నేషనల్ టాలెంట్ స్కాలర్‌షిప్స్: అగ్రికల్చర్ విద్యార్థులు నెలకు 3 వేల ఉప‌కార‌వేత‌నం పొందాలంటే ఏంచేయాలి?

వీడియో క్యాప్షన్, ఎన్‌టీఎస్: అగ్రికల్చర్ విద్యార్థులు నెలకు 3 వేల ఉప‌కార‌వేత‌నం పొందాలంటే ఏంచేయాలి?
    • రచయిత, ఎ.కిశోర్‌బాబు
    • హోదా, బీబీసీ కోసం

భారత్‌లో ఇంజినీరింగ్‌, వైద్య శాస్త్రం త‌రవాత యువ‌త ఎక్కువ‌గా చ‌దివేది వ్య‌వ‌సాయ శాస్త్ర‌మే.

వ్య‌వ‌సాయంలో వ‌స్తున్న ఆధునిక సాంకేతిక మార్పుల‌కు అనుగుణంగా వ్య‌వ‌సాయ శాస్త్రం చ‌దివే వారికి డిమాండు పెరుగుతోది. దీంతో దేశంలో అగ్రిక‌ల్చ‌ర్ యూనివ‌ర్సిటీలు, అగ్రిక‌ల్చ‌ర్ క‌శాళాల‌లు కూడా గ‌ణ‌నీయంగా పెరిగాయి.

అగ్రిక‌ల్చ‌ర్ కోర్సు చ‌దివే విద్యార్థుల‌కు ప్రోత్సాహం ఇచ్చేందుకు కేంద్ర ప్ర‌భుత్వం నెలకు రూ.2000 నుంచి రూ.3000 వరకు స్కాల‌ర్‌షిప్ ఇచ్చే ఒక ప్ర‌త్యేక ప‌థ‌కం అమ‌లు చేస్తోంది.

నేష‌న‌ల్ టాలెంట్ స్కాల‌ర్‌షిప్స్ (ఎన్‌టీఎస్) పేరిట ఈ ప‌థ‌కాన్ని కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ, భార‌త వ్య‌వ‌సాయ ప‌రిశోధ‌న మండ‌లి (ఐసీఏఆర్) సంయుక్తంగా అమ‌లు చేస్తున్నాయి.

ఈ ప‌థ‌కం కింద స్కాలర్‌షిప్ పొందాలంటే ఏం చేయాలో ఈ కథనంలో తెలుసుకుందాం.

అగ్రికల్చర్ విద్యార్థి

ఫొటో సోర్స్, Getty Images

నేష‌న‌ల్ టాలెంట్ స్కాల‌ర్‌షిప్స్ అంటే?

భార‌త్‌లో వ్య‌వ‌సాయ విద్య‌ను బ‌లోపేతం చేయాల‌నే ల‌క్ష్యంతో.. వ్య‌వ‌సాయ క‌ళాశాల‌ల్లో అగ్రిక‌ల్చ‌ర్ కోర్సు చ‌దివే విద్యార్థులు, ప‌రిశోధ‌క విద్యార్థుల‌కు ఆర్థికంగా ప్రోత్స‌హం అందించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం, ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్ రీసెర్చ్(ఐసీఏఆర్) నిర్ణ‌యించాయి. ఐసీఏఆర్ గుర్తింపు పొందిన అగ్రికల్చ‌ర్ క‌ళాశాల‌ల్లో చదివే అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల‌కు నెలకు రూ.2000, పీజీ విద్యార్థుల‌కు నెలకు రూ.3000 వారి ప్ర‌తిభ‌ను బ‌ట్టి ఉప‌కారవేత‌నాలు ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు.

దీని కోసం కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ స‌హ‌కారంతో ఐసీఏఆర్ ఈ ప‌థ‌కం ప్రారంభించింది.

అగ్రికల్చ‌ర్ విద్యార్థుల‌కు ఉప‌యోగం ఏమిటి?

దేశంలో ఐసీఏఆర్ గుర్తింపుతో కొన్ని వ్య‌వ‌సాయ క‌ళాశాల‌లు, యూనివ‌ర్సిటీలు ఏర్ప‌డ్డాయి. ఈ సంస్థల్లో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి విద్యార్థులు వ‌చ్చి చ‌దువుతున్నారు.

ఈ విద్యార్థులు ఏ రాష్ట్రం, ఏ ప్రాంతానికి చెందిన వారు అనేది సంబంధం లేకుండా ఏ అగ్రిక‌ల్చ‌ర్ క‌ళాశాల‌ లేదా యూనివ‌ర్సిటీలో చ‌దువుతున్నా ఈ స్కాల‌ర్‌షిప్ పొంద‌వ‌చ్చు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని అగ్రిక‌ల్చ‌ర్ యూనివ‌ర్సిటీలు, క‌ళాశాలల్లో దాదాపు నాలుగు వేల మందికిపైగా విద్యార్థులు ఈ త‌ర‌హా స్కాల‌ర్‌షిప్‌లు పొందుతున్నారు.

అగ్రికల్చర్ విద్యార్థి

ఫొటో సోర్స్, Getty Images

విద్యార్థులంద‌రూ అర్హులేనా?

ఐసీఏఆర్ గుర్తింపు పొందిన అగ్రిక‌ల్చ‌ర్ క‌ళాశాల‌లు, యూనివ‌ర్సిటీల్లో ఆలిండియా ఎంట్రెన్స్ ఎగ్జామినేష‌న్ (ఏఐఈఈ) ద్వారా ఈ క‌ళాశాల‌ల్లో ప్ర‌వేశం పొందిన విద్యార్థులు మాత్ర‌మే ఈ ఉపకార వేతనానికి అర్హులు.

ప్రైవేటు క‌ళాశాల‌ల్లో డొనేష‌న్ మీద‌, మేనేజ్‌మెంట్ కోటా కింద చేరిన విద్యార్థులు అర్హులు కారు. కేవ‌లం ఏఐఈఈ ద్వారా ప్ర‌వేశాలు పొందిన విద్యార్థుల‌కే ఈ సౌల‌భ్యం ఉంది.

బీఎస్సీ విద్యార్థుల‌కు ఎంత స్కాల‌ర్‌షిప్ ఇస్తారు?

మొద‌టి సంవ‌త్స‌రం ప్ర‌తి నెలా రూ.2000 స్కాల‌ర్‌షిప్ ఇస్తారు. త‌రువాత కోర్సు పూర్త‌య్యే వ‌ర‌కు దీన్ని రెన్యువ‌ల్ చేసుకోవ‌చ్చు.

ఎమ్మెస్సీ విద్యార్థుల‌కు మొద‌టి సంవ‌త్స‌రం ప్ర‌తి నెలా రూ.3000 స్కాల‌ర్‌షిప్ ఇస్తారు.

అగ్రికల్చర్ విద్యార్థి

ఫొటో సోర్స్, Getty Images

విద్యార్థికి ఉండాల్సిన అర్హతలేమిటి?

  • మంచి మార్కులు, ప్ర‌తిభ చూపిన విద్యార్థులు, మంచి న‌డ‌వ‌డిక ఉన్న వారిని మాత్ర‌మే ఈ ప‌థ‌కానికి ఎంపిక చేస్తారు.
  • దీనికి సంబంధించి ఆ విద్యార్థి చ‌దువుతున్న క‌ళాశాల లేదా యూనివ‌ర్సిటీ విభాగాధిప‌తి, ప్రిన్సిపాల్ స‌ర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది.
  • క‌ళాశాల అధికారుల ముంద‌స్తు అనుమ‌తి లేకుండా ఎట్టి ప‌రిస్థితుల్లోనూ త‌ర‌గ‌తుల‌కు గైర్హాజ‌రు కాకూడ‌దు.
  • ఎలాంటి గొడ‌వ‌లు లేదా స‌మ్మెలు, ఆందోళ‌న కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌కూడ‌దు.

పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తూ చ‌దివే విద్యార్థికి స్కాల‌ర్‌షిప్ వ‌ర్తిస్తుందా?

వ‌ర్తించ‌దు. ఈ స్కాల‌ర్‌షిప్ పొందే విద్యార్థి పూర్తి స్థాయి స‌మ‌యం త‌న చ‌దువుకే అంకితం చేయాలి. అంతే త‌ప్ప, ఏదైనా పార్ట్ టైమ్ ఉద్యోగం చేయ‌కూడదు.

ఒక‌వేళ స్కాల‌ర్‌షిప్ పొందుతున్న విద్యార్థి పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తున్నారని తెలిస్తే, వెంట‌నే ఈ స్కాల‌ర్‌షిప్‌ను రద్దు చేస్తారు

విద్యార్థి మ‌రో స్కాల‌ర్‌షిప్ పొందుతుంటే ఇది వ‌ర్తిస్తుందా?

వ‌ర్తించ‌దు. ఈ స్కాల‌ర్‌షిప్ పొందే విద్యార్థి ఇత‌ర స్కాల‌ర్‌షిప్‌లు పొంద‌కూడ‌దు.

క‌ళాశాల‌లో చేరిన నెల రోజుల్లోపే విద్యార్థి చదువు మానేస్తే?

ఈ స్కాల‌ర్‌షిప్ వ‌ర్తించ‌దు. క‌ళాశాల‌లో చేరిన త‌రువాత క‌నీసం నెల రోజులైనా అక్కడ చ‌ద‌వాలి.

వీడియో క్యాప్షన్, సిద్ధిపేటలోని స్వచ్చబడిపై బీబీసీ ప్రత్యేక కథనం

స‌బ్జెక్టును మార్చుకోవ‌చ్చా?

ఈ ప‌థ‌కం కింద ఎంపిక‌య్యే విద్యార్థి త‌న ఇనీషియ‌ల్ స‌బ్జెక్టును త‌ర‌చుగా మార్చుకోవ‌డం కుద‌ర‌దు.

విద్యార్థి కళాశాలలో చేరిన తరువాత ఎప్ప‌టి నుంచి స్కాల‌ర్‌షిప్ ఇస్తారు?

విద్యార్థి కళాశాలలో చేరిన మొదటి రోజు నుంచే ఈ స్కాల‌ర్‌షిప్ వ‌ర్తిస్తుంది.

ఐసీఏఆర్ నేరుగా చెల్లిస్తుందా?

చెల్లించదు. ఎంపికైన విద్యార్థుల‌కు ఆయా విద్యార్థి చ‌దువుతున్న క‌ళాశాల లేదా యూనివ‌ర్సిటీ ఉన్న‌తాధికారుల‌కు ఈ సొమ్ము చెల్లించాల‌ని ఆదేశిస్తుంది.

ఒకేసారి విద్యార్థికి ఈ సొమ్ము ఇస్తారా?

ఐసీఏఆర్ సంస్థ ఈ ప‌థ‌కానికి ఎంపికైన విద్యార్థికి ముందుగానే మొత్తం 12 నెల‌ల స్కాల‌ర్‌షిప్ పంపుతుంది.

క‌ళాశాల యాజ‌మాన్యం మాత్రం విద్యార్థికి ప్ర‌తి నెలా స్కాల‌ర్‌షిప్ చెల్లిస్తుంది. విద్యార్థి హాజ‌రు, ఓజీపీఏ/సీజీపీఏ ఎలా ఉంద‌నేది చూసుకుని విద్యార్థికి దీనిని చెల్లిస్తుంది.

వీడియో క్యాప్షన్, ఐఐటీ బాంబే: ‘IITలోనూ కుల వివక్ష తప్పలేదు’

ఓజీపీఏ/సీజీపీఏ ఎంత ఉండాలి?

ఈ స్కాల‌ర్‌షిప్ పొందే విద్యార్థులు త‌మ ఓజీపీఏ/సీజీపీఏ 10కి కనీసం ఏడు పాయింట్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల‌కైతే కనీసం 6.5 పాయింట్లు ఉండాలి.

ద‌ర‌ఖాస్తు ఎలా చేసుకోవాలి?

ఈ స్కాల‌ర్‌షిప్ కోసం విద్యార్థులు ఐసీఏఆర్‌కు ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ఆఫ్‌లైన్ ద్వారా వ‌చ్చే ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించ‌రు.

https://education.icar.gov.in/Event_details?component=NTS&DegProg=UG&SchemeCode=NTSU

ఈ వెబ్‌సైట్‌లో విద్యార్థులు ద‌ర‌ఖాస్తు స‌బ్‌మిట్ చేయొచ్చు.

ద‌ర‌ఖాస్తుతో పాటు ఎలాంటి ప‌త్రాలు పొందుప‌ర‌చాలి?

  • విద్యార్థి ఫొటోగ్రాఫ్
  • సంత‌కం
  • వేలిముద్ర‌
  • అధికారులు ఇచ్చిన కండ‌క్ట్, స్ట‌డీ మెరిట్ స‌ర్టిఫికెట్లు
  • ఆధార్‌కార్డు
  • బ్యాంకు ఖాతా వివ‌రాలు

వివ‌రాల‌కు ఎవ‌ర్ని సంప్ర‌దించాలి?

https://www.icar.org.in/ వెబ్‌సైట్లో వివ‌రాలు తెలుసుకోవ‌చ్చు.

011-25847121 నంబ‌రులో ఫోను ద్వారా ఐసీఏఆర్ అధికారుల‌ను నేరుగా సంప్ర‌దించవ‌చ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)