మార్గదర్శిపై వస్తున్న ఆరోపణలు ఏమిటి, రామోజీరావు, శైలజలను సీఐడీ ఎందుకు విచారిస్తోంది

రామోజీ రావు

ఫొటో సోర్స్, Facebook/Ramojirao

ఫొటో క్యాప్షన్, రామోజీ రావు
    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మార్గదర్శి – ఈ చిట్ ఫండ్ కంపెనీ పేరు రెండు దశాబ్దాలుగా తెలుగు రాజకీయాల్లో వినిపిస్తూనే ఉంది. ఈనాడు గ్రూపు సంస్థల యజమాని రామోజీ రావు నిర్వహించే ఈ సంస్థ చిట్ ఫండ్ వ్యాపారాల్లో ఉంది.

ఆ సంస్థ వివిధ చట్టాలకు వ్యతిరేకంగా వ్యాపారం చేస్తోంది అంటూ ఒకప్పటి కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కోర్టుకు వెళ్లడంతో మొదలైన వ్యవహారం తరువాత అనేక మలుపులు తిరిగింది.

ఉండవల్లి అరుణ్ కుమార్ కేసు కోర్టులో ఉంది. ఆలోపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నేర విచారణ విభాగం (సీఐడీ) మార్గదర్శిపై మరో కేసు పెట్టి విచారణ చేస్తోంది.

ఇంతకీ మార్గదర్శిపై ఆరోపణలు ఏంటి? అప్పట్లో అరుణ్ కుమార్ వేసిన పిటిషన్లు, ఇప్పుడు సీఐడీ పెట్టిన కేసులూ ఒకటేనా?

రామోజీరావు, ఆయన కోడలు శైలజ విచారణకు దారి తీసిన పరిస్థితులు ఏమిటి?

ఈ కేసులు అర్థం కావాలంటే ముందు అసలు చిట్ ఫండ్ వ్యాపారం చుట్టూ ఉండే నిబంధనలు తెలియాలి.

చిట్ ఫండ్ వంటి వ్యాపారాలను పర్యవేక్షించేందుకు రెండు ప్రధాన చట్టాలున్నాయి. ఐపీసీ వీటికి అదనం.

స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ పరిధిలో ఉండే ‘అసిస్టెంట్ రిజిస్ట్రార్, చిట్స్’ అనే అధికారి ఈ చిట్ వ్యాపారాలు సక్రమంగా నిర్వహించేలా చూస్తారు.

అలాగే చీటీల వ్యాపారాలతో జరిగే మోసాలను అరికట్టడానికి మరికొన్ని చట్టాలు కూడా ఉన్నాయి.

అవి:

  • ఆంధ్రప్రదేశ్ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఇన్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ చట్టం - 1999
  • చిట్ ఫండ్ చట్టం – 1982

తాజాగా ఏపీ పోలీసులు మార్గదర్శిపై పెట్టిన కేసుల్లో చిట్ ఫండ్ చట్టం నుంచి రెండు సెక్షన్లు, ఫైనాన్స్ కంపెనీల ప్రొటెక్షన్ చట్టం నుంచి రెండు సెక్షన్లు, ఐపీసీ నుంచి వివిధ సెక్షన్ల ఆధారంగా కేసు పెట్టారు.

ఆయా చట్టాల్లోని వివిధ నిబంధనలను మార్గదర్శి పాటించడం లేదన్నది అభియోగం.

శైలజ

ఫొటో సోర్స్, Margadarshi website

ఆరోపణలు ఏంటి?

మార్గదర్శిపై ఆంధ్ర రాష్ట్రానికి చెందిన మొత్తం ఏడుగురు ప్రభుత్వ అధికారులు ఫిర్యాదు చేశారు.

విశాఖ, కాకినాడ, ఏలూరు, విజయవాడ, గుంటూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల ‘చిట్స్ అసిస్టెంట్ రిజిస్ట్రార్‌’లు మార్గదర్శి అక్రమాలకు పాల్పడుతోందంటూ ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశారు.

2022 అక్టోబరు, నవంబరు నెలల్లో రిజిస్ట్రేషన్ల శాఖ ఆంధ్రలోని వివిధ మార్గదర్శి ఆఫీసుల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించింది. పెద్దఎత్తున పత్రాలను స్వాధీనం చేసుకుంది.

అప్పటినుంచీ నోటీసుల పరంపర కొనసాగుతూనే ఉంది. మళ్లీ మార్చి 12న కూడా మార్గదర్శి కార్యాలయాల్లో సోదాలు జరిగాయి.

ఈ సోదాల అనంతరం ఆ సంస్థపై పలు కేసులు పెట్టారు. తరువాత ఒక ప్రెస్ మీట్ ఏర్పాటుచేసి సంస్థపై ఉన్న ఆరోపణలను వివరించారు సీఐడీ, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు.

చిట్ ఫండ్స్‌లో పెట్టిన పెట్టుబడులు ఎటూ మళ్లించకూడదు, ఎక్కడా వాడకూడదు, ఎవరికి బదిలీ చేయకూడదు వంటి రూల్స్ ఉంటాయి. మార్గదర్శి ఆ నిబంధనలు పాటించలేదన్నది ప్రధాన ఆరోపణ.

‘‘వివిధ మార్గదర్శి బ్రాంచీల్లో మేం చేసిన సోదాల్లో డబ్బంతా వాళ్ల కార్పొరేట్ ఆఫీసుకు బదిలీ అయినట్టు మాకు స్పష్టమైన ఆధారాలు దొరికాయి. వాటిని వారు మ్యూచువల్ ఫండ్స్‌లో పెడుతున్నట్టు తెలుస్తోంది. మ్యూచువల్ ఫండ్స్ అనేవి మార్కెట్ రిస్కుల ప్రకారం ఉంటాయి. కాబట్టి అలా బదిలీ చేయడం సరైన ప్రక్రియ కాదు’’ అని బీబీసీతో చెప్పారు ఒక అధికారి. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా కూడా పలు లావాదేవీలు జరిగినట్టు వారు చెబుతున్నారు.

‘‘చిట్ ఫండ్ చట్టం ప్రకారం బ్రాంచి మేనేజర్ దగ్గర పూర్తి వివరాలు ఉండాలి. కానీ మేం ప్రశ్నించినప్పుడు మాత్రం, వాళ్లంతా మాకేం తెలియదు అంటున్నారు. అంతా హెడ్ ఆఫీసు నుంచే జరుగుతోంది అని చెబుతున్నారు. అది కూడా నిబంధనలకు విరుద్ధమే’’ అని మీడియాతో చెప్పారు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రామకృష్ణ.

‘‘పెద్దఎత్తున నిధుల మళ్లింపు, అకౌంట్లలో తేడాలు, అవసరమైన లెడ్జర్లు నిర్వహించకపోవడం, చందా డబ్బు చిట్ అకౌంట్లో డిపాజిట్ చేయకపోవడం, ఒక చిట్‌లో లోటు వచ్చిన డబ్బును వేరే చిట్ డబ్బుతో పూరించడం వంటి తేడాలు మాకు కనిపించాయి’’ అన్నారు సీఐడీ అదనపు డీజీ సంజయ్.

మార్గదర్శి

ఫొటో సోర్స్, Getty Images

అదే పెద్ద సమస్య..

మిగతా అన్ని ఉల్లంఘనల కంటే చిట్ ఫండ్ డబ్బు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టడం పెద్ద సమస్యగా చూస్తున్నారు విచారణ అధికారులు. 50 కోట్లు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్, ఎడెల్వెసిస్ ఆర్బిట్రేజ్ ఫండ్ ఇతర సంస్థలో పెట్టినట్టు వారు చెబుతున్నారు. చిట్ ఫండ్ చట్టం ప్రకారం చిట్టీల డబ్బును, వసూలు చేసిన వారు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టకూడదు. ఆ మాటకొస్తే వేరే ఏ ఇతర కంపెనీల్లోనూ పెట్టకూడదు. కానీ ఈ రెండు నిబంధనలనూ మార్గదర్శి ఉల్లంఘించింది అనేది ఏపీ ప్రభుత్వ ఆరోపణ.

‘‘చిట్టీల డబ్బు ఉషా కిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో 2 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు. అలా వేరే కంపెనీలోకి డబ్బు మళ్లించడం కూడా చట్ట విరుద్ధం. వ్యక్తిగత లాభాల కోసం చిట్ వేసిన వారి సొమ్మును నిబంధనలకు విరుద్ధంగా మళ్లించారు’ అని బీబీసీతో చెప్పారు సీఐడీ అధికారులు.

‘‘చిట్టీ నెలవారీ చందాలను చిట్ ఫండ్ చట్టం సెక్షన్ 27, 32ల ప్రకారం నిర్వహించలేదు. చిట్టీల మధ్య డబ్బు మార్పిడి విపరీతంగా జరిగింది. సాధారణంగా చిట్టీ అగ్రిమెంట్లలో బ్యాంక్ అకౌంట్ నంబర్ ఉండాలి. కానీ వీళ్లు మాత్రం ఒక అకౌంట్ నంబర్ కాకుండా చాలా అకౌంట్ నంబర్లు వాడతున్నారు. ఆ బ్యాంకు అకౌంట్ నంబర్లను చందాదారులకు చెప్పడం లేదు. ఆ అకౌంట్లపై కూడా కార్పొరేట్ కార్యాలయానికే అధికారాలు ఉంటున్నాయి తప్ప, స్థానిక బ్రాంచీలకు అధికారం ఉండడం లేదు. వాళ్లే డబ్బు వేయడం తీయడం చేస్తున్నారు. ఆ రకంగా చిట్టీల చట్టం ప్రకారం బాధ్యతగా ఉండాల్సిన మేనేజర్లు తమ విధుల్లో నిర్లక్ష్యం వహించినట్టే. దీనివల్ల హెడ్ ఆఫీసు నుంచి నగదు మళ్లింపు తేలిక అవుతోంది’’అని వివరించారు సీఐడీ అధికారులు.

‘‘అటు మనీ లాండరింగ్ జరిగినట్టు కూడా మాకు అనుమానాలు ఉన్నాయి. డిపాజిట్ కాని చెక్కులను చూపించి బాలెన్స్ షీట్లు ఎక్కువగా చూపించారు. వాళ్ల ఆడిటర్ శ్రావణ్ మార్గదర్శి వారు ఇచ్చిన కాగితాలపై సంతకాలు పెట్టేశారు తప్ప ఆడిటింగ్ నిబంధనల ప్రకారం వెరిఫై చేసుకోలేదు. సీఐడీ వాళ్లు బ్యాంకులో ఆరా తీసిన దానికీ, శ్రావణ్ ధ్రువీకరించిన బ్యాంకు బాలెన్సులకూ మధ్య చాలా తేడా ఉంది. వందల కోట్ల రూపాయల నగదు ఎక్కువ ఉన్నట్టు చూపించారు. అంతేకాదు, ఇన్‌కమ్ టాక్స్ చట్టానికి విరుద్ధంగా పెద్ద మొత్తంలో నగదు తీసుకుంటున్నారు. టీడీఎస్ కట్ చేయడం లేదు’’ అని వివరించారు సీఐడీ అధికారులు

‘‘చిట్ ఫండ్ చట్టాల ప్రకారం చిట్టీల సంబంధించిన అధికారం బ్రాంచి మేనేజర్ల దగ్గరే ఉండాలి. కానీ వారికి 500 రూపాయల కంటే చెక్ పవర్ లేదు. మొత్తం కంట్రోల్ అంటే హైదరాబాద్ కేంద్రంగా ఉండే 11 మంది డైరెక్టర్ల చేతిలో ఉంది. అది నిబంధనలకు విరుద్ధం’’అని సీఐడీ అధికారులు చెప్పారు.

మార్గదర్శి

ఫొటో సోర్స్, Getty Images

మార్గదర్శిపై పెట్టిన కేసులు:

  • డిపాజిటర్ల రక్షణ చట్టం సెక్షన్ 5: డిపాజిట్లను తిరిగి ఇవ్వలేని పక్షంలో సంస్థలోని బాధ్యులకు పదేళ్ల జైలు శిక్ష.
  • ఐపీసీ సెక్షన్లు 120బీ, 409, 420, 477ఏ రెడ్ విత్ 34: నేరపూరిత కుట్రలకు శిక్ష, తమ ఆధీనంలో ఉంచిన, వ్యాపారం కోసం పెట్టిన పెట్టుబడి విషయంలో కుట్రతో, మోసం చేస్తే వారికి జీవిత శిక్ష విధించడం, రికార్డులు తారుమారు చేయడం, మోసం చేయడం వంటి నేరాలు.
  • చిట్ ఫండ్ చట్టం సెక్షన్ 76: చిట్ ఫండ్ చట్టం ప్రకారం సకాలంలో పత్రాలు సమర్పించకపోవడం, అగ్రిమెంట్లలో ఉన్న విధంగా తారీఖులు వంటి నిబం‌ధనలు పాటించకపోవడం – దానికి శిక్ష
  • చిట్ ఫండ్ చట్టం సెక్షన్ 79: చిట్ ఫండ్ చట్టం ప్రకారం తప్పు చేస్తే, కేవలం కంపెనీ మీదే కాకుండా ఆ తప్పు జరిగిన సమయంలో కంపెనీలో బాధ్యతల్లో ఉన్న అందరిపైనా చర్యలు తీసుకునే హక్కు.
మార్గదర్శి

ఫొటో సోర్స్, Getty Images

ప్రభుత్వం ఏం చెబుతోంది?

పై నేరాలన్నిటినీ ప్రస్తుతం సీఐడీ విచారణ చేస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వం సీరియస్ గానే ఉంది అనడానికి సాక్ష్యంగా రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ వి.రామకృష్ణ, సీఐడీ అదనపు డీజీ సంజయ్ ఇద్దరూ కలిసి విలేకర్ల సమావేశం పెట్టి.. మార్గదర్శి ఎన్నో అవకతవకలకు పాల్పడిందనీ, విచారణలో నేరం రుజువైతే ఏ స్థాయికి వెళ్లి అయినా కఠిన చర్యలు తీసుకుంటామనీ వారు హెచ్చరించారు.

మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ రామోజీరావు, ఆయన కోడలు, సంస్థ ఎండీ శైలజ, కొందరు బ్రాంచ్ మేనేజర్లపై రిజిస్ట్రేషన్ల శాఖ ఫిర్యాదు మేరకు ఏపీ సీఐడీ పలు ఎఫ్ఐఆర్లను నమోదు చేసింది.

మంగళగిరి సీఐడీ పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదు అయింది.

ప్రభుత్వం కేసులు పెట్టిన తరువాత డిపాజిట్‌దారులు 8 మంది కేసులు పెట్టారని సీఐడీ అధికారులు ప్రకటించారు. దీంతో ఈ ఏడాది మార్చి 12న మార్గదర్శి విజయవాడ, ఒంగోలు, చీరాల బ్రాంచీల మేనేజర్లను సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. తరువాత వీరికి వివిధ కోర్టుల్లో బెయిల్ మంజూరైంది.

మార్చి నెలాఖరున విచారణ కోసం రామోజీరావు, శైలజలకు సీఐడీ నోటీసులు ఇచ్చింది. మార్చి 14వ తేదీన మార్గదర్శి హైకోర్టుకు వెళ్లింది.

మార్గదర్శి సిబ్బందిపైనా.. రామోజీ రావు, శైలజలపై ఎలాంటి బలవంతపు చర్యలూ చేపట్టరాదని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

శైలజను హైదరాబాద్‌లో ఏప్రిల్ 3న విచారించారు పోలీసులు.

వీడియో క్యాప్షన్, మీడియా సంస్థలు బిజినెస్ ఎంపైర్స్ చేతుల్లోకి వెళితే ఏమవుతుంది? - వీక్లీ షో విత్ జీఎస్

ఉండవల్లి అరుణ్ పెట్టిన కేసూ ఇదీ ఒకటేనా?

మార్గదర్శి 1962 లో ప్రారంభం అయింది.

ఆంధ్రప్రదే‌శ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకల్లో వ్యాపారం నిర్వహిస్తోంది.

ప్రస్తుతం 4,300 మంది ఉద్యోగులు, 16,301 ఏజెంట్లు, 108 బ్రాంచీలు, 3,11,146 చందాదారులు, 11,206 కోట్ల టర్నోవరుతో ఉంది.

1992 లో తమిళనాడులో 2001లో కర్ణాటకలో వీరి వ్యాపారం ప్రారంభమైంది.

2006 నుంచి మార్గదర్శిపై వివాదం మొదలైంది.

నిజానికి మార్గదర్శిపై ప్రస్తుత కేసు కంటే ముందు నమోదయిన కేసు అప్పటి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వేసింది.

ఆయన సుదీర్ఘ కాలంగా ఈ అంశంపై కోర్టులో కేసు నడుపుతున్నారు. 2006వ సంవత్సరంలో ఆయన ఈ కేసు ఫైల్ చేశారు.

2014లో ఏపీ హైకోర్టు ఈ కేసును డిస్మిస్ చేసింది. దానిపై వెంటనే సుప్రీం కోర్టుకు వెళ్లారు అరుణ్ కుమార్.

తాను రామోజీరావుపై వేసిన కేసులో జగన్ నాయకత్వంలోని ఏపీ ప్రభుత్వం ఇంప్లీడ్ కావాలంటూ పలుసార్లు ఏపీ ప్రభుత్వ పెద్దలను అభ్యర్థించినట్టు ఉండవల్లి చెప్పారు.

చివరగా 2022లో ఏపీ ప్రభత్వం ఈ కేసులో ఇంప్లీడ్ అయింది.

వీడియో క్యాప్షన్, ఆ నాలుగు మీడియా సంస్థలను వైసీపీ నిషేధిస్తోందని వెల్లడించిన మంత్రి కొడాలి నాని

భారతదేశంలో వ్యాపార సంస్థలను నిర్వహించడానికి కొన్ని చట్టాలు ఉన్నాయి.

పార్టనర్షిప్, ప్రైవేట్ లిమిటెడ్, ప్రొప్రైటరీ, ఎల్ఎల్పీ వంటివి. వాటిలోనే హిందూ అన్ డివైడెడ్ ఫామిలీ ఒక రకం. అంటే హిందూ అవిభాజ్య కుటుంబం నడిపే సంస్థ(హెచ్‌యూఎఫ్) అంటారు దీన్ని. తల్లితండ్రులు, పిల్లలు, లేదా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు, కోడళ్లు.. ఇలా వీరంతా వాటాదారులుగా ఉంటూ చేసే వ్యాపారాన్ని హెచ్‌యూఎఫ్ అని అంటారు.

అయితే ఆ తరహా వ్యాపారాలు చేసే వారు ప్రజల నుంచి డిపాజిట్లు తీసుకుని వ్యాపారం చేయకూడదని ఒక నిబంధన.

మార్గదర్శి హెచ్‌యూఎఫ్‌గా నమోదై నిబంధనలకు విరుద్ధంగా జనం నుంచి డిపాజిట్లు తీసుకుంది అనేది ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన ఫిర్యాదు.

దీనిపై ఉండవల్లి సమయం వచ్చిన ప్రతిసారీ మాట్లాడుతూనే ఉన్నారు. తాజాగా కూడా గత నవంబరులో, మార్చిలో ఆయన విలేకర్ల సమావేశాలు నిర్వహించి మార్గదర్శి చిట్ ఫండ్స్ విషయం మాట్లాడారు.

‘‘మార్గదర్శి సంస్థ డిపాజిట్లు తీసుకోవడం ఆపేసిందని 2006లోనే రామోజీరావు హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో చెప్పారు. అప్పటి వరకూ తీసుకున్నవాటిని ఇచ్చేస్తామన్నారు. కానీ ఇప్పటికీ డిపాజిట్లు తీసుకోవడం మానలేదు. మార్గదర్శి తమ డబ్బు చెల్లించలేదని చిట్టి వేసిన ఏ ఒక్క వ్యక్తీ (సబ్ స్క్రైబర్) ఫిర్యాదు చేయలేదు కాబట్టి, మార్గదర్శిపై కేసు కొట్టేయాలని వారు అంటున్నారు. అసలు చట్టపరమైన పాయింట్ మాట్లాడడం లేదు. హెచ్యూఎఫ్‌గా ఉంటూ డిపాజిట్లు తీసుకోవడం తప్పో కాదో చెప్పాలని నేను కోర్టును అడుగుతున్నాను. మార్గదర్శి వాళ్లు ఎక్కడా, తాము తప్పు చేయలేదనీ, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం లేదనీ మాత్రం చెప్పడం లేదు. మొదట్లో మార్గదర్శికి రామోజీకి సంబంధం లేదన్నారు. ఆయనపై ఆరోపణలు చేస్తే నాపై పరువు నష్టం దావా కూడా వేశారు. మళ్లీ ఆయనే తమ చైర్మన్ అంటూ వారు కోర్టులో పిటిషన్లు వేశారు’’ అని అన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్.

‘‘అసలు ఈనాడు మొత్తం ఈ చిట్స్ డబ్బు మీదే నడుస్తోంది. జనం డబ్బు బ్యాంకులో వేయకుండా మ్యూచువల్ ఫండ్స్‌లో పెడుతున్నారు’’ అని ఆరోపించిన అరుణ్ కుమార్, మొత్తం మార్గదర్శి వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం, రిటైర్డ్ సుప్రీం కోర్టు జడ్జి చేత విచారణ చేయించాలనీ, కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేసి విచారణ చేయించాలనీ డిమాండ్ చేశారు.

‘‘రామోజీరావు మార్గదర్శిని నడుపుతున్నట్టుగా దేశంలో బ్యాంకులను నడిపితే అసలు బ్యాంకులకు నష్టాలే ఉండవు. అప్పుడు ఆయనకు పద్మవిభూషణో, భారత రత్నో అవార్డు కూడా ఇవ్వొచ్చు అంటూ వ్యగ్యంగా వ్యాఖ్యానించారు అరుణ్.

మార్గదర్శి చైర్మన్ రామోజీరావుని నిన్న ఐదు గంటలపాటు సిఐడి బృందం విచారణ చేసింది.

ఆయన వీడియో స్టేట్మెంట్ రికార్డు చేశారు. మొత్తం 46 ప్రశ్నలతో విచారణ సాగినట్టుగా సిఐడి అధికారులు చెప్పారు.

అవసరమైతే మరోసారి విచారించే అవకాశం ఉంది. ఈనెల ఆరో తేదీన శైలజను విచారిస్తామని ఉంది అని అధికారులు వివరించారు.

ప్రస్తుతం తాము ఆర్థికంగా బలంగా ఉన్నట్టుగా అనేక పత్రాలు చూపిస్తోంది మార్గదర్శి.

జగన్ అక్కసుతోనే నాపైన, మార్గదర్శిపైనా బురద చల్లుతున్నారు: రామోజీ

కాగా ఎవరి నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేకుండానే మార్గదర్శి చిట్‌ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్‌పై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసిందని మార్గదర్శి వర్గాలు ఆరోపించాయి.

‘మార్గదర్శికి సంబంధించిన సమాచారం మొత్తం జిల్లాల్లోని బ్రాంచ్ కార్యాలయాల్లోనే ఉంటుంది. కొత్త చిట్‌ల వివరాలు మొదలుకుని ఆయా శాఖల్లో జరిగే కార్యకలాపాలన్నింటి సమాచారాన్ని చట్టప్రకారం ఎప్పటికప్పుడు చిట్‌లు పర్యవేక్షించే రిజిస్ట్రార్లకు పంపిస్తుంటాం’ అని రామోజీ రావు సీఐడీ అధికారులకు చెప్పినట్లు ‘ఈనాడు’ పత్రిక రాసింది.

60 ఏళ్లుగా ఇలా పంపిన సమాచారానికి సంబంధించి రిజిష్ట్రార్ల నుంచి ఎలాంటి అభ్యంతరాలు, ఫిర్యాదులు రాలేదని.. ఇప్పుడు ఉన్నట్టుండి ఇదంతా జరగడానికి ఏపీ ప్రభుత్వం, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కారణమని.. ‘ఈనాడు’ నిష్పక్షపాతంగా వార్తలు రాస్తుందనే కోపం, అక్కసుతోనే వ్యక్తిగతంగా తనపైన, మార్గదర్శిపైన బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారని రామోజీరావు సీఐడీ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు ఈనాడు కథనం తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)