‘‘కళ్లు తెరచి చూసేసరికి, సైనికుల కాలి దగ్గర పడి ఉన్నాను. గాయపడిన నా కాలిపై వారు ఆరు సిగరెట్లతో కాల్చారు.’’

- రచయిత, ఒకస్సానా ఆంటోనెంకో, లీనా షైఖోనీ
- హోదా, బీబీసీ న్యూస్
‘‘అడవిలో ఆ రోజులను గుర్తుచేసుకుంటే, ఇప్పటికీ నాకు భయమేస్తోంది’’అని జూమ్ కాల్‌లో బీబీసీతో మాట్లాడుతూ సిరియావాసి అబ్దుల్‌రహ్మాన్ కివాన్ చెప్పారు.
డిసెంబరు నెలలో ఆ రోజు చలి గజగజ వణికిస్తోంది. ఆయనకు ఎటుచూసినా మంచే కనిపిస్తోంది. ఒంట్లో శక్తి మొత్తం అయిపోవడంతో ఆయన కుప్పకూలారు. ఇక బతుకుతాననే ఆశ కూడా ఆయనలో ఆవిరైంది.
‘‘ఇక నా వల్ల కాదు అనిపించింది. గాయమైన నా కాలు ముందుకు కదిలేందుకు మొరాయించింది’’అని అబ్దుల్‌రహ్మాన్ చెప్పారు.
ఐరోపా సమాఖ్య దేశం లాత్వియా నుంచి బెలరూస్‌ను వేరుచేసే అడవుల్లో ఆయన వారాల నుంచీ నడుస్తున్నారు.
తూర్పు యూరప్‌లోని ఆ రెండు దేశాల సరిహద్దు దళాలు వీరిని తమ దేశాల్లోకి రాకుండా ముందుకూ, వెనక్కీ నెడుతున్నాయి.
‘‘యూరప్‌కు చేరుకోవడం అనేది అంతిమ యాత్ర లాంటిదని నాకు తెలుసు. కానీ, ఇది తప్పదు, నేను ముందుకు వెళ్లాల్సిందే. ఎందుకంటే కల్లోలిత సిరియా నుంచి ప్రాణాలు అరచేత పట్టుకొని నేను వస్తున్నాను’’అని ఆయన వివరించారు.
యుద్ధం వల్ల ఆయన ఒక కాలికి గాయమైంది. దీంతో ఆయన చాలా కష్టంతో నడుస్తున్నారు. అందుకే యూరప్‌లోకి కాస్త తేలిగ్గా అడుగుపెట్టే మార్గాన్ని ఎంచుకున్నారు.
ఫేస్‌బుక్‌లో కొన్ని అన్‌వెరిఫైడ్ అకౌంట్ల నుంచి కొన్ని అరబిక్ ప్రకటనలను ఆయన చూశారు. మొదట రష్యా, అక్కడి నుంచి బెలరూస్ గుండా యూరప్‌కు తీసుకెళ్తామని వాటిలో చెప్పారు. సాధారణంగా స్మగ్లర్లు ఈ మార్గాన్ని ఎక్కువగా ఉపయోగించుకుంటారు.
కొంత మంది స్నేహితులు ఇప్పటికే ఈ మార్గంలో గమ్యాన్ని చేరుకున్నారు. ఇది అత్యుత్తమ మార్గమని వారే అబ్దుల్ రహ్మాన్‌కు చెప్పారు. కానీ, ఆయనకు ఊహించని పరిస్థితులు ఎదురయ్యాయి.

రెండు సరిహద్దుల మధ్య కథ
బెలరూస్ నుంచి యూరోపియన్ యూనియన్ (ఈయూ) సభ్యదేశమైన పోలండ్‌లోకి అడుగుపెట్టేందుకు నవంబరులోనే అబ్దుల్ రహ్మన్‌తోపాటు మరికొందరు మూడుసార్లు యత్నించి విఫలమయ్యారు. తర్వాత మరో ఈయూ సభ్యదేశమైన లాత్వియాలోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నించారు.
30 అంగుళాల మందముండే మంచు అన్ని వైపులా కనిపిస్తున్న అడవుల్లో వీరు డజన్ల కి.మీ. నడిచారు. వీరి దగ్గర చాలా కొంచెం ఆహారం, నీరు మాత్రమే ఉండేవి.
‘‘చలికి మేం గజగజ వణికేవాళ్లం. మేం నడిచేటప్పుడు, కాస్త వేడిగా అనిపించేది. ఎక్కడైనా కూర్చున్నామా.. అక్కడి మంచుతో మా బట్టలన్నీ తడిచిపోయేవి’’అని అబ్దుల్‌రహ్మాన్ చెప్పారు.
వీరు తెచ్చుకున్న నీరు అయిపోయినప్పుడు, మంచులో నీరు పీల్చుకుంటూ శరీరంలో నీటి స్థాయులు పడిపోకుండా వీరు చూసుకునేవారు.
‘‘మాలో ఆశలు చచ్చిపోయాయి. మమ్మల్ని క్షమించండని మా కుటుంబ సభ్యులకు కూడా మేం సందేశాలు పంపించేశాం’’అని ఆయన చెప్పారు.

అబ్దుల్ రహ్మాన్‌కు మధ్యలో కలిసిన మరో సిరియావాసి ఇస్సామ్. వీరిద్దరూ వారాలపాటు ఆ అడవిలోనే గడిపారు. ఒకసారి లాత్వియాలోకి అడుగుపెట్టిన వెంటనే, అక్కడి సరిహద్దు బలగాలు వీరిని బెలరూస్‌లోకి తోసేసేవి. బెలరూస్‌లోకి వెళ్లినప్పుడు కూడా ఇలానే జరిగేది.
‘‘మేం మిన్స్‌క్‌లోకి మళ్లీ అడుగుపెట్టేందుకు బెలరూస్ భద్రతా దళాలు ఒప్పుకోవడం లేదు’’ అని లాత్వియా అధికారులకు మేం పదేపదే చెప్పేవాళ్లమని అబ్దుల్ రహ్మన్ చెప్పారు.
‘‘మీరు మమ్మల్ని లాత్వియాలోకి అడుగుపెట్టనివ్వకపోతే, మేం ఎక్కడి వెళ్లాలి? వెనక్కి వారు రానివ్వడంలేదు’’అని ప్రశ్నించినట్లు ఆయన వివరించారు.
ఆ తర్వాత లాత్వియా భద్రతా దళాలు వీరిని ఒక శిబిరంలో నిర్బంధించాయి. అది చాలా మురికిగా, చాలా మందితో ఇరుకుగా ఉండేదని అబ్దుల్ రహ్మాన్ చెప్పారు. బెలరూస్ సరిహద్దులోని వారి ప్రధాన కార్యాలయానికి కొన్ని గంటల దూరంలోనే ఆ శిబిరం ఉండేది.
సరిహద్దుల్లో నుంచి తీసుకొచ్చిన వారిని ఈ శిబిరాల్లో ఉంచుతారు. ఇక్కడ కొందరిని గంటలపాటు, మరికొందరిని రోజులు, ఇంకొందరిని నెలలపాటు ఉంచుతారు. తర్వాత మళ్లీ వారిని సరిహద్దుల అవతలకు పంపించేస్తారు.
‘‘అక్కడ మరుగుదొడ్లు లేవు. మంచినీరు కూడా లేవు. అనుమతి లేకుండా ఆ శిబిరం నుంచి బయటకు కూడా వెళ్లకూడదు’’అని ఇస్సామ్ చెప్పారు. అక్కడ చాలా అమానవీయంగా చూసేవారని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, LEVA
హింస
లాత్వియాలోని ఆ శిబిరంలో తన గాయపడిన కాలిపై లాఠీతో కొట్టేవారని అబ్దుల్ రహ్మాన్ చెప్పారు. ఆ తర్వాత మళ్లీ ఆయన్ను సరిహద్దుల అవతలకు తీసుకెళ్లి వదిలిపెట్టేవారు. మూడోసారి ఇలా తీసుకెళ్లేటప్పుడు ఆయన స్పృహ కోల్పోయారు.
‘‘నేను కళ్లు తెరచి చూసేసరికి, ఆ శిబిరంలో సైనికుల కాలి దగ్గర పడివున్నాను. గాయపడిన నా కాలిపై వారు ఆరు సిగరెట్లతో కాల్చారు’’అని ఆయన చెప్పారు.
ఆ శిబిరంలో దాదాపు రెండు వారాలు తనను ఉంచినట్లు ఆయన చెప్పారు. జనవరి మొదట్లో ఆయన ఆరోగ్యం బాగా క్షీణించడంతో లాత్వియాలోని ఒక ఆస్పత్రికి ఆయన్ను తీసుకెళ్లారు.
తనను కూడా సరిహద్దు అధికారులు చిత్రహింసలు పెట్టారని ఇస్సామ్ వివరించారు. తనను వదిలిపెట్టాలని వేడుకుంటున్న 16 ఏళ్ల బాలుడిని కూడా వారు తీవ్రంగా కొట్టారని ఆయన చెప్పారు.
‘‘ఒక మహిళను కొడుతున్నప్పుడు నేను అడ్డుకున్నాను. దీంతో మరింత ఎక్కువగా కొట్టారు. ఒక సైనికుడు కాలితో తన్నాడు’’అని ఆయన వివరించారు.
శరణార్థుల సమస్య
27 సభ్య దేశాలున్న ఐరోపా యూనియన్‌లోకి శరణార్థులు పోటెత్తడంపై ఎప్పటినుంచో చర్చ జరుగుతోంది. అయితే, నేడు ఈ చర్చలోకి ఈయూ-బెలరూస్ సరిహద్దుల అంశం కొత్తగా వచ్చి చేరింది.
2020లో బెలరూస్ అధ్యక్ష ఎన్నికల వివాదం తర్వాత ఈయూతో బెలరూస్ సంబంధాలు మరింత క్షీణించాయి. బెలరూస్, రష్యా కలిసి ఈ శరణార్థులను తమవైపు పోటెత్తేలా చేస్తూ కొత్త యుద్ధానికి తెరతీస్తున్నాయని ఐరోపా దేశాలు ఆరోపిస్తున్నాయి.
అక్రమ వలసదారులను ‘‘యుద్ధంలో ఆయుధాలు’’గా లాత్వియా భావిస్తోంది. వీరిని ఎలాగైనా వెనక్కి పంపించేయాలని భావిస్తోంది. ఆగస్టు 2021 నుంచి బెలరూస్ నుంచి అక్రమంగా తమ దేశంలోకి ప్రవేశించాలని చూసిన 10,524 ప్రయత్నాలను అడ్డుకున్నట్లు లాత్వియా వెల్లడించింది.
‘‘లాత్వియాతోపాటు యూరోపియన్ యూనియన్ సరిహద్దులను కాపాడటం మా విధి’’అని లాత్వియా హోం శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అక్రమంగా తమ దేశంలోకి అడుగుపెట్టే వారిని తాము దేశంలోకి అనుమతించాల్సిన అవసరంలేదని వివరించింది.
అయితే, వలసదారులను తాము హింసించడం లేదని చెబుతోంది.
‘‘అక్రమంగా సరిహద్దుల్లోకి ప్రవేశించిన వారికి శిబిరాల్లో మానవతా సాయం అందిస్తున్నాం. అవసరమైతే వైద్య సాయం కూడా అందిస్తున్నాం’’అని చెబుతోంది.
క్రిమినల్ కేసు
అక్రమ వలసదారులను వెనక్కి పంపేయాలనే ప్రభుత్వ నిర్ణయానికి లాత్వియాలో చాలా మంది మద్దతు పలుకుతున్నారు.
దీన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు. అలా వ్యతిరేకించేవారిలో లెవా రాబిష్కో ఒకరు. పశ్చిమాసియా నుంచి వచ్చే వలసదారులకు ఆమె సాయం చేస్తున్నారు. ముఖ్యంగా లాత్వియా, బెలరూస్ సరిహద్దుల మధ్య చిక్కుకున్న వారికి ఆమె సాయం చేస్తున్నారు.
ఇస్సామ్‌తోపాటు కొందరు సభ్యులు లాత్వియాలో వాలంటీర్లకు సమాచారం అందించారు. ఆ వాలంటీర్లే యూరోపియన్ మానవ హక్కుల కోర్టులో కేసు నమోదుచేశారు.
కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతానికి వలసదారులను అనుమతించాలని, వారికి మానవతా సాయం అందించాలని సూచించింది. దీంతో ఇస్సామ్ బృందాన్ని వెనక్కి పంపకుండా చూసేందుకు లెవా, మరికొందరు సరిహద్దుల దగ్గర పహారా కాసారు.
‘‘మేం దాదాపు రెండు గంటలు అక్కడే ఎదురుచూశాం. వారు వస్తారో లేదో మాకు తెలియదు. మేం ఎదురుచూస్తానే ఉన్నాం. కానీ, మంచు కురుస్తుండగా, గజగజ వణుకుతూ వారు వచ్చారు. మేం వారిని చూసి షాక్‌కు గురయ్యాం’’అని ఆమె చెప్పారు.
అయితే, 2021 నుంచి సరిహద్దు ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితి కొనసాగుతోంది. ఇక్కడ ప్రత్యేక అనుమతి లేకుండా వాలంటీర్లు, జర్నలిస్టులు లేదా అంతర్జాతీయ సంస్థలు ప్రవేశించడానికి వీల్లేదు. అంటే లెవా, ఆమెతోపాటు వచ్చిన ఇగ్లిస్ ఇక్కడకు అక్రమంగా వచ్చినట్లే.
దీంతో వారిద్దరిపైనా క్రిమినల్ కేసు నమోదైంది. లాత్వియాలోకి వలసదారులను అక్రమంగా వచ్చేందుకు సాయం చేస్తున్నారని వీరిపై కేసు పెట్టారు. ‘‘అయితే, ఇలాంటి కేసుల వల్ల ఈ సమస్య ప్రజలందరికీ తెలుస్తుంది. ఇది కూడా మన మంచికే’’అని లెవా అన్నారు.
‘‘ఆశ్రయం కోసం చట్టబద్ధంగా దరఖాస్తు పెట్టుకునే అవకాశం వీరికి ఇవ్వకపోతే, అక్రమ వలసలు మరింత పెరుగుతాయి’’అని లెవా చెప్పారు.
అబ్దుల్ రహ్మాన్ ఎట్టకేలకు ఒక ఐరోపా దేశానికి చేరుకోగలిగారు. ఆయన ఎక్కడికి వెళ్లారో చెప్పడానికి ఇష్టపడలేదు.
లాత్వియాలో శరణార్థిగా ఉండేందుకు ఇస్సాం దరఖాస్తు పెట్టుకున్నారు. ఆ వెంటనే, ఆయన నెదర్లాండ్స్‌లో తన అన్నయ్య దగ్గరకు వెళ్లారు. లెవా చేసిన సాయానికి తాను రుణపడి ఉంటాయనని ఆయన చెప్పారు. కానీ, తాను లాత్వియాకు తిరిగి వెళ్లబోనని ఆయన అన్నారు.
‘‘నన్ను అంత హింసించిన దేశానికి ఎలా వెళ్లమంటారు?’’అని ఇస్సాం ప్రశ్నించారు.
‘‘వారు నన్ను తీవ్రంగా కొట్టారు. చాలా అనాగరికంగా ప్రవర్తించారు’’అని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ఐపీఎల్ 2023: టోర్నీని రసవత్తరంగా మార్చబోతున్న 'ఇంపాక్ట్ ప్లేయర్' రూల్ ఏంటి?
- సెమాగ్లుటైడ్: బరువు తగ్గించే ఈ ఇంజెక్షన్‌కు అంత డిమాండ్ ఎందుకు?
- తెలంగాణ: ఆదివాసీలు పరిశ్రమలు పెట్టేందుకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం పొందడం ఎలా?
- ‘‘ఆయన నాలుగేళ్లుగా నీళ్లు పోసుకోలేదు... అడవిలోనే ఒంటరి జీవితం... అటవీ ఏనుగులున్నా భయపడలేదు’’
- 'జీన్ ఎడిటెడ్ ఫుడ్' అంటే ఏంటి? అది తినడం ఆరోగ్యానికి మంచిదేనా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

















