తెలుగు రాష్ట్రాల్లో కోళ్ల ఫారాలు ఎందుకు మూతపడుతున్నాయి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
పౌల్ట్రీ రంగంలో తెలుగు రాష్ట్రాలది తిరుగులేని స్థాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఈ రంగంలో ముందుండేది. రాష్ట్ర విభజన తర్వాత గుడ్లు ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ టాప్‌లో ఉంటే, తెలంగాణ తృతీయ స్థానంలో ఉంది.
కోడి మాంసం ఉత్పత్తలో ఏపీ మూడో స్థానంలో ఉంటే తెలంగాణ టాప్ 7లో నిలుస్తోంది.
2022 నాటి కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం పౌల్ట్రీలో అత్యధిక పెట్టుబడులు వచ్చిన రాష్ట్రాల్లో కూడా ఏపీ, తెలంగాణ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.
పౌల్ట్రీ ఉత్పత్తుల్లో ముందంజలో నిలవడంతో ఈ రంగంలో లక్షల మందికి ఉపాధి లభిస్తోంది. మొత్తంగా ఉభయ రాష్ట్రాల్లో 10 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
కానీ పరిస్థితి మారుతోంది. ప్రస్తుతం పౌల్ట్రీ పరిశ్రమ తిరగోమనం బాట పడుతోంది. వందల కొద్దీ పరిశ్రమలు మూతపడుతున్నాయి. ఇప్పటికే చిన్న, మధ్య తరహా పౌల్ట్రీ యూనిట్లు వేలాదిగా మూసివేశారు. మరిన్ని అదే బాటలో ఉన్నాయని యజమానులు చెబుతున్నారు
కరోనా ముందు వరకూ గుడ్లు, కోడిమాంసం ఎగమతుల్లో దేశానికే తలమానికంగా నిలిచిన తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిస్థితి ఎందుకొచ్చింది?

దేశవ్యాప్తంగా గుర్తింపు
గుడ్లు, కోడి మాంసం ఉత్పత్తిలో తెలుగు నేలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ముఖ్యంగా ఒడిశా, బిహార్, జార్ఖండ్, అస్సాం వంటి రాష్ట్రాలకు ఎక్కువగా గుడ్లు ఎగుమతి జరిగేవి.
2022 నాటి అధికారిక సమాచారం ప్రకారం దేశంలో ఉత్పత్తి అయ్యే గుడ్లలో ఒక్క ఏపీనే 20.45 శాతం ఉత్పత్తి చేస్తోంది. తెలంగాణలో 12.98 శాతం గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ మొత్తం కోడిగుడ్లలో 20 శాతం మాత్రమే స్థానిక అవసరాలకు వినియోగించగా, 80 శాతం ఎగుమతులు అయ్యేవి.
తెలుగు వారికి చెందిన వెంకటేశ్వర హేచరీస్, శ్రీనివాస హేచరీస్ వంటి సంస్థలు పలు రాష్ట్రాలకు విస్తరించడం, నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ (నెక్)లో తెలుగు వారు పలు కీలక పదవులు నిర్వహించడం కూడా జరిగాయి.
ప్రస్తుతం ఏపీలో పశ్చిమ గోదావరి, చిత్తూరు, తూర్పు గోదావరి వంటి జిల్లాల్లో ఎక్కువగా పౌల్ట్రీ వ్యాపించింది.
తెలంగాణలో రంగారెడ్డి, నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో పెద్ద స్థాయిలో పౌల్ట్రీ యూనిట్లు వెలిశాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఉత్పత్తి ఖర్చుకు – మార్కెట్ ధరకి పొంతన లేదు..
నిజామాబాద్ జిల్లాలో కోళ్ల ఫారం నడుపుతున్న మాదాల చిరంజీవి తన అనుభవాన్ని బీబీసీతో పంచుకున్నారు. కోళ్ల ఫారం రైతుల సమస్యలను ఆయన వివరించారు.
“సగటున 10 వేల కోళ్లు పెంచితే 8.7 వేల గుడ్లు వస్తాయి. చలికాలంలో ఎక్కువగా, వేసవిలో తక్కువగా గుడ్లు పెడతాయి. కోడికి 120 గ్రాముల దాణా వేయాలి. మార్కెట్‌లో ప్రస్తుత ధరల ప్రకారం మేతకి రూ. 30 వేలు ఖర్చవుతుంది. కూలీల ఖర్చు, కరెంటు బిల్లు, ఫారం అద్దె కలిపితే ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ ఉంటుంది. నెక్ నిర్ణయించిన ధరల ప్రకారం గుడ్డు రూ. 4.05 రూ ఉంటే, రైతుకి దక్కేది రూ. 3.8 మాత్రమే. దళారుల పాత్ర పెరిగింది. నెక్ పేరుకే కోళ్ల ఫారం నిర్వాహకుల సంస్థ. ప్రస్తుతం అందుకు విరుద్ధంగా సాగుతోంది” అంటూ ఆయన వాపోయారు.
కోడి మేత ధర కిలోకి 2020 నాటికి రూ. 16 నుంచి 18 మధ్య ఉంటే ప్రస్తుతం అది రూ. 26 నుంచి 28 మధ్య ఉంటోందని తెలిపారు. కానీ కోడిగుడ్డు ధర గతంతో పోలిస్తే తగ్గిపోతోందని చెప్పారు.
గుడ్డుతో పాటుగా కోడి ద్వారా వచ్చే ఆదాయం కూడా అంతంత మాత్రమేనని చిరంజీవి అన్నారు. కిలోకి రూ. 58 కి మించి రాదని, దానివల్ల కూడా నష్టపోవాల్సి వస్తోందని బీబీసీకి తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
పోటీ పెరుగుతోంది...
ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా నాటికి 1.20 కోట్ల కోళ్లు ఉండేవి. ఆ సమయంలో రోజుకి కోటి చొప్పున సగటున గుడ్లు ఉత్పత్తి జరిగేది. వాటిలో 80 లక్షల గుడ్లు ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలకు ఎగుమతి చేసేవారు.
ప్రస్తుతం ఈ జిల్లాలో కేవలం 95 లక్షల కోళ్లు మాత్రమే పెంచుతున్నారు. గుడ్ల ఉత్పత్తి కూడా రోజుకి 65 లక్షలకి పడిపోయింది. ఎగుమతులు తగ్గిపోవడం పెద్ద ప్రభావం చూపుతోందని పౌల్ట్రీ యజమానులు అంటున్నారు.
కోళ్ల పరిశ్రమలో గుడ్లు ఉత్పత్తి కోసమే కాకుండా, బ్రాయిలర్ వంటి మాంసం కోసం సిద్ధం చేసే కోళ్లను కూడా పెంచుతారు.
ప్రస్తుతం మార్కెట్లో ఎగుమతుల విషయంలో వచ్చిన సమస్యల కారణంగా ధరలు తగ్గిపోతున్నాయని నెక్ రాష్ట్ర అధ్యక్షుడు పి.ముకుంద రెడ్డి బీబీసీతో అన్నారు.
"ఒడిశా, బిహార్ వంటి రాష్ట్రాలు ఎక్కువగా దిగుమతుల మీద ఆధారపడేవి. మన ప్రాంతం నుంచి ఆ రాష్ట్రాలకు నిత్యం వందల లారీల ద్వారా ఎగుమతులు జరిగేవి. కానీ ప్రస్తుతం అక్కడి ప్రభుత్వాలు రాయితీలు పెంచాయి. దాంతో స్థానికంగా ఉత్పత్తి చేసే యూనిట్లు పెరుగుతున్నాయి. ఇది మన ఎగుమతులు తగ్గిపోవడానికి కారణమవుతోంది. అదే సమయంలో ధరల విషయంలో సమస్య ఏర్పడుతోంది. పౌల్ట్రీలో నిల్వ ఉంచడం సాధ్యం కాదు కాబట్టి ఎగుమతులకు కొత్త మార్కెట్ల వైపు చూడాలి. కానీ ధరల విషయంలో స్థిరత్వం లేకపోతే కష్టమే" అంటూ వ్యాఖ్యానించారు.
పౌల్ట్రీ ఉత్పత్తుల మార్కెట్, ధరల విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని తాము పలుమార్లు విన్నవించినా ఆశించిన ఫలితం దక్కలేదని ఆయన వాపోయారు.
ఉత్పత్తి వ్యయం పెరిగింది...
దేశవ్యాప్తంగా సగటున గుడ్డు వినియోగం పెరిగింది. అనేక ప్రచార కార్యక్రమాలు, ముఖ్యంగా కరోనా సమయంలో ప్రోటీన్ అవసరాల పేరుతో గుడ్డు తినేవారి సంఖ్య పెరిగింది.
2012 నాటికి సగటున భారతీయులు ఏడాదికి 62 గుడ్లు తింటే ప్రస్తుతం అది 50 శాతం పెరిగింది. 96 గుడ్లు చొప్పున సగటున తీసుకుంటున్నారని అధికారిక గణాంకాలు చెప్తున్నాయి. అంటే వినియోగం పెరిగింది.
దానికి తగ్గట్టుగానే మార్కెట్ కూడా విస్తరించింది. కానీ ప్రస్తుతం మార్కెట్‌లో గుడ్డు ధరలతో పోలిస్తే ఉత్పత్తి వ్యయం ఎక్కువయ్యిందని రైతులు అంటున్నారు.
మార్కెట్లో 2023 ఏప్రిల్ 4 నాటికి హైదరాబాద్‌లో వంద గుడ్లకు రూ.404, చిత్తూరు రూ. 458, విజయవాడ రూ. 417, వరంగల్ రూ. 407 చొప్పున ధర ఉంది.
అదే సమయంలో ఒక్కో గుడ్డు ఉత్పత్తికే రూ. 3.50 సరాసరి ఖర్చు అవుతోందని తూర్పు గోదావరి జిల్లాకి చెందిన పౌల్ట్రీ యజమాని సుబ్బారెడ్డి అన్నారు.
రవాణా, ఇతర ఖర్చులు కలుపుకుంటే వ్యయం ఇంకా పెరుగుతుందని.. రూ. 4 కి గుడ్లు అమ్మడం అంటే నష్టపోతున్నట్టేనని అన్నారు.
"గుడ్డు తయారీ ఖర్చు పెరిగింది. మేత కోసం ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తోంది. మొక్కజొన్న, సోయాబీన్, నూకల ఖర్చు బాగా పెరిగింది. కానీ రాయితీ ధరల మీద వాటిని సరఫరా చేయడం లేదు. దాంతో బహిరంగ మార్కెట్లో వాటిని కొని, కోళ్లు పెంచి, గుడ్లు ఉత్పత్తి చేసిన తర్వాత మార్కెట్ లో రేట్ లేనప్పుడు ఫారం నష్టాల్లో చిక్కుకుంటోంది. అందుకే ఎక్కువ మంది కోళ్ల ఫారాలు మూసేస్తున్నారు. మా మండలంలోనే పెద్ద కోళ్ల ఫారాల నుంచి చిన్న ఫారాల వరకూ 30కి పైగా మూతపడ్డాయి. అలా మూతపడుతున్నవి రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్నాయి" అంటూ ఆయన వివరించారు.
గుడ్డు రేటు బహిరంగమార్కట్లో రూ. 6 దాటిన దశ నుంచి ప్రస్తుతం రూ. 5 లోపుకు వచ్చేసింది. దాంతో ఖర్చులు పెరుగుతుండగా, రాబడి తగ్గుతోందని సుబ్బారెడ్డి వివరించారు.
వేసవి కష్టాలు తోడై...
ఏడాదిన్నర కాలంగా పౌల్ట్రీ పరిశ్రమ ఒడిదుడుకుల మధ్య సాగుతోంది. మొక్కజొన్న, సోయాబీన్‌తో పాటుగా స్థానికంగా లభించే నూకలు కూడా ఎక్కువగా ఎగుమతి అవుతుండడం వల్ల స్థానిక మార్కెట్లో ధరలు అందుబాటులో లేకుండా పోయాయి. ఇది పౌల్ట్రీ యజమానులకు పెనుభారం అవుతోంది.
అదే సమయంలో వాతావరణ మార్పులు కూడా పౌల్ట్రీ నిర్వహణకు పెను భారం అవుతున్నాయి. సహజంగా ఏటా వేసవి ఆరంభంలో చికెన్, గుడ్లు ధరలు తగ్గుతూ ఉంటాయి. కానీ ఈసారి అసాధారణంగా పడిపోతున్నాయనేది నిర్వాహకుల వాదన.
"చాలా ప్రాంతాల్లో వ్యవసాయం తర్వాత పౌల్ట్రీ రంగం ఎక్కువ మందికి ఉపాధి కల్పించేది. కానీ పౌల్ట్రీ కేంద్రాలు మూతపడడం వల్ల అనేక మంది పని కోల్పోతున్నారు. వేసవిలో ధరల్లో కొంత హెచ్చు తగ్గులుంటాయి. కానీ 2021 నుంచి వరుస నష్టాలు చూడాల్సి వస్తోంది. అందుకే ఎక్కువ మంది పరిశ్రమలను మూత వేస్తున్నారు. ఆక్వా రంగం ఎగుమతుల్లో ఒడిదుడుకులు వచ్చినప్పుడు ప్రభుత్వం స్పందించింది. కానీ పౌల్ట్రీ పరిశ్రమల మీద శ్రద్ధచూపడం లేదు. ఇది ఏపీకి నష్టాన్ని తెస్తుంది" అంటూ వెటర్నరీ డిపార్ట్‌మెంట్ మాజీ డైరెక్టర్ ఎం.రామకోటేశ్వర రావు అభిప్రాయపడ్డారు.
పౌల్ట్రీ పరిశ్రమను మళ్లీ పట్టాలెక్కించాలంటే ప్రభుత్వ చేదోడు చాలా అవసరమని, ఒడిశా వంటి రాష్ట్రాల్లో రాయితీలు పెంచి, ఫలితాలు సాధిస్తున్న తీరుని గమనించాలని ఆయన సూచించారు.
ఇవి కూడా చదవండి:
- ఐపీఎల్ 2023: టోర్నీని రసవత్తరంగా మార్చబోతున్న 'ఇంపాక్ట్ ప్లేయర్' రూల్ ఏంటి?
- సెమాగ్లుటైడ్: బరువు తగ్గించే ఈ ఇంజెక్షన్‌కు అంత డిమాండ్ ఎందుకు?
- తెలంగాణ: ఆదివాసీలు పరిశ్రమలు పెట్టేందుకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం పొందడం ఎలా?
- ‘‘ఆయన నాలుగేళ్లుగా నీళ్లు పోసుకోలేదు... అడవిలోనే ఒంటరి జీవితం... అటవీ ఏనుగులున్నా భయపడలేదు’’
- 'జీన్ ఎడిటెడ్ ఫుడ్' అంటే ఏంటి? అది తినడం ఆరోగ్యానికి మంచిదేనా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















