ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉన్నత స్థాయి పోస్టుల్లో 90 శాతం మంది అగ్ర కులాలవారే.. ఎందుకిలా? బీసీ, ఎస్సీ, ఎస్టీ కోటాల పరిస్థితి ఏమిటి?

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌లోని పబ్లిక్ సెక్లార్ బ్యాంకులలో ఉన్నత స్థానాలలో పనిచేసే సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లలో 90 శాతం మంది అగ్రకులాలకు చెందినవారేనని వెల్లడైంది. వెనుకబడిన వర్గాలకు (బీసీ) చెందినవారి ప్రాతినిధ్యం 2 నుంచి 3 శాతానికి మించి లేదు. మరి.. దీనికి కారణమేంటి?
ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఉన్నత స్థానాలలో పనిచేస్తున్నవారి కులాలేమిటన్న సమాచారాన్ని ‘ఆల్ ఇండియా బ్యాక్‌వర్డ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్’ జనరల్ సెక్రటరీ జి.కరుణానిధి పొందారు.
ఆ సమాచారం ప్రకారం.. ప్రభుత్వ రంగ బ్యాంకులలో జనరల్ మేనేజర్, చీఫ్ జనరల్ మేనేజర్ పదవుల్లో ఉన్నవారిలో 88 నుంచి 92 శాతం మంది జనరల్ కేటగిరీకి చెందినవారు.

దేశంలోని జాతీయ బ్యాంకులలో 147 మంది చీఫ్ జనరల్ మేనేజర్లు ఉన్నారు. వారిలో 135 మంది జనరల్ కేటగిరీకి చెందినవారు. ఇది 92 శాతానికి సమానం. మొత్తం 667 మంది జనరల్ మేనేజర్లు ఉండగా వారిలో 588 మంది అంటే 88 శాతం జనరల్ కేటగిరీకి చెందినవారు.
డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులలో 81 శాతం జనరల్ కేటగిరీవాళ్లు కాగా 8 శాతం మంది వెనుకబడిన వర్గాల వారు ఉన్నారు.
అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్టులలో 72 శాతం మంది జనరల్ కేటగిరీ, 14 శాతం వెనుకబడిన వర్గాల వారు.
చీఫ్ మేనేజర్లలో 61 శాతం మంది జనరల్ కేటగిరీలోవారు కాగా 19 శాతం మంది వెనుకబడినవర్గాల వారు.
పబ్లిక్ సెక్టార్ బ్యాంకులలోని పోస్టులకు నియామకాల సమయంలో వెనుకబడినవర్గాలకు 27 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నారు. షెడ్యూల్డ్ కులాలకు 15 శాతం, షెడ్యూల్డ్ తెగలకు 7.5 శాతం రిజర్వేషన్ ఉంది. మండల్ కమిషన్ సిఫారసుల ప్రకారం ఈ రిజర్వేషన్లు వర్తిస్తున్నయి.
పదోన్నతులలోనూ రిజర్వేషన్లు ఉండాలని మండల్ కమిషన్ సిఫారసు చేసింది. కానీ, కమిషన్ సిఫారసుల అమలు విషయంలో ఇందిర సహానీ కేసు సందర్భంలో సుప్రంకోర్టు పదోన్నతలలో రిజర్వేషన్లు అవసరం లేదని ఆదేశించింది.
షెడ్యూల్డ్ కులాలు, తెగలకు కూడా పదోన్నతులలో రిజర్వేషన్లు అయిదేళ్లవరకేనని నిర్ణయించారు.

అయితే, షెడ్యూల్డ్ కులాలు, తెగల ప్రయోజనాలను పరిరక్షించాలన్న ప్రభుత్వ స్ఫూర్తిని అనుసరించి వారికి పదోన్నతులలోనూ రిజర్వేషన్లు కల్పించడం కొనసాగించాలంటూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 16ను సవరిస్తూ కొత్త క్లాజ్(4ఏ) జోడించారు. ఈ సవరణను 1995 మే 31 పార్లమెంటు ఆమోదించింది.
ఈ సవరణ సమయంలోనే కొందరు నాయకులు వెనుకబడిన కులాలకూ పదోన్నతులలో రిజర్వేషన్లు కొనసాగించాలని కోరారు. దాంతో ఆ మేరకు రాజ్యంగ సవరణ చేస్తామని అప్పటికి సామాజిక న్యాయం, సాధికారత మంత్రిగా ఉన్న సీతారాం కేసరి తెలిపారు. కానీ, ఇంతవరకు అది జరగలేదు.
‘బ్యాంకింగ్ ఉద్యోగాలను స్కేల్ 1 నుంచి స్కేల్ 4 అంటూ నాలుగు విభాగాలుగా చూస్తారు. వీటిలో స్కేల్ 3లో రిజర్వేషన్లు కొంతవరకు కరెక్టుగా అమలవుతున్నాయి. స్కేల్ 4లో వెనుకబడినవర్గాల రిజర్వేషన్లు చాలా తక్కువగా అమలవుతున్నాయి. స్కేల్ 4లో చీఫ్ జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజనర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, చీఫ్ మేనేజర్ వంటి పోస్టులున్నాయి. పదోన్నతులలో రిజర్వేషన్లు అమలైతేనే ఈ స్థానాలలో వెనుకబడిన వర్గాలకు అవకాశం దక్కుతుంది’ అన్నారు కరుణానిధి.
కాగా పదోన్నతులలో రిజర్వేషన్లు పొందుతున్న ఎస్సీ, ఎస్టీలు కూడా ఉన్నత స్థాయి పదవులలో తక్కువ సంఖ్యలోనే ఉన్నారు. చీఫ్ జనరల్ మేనేజర్ పోస్టులలో ఎస్సీలు 6 శాతం, జనరల్ మేనేజర్ పోస్టులలో ఎస్సీ, ఎస్టీలు 8 శాతం ఉన్నారు. చీఫ్ జనరల్ మేనేజర్ పోస్టులో ఎస్టీ కేటగిరీవారు ఒక్కరు కూడా లేరు. ఇక జనరల్ మేనేజర్ పోస్టులలో ఎస్టీలు 2 శాతం మాత్రమే ఉన్నారు.

‘ఎస్సీ, ఎస్టీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పిస్తున్నప్పటికీ ప్రతి స్థాయిలో వారికి దక్కాల్సినన్ని రెగ్యులర్ పోస్టులు దక్కడం లేదు. స్కేల్ 1, స్కేల్ 2 స్థాయిలో ఎస్సీ, ఎస్టీలకు తగిన ప్రాతినిధ్యం ఉంటున్నా ఆపై స్థాయి ఉద్యోగాలకు వచ్చేసరికి వారి సంఖ్య తగ్గిపోతోంది’ అన్నారు కరుణానిధి.
‘తమిళనాడు వంటి రాష్ట్రాలలో ప్రభుత్వ విద్యాసంస్థలలో సీట్లు, ప్రభుత్వ ఉద్యోగాలలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు కనిపిస్తారు. కానీ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో మాత్రం వారికి అవకాశాలు చాలా తక్కువ. జనరల్ కేటగిరీలో వచ్చేవారిలో ఎక్కువగా అగ్రకులాలవారే ఉంటున్నారు’ అన్నారు కరుణానిధి.
ఒక్క బ్యాంకింగ్ రంగంలోనే కాదు పదోన్నతులలో రిజర్వేషన్లు అమలు కాని ప్రతి చోటా ఇదే పరిస్థితి ఉంటోందని, ఒక్క వర్గానిదే ఆధిపత్యం ఉంటోందని భారతీయ బ్యాంక్ ఉద్యోగుల సమాఖ్య సంయుక్త కార్యదర్శి సీపీ కృష్ణ చెప్పారు.
‘బ్యాంకులలో స్కేల్ 4 పోస్టులు ప్రత్యక్ష పరిశీలన ద్వారా భర్తీ చేస్తారు. అవసరం, పైవాళ్ల ఒత్తిళ్లు వంటివన్నీ ఈ పోస్టుల భర్తీని ప్రభావితం చేస్తాయి. ఇక్కడ రిజర్వేషన్లు అమలైతేనే అందరికీ అవకాశం దక్కుతుంది. లేదంటే ఇప్పుడు జరుగుతున్నట్లే ఉంటుంది’ అన్నారు కృష్ణ.
బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మాత్రమే కాదు మహిళలకూ పైస్థాయి పదవులు దొరకడంలేదని కృష్ణ చెప్పారు. ఉన్నత స్థానాలలో ఒకే వర్గం ఉండడం వల్ల సేవలపైనా ప్రభావం పడుతుందని.. సేవలు పొందేవారి విషయంలోనూ ప్రాధాన్యాలు మారిపోతుంటాయని కృష్ణ అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- ఆస్కార్ 2023: ‘‘నాటునాటు పాటను తరాల పాటు గుర్తుంచుకుంటారు...’’ ఆర్ఆర్ఆర్ బృందానికి అభినందనల వెల్లువ
- లావణి డ్యాన్స్: మహిళలను ప్రైవేటుగా బుక్ చేసుకునే ఈ నృత్యం ఏంటి? ఈ జీవితం మీద ఆ మహిళలు ఏమంటున్నారు?
- స్టాక్ మార్కెట్ ద్వారా తక్కువ కాలంలో ధనవంతులు కావొచ్చా? ఇందులో నిజమెంత?
- చైనా: జాక్ మా, బావో ఫ్యాన్, మరికొందరు.. బిలియనీర్ల వరుస అదృశ్యాల వెనుక మిస్టరీ ఏంటి?
- 2023 DW: భూమి వైపు దూసుకొస్తున్న గ్రహ శకలం.. 2046 'వాలెంటైన్స్ డే నాడు భూమిని తాకవచ్చు'














