanjay Kumar
- రచయిత, ప్రవీణ్ శుభం
- హోదా, బీబీసీ కోసం
తెలంగాణ పదోతరగతి పరీక్ష పేపర్ల లీక్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ఈ కేసులో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను ఏ-1 నిందితునిగా వరంగల్ పోలీసులు తమ రిమాండ్ రిపోర్ట్‌లో చూపించారు. బండి సంజయ్‌ను హన్మకొండ అదాలత్ కోర్ట్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు.
మంగళవారం అర్ధరాత్రి కరీంనగర్‌లో బండి సంజయ్ అరెస్ట్ , ఆ తర్వాత బొమ్మల రామారం పోలీస్ స్టేషన్‌కు తరలింపు, బుధవారం హన్మకొండ కోర్ట్‌లో హాజరుపరచడం, కోర్టు ఆయన్ను 14 రోజుల రిమాండ్‌కు పంపడం వరకు పరిస్థితులు వేగంగా మారుతూ వచ్చాయి.

కేసు పూర్వాపరాలు
వరంగల్ జిల్లా కమలాపూర్ ప్రభుత్వ బాలుర పాఠశాల పరీక్ష కేంద్రం నుంచి మంగళవారం పదోతరగతి హిందీ పరీక్ష పేపర్ లీక్ అయింది. దీనిపై పాఠశాల హెడ్మాస్టర్ ఫిర్యాదు మేరకు కమలాపూర్ పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశారు.
దీనిపై ఐపీసీ 420-4(ఏ), తెలంగాణ పబ్లిక్ ఎగ్జామినేషన్ ( ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీసింగ్), ఐటీ యాక్ట్‌ల కింద కేసు నమోదైంది.
ఈ కేసులో మంగళవారం బూరం ప్రశాంత్ అనే మాజీ జర్నలిస్ట్‌తోపాటు మరో యువకున్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ కేసు నేపథ్యంలో బుధవారం కరీంనగర్ టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో బండి సంజయ్‌పై ఐపీసీ 151 సెక్షన్ కింద పోలీసులు సూమోటో కేసు నమోదు చేశారు.
కమలాపూర్ కేసులో ఈ రోజు బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ నుంచి వరంగల్ కమిషనరేట్ పోలీసులు బండి సంజయ్‌ను వరంగల్ తీసుకువచ్చి అదాలత్ కోర్ట్‌కు తీసుకువచ్చారు.
బుధవారం కోర్టుకు సెలవు కావడంతో మెజిస్ట్రేట్ ఇంటి వద్ద హాజరుపరిచారు.

ఫొటో సోర్స్, UGC
రిమాండ్ రిపోర్ట్‌లో ఏముంది?
వరంగల్ న్యాయస్థానంలో పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్ ప్రకారం... ఐపీసీ 120(బి), 420, 447, 505(1)బీ, మాల్ ప్రాక్టీసెస్ యాక్ట్ 4 4(ఏ), ఐటీ యాక్ట్‌ల కింద మొత్తం 9 మందిపై కేసు నమోదు చేసారు. వీరిలో ఒకరు మైనర్ బాలుడు. నిందితుల్లో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
కమలాపూర్ పరీక్ష కేంద్రం నుంచి పేపర్‌ను ఫోన్‌లో ఫోటో తీసి, ఆ తర్వాత సోషల్ మీడియాలో వైరల్ చేయడం ద్వారా తెలంగాణలో గందరగోళ పరిస్థితులు, శాంతిభద్రతల సమస్య సృష్టించాలనే, ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే కుట్ర దీని వెనుక దాగి ఉందని రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు ఆరోపించారు.
పేపర్‌ను ఫోటో తీసుకున్నాక ఎమ్మెల్యే ఈటల రాజేందర్, బండి సంజయ్ సహా పలువురు బీజేపీ నాయకులకు, జర్నలిస్టులకు ఫార్వర్డ్ చేసారని రిపోర్ట్‌లో తెలిపారు.

‘‘నిష్పక్షపాతంగా విచారణ జరిపాం’’
ఈ కేసు దర్యాప్తు వివరాలను వరంగల్ పోలీసు కమిషనర్ ఏవీ రంగనాథ్ మీడియాకు వివరించారు.
ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని, ప్రజలను అయోమయంలో పడేసి పరీక్షల నిర్వహణ వ్యవస్థపై అపనమ్మకం కలిగించాలని బండి సంజయ్ కుట్ర పన్నారని ఆయన చెప్పారు.
"పరీక్ష పేపపర్ల లీక్‌కు ముందు రోజు ఏ-2 నిందితుడు బూరం ప్రశాంత్.. బండి సంజయ్‌తో చాలా సార్లు వాట్సప్ చాట్ , కాల్స్ చేశారు. లభించిన ఆధారాల ఆధారంగా బండి సంజయ్ డైరెక్షన్‌లోనే పేపర్ లీక్ జరిగిందని భావిస్తున్నాం. ఇదంతా ఒక గేమ్ ప్లాన్‌లా సాగింది. దీని వెనుక కుట్ర ఉంది. ఏ-2 నిందితుడు బూరం ప్రశాంత్.. బండి సంజయ్‌కు సోషల్ మీడియా అడ్వైజర్‌గా వ్యవహరిస్తున్నాడని మా విచారణలో తేలింది. వారిద్దరి మధ్య నడిచిన వాట్సప్ చాట్‌ల ప్రకారం కుట్ర పూరితంగానే పేపర్ బయటకు వచ్చేలా చేసినట్లు తేలింది. అందుకే బండి సంజయ్‌ను ఏ-1 నిందితునిగా చేర్చాం’’ అని రంగనాథ్ అన్నారు.
పార్టీలకతీతంగా నిష్పక్షపాతంగా విచారణ జరుగుతోందని, బలమైన ఆధారాల వల్లే బండి సంజయ్‌ను ఏ-1 గా చేర్చామని రంగనాథ్ తెలిపారు.

ఫొటో సోర్స్, AP
బండి సంజయ్ ఫోన్‌లో కీలక ఆధారాలు: పోలీసులు
ఈ కేసు విచారణలో బండి సంజయ్ సెల్ ఫోన్ కీలకంగా మారిందని పోలీసులు చెబుతున్నారు.
ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా బండి సంజయ్ ఫోన్‌ను అడిగామని, అయితే తన వద్ద ఫోన్ లేదని ఆయన చెప్పారని రంగనాథ్ వివరించారు. బండి సంజయ్ ఫోన్ లభిస్తే కీలకమైన ఆధారాలు బయటపడతాయని తెలిపారు.
‘‘ఫోన్ ఇస్తే కీలకమైన సమాచారం వస్తుందని ఆయనకు తెలుసు. ఫోన్ దొరక్కపోతే సర్వర్లు, సర్వీస్ ప్రొవైడర్ల సహకారంతో డేటా సేకరిస్తాం. ఇన్వెస్టిగేషన్‌కు మరికొన్ని రోజులు సమయం పడుతుంది’’ అని రంగనాథ్ తెలిపారు.
నిబంధనల ప్రకారమే బండి సంజయ్‌ను అరెస్ట్ చేశామని, సీఆర్పీసీ 41 సెక్షన్ ప్రకారం వారెంట్ లేకుండా అరెస్ట్ చేయవచ్చని ఆయన చెప్పారు. బండి సంజయ్ అరెస్ట్ విషయాన్ని లోక్ సభ స్పీకర్ కార్యాలయానికి తెలియజేశామని వివరించారు.
బండి సంజయ్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారని సోషల్ మీడియాలో ఆరోపణలు వస్తున్నాయని, అయితే చట్ట ప్రకారమే అరెస్ట్ చేశామని రంగనాథ్ మీడియా సమావేశంలో తెలిపారు.

బీజేపీ ఆందోళనలు
బండి సంజయ్ అరెస్ట్‌పై మంగళవారం అర్ధరాత్రి నుండి బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ వద్ద బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావ్‌ను పోలీసులు అదుపులో తీసుకున్నారు. పార్టీ ఎమ్మెల్యే లు ఈటల రాజేందర్, రాజా సింగ్ ( సస్పెండెడ్ ఎమ్మెల్యే) లను అరెస్ట్ చేశారు.
బండి సంజయ్ అరెస్ట్‌నుబీజేపీ జాతీయ కార్యదర్శి బీఎల్ సంతోష్ ఖండించారు. బీఆర్ఎస్ మునిగిపోయే నావ అని, రాజకీయంగా ఆ పార్టీ సమాధి అయ్యే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు.
దిల్లీలో పార్లమెంట్ ఆవరణలో బీజేపీ ఎంపీలు ప్లకార్డులతో నిరసన చేపట్టారు.
"కొంత కాలంగా తెలంగాణలో లీకేజీలు, ప్యాకేజీల వ్యవహారం నడుస్తోంది. ఈ వ్యవహారాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే బండి సంజయ్‌ను అరెస్ట్ చేశారు’’అని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు.
ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలు, జర్నలిస్టుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజాస్వామ్య పద్ధతిలో దీన్ని ఎదుర్కొంటామని లక్ష్మణ్ అన్నారు.
బండి సంజయ్ అరెస్ట్‌పై పార్లమెంట్ హక్కుల కమిటీకి ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపూరావు ఫిర్యాదు చేశారు.
బండి సంజయ్ ఏమన్నారు?
‘’బీఆర్ఎస్‌లో భయం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే నన్ను అరెస్ట్ చేశారు. అయితే ప్రశ్నించడాన్ని ఆపేది లేదు’’అని బండి సంజయ్ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న సమయంలో తన ఇంట్లోకి అక్రమంగా చొరబడి అరెస్ట్ చేశారని లోక్‌సభ స్పీకర్ కార్యాలయానికి బండి సంజయ్ ఫిర్యాదు చేశారు.
అశాంతి రేపేందుకు కుట్ర చేస్తున్నారు: బీఆర్ఎస్
ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో అశాంతిని రేపేందుకు బండి సంజయ్ ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపించింది.
‘’సంక్షేమ కార్యక్రమాలతో పచ్చగా ఉన్న తెలంగాణలో చవకబారు ఎత్తుగడలతో పాగా వేసేందుకు బీజేపీ చిచ్చు పెడుతోంది’’ అని కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. బాధ్యతగల పదవిలో ఉన్న బండి సంజయ్ తనకు ప్రశ్నాపత్రం చేరిన వెంటనే పోలీసులకు సమాచారం అందించకుండా కుట్ర పూరితంగా వ్యవహరించారని విమర్శించారు.
విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేసే కుట్ర చేసినందుకే బండి సంజయ్‌ను అరెస్ట్ చేశారని మరో మంత్రి హరీశ్ రావ్ చెప్పారు. ఎంపీగా ఆయనపై అనర్హత వేటు వేయాలలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు.
ప్రధాని పర్యటన నేపథ్యంలో రాజకీయ దుమారం
బీఆర్ఎస్, బీజేపీల మధ్య నెలకొన్న రాజకీయ ఘర్షణ నేపథ్యంలో ఏప్రిల్ 8న ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
హైదరాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ ప్రెస్ ప్రారంభం, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నవీకరణతోపాటు పలు కార్యక్రమాల్లో మోదీ పాల్గొననున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఐపీఎల్ 2023: టోర్నీని రసవత్తరంగా మార్చబోతున్న 'ఇంపాక్ట్ ప్లేయర్' రూల్ ఏంటి?
- సెమాగ్లుటైడ్: బరువు తగ్గించే ఈ ఇంజెక్షన్‌కు అంత డిమాండ్ ఎందుకు?
- తెలంగాణ: ఆదివాసీలు పరిశ్రమలు పెట్టేందుకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం పొందడం ఎలా?
- ‘‘ఆయన నాలుగేళ్లుగా నీళ్లు పోసుకోలేదు... అడవిలోనే ఒంటరి జీవితం... అటవీ ఏనుగులున్నా భయపడలేదు’’
- 'జీన్ ఎడిటెడ్ ఫుడ్' అంటే ఏంటి? అది తినడం ఆరోగ్యానికి మంచిదేనా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















