గ్రీసు అగ్ని ప్రమాదం:‘‘నాన్నా మనం చచ్చిపోతామా?’ అని ఏడుస్తూ నా కూతురు అడిగింది’

ఫొటో సోర్స్, Talibshah Hosseini
- రచయిత, కావూన్ ఖామూష్
- హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్
తాలిబ్‌షాహ్ హొసైనీ తన ముగ్గురు పిల్లల్ని, అనారోగ్యంతో ఉన్న భార్యను తీసుకుని బయటకి పరిగెత్తారు. వలసదారుల శిబిరంలోని వారి గుడారాన్ని మంటలు చుట్టుముట్టాయి.
హొసైనీ ఆ రాత్రి పడుకోకుండా దూరంగా చిన్న మంటలు కనిపిస్తుంటే గమనిస్తూ కూర్చున్నారు. కాసేపయ్యాక మరి కాస్త పరిశీలించి చూస్తే ప్రమాదం ముంచుకొచ్చే అవకాశముంది అనిపించి చుట్టుపక్కల ఉన్నవారిని హెచ్చరించడానికి వెళ్లారు.
తన గుడారానికి తిరిగి వచ్చి చూసేసరికి పిల్లలు భయంతో వణికిపోతూ కనిపించారు.
"నాన్నా మనం చచ్చిపోతామా?" అని ఏడుస్తూ నా చిన్న కూతురు అడిగింది అంటూ 37 ఏళ్ల అఫ్గానిస్తాన్ కళాకారుడు హొసైనీ వివరించారు.
మంగళవారం రాత్రి గ్రీస్ దీవి లెస్బాస్ వలస శిబిరాల వద్ద పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది.

ఫొటో సోర్స్, Reuters
నిస్సహాయులై..
హొసైనీ కుటుంబం అక్కడి నుంచి తప్పించుకుని పొదల గుండా పరిగెత్తుతూ, గుట్టల మీంచి దూకుతూ 90 నిమిషాల పాటు పరిగెత్తి సురక్షిత ప్రదేశానికి చేరుకుంది. ఆ రాత్రంతా వారు ఆరుబయట శరణార్థులు, వలసదారులతోపాటూ గడిపారు.
"నా పిల్లలు…నాన్నా ఇక్కడ చాలా చలేస్తోంది. మనం ఇక్కడెందుకున్నాం? ఇప్పుడేమవుతుంది? లాంటి ప్రశ్నలడుగుతున్నారు. వేటికీ నా దగ్గర జవాబులు లేవు. చాలా బాధగా ఉంది" అని హొసైనీ చెప్పారు.
2019లో తాలిబన్ ఉగ్రవాదుల నుంచి రక్షించుకోవడానికి అఫ్గానిస్తాన్ నుంచి కుటుంబంతో సహా పారిపోయి వచ్చినప్పటి నుంచి చావును తప్పించుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నామని హొసైనీ అన్నారు.
ఇక్కడి లెస్బాస్‌లోని మోరియా క్యాంపుకు వచ్చి 9 నెలల 5 రోజులయ్యిందని తెలిపారు.
ఈ శిబిరం 3,000 మంది శరణార్థులకు మాత్రమే ఆవాసం కల్పించాల్సి ఉంది. కానీ ఇప్పుడు 13,000 మంది అక్కడ ఉన్నారు. వీరంతా 70 దేశాల నుంచి వచ్చినవారు కాగా వీరిలో అఫ్గానిస్తాన్‌వాళ్లే అధిక శాతం ఉన్నారు.
భయంకరమైన రోజులు
ఈ శిబిరంలోకి వచ్చాక జీవితంలో ఎన్నడూ చూడని భయంకరమైన అనుభవాలను ఎదుర్కొన్నానని హొసైనీ అన్నారు.
"తొక్కిసలాటలో ఒక గర్భిణి మరణించడం కళ్లారా చూశాను. దొంగతనాలు, దోపిడీలు జరిగాయి. మా గుడారంలోకొచ్చి మమ్మల్ని ఎవరైనా చంపేస్తారేమోనని రాత్రంతా మేల్కుని కుర్చునేవాడిని" అని చెప్పారు.
చాలా నెలలు ఒక చిన్న గుడారంలోనే హొసైనీ తన ముగ్గురు పిల్లలు, కిడ్నీ సమస్యతో బాధపడుతున్న భార్యతో కలిసి నివసించాల్సి వచ్చింది. అనేకసార్లు అభ్యర్థనలు చేసిన అనంతరం ఈ మధ్యనే ఒక పెద్ద గుడారానికి వారు మారారు. అందులో మరో కుటుంబంతో కలిసి నివసిస్తుండగా ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇప్పుడు అదీ పోయిందని హొసైనీ తెలిపారు.
"మేము తప్పించుకుని ఉండకపోతే గుడారం మామీద పడిపోయి ఉండేది" అని తన అనుభవాలను హొసైనీ వివరించారు.

ఫొటో సోర్స్, Talibshah Hosseini
లెస్బాస్‌కు ప్రయాణం
అఫ్గానిస్తాన్‌లో నిరంతరం ఘర్షణలు ఉన్నప్పటికీ హొసైనీకి సొంత దేశంలో, సొంత ఇంట్లో సంపన్నమైన జీవితం ఉండేది.
హొసైనీ అఫ్గానిస్తాన్‌లో ఫర్యాబ్ నేషనల్ థియేటర్ బృందంలో ముఖ్య సభ్యులు. అతని ఊరిలో అతనొక సెలెబ్రిటీ. టీవీ కార్యక్రమాల్లో పాల్గొంటూ తిరుగుబాటుదారులను విమర్శిస్తూ సాంఘిక, రాజకీయ చర్చలు జరిపేవారు.
2009లో అతనికి వివాహమైంది. ముగ్గురు కూతుళ్లకు ఆయన తండ్రి అయ్యారు. ఆయన భార్య బ్యూటీ పార్లల్‌లో పని చేస్తుండేవారు. జీవితం సాఫీగా సాగిపోతుండేది.
ఒకసారి ఒక టీవీ షోలో హొసైనీ తాలిబన్లను విమర్శిస్తూ, అఫ్గాన్ సైన్యంపై ప్రశంసల వర్షం కురిపించారు. తరువాత అతనికి తాలిబన్ల నుంచి బెదిరింపులు రావడం మొదలయ్యాయి.
"నాకు నా దేశమంటే ప్రాణం. నా ప్రభుత్వం కోసం పనిచేయడం నాకెంతో ఆనందాన్ని కలిగించేది. కానీ నేను కష్టాల్లో పడినప్పుడు వారు నాకు సహాయం చేయలేదు" అని హొసైనీ తెలిపారు.
దశాబ్దాలుగా ఆ దేశంలో జరుగుతున్న హింసల్లో హొసైనీ తన తండ్రిని, ఇద్దరు అన్నదమ్ములను, మేనల్లుడిని కోల్పోయారు.
ప్రస్తుత పరిస్థితుల్లో దేశాన్ని విడిచి వెళ్లడమే మంచిదనే నిర్ణయానికొచ్చారు.
ఐరోపా చేరుకోవడానికి అనేక దేశాల గుండా ప్రయాణించాల్సి వచ్చింది. ఈ ప్రయాణంలో తన పెద్ద కూతురు ఫరీమా అనేక భాషలను నేర్చుకుందనీ, తెలివైన పిల్ల అనీ హొసైనీ చెప్పుకొచ్చారు.
"నాన్నా, నువ్వంటే నాకిష్టం లేదు. నన్ను నా స్కూలు నుంచీ దూరం చేశావు. నేను సంతోషంగా లేను అని మా పెద్ద అమ్మాయి అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్నప్పుడు తండ్రిగా నా హృదయం బద్దలైపోతుంటుంది. నా బాధను మాటల్లో చెప్పలేను" అని హొసైనీ అన్నారు.

ఫొటో సోర్స్, Talibshah Hosseini
అఫ్గానిస్తాన్ తిరిగి వెళ్లిపోదామనే ఆలోచన
అగ్నిప్రమాదం తరువాత వారంతా నిరాశ్రయులైపోయారు. గ్రీకు అధికారులు ఎంతో సహాయం చేస్తున్నా కూడా సరిపోవడం లేదు.
గురువారం అక్కడ ఉన్నవారికి ఆహార పొట్లాలను పంచడానికి ఒక వ్యాన్ వచ్చింది. కానీ అంతమందికి పొట్లాలు అందించలేక వ్యాన్ తిరిగి వెళ్లిపోయింది.
"అందరం కట్టుబట్టలతో పరిగెత్తాం. మాతోపాటూ ఏమీ తెచ్చుకోలేదు. రాత్రిపూట చాలా చలిగా ఉంటోంది. కప్పుకోడానికి ఒక బట్ట లేదు."
"పొద్దున్నపూట భయంకరమైన ఎండ. ఇళ్లు లేకుండా రోడ్ల మీద ఉన్నాం. ఎండకు అడ్డం పెట్టుకోడానికి ఒక చిన్న కాగితం ముక్కో లేదా గుడ్డ ముక్కో దొరుకుతుందేమోనని వెతుకుతున్నాం."
"పిల్లలు ఏడుపులు ఆపట్లేదు. అందరూ భయబ్రాంతులకు గురవుతున్నారు. ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది" అని హొసైనీ చెప్పారు.
ఇక్కడ భయంకరమైన కష్టాలు అనుభవించామని, అఫ్గానిస్తాన్ తిరిగి వెళ్లిపోవడం మేలేమోనని హొసైనీ ఆలోచిస్తున్నారు.
"కూడు, గుడ్డ లేదు, తలదాచుకోడానికి స్థలం లేదు. టాయిలెట్స్ లేవు. డాక్టర్లు లేరు. ఇక్కడికి ఎందుకొచ్చామా అని బాధపడుతున్నాను. ఇక భరించలేను. శరణార్థులకు ఆవాసం కల్పించలేకపోతే మమ్మల్ని తిరిగి పంపేయడమే మేలు" అని హొసైనీ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- నేపాల్‌తో చైనా స్నేహం భారత్‌కు ప్రమాదమా
- "కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం పైచేయి సాధించడానికి ఏకైక కారణం ఇదే"
- 1988లో భారత సైన్యం మాల్దీవులలో అడుగు పెట్టినపుడు ఏం జరిగింది?
- 1990ల్లో 13 నెలలపాటు నేపాల్‌ను భారత్ ఎందుకు దిగ్బంధించింది?
- ఒక్క సంవత్సరంలోనే 600 సార్లు అతిక్రమణలకు పాల్పడిన చైనా..
- ఏడు నెలల గర్భంతో ఉన్న భార్యను తీసుకుని 1200 కిలోమీటర్లు స్కూటీపై ప్రయాణం
- తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకలు మొదలయ్యేది ఎప్పుడు?
- 10 కి.మీ దూరంలో భారతీయ మహిళ మృతదేహం.. తీసుకురావాలంటే 2291 కి.మీ. ప్రయాణించాలి
- అక్షరాస్యతలో బిహార్ కంటే వెనుకబడ్డ ఆంధ్రప్రదేశ్.. అసలు కారణాలేంటి?
- భారత్-చైనా సరిహద్దు వివాదంలో దూకుడు ప్రదర్శిస్తోంది ఎవరు? - మాజీ సైన్యాధికారి వీపీ మాలిక్ ఇంటర్వ్యూ
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరి గంటల్లో ఏం జరిగిందంటే..
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్: టీవీ అతనిని తారని చేసింది... అదే టీవీ అతనిని పదే పదే చంపింది...
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 50 కలలు.. భౌతిక శాస్త్ర ప్రయోగాలు, విశ్వం, ప్రకృతి గురించి కన్న కలల్లో నెరవేరనివి ఎన్నంటే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








