సముద్రంలోనే నివాసం, శరణార్థులకు ఆవాసంగా విలాసవంతమైన ఓడ

శరణార్థులకు, వలసదారులకు నివాసంగా మారిన ఓడ

కట్టుదిట్టమైన భద్రతను, ముందు వరుసలో ఉన్న వారిని దాటుకుని వెళ్లిన తర్వాత ఆ ఓడలో ఉన్నవారిని కలిశాం.

ఆ ఓడ ఎక్కడకూ వెళ్లదు. సముద్రంలో ఒక చోట ఉంటుంది అంతే.

మేం మొట్టమొదట కలిసిన చిన్నారి ప్రయాణికుడి పేరు సల్హేర్.. ఆరు నెలల బాబు. ఆ పిల్లాడి ముఖంలో కనిపించే చిరునవ్వు వెనుకాల సల్హేర్, అతని తల్లి 19 ఏళ్ల ఆస్టర్ ఇన్ని రోజులుగా పడుతున్న బాధాకరమైన క్షణాలూ కనిపిస్తున్నాయి.

హింస నుంచి తప్పించుకుని ఎరిత్రియా నుంచి బయటపడ్డ తర్వాత రువాండా చేరుకున్నాక తన కొడుకు పుట్టినట్లు ఆస్టర్ తెలిపారు.

‘‘ఇక్కడ బాగుంది. ఎలాంటి సమస్య లేదు. డచ్‌ నేర్చుకోవాలనుకుంటున్నాను. డచ్ నేర్చుకున్న తర్వాత ఇక్కడే పనిచేయాలనుకుంటున్నాను’’ అని ఆమె తెలిపారు.

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయాణికుల నౌకల్లో ఒకటైన ‘సిల్జా యూరోపా’లో 3 వేల మంది వరకు ప్రయాణించవచ్చు.

సాధారణంగా ఇది నిత్యం ఎస్టోనియా రాజధాని తలిన్ నుంచి ఫిన్లాండ్ రాజధాని హెల్సింకీకి ప్రయాణించేది.

కానీ, గత ఆరు నెలలుగా ఎక్కడికీ ప్రయాణించకుండా సముద్రంలో ఒకే చోట తేలుతూ ఉంది.

ఆమ్‌స్టర్‌డ్యామ్‌ తీరం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో ఈ ఓడ 900 మంది శరణార్థులు, వలసదారులకు స్థిర నివాసంగా మారింది.

శరణార్థులకు, వలసదారులకు నివాసంగా మారిన ఓడ

‘నాకు ఇక్కడ నచ్చింది’ అని జారా చెప్పారు.

జారా తన మొదటి భర్త తనను చంపడానికి ప్రయత్నించి.. ఛాద్‌లోని తన స్వగృహం నుంచి పారిపోయి వచ్చారు. అప్పటి నుంచి జారా ఈ నౌకలోనే ఉంటున్నారు.

‘ఇతర క్యాంప్‌లలో మేం నలుగురు నుంచి ఐదుగురితో రూమ్ షేర్ చేసుకోవాలి. అలా నివసించడం అంత తేలికైన విషయం కాదు. కానీ, ఇక్కడ మాకంటూ ఒక సొంత గది ఉంది. బోట్‌లో అన్ని సౌకర్యాలు చాలా మెరుగ్గా ఉన్నాయి’’ అని తెలిపారు జారా.

మేం కలిసిన ఏడుగురు మహిళలలో షెజా ఒకరు. మేమంతా అక్కడే కూర్చుని, కొద్దిసేపు మాట్లాడుకున్నాం.

వీరంతా వేర్వేరు దేశాల నుంచి వచ్చినవారు. సిరియా, పాకిస్తాన్, తుర్కియే నుంచి వచ్చిన వారు ఉన్నారు.

వీరిలో గృహ హింస ఎదుర్కొన్నవారు, మత హింసను ఎదుర్కొన్నవారు ఉన్నారు.

‘డచ్ చాలా బాగుంది. వారు బాగా చూసుకుంటున్నారు. ఇది చాలా సురక్షితంగా, శుభ్రంగా, సౌకర్యవంతంగా, ఎక్కడికక్కడ అమర్చి ఉంది. ఫుడ్ చాలా భిన్నంగా ఉంది. ఇదొక విభిన్న సంస్కృతుల కలయిక’ అని ఈ ఓడలో ఉంటున్న ఓ మహిళ అన్నారు.

శరణార్థులకు, వలసదారులకు నివాసంగా మారిన ఓడ

ఆరు నెలల క్రితం ఈ నౌక రేవులో ఆగిపోయి, శరణార్థులకు నివాసంగా మారుతున్నప్పుడు, వేలాది మంది స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

తమ ఉద్యోగాలు ఊడుతాయని, స్థానిక సర్వీసులకు ఇబ్బందులు కలుగుతాయని అన్నారు.

శరణార్థుల కోసం ప్రభుత్వం నడిపే పథకం కింద, వలసదారులు ఈ నౌకలో లగ్జరీ జీవితాన్ని గడిపేలా తీర్చిదిద్దారు.

అయితే, ఈ నౌక రాక తర్వాత చుట్టుపక్కల ఏడు రెస్టారెంట్లలో ఆరు మూతపడ్డాయి. స్విమ్మింగ్ పూల్, సావ్‌నాలు కూడా మూతపడ్డాయి.

ఎర్రటి రంగు సీట్లతో సౌకర్యవంతంగా కూర్చునేందుకు వీలుగా ఉండే కాన్ఫరెన్స్ రూమ్‌ను డచ్ పాఠాలను బోధించేందుకు ఉపయోగిస్తున్నారు.

అలాగే మానవ హక్కుల సెమినార్ల కోసం, లింగ సమానత్వం చర్చలకు వాడుతున్నారు.

మూలన పడ్డ తర్వాత నౌకను ఇలా విలాసవంతంగా రూపుదిద్దొచ్చని డచ్ ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం వల్ల తెలిసింది. కానీ, దీనికి అంత తక్కువ ఖర్చేమీ కాదు.

డచ్ ప్రభుత్వం ఈ ఓడను ఇలా మార్చేందుకు ఎంత ఖర్చయిందో చెప్పేందుకు ఇష్టపడలేదు. కానీ, ప్రతి రోజూ లక్షల కొద్ది యూరోలను ఖర్చు చేస్తుందని అర్థమవుతోంది.

ఆ ఓడలో ఎలా ఉందో చూసేందుకు మూడు వారాల క్రితం అధికారులు యూకే నుంచి ఇక్కడకి వచ్చారు.

బ్రిటన్‌కు వచ్చే శరణార్థులకు, వలసదారులకు నౌకలను స్థిరనివాసంగా మార్చే అవకాశాలపై యూకే ప్రభుత్వ అధికారులు తెలుసుకున్నారు.

శరణార్థులకు, వలసదారులకు నివాసంగా మారిన ఓడ

డచ్ ప్రయోగం గురించి యూకే అధికారులకు తెలిపిన తర్వాత సీఓఏ నుంచి ఎంపికైన గైడ్ రోనాల్డ్ స్మెలెన్‌బర్గ్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నాం.

‘‘ఇది చాలా ఖరీదైన ఆప్షన్ అనేది వాస్తవం. కానీ ఇది పనిచేస్తుంది. పర్యావరణానికి ఇది హాని చేయదు. ఎన్నో సమస్యలకు ఇది ఒక తేలిక పరిష్కారం’’ అని గైడ్ తెలిపారు.

ఈ ఓడలో తమతో పాటు నివసించే చాలా మందితో మాట్లాడితే.. సౌకర్యవంతంగా, శుభ్రంగా ఉండే ఇలాంటి ఒక ప్రదేశం దొరకడం తాము అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొంటున్నారు.

డచ్‌ ప్రభుత్వానికి తాను ఎంతో రుణపడి ఉంటానని సిరియా నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్న డెకరేటర్ అనాస్ అన్నారు. అయితే, అందరూ ఇలానే భావించడం లేదు.

ఇది చాలా భయానకంగా ఉందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక తల్లి చెప్పారు. ‘‘ఇక్కడ ఉంటున్న మాపై దీని ప్రభావం ఎలా ఉంటుందోనని నాకు ఆందోళనగా ఉంది. నేను మా కిటికీ తలుపులు తెరిచినప్పుడు స్వచ్ఛమైన గాలిని కోల్పోతున్నా.’’ అని అన్నారు.

ఓడలో ఉండే వారు వెళ్లాలంటే వెళ్లిపోవచ్చు. కానీ, వారికి అవసరమైనప్పుడు డాక్టర్లు, నర్సులు అక్కడికివస్తున్నారు.

ఈ విధానంతో తొలుత సమీప పట్టణంలో శరణార్థులపై నెలకొన్న ఆగ్రహం కాస్త సద్దుమణిగింది.

‘మా దేశం వలసదారులతో నిండిపోతుందని చాలా మంది భావిస్తున్నారు. నేను ఆ అభిప్రాయాన్ని చెప్పాలనుకోవడం లేదు. కానీ, ఇదొక పెద్ద సమస్య అవుతుందనే దాన్ని నేను అర్థం చేసుకోగలను’’ అని స్థానిక వ్యక్తి అన్నారు.

సిరియా యుద్ధం, ఆ తర్వాత ప్రస్తుతం ఉక్రెయిన్‌పై రష్యా చేపడుతోన్న దాడితో చాలా యూరోపియన్ దేశాలకు వలసల సమస్య పెరిగింది.

శరణార్థులు, వలసదారుల కోసం ఓడను వినియోగించడమనే ప్రయోగం విజయవంతమైందని డచ్ ప్రభుత్వం చెబుతోంది. అయితే, ఇది పూర్తి పరిష్కారం కాదని డచ్ ప్రభుత్వం కూడా అంగీకరిస్తోంది. మూడు నెలల్లో వీరు ఈ ఓడను వదలాల్సి ఉంటుంది. కానీ, ఆ తర్వాత వీరిని ఎక్కడికి తీసుకెళ్తారు.. కానీ, ఎక్కడకు తీసుకెళ్తారో అధికారులకు కూడా ఇప్పటివరకు తెలియదు.

ఇవి కూడా చదవండి: