తెలంగాణ: గుంజపడుగులో లాయర్ దంపతుల అంత్యక్రియలు

హైకోర్టు లాయర్ దంపతులు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, హైకోర్టు లాయర్లు గట్టు వామన్‌రావు, నాగమణి బుధవారం హత్యకు గురయ్యారు
మీ అభిమాన భారతీయ క్రీడాకారిణికి ఓటు వేసేందుకు CLICK HERE

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో బుధవారం హత్యకు గురైన న్యాయవాది గట్టు వామన్ రావు, ఆయన భార్య నాగమణి అంత్యక్రియలు వారి స్వగ్రామం గుంజపడుగులో పూర్తయ్యాయి. మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు సహా పలువురు నేతలు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

లాయర్ దంపతల హత్య కేసుకు సంబంధించి పోలీసులు కుమార్, చిరంజీవి, దాస్ అనే ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. గుంజపడుగులోని గుడి వివాదమే ఈ హత్యలకు ముఖ్య కారణమని వారు భావిస్తున్నారు.

ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని తెలంగాణ కాంగ్రెస్ నేత ఉత్తమ్‌కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇందుకోసం తాము హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేస్తామని, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కి లేఖ రాస్తామన్నారు.

న్యాయవాదులకు రక్షణ కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

హైకోర్టు

ఫొటో సోర్స్, High court website

ఈ కేసు విషయంలో తెలంగాణ హైకోర్టు ధర్మాసనం స్పందించింది. ఈ కేసును సుమోటోగా స్వీకరిస్తున్నట్లు తెలిపింది. ఈ హత్యలపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. లాయర్ల హత్యలు ప్రభుత్వ విశ్వాసాన్ని ప్రశ్నించేలా ఉందని వ్యాఖ్యానించిన హైకోర్టు, ప్రభుత్వం విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని సూచించింది.

ఈ కేసు దర్యాప్తును నిర్దిష్ట కాలపరిమితిలో పూర్తి చేయాలని చెప్పింది. తదుపరి విచారణను హైకోర్టు మార్చి 1వ తేదీకి వాయిదా వేసింది.

పోలీసుల వివరాల ప్రకారం గుడిని కూల్చేస్తే వామన్‌రావు కూలిపోతాడని కుంట శ్రీనివాస్ వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. గతంలో సికాసలో పని చేసిన కుంటా శ్రీనివాస్ కాల్ డేటాను పోలీసులు విశ్లేషించారు

కుంట శ్రీనివాస్‌పై అనేక కబ్జా, బెదిరింపులకు పాల్పడిన కేసులు ఉన్నాయని చెప్పిన పోలీసులు ఘటనాస్థలంలో ఐదుగురు ఉన్నట్టు తేల్చారు.కుంట శ్రీనివాస్‌ను త్వరలోనే పట్టుకుంటామంటున్నారు.

ఈ కేసుపై మరిన్ని వివరాలు ఇచ్చేందుకు రామగుండం సీపీ సత్యనారాయణ గురువారం సాయంత్రం మీడియాతో మాట్లాడబోతున్నారు.

నాంపల్లి క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గంపా వెంకటేశం
ఫొటో క్యాప్షన్, నాంపల్లి క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గంపా వెంకటేశం

అయితే, న్యాయవాదులైన భార్యాభర్తలను రక్షించడంలో విఫలమైన సీపీ సత్యనారాయణను సస్పెండ్ చేయాలని కోరుతూ నాంపల్లి క్రిమినల్ కోర్టులోని న్యాయవాదులు రాజ్‌భవన్ ముట్టడికి బయలుదేరారు. వారిని పోలీసులు అడ్డుకుని గోషామహల్ గ్రౌండ్ కు తరలించారు.

కారు

ఫొటో సోర్స్, UGC

మంథని నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా...

"న్యాయవాదులకు రక్షణ కల్పించే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ను వెంటనే అమలులోకి తేవాలి" అని నాంపల్లి క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గంపా వెంకటేశం మీడియాతో అన్నారు.

తెలంగాణ హైకోర్టులో న్యాయవాదులుగా ఉన్న గట్టు వామన్ రావు, నాగమణి దంపతుల స్వగ్రామం పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు.

మంథని కోర్టులో పని ముగించుకొని బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో తిరిగి హైదరాబాద్‌కు వెళ్తుండగా వారిపై దాడి జరిగిందని మంథని పోలీసులు చెప్పారు. తీవ్రంగా గాయపడిన వారిని అంబులెన్సులో ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే ప్రాణాలు కోల్పోయారు.

రామగిరి మండలం మారుతినగర్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు న్యాయవాదులు ప్రయాణిస్తున్న కారును అడ్డగించి, నడి రోడ్డుపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతోంది.

హత్యకు గురైన న్యాయవాదులు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, హత్యకు గురైన హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్ రావు, నాగమణి

ఈ కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ చెప్పారు. ఈ దాడికి బాధ్యులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు.

"తీవ్రంగా గాయపడి కొన ఊపిరితో ఉన్న గట్టు వామన్‌రావు తనపై దాడి చేసింది తన స్వగ్రామం గుంజపడుగుకు చెందిన శ్రీను, కుమార్‌లు అని, వసంత్ రావు అనే వ్యక్తి ప్రోద్బలంతో ఈ దాడి జరిగిందని చెప్పారు. ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకున్నాం. మరికొందరి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి" అని సీపీ సత్యనారాయణ చెప్పారు.

వీడియో క్యాప్షన్, హంతకులు ఎంతటివారైనా వదిలిపెట్టం: సీపీ సత్యనారాయణ

న్యాయవాదుల హత్యను తెలంగాణ బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది.

ఈ ఘటనను ఆంధ్రా లాయర్స్ అసోసియేషన్ కూడా ఖండించింది. న్యాయవాదులకు, వారి కుటుంబాలకు కనీస భద్రత లేకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేసింది.

న్యాయవాదులకు రక్షణ కల్పించటంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని, చట్టాలను, రాజ్యాంగాన్ని నిరంతరం పర్యవేక్షించే న్యాయవాదికి సామాజిక భద్రత, వృత్తి భద్రత లేకుండా పోతోందని ఆంధ్రా లాయర్స్ అసోసియేషన్ వ్యాఖ్యానించింది. బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది.

''జాతీయ స్థాయిలో న్యాయవాదులందరూ ఒక ప్రత్యేక కార్యాచరణకు పిలుపునివ్వాలి. న్యాయవాదుల రక్షణకై ప్రత్యేక చట్టం రూపొందించాలి. ఈ హత్యా ఘటనపై ప్రత్యేక దర్యాప్తుకు ప్రభుత్వం ఆదేశించాలి. న్యాయవాదులకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం చట్ట సభల్లో ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించాలి'' అని ఆంధ్రా లాయర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మేడా శ్రీనివాస్ అన్నారు.

ఈ హత్యపై సీఎం కేసీఆర్ స్పందించాలి: బండి సంజయ్

న్యాయవాదుల హత్యపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు.

వామన్‌రావుకు రక్షణ కల్పించాలని హైకోర్టు ఆదేశించినా, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఈ హత్యపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు.

కొవ్వొత్తులతో ర్యాలీ

ఫొటో సోర్స్, ugc

హైకోర్టు న్యాయవాదుల హత్య కేసులో దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా న్యాయ విద్యార్థుల ఆధ్వర్యంలో లా కళాశాల నుంచి ఆర్ట్స్ కాలేజ్ వరకు విద్యార్థులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

మంచిర్యాలలో న్యాయవాదులు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు.

తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల హత్యను నిరసిస్తూ గురువారం గుంటూరు జిల్లా వ్యాప్తంగా కోర్టుల్లో విధులు భహిష్కరించాలని జిల్లా బార్ ఫెడరేషన్ పిలుపునిచ్చింది.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)