ఇరాక్ యుద్ధం: 20ఏళ్ల కిందట అమెరికా ఎందుకు దండెత్తింది?

ఫొటో సోర్స్, Getty Images
2003 మార్చి 20న మిత్ర దేశాలతో కలిసి అమెరికా.. ఇరాక్‌పై దండెత్తింది. అక్కడి సద్దాం హుస్సేన్ ప్రభుత్వాన్ని కూలదోసింది.
ఇరాక్ దగ్గర భారీ విధ్వంసానికి కారణమయ్యే ఆయుధాలు ఉన్నాయని, వీటితో అంతర్జాతీయ శాంతికి ముప్పు పొంచి వుందని ఆనాడు అమెరికా చెప్పింది. అయితే, ఇరాక్‌పై సైనిక చర్య కోసం అమెరికాకు మద్దతు ఇచ్చేందుకు చాలా దేశాలు నిరాకరించాయి.
అసలు ఇరాక్‌పై అమెరికా ఎందుకు దండెత్తింది?
1990-91నాటి గల్ఫ్ యుద్ధంలో అమెరికా నేతృత్వంలోని కొన్ని దేశాలు ఇరాక్‌ను కువైట్ నుంచి వైదొలిగేలా చేశాయి.
ఆ తర్వాత, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ‘‘తీర్మానం-687’’ను ఆమోదించారు. ఇరాక్ తమ దగ్గరున్న విధ్వంసకర ఆయుధాలైన వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ (డబ్ల్యూఎండీ)లు అన్నింటినీ నిర్వీర్యం చేయాలని దీనిలో సూచించారు. అణు, జీవ, రసాయన ఆయుధాలు, దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణులను డబ్ల్యూఎండీలుగా పిలుస్తారు.
అయితే, 1998లో ఐక్యరాజ్యసమితి ఆయుధ పరిశీలకుల తనిఖీలకు సహకరించమని ఇరాక్ తేల్చిచెప్పింది. దీంతో అమెరికా, బ్రిటన్ వైమానిక దాడులు మొదలుపెట్టాయి.
న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌తోపాటు వాషింగ్టన్‌లోని పెంటగాన్‌పై 2001 సెప్టెంబరు 11న అల్‌ఖైదా దాడుల అనంతరం, ఇరాక్‌పై దండెత్తాలని అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ ప్రభుత్వం ప్రణాళికలు రచించింది.
విధ్వంసకర డబ్ల్యూఎండీలను సద్దాం హుస్సేన్ పెద్దయెత్తున తయారుచేస్తున్నారని, అక్కడ వీటి నిల్వలు భారీగా పెరిగాయని బుష్ ప్రభుత్వం చెప్పింది.
అంతేకాదు ఇరాక్, ఇరాన్, ఉత్తర కొరియాలు ప్రమాదకర కూటమిగా ఏర్పడ్డాయని అమెరికా ఆరోపించింది.

ఫొటో సోర్స్, Getty Images
2002 అక్టోబరులో ఇరాక్‌పై సైనిక చర్యలకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపింది.
‘‘భారీ విధ్వంసాలకు కారణమయ్యే డబ్ల్యూఎండీలు పెద్దయెత్తున ఇరాక్ నిల్వ చేసిందని అమెరికాలో చాలా మంది భావించేవారు. ఈ ఆయుధాలతో తమకు చాలా ముప్పు పొంచివుందని అనుకునేవారు’’అని లండన్‌కు చెందిన విదేశీ వ్యవహారాల థింక్ ట్యాంక్ ‘అమెరికాస్ ప్రోగ్రామ్ ఎట్ ఛాటమ్ హౌస్’ డైరెక్టర్ లెస్లీ వింజమూరి చెప్పారు.
ఫిబ్రవరి 2003లో అప్పటి అమెరికా విదేశాంగ మంత్రి కోలిన్ పావెల్.. ఇరాక్‌పై సైనిక చర్యలకు ఆమోదం తెలపాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని కోరారు. ఇదివరకు ఆమోదించిన కొన్ని తీర్మానాలను ఇరాక్ ఉల్లంఘించిందని ఆయన చెప్పారు.
కానీ, మండలిలోని సభ్య దేశాలను ఒక తాటిపైకి ఆయన తీసుకురాలేకపోయారు. చాలావరకు సభ్య దేశాలు మొదటగా ఐక్యరాజ్యసమితోపాటు ఇంటర్నేషనల్ ఎనర్జీ అథారిటీ (ఐఈఏ)కి చెందిన ఆయుధ పరిశీలకులను ఇరాక్ పంపించాలని, సోదాలు చేపట్టాలని సూచించాయి. మొత్తానికి 2002లో ఆయుధ పరిశీలకులు ఇరాక్‌కు వెళ్లారు.
అయితే, ఆ ఆయుధ పరిశీలకుల నివేదిక వచ్చేవరకు ఎదురుచూడటం మంచిదికాదని అమెరికా సూచించింది. ఇరాక్‌పై దండెత్తేందుకు మద్దతు తెలిపిన దేశాలతో ఒక కూటమిని ఏర్పాటుచేసింది.

యుద్ధానికి ఎవరు మద్దతు తెలిపారు?
మొత్తంగా 30 దేశాలతో అమెరికా ఒక కూటమి ఏర్పాటుచేసింది. వీటిలో బ్రిటన్, ఆస్ట్రేలియా, పోలండ్‌లతో కలిసి ఇరాక్‌పై అమెరికా దండెత్తింది.
బ్రిటన్ 45,000 మంది జవాన్లను, ఆస్ట్రేలియా 2,000 మందిని, పోలండ్ తమ ప్రత్యేక దళాలకు చెందిన 194 మంది జవాన్లను ఇరాక్‌పైకి పంపించాయి.
తమ భూభాగం నుంచే ఈ సైనిక చర్య మొదలుపెట్టేందుకు కువైట్ అంగీకరించింది.
తూర్పు ఐరోపాలోని కొన్ని దేశాలతో కలిసి స్పెయిన్, ఇటలీ.. అమెరికా నేతృత్వంలోని సంకీర్ణానికి దౌత్యపరమైన సాయం అందించాయి. ఇరాక్ దగ్గర విధ్వంసకర ఆయుధాలు ఉన్నాయని, ఐరాస తీర్మానాలను ఇరాక్ ఉల్లంఘించిందని ఈ దేశాలు భావించాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఇరాక్‌పై వచ్చిన ఆరోపణలు ఏమిటి?
జీవ ఆయుధాలు (బయోలాజికల్ వెపన్స్) తయారుచేసేందుకు ఇరాక్ కొన్ని ‘‘మొబైల్ ల్యాబ్స్’’ ఏర్పాటుచేసిందని 2003లో ఐక్యరాజ్యసమితికి అప్పటి అమెరికా విదేశాంగ మంత్రి కోలిన్ పావెల్ చెప్పారు.
అయితే, ఈ ఆరోపణలను రుజువు చేసేందుకు తమ దగ్గర ప్రస్తుతానికి స్పష్టమైన ఆధారాలులేవని 2004లో ఆయన అంగీకరించారు.
మరోవైపు బ్రిటన్‌తోపాటు పశ్చిమాసియాలోని తూర్పు ప్రాంతాలపై 45 నిమిషాల్లోనే దాడికి సిద్ధంచేసే క్షిపణులు ఇరాక్ దగ్గర ఉన్నట్లు తమకు నిఘా సమాచారం అందిందని బ్రిటన్ ప్రభుత్వం నుంచి కూడా నివేదిక బయటకు వచ్చింది.
ఆ తర్వాత, అప్పటి బ్రిటన్ ప్రధాని టోనీ బ్లెయిర్ కూడా సద్దాం హుస్సేన్ భారీగా విధ్వంసకర డబ్ల్యూఎండీలను తయారుచేస్తున్నారని నిస్సందేహంగా చెప్పగలమని వ్యాఖ్యానించారు.
ఇరాక్ సైన్యం నుంచి బయటకువచ్చిన రసాయన ఆయుధాల ఇంజినీరు రఫీద్ అహ్మద్ అల్వాన్ అల్-జనాబీ, ఇరాకీ మాజీ గూఢచారి మాజ్ మహమ్మద్ హరీథ్‌లు తమ ప్రతినిధులతో మాట్లాడారని ఇటు అమెరికా, అటు బ్రిటన్ చెప్పాయి. ఆ ఇద్దరు అధికారులూ ఇరాక్ డబ్ల్యూఎండీ కార్యక్రమంలో నేరుగా పాలుపంచుకున్నారని వివరించాయి.
అయితే, ఇరాక్‌పై అమెరికా సంకీర్ణ దళాలు దండెత్తి, సద్దాం హుస్సేన్ ప్రభుత్వాన్ని కూలదోయడమే లక్ష్యంగా తాము తప్పుడు సమాచారం ఇచ్చామని ఆ తర్వాత ఇద్దరు అధికారులూ అంగీకరించారు.

యుద్ధానికి మద్దతు ఇచ్చేందుకు ఎవరు నిరాకరించారు?
అమెరికాకు పొరుగున ఉండే కెనడా, మెక్సికో ఈ యుద్ధానికి మద్దతు ఇచ్చేందుకు నిరాకరించాయి.
మరోవైపు అమెరికాకు ప్రధాన మిత్ర దేశాలైన జర్మనీ, ఫ్రాన్స్ కూడా దీనికి మద్దతు ఇవ్వలేదు.
సైనిక చర్యకు వెళ్లడమంటే అది ‘‘ఈ సమస్యకు అత్యంత దారుణ పరిష్కారం’’ అవుతుందని అప్పటి ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి డొమినిక్ డీ విలెపిన్ వ్యాఖ్యానించారు.
మరోవైపు ఇరాక్ పొరుగునున్న నాటో సభ్య దేశం తుర్కియే ఈ సైనిక చర్యకు తమ వైమానిక క్షేత్రాలు ఉపయోగించుకోనివ్వబోమని స్పష్టంచేసింది.
1990-91 గల్ఫ్ యుద్ధంలో అమెరికా వెంటన నిలిచిన సౌదీ అరేబియా లాంటి పశ్చిమాసియా దేశాలు 2003నాటి ఇరాక్‌పై సైనిక చర్యకు మద్దతు ఇవ్వలేదు.
‘‘ఇదొక పిచ్చి ప్రణాళిక అని గల్ఫ్ అరబ్ దేశాలు భావించాయి’’అని ఎస్ఏఏఎస్ యూనివర్సిటీకి చెందిన పశ్చిమాసియా దేశాల రాజకీయ నిపుణుడు, ప్రొఫెసర్ గిల్‌బర్డ్ ఆర్చర్ అన్నారు.
‘‘సద్దాం హుస్సేన్ ప్రభుత్వం కుప్పకూలితే, ఇరాక్‌పై ఇరాన్ ప్రభావం పెరుగుతుందని ఆ దేశాలు భావించాయి’’అని ఆయన చెప్పారు.
యుద్ధంలో ఏం జరిగింది?
2003 మార్చి 20న సాయంత్రం ‘‘ఆపరేషన్ ఇరాకీ ఫ్రీడమ్’’ పేరుతో 2,95,000 మంది సంకీర్ణ సేనల జవాన్లతో కువైట్ సరిహద్దుల నుంచి ఇరాక్‌పై అమెరికా దండెత్తింది.
మరోవైపు ఇరాక్ ఉత్తరం వైపు నుంచి కుర్దిష్ పెష్‌మెర్గా దళాలకు చెందిన 70,000 మంది కూడా ఇరాకీ సైన్యంపై దండెత్తారు.
మే నెలకు ఇరాకీ సైన్యాన్ని అమెరికా సంకీర్ణం ఓడించింది. సద్దాం హుస్సేన్ ప్రభుత్వాన్ని కూడా కూలదోసింది. ఆ తర్వాత సద్దాం హుస్సేన్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం ఆయనకు మరణ శిక్షను అమలుచేశారు.
అయితే, మొత్తానికి ఇరాక్ దగ్గర ఎలాంటి విధ్వంసకర డబ్ల్యూఎండీలూ బయటపడలేదు.
2004నాటికి ఇరాక్‌లో సాయుధ పోరాటాలు పెల్లుబికాయి. ఆ తర్వాత అక్కడి సున్నీ, షియా ముస్లిం వర్గాల మధ్య అంతర్యుద్ధం చెలరేగింది.
2011లో ఇక్కడి నుంచి అమెరికా సేనలు వైదొలిగాయి.
యుద్ధంతోపాటు అనంతర పరిణామాల వల్ల 2003 నుంచి 2011 మధ్య ఇరాక్‌లో 4,61,000 మంది మరణించినట్లు అంచనాలు వెల్లడించాయి. మరోవైపు మూడు ట్రిలియన్ డాలర్లు (సుమారు రూ.247 లక్షల కోట్లు) ఆర్థిక నష్టం కూడా సంభవించిందని తెలిపాయి.
‘‘ఈ యుద్ధం వల్ల ప్రపంచ దేశాల నమ్మకాన్ని అమెరికా కోల్పోయింది’’అని రాయల్ యునైటెడ్ స్టేట్స్ సర్వీస్ ఇన్‌స్టిట్యూట్ థింక్ ట్యాంక్ డైరెక్టర్ జనరల్ డా. కారిన్ వోన్ హిప్పెల్ వ్యాఖ్యానించారు.
‘‘యుద్ధం జరిగి నేటికి 20 ఏళ్లు గడుస్తోంది. ఇప్పటికీ ‘మమ్మల్ని అమెరికా నిఘా సమాచారాన్ని నమ్మమంటారా?’అని ప్రజలు అడుతున్నారు’’అని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ఆస్కార్-ఆర్ఆర్ఆర్: వైఎస్ జగన్ ‘‘తెలుగు జెండా’’ అంటే ప్రాంతీయ వాదం అవుతుందా?
- కే హుయ్ క్వాన్: ఒకప్పుడు శరణార్థి...నేడు ఆస్కార్ విజేత
- మాతృత్వం: ‘మా అమ్మ వయసు 50 ఏళ్లయితే మాత్రం.. రెండవ బిడ్డను కనడానికి ఎందుకు సిగ్గుపడాలి?’
- కర్నాటక: ‘‘మైకుల్లో ప్రార్థించకుంటే అల్లాకు వినపడదా..’’ బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు... మరి నిబంధనలు ఏం చెబుతున్నాయి
- లావణి డ్యాన్స్: మహిళలను ప్రైవేటుగా బుక్ చేసుకునే ఈ నృత్యం ఏంటి? ఈ జీవితం మీద ఆ మహిళలు ఏమంటున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

















