ఇరాక్ వార్@20: సద్దాం పాలనే నయమని సర్వేలో తేల్చిన ప్రజలు

బాగ్దాద్‌లోని సద్దాం హుస్సేన్ విగ్రహాన్ని తొలగింపు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బాగ్దాద్‌లోని సద్దాం హుస్సేన్ విగ్రహాన్ని తొలగిస్తున్న అమెరికా బలగాలు
    • రచయిత, జులియన్ హజ్
    • హోదా, బీబీసీ అరబిక్

అమెరికా నేతృత్వంలో 2003లో దండయాత్ర మొదలైనప్పటి నుంచి దేశం పరిస్థితి అధ్వాన్నంగా మారిందని ఇరాక్‌లోని మెజారిటీ ప్రజలు చెప్పినట్లు ఒక కొత్త సర్వే వెల్లడించింది.

ఇరాక్‌లో సద్దాం హుస్సేన్ పాలన ముగిసి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సర్వేను చేశారు.

లాభాపేక్ష లేని గ్లోబల్ పోలింగ్ సంస్థ ‘‘గాలప్ ఇంటర్నేషనల్’’ ఈ సర్వేను చేసింది.

ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో, ఇరాక్‌లోని 18 గవర్నరేట్ (ప్రభుత్వ పాలక విభాగాలు) ప్రాంతాల్లో ముఖాముఖిగా ఈ సర్వేను చేపట్టారు.

అమెరికా దండయాత్రకు ముందుతో పోలిస్తే ఇప్పటి ఇరాక్ పరిస్థితి ఎలా ఉందని ప్రశ్నించగా, 60 శాతం మంది ప్రస్తుతం దేశం పరిస్థితి బాగా దిగజారిందని చెప్పారు.

40 శాతం మంది పరిస్థితులు మెరుగయ్యాయని తెలిపారు.

2003 తర్వాత ఇరాక్‌లో షియా అరబ్ మెజారిటీ రాజకీయంగా శక్తిమంతంగా మారింది. ఇది సున్నీ, కుర్ద్, ఇతర మైనారిటీ కమ్యూనిటీల్లో ఆగ్రహాన్ని పెంచింది.

ఈ కమ్యూనిటీల మధ్య విభజన ఉన్న విషయం సర్వేలో తేటతెల్లమైంది.

సద్దాం హుస్సేన్ పాలనలో జీవితం బాగుండేదని దాదాపు 54 శాతం మంది సున్నీ ముస్లింలు సర్వేలో పేర్కొన్నారు.

ఈ ప్రశ్నకు తాజాగా స్పందించిన ప్రతీ ముగ్గురిలో ఒక్కరు మాత్రమే ప్రస్తుతం ఇరాక్ పరిస్థితి అధ్వాన్నంగా ఉందని చెప్పారు.

2003లో ఇదే ప్రశ్నను అడిగినప్పుడు ప్రతీ ముగ్గురిలో ఇద్దరు, దేశం పరిస్థితి ఏమీ బాగోలేదని చెప్పినట్లు గాలప్ ఇంటర్నేషనల్ కనుక్కుంది.

సద్దాం హుస్సేన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సద్దాం హుస్సేన్ విగ్రహాన్ని తొలగిస్తున్న అమెరికా సైనికులు

అన్బర్ ప్రావిన్సులో నివసించే 45 ఏళ్ల ఒక వ్యక్తి, గాలప్ సర్వే టీమ్‌తో మాట్లాడారు.

‘‘పరిస్థితి మెరుగైందా? లేదా అధ్వాన్నంగా మారిందా? అనేది నిర్ణయించడం చాలా కష్టం. మార్పు ఏదైనా కొత్త ఆశలను రేకెత్తిస్తుంది. అప్పుడు మనం గతాన్ని మర్చిపోతాం. ఆర్థిక వ్యవస్థ మెరుగై ఉండొచ్చు. కానీ భద్రత, ఉత్పత్తి రంగాలు క్షీణించాయి’’ అని చెప్పారు.

2003లో ఇరాక్‌పై అమెరికా దండెత్తింది. ఇరాక్ వద్ద ‘సామూహిక విధ్వంసక మారణాయుధాలు (వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్-డబ్ల్యూఎండీ)’ ఉన్నాయని అమెరికా వాదించింది.

ప్రపంచ భద్రతకు సద్దాం హుస్సేన్ ప్రభుత్వం ప్రమాదకరంగా మారిందని భావించి ఈ దండయాత్రకు పాల్పడింది.

కానీ, ఇరాక్ వద్ద ఈ ఆయుధాలు ఉన్నట్లు సాక్ష్యాలేవీ లభించలేదు. పైగా యుద్ధం కారణంగా లక్షలాది మంది ఇరాక్ పౌరులు చనిపోయారు. ఈ యుద్ధం ఆ దేశంలో అస్థిరతను ఏర్పరచింది.

తగిన కారణాలను చెబుతూ యుద్ధాన్ని అమెరికా సమర్థించుకున్నా, అసలు ఉద్దేశాలు వేరే ఉన్నాయని చాలామంది ఇరాక్ పౌరులు అనుమానించారు.

ఇరాక్‌లోని వనరులను దోచుకోవడం కోసమే అమెరికా దండెత్తిందని 51 శాతం మంది ఇరాక్ పౌరులు గట్టిగా నమ్ముతున్నారు.

సద్దాం హుస్సేన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2003లో ఇరాక్‌పై అమెరికా దండయాత్ర చేసింది

చమురు, సహజవాయువు నిక్షేపాలు అత్యధికంగా ఉండే ఆగ్నేయ గవర్నరేట్లు, అన్బర్ ప్రావిన్సులో ఈ నమ్మకం మరింత బలంగా ఉంటుంది.

సద్దాం హుస్సేన్‌ పాలనను పడగొట్టడానికే అమెరికా దండయాత్ర చేసిందని సర్వేలో పాల్గొన్న 29 శాతం మంది భావిస్తున్నారు.

అమెరికా రక్షణ శాఖ కాంట్రాక్టర్లకు ప్రయోజనాలు చేకూర్చడం, తీవ్రవాదంపై పోరాటం, ఇరాక్‌లో ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేయడం వంటి కారణాలను కూడా ప్రజలు సర్వేలో పంచుకున్నారు. అయితే, వీటిని చాలా తక్కువ మంది మాత్రమే చెప్పారు.

అమెరికా దండయాత్ర మొదలైనప్పుడు, ఇరాక్‌లోని ఒక కమ్యూనిటీకి చెందిన పౌరసైన్యం (మిలీషియా) వీధుల్లోకి వచ్చింది.

ఇరాక్‌లో 60 శాతంగా ఉన్న షియా ముస్లింలు, సద్దాం హుస్సేన్ పాలనలో చాలాకాలం అణచివేతకు గురయ్యారు.

2014లో ఇరాక్‌లో కొత్త పోరాటం మొదలైంది.

ఇరాక్‌కు అమెరికాతో పాటు మిత్ర దేశాల నుంచి భారీ మిలటరీ సహాయం అందడంతో 2018లో ఐఎస్‌ను దేశం నుంచి తరిమికొట్టారు.

అప్పటి నుంచి దేశంలో స్థిరత్వం తిరిగొచ్చింది.

సర్వే ప్రకారం, దేశ భవిష్యత్‌లో అమెరికా ప్రమేయం విషయంలో ఇరాక్ ప్రజలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.

2007లో ఇరాక్‌లో అమెరికా సైనికుల సంఖ్య అత్యధికంగా 1,70,000గా ఉండేది. ఇప్పుడు వారి సంఖ్య దాదాపుగా 2,500గా ఉంది.

ఇరాక్

ఫొటో సోర్స్, Getty Images

ఇరాక్‌కు దక్షిణ భాగాన ఉండేవారిలో చాలామంది తక్షణమే అమెరికా బలగాలను దేశం నుంచి వెళ్లిపోవడాన్ని సర్వేలో కోరారు.

కుర్దిస్తాన్ రీజియన్‌తో సహా ఉత్తర ప్రాంతంలో ఉండే వారు దేశంలో కొంత స్థాయలో అమెరికా ఆర్మీ ఉండటం అవసరమని భావిస్తున్నారు.

సర్వేలో పాల్గొన్న 75 శాతం మంది షియా ముస్లింలు, అమెరికా సంకీర్ణ బలగాల రాకను వ్యతిరేకించారు. వారు తమ దేశానికి రాజకీయ, భద్రతా మిత్ర దేశంగా రష్యాకు మద్దతు ఇచ్చారు.

ఇటీవలి సంవత్సరాలలో మధ్య ప్రాచ్యంలో ఆర్థికంగా చైనా చాలా ఉన్నత స్థానంలో నిలిచింది.

ఇరాక్‌లో యువత భవిష్యత్ అంధకారంలో ఉంది. 2019లో బాగ్దాద్ వీధుల్లో ప్రారంభమైన అక్టోబర్ సోషల్ ఉద్యమాన్ని క్రూరంగా అణిచివేశారు.

సర్వేలో పాల్గొన్న 47 శాతం మంది ఇరాక్ ప్రజలు, అక్కడే ఉంటూ దేశాన్ని పునర్నిర్మించాలని అనుకుంటున్నారు. 25 శాతం మంది దేశాన్ని వదిలి వెళ్లిపోవాలని కోరుకుంటున్నారు.

18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉన్న ప్రతీ ముగ్గురిలో ఒకరు దేశాన్ని వదిలేయాలని అనుకుంటున్నారు. దేశంలోని రాజకీయ పరిస్థితులు, అవినీతి సమస్యల దీనికి కారణంగా చూపిస్తున్నారు.

అమెరికా బలగాలు

ఫొటో సోర్స్, Getty Images

గత 20 ఏళ్లుగా లక్షలాది ఇరాకీలు గందరగోళం, మానసిక వ్యథల మధ్య బతుకుతున్నారు.

గత కాలపు భారాన్ని మోస్తూనే, మంచి భవిష్యత్‌ను తీర్చిదిద్దుకోవాలనే ఆశతో కొత్త తరం పుట్టుకొస్తోంది.

ఇరాక్ జనాభాలో 40 శాతం మంది 15 ఏళ్ల లోపు వారే ఉన్నారు. ఈ తరం వారు మంచి ఉద్యోగ అవకాశాలకు, ఆర్థిక భద్రతకు ప్రాధాన్యత ఇస్తారు. తద్వారా దేశంలో శాంతి, స్థిరత్వం కూడా లభిస్తుంది.

దీనికి ఇరాక్ నాయకులు, అంతర్జాతీయ మద్దతుదారులు ప్రోత్సాహం లభిస్తుందని ఆశిస్తున్నారు.

డేటా జర్నలిజం: లియోని రాబర్ట్‌సన్

డిజైన్: రాయిస్ హుస్సేన్, ఇస్మాయిల్ మోనీర్

ఎడిటర్లు: మయా మౌస్సావీ, జొహాన్నెస్ డెల్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)