విద్యార్థులకు రూ.10 లక్షలు ఇచ్చే పథకం

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఎ.కిశోర్‌బాబు
- హోదా, బీబీసీ కోసం
విద్యార్థుల మేధస్సుకు పదును పెట్టేవే కాంపిటీషన్లు.
అంతర్జాతీయ వేదికలపై జరిగే ప్రతిష్ఠాత్మక పోటీలకు హాజరై బహుమతులు పొందితే వచ్చే గుర్తింపు వేరుగా ఉంటుంది.
అమెరికాలోని నాసా వంటి అంతరిక్ష సంస్థలు, టెక్ కంపెనీలు రకరకాల పోటీలు, సదస్సులు నిర్వహిస్తుంటాయి. ఇలాగే ఇతర దేశాల్లోనూ జరుగుతుంటాయి.
విదేశాల్లో జరిగే ఇలాంటి పోటీల్లో పాల్గొనాలంటే సామాన్య విద్యార్థులకు ఆషామాషీ వ్యవహారం కాదు. ఇది ఎంతో ఖర్చుతో కూడుకున్నది.
ఇంజినీరింగ్ విద్యార్థులు విదేశాలకు వెళ్లి అక్కడ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించే ఓ పథకం అమలు చేస్తోంది.
ఒక్కో విద్యార్థికి రూ.లక్ష చొప్పున ఒక బృందంలో అత్యధికంగా 10మందికి ఇలాంటి సాయం అందజేస్తుంది.
ఇంజినీరింగ్ విద్య అభ్యసించే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ Support To Students For Participating In Competition Abroad పథకం గురించి పూర్తిగా తెలుసుకుందామా?

ఫొటో సోర్స్, Getty Images
ఏమిటీ పథకం?
దేశంలో B.E./B.Tech. లేదా Integrated M. Tech, లేదా 1st and 2nd-year students of M.E./M.Tech చదువుతున్న విద్యార్థులు విదేశాల్లో జరిగే అంతర్జాతీయ కాంపిటీషన్లలో పాల్గొనడానికి వీలుగా ప్రవేశపెట్టిన పథకం ఇది.
ఇంజినీరింగ్ విద్య నాణ్యతను పెంచడంతోపాటు విద్యార్థుల్లో పరిశోధన, ఆవిష్కరణలు, పోటీతత్వాన్ని పెంపొందించే ఉద్దేశంతో తీసుకొచ్చిన పథకం ఇది.
కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (AICTE) ఈ పథకాన్ని అమలు చేస్తోంది.
విద్యార్థులకు అంతర్జాతీయ సైన్స్ కాంపిటీషన్లలో పోటీలకు సంబంధించి ఆహ్వానం ఉన్నట్లయితే, అవి జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి పోటీలుగా గుర్తింపు పొందినవి అయితే.. అలాంటి పోటీల్లో విద్యార్థులు పాల్గొనడానికి కేంద్ర ప్రభుత్వం, AICTE ఆర్థిక సహాయం అందజేస్తాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఎవరు అర్హులు?
ఇంజినీరింగ్ విద్యార్థులందరూ అర్హులే. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి గుర్తింపు పొందిన ఇంజినీరింగ్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులందరూ కూడా ఈ పథకానికి అర్హులే.
పోటీలకు వెళ్లే విద్యార్థుల బృందం కనీసం ఇద్దరికి తగ్గకుండా 10మందికి మించకుండా ఉండాలి.
ఏఐసీటీఈ గుర్తింపు పొందిన ఇంజినీరింగ్ కళాశాలల్లో B.E./B.Tech. లేదా Integrated M. Tech, లేదా 1st and 2nd-year students of M.E./M.Tech చదువుతున్న విద్యార్థులు అర్హులు

ఫొటో సోర్స్, Getty Images
సదస్సులకు వెళ్లాలన్నా...
ఇంజినీరింగ్ విద్యార్థులు అంతర్జాతీయ సదస్సులు, సింపోసియం, వర్క్‌షాపు, ఎగ్జిబిషన్ ( international scientific event(conference/seminar/symposium/workshop/exhibition) తదితర సదస్సుల్లో పాల్గొని రావడానికి మరో పథకాన్ని అమలు చేస్తున్నారు.
ఇది కేవలం అంతర్జాతీయ సదస్సులకు హాజరయ్యేందుకు ఉపకరించే పథకం.
ఈ పథకానికి AICTE, Indian National Academy of Engineering (INAE) సంస్థలు మాత్రమే ఆర్థిక సాయం చేస్తాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఎంత ఆర్థిక సాయం చేస్తారు?
ఒక్కో విద్యార్థికి రూ.లక్ష చొప్పున పోటీకి వెళ్లే బృందంలో అత్యధికంగా 10 మందికి చెల్లిస్తారు.
ఈ ఆర్థిక ప్రోత్సాహం దేనికోసం వెచ్చించాల్సి ఉంటుంది?
విద్యార్థుల విమాన టికెట్ ఛార్జీలు, రైలు ప్రయాణ ఖర్చులు, వసతి, భోజనం ఖర్చులు, రిజిస్ట్రేషన్, వీసా రుసుములకు వెచ్చించాల్సి ఉంటుంది.
ఒకసారి పోటీకి వెళ్లి వచ్చాకా ఈ ఖర్చుకు సంబంధించి లెక్కలు సమర్పించాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఎలా చేసుకోవాలి?
https://www.myscheme.gov.in/schemes/sspca
ముందుగా విద్యార్థులు పై వెబ్ లింకు ద్వారా AICTE వెబ్‌సైటులోకి వెళ్లి అక్కడ విద్యార్థులకు అందిస్తున్న పథకాల విండోకి వెళ్లాలి.
అందులో 'Support to Students for Participating in Competition Abroad Scheme అనే దాన్ని క్లిక్ చేసి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకోవాలి.
ఈ దరఖాస్తును పూర్తి చేసి అందులో అవసరమైన చోటల్లా మీరు చదువుతున్న కళాశాల లేదా విద్యా సంస్థ లేదా యూనివర్సిటీ అథారిటీ సంతకాలు, స్టాంపు, మీ సంతకాలు ఉండేలా చూసుకోవాలి.
మీరు పోటీలో పాల్గొనాలని మీకు లేదా మీ బృందానికి అందిన అంతర్జాతీయ కాంపిటీషన్ ఇన్విటేషన్ పత్రం కాపీ జత చేయాలి.
ఇందులో మీరు పొందుపరిచే ప్రతి సమాచారం కూడా చాలా కచ్చితంగా ఉండాలి.
ఏ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్నా ఈ గ్రాంట్ ఇస్తారా?
AICTE గుర్తింపు పొందిన ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు ఈ పథకాలకు అర్హులవుతారు.
దరఖాస్తును ఎవరికి పంపాలి?
ఇలా పూర్తి చేసిన దరఖాస్తును ఈ కింది చిరునామాకు స్పీడు పోస్టు, పోస్టు ద్వారా మాత్రమే పంపాలి.
ఈ-మెయిల్ ద్వారా పంపిన దరఖాస్తులు పరిశీలనకు స్వీకరించరు.
Prof. Dileep N Malkhede
Adviser RIFD
All India Council for Technical Education
Nelson Mandela Marg, Vasant Kunj, New Delhi - 110070
దరఖాస్తు పంపగానే గ్రాంటు ఇస్తారా?
ఇవ్వరు.
మీరు పంపిన దరఖాస్తును పరిశీలించేందుకు AICTEలోని ఒక నిపుణుల ప్యానెల్ ఉంటుంది. ఈ ప్యానెల్ మీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలిస్తుంది.
మీకు అందిన ఆహ్వానం సరైందా కాదా అనేది నిర్ధారించుకుంటుంది.
మీ ప్రతిభను, మీరు చదువుతున్న ఇంజినీరింగ్ కళాశాల AICTE గుర్తింపు పొంది ఉందా లేదా తదితర అనేక అంశాలను పరిశీలించి మీ దరఖాస్తును ఎంపిక చేస్తుంది.
దరఖాస్తుతో పాటు ఎలాంటి ధ్రువపత్రాలు సమర్పించాలి?
- మీరు పోటీలో పాల్గొనడానికి అనుమతిస్తూ ఆ కాంపిటీషన్ నిర్వహిస్తున్న సంస్థ మీకు పంపిన అంగీకార పత్రం.
- ఆ పోటీలో మీరు ఇవ్వనున్న ప్రజెంటేషన్, ఆ పోటీకి సంబంధించి పూర్తి వివరాలతో కూడిన ప్రత్యేక డాక్యుమెంట్.
పోటీలకు ఎంపికైన తరువాత డబ్బు ఎప్పుడు చెల్లిస్తారు?
మీ ప్రయాణానికి ముందుగానే ఈ డబ్బు చెల్లిస్తారు.
ఒకే సారి చెల్లిస్తారా?
ఏక మొత్తం ఒకేసారి ఇస్తారు.
అయితే మీరు మీ ప్రయాణం విజయవంతంగా పూర్తి చేసుకుని తిరిగి వచ్చిన తరువాత మీరు చేసిన ఖర్చులకు తాలూకూ బిల్లులు సమర్పించాల్సి ఉంటుంది.
పోటీలకు కాకుండా సదస్సుల్లో పాల్గొనడానికి వెళ్లే విద్యార్థులకు గ్రాంటు ఎలా ఇస్తారు?
దాదాపుగా పైన చూపించిన నిబంధనలన్నీ ఉంటాయి.
అయితే, ఈ సదస్సులు, సింపోసియం తదితరాల్లో పాల్గొనదలచిన ఇంజినీరింగ్ విద్యార్థులకు మాత్రం తప్పనిసరిగా వారి సీజీపీఏలో 7 (7 CGPA) లేదా మునుపటి పరీక్షల్లో 65 శాతం మార్కులైనా సాధించి ఉండాలి.
అలాంటి విద్యార్థులు మాత్రమే ఈ పథకానికి అర్హులు.
ఈ పథకానికి దరఖాస్తు ఏ చిరునామాకు పంపాలి?
ట్రావెల్ గ్రాంట్ పథకం కోసం విద్యార్థులు తమ దరఖాస్తును ఈ కింది చిరునామాకు పంపాలి.
Executive Director Indian National Academy of Engineering (INAE) Unit No 604-609
6th Floor, Tower A, SPAZE I-Tech Park, Sector-49, Sohna Road, Gurgaon - 122 018
ఏవైనా అనుమానాలుంటే ఎవర్ని సంప్రదించాలి?
0124-4239480 నెంబరుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
Website: www.inae.in
ఇవి కూడా చదవండి:
- ఆస్కార్-ఆర్ఆర్ఆర్: వైఎస్ జగన్ ‘‘తెలుగు జెండా’’ అంటే ప్రాంతీయ వాదం అవుతుందా?
- కే హుయ్ క్వాన్: ఒకప్పుడు శరణార్థి...నేడు ఆస్కార్ విజేత
- మాతృత్వం: ‘మా అమ్మ వయసు 50 ఏళ్లయితే మాత్రం.. రెండవ బిడ్డను కనడానికి ఎందుకు సిగ్గుపడాలి?’
- కర్నాటక: ‘‘మైకుల్లో ప్రార్థించకుంటే అల్లాకు వినపడదా..’’ బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు... మరి నిబంధనలు ఏం చెబుతున్నాయి
- లావణి డ్యాన్స్: మహిళలను ప్రైవేటుగా బుక్ చేసుకునే ఈ నృత్యం ఏంటి? ఈ జీవితం మీద ఆ మహిళలు ఏమంటున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

















