థాయ్‌లాండ్: సముద్రంలో మునిగిపోయిన నేవీ షిప్, 75 మంది సెయిలర్స్‌ను రక్షించారు.. ఇంకా 31 మంది నీటిలోనే

ఫొటో సోర్స్, royal thai navy
- రచయిత, ఫ్రాన్సిస్ మావో
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆదివారం రాత్రి గల్ఫ్ ఆఫ్ థాయ్‌లాండ్‌లో తుపాను కారణంగా థాయ్ నేవీ షిప్ బోల్తా పడింది.
రాత్రి స్థానిక కాలమానం 23.30 గంటలకు హెచ్‌టీఎంఏఎస్ సుఖోటై నౌక నీట మునిగింది.
ఇది మునిగిపోయే సమయానికి 100 మందికి పైగా నావికులు అందులో ఉన్నారు. సహాయక చర్యల కోసం పంపిన ఓడ కొందరిని వెంటనే రక్షించగలిగింది.
సోమవారం నాటికి ఇంకా 31 మంది నావికులు నీటిలో చిక్కుకుని ఉన్నారని అధికారులు తెలిపారు.
ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ సిబ్బందిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
షిప్‌లోకి నీరు చేరడంతో బోల్తా పడిందని, నౌక అంతా జలమయం అయిపోయిందని, పవర్ రూమ్ షార్ట్ సర్క్యూట్ అయిందని అధికారులు తెలిపారు.
విద్యుత్ లేకపోవడంతో, నౌకను కంట్రోల్‌లోకి తీసుకురావడం సిబ్బందికి కష్టమైంది. నౌక ఓ పక్కకు ఒరిగి క్రమంగా నీట మునిగింది.

ఫొటో సోర్స్, ROYAL THAI NAVY
ప్రచువాప్ ఖిరీ ఖాన్ ప్రావిన్స్‌లోని బ్యాంగ్ సఫాన్ జిల్లా తీరానికి కేవలం 32 కిమీ దూరంలోనే నౌక తుపానులో చిక్కుకుంది.
థాయ్ నేవీ ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఫొటోలు ఆందోళనకరంగా ఉన్నాయి.
నౌక ఓ పక్కకి ఒరిగిపోవడం, రెస్క్యూ నౌకలు మునిగిపోయిన సిబ్బందిని వెతకడం ఆ ఫొటోల్లో కనిపిస్తోంది.
సహాయక చర్యల కోసం మూడు ఓడలను, ఒక్ హెలికాప్టర్‌ను పంపించారు. కానీ, హెచ్‌టిఎమ్‌ఎఎస్ క్రాబురి అనే ఓడ మాత్రమే ఘటనాస్థలానికి చేరుకోగలిగింది.
నౌకతో పాటు నీళ్లల్లో పడిపోయిన 106 మంది నావికులలో 75 మందిని రక్షించగలిగారు.
మిగతా 28 మందిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని థాయ్ నేవీ చెప్పింది.
వారందరి జాడ దొరికిందో లేదో స్పష్టంగా తెలియలేదు. సోమవారానికి 106 మందిలో ఇంకా 31 మంది నీటిలోనే చిక్కుకున్నారు అని నేవీ ప్రకటించింది.
ఆదివారం రాత్రంతా గాలించి, చాలామంది నావికులను రక్షించారని అధికారులు తెలిపారు.
నీటి నుంచి బయటకు తెచ్చిన సిబ్బందికి వైద్య సహాయం అందిస్తున్న ఫొటోలు లోకల్ మీడియాలో వచ్చాయి.
ఇవి కూడా చదవండి:
- చైనాతో ‘సరిహద్దు ఘర్షణలు’ జరుగుతున్నా.. ఆ దేశం నుంచి భారత్ దిగుమతులు ఏటేటా పెరుగుతూనే ఉన్నాయి.. ఎందుకు?
- ఆంధ్రప్రదేశ్: 20 రూపాయలకే ‘మన భోజనం’ - ఎక్కడంటే...
- రైలు ప్రయాణం: ప్రయాణికులకు తగినన్ని రైళ్లు నడపటం లేదా? రిజర్వేషన్ బోగీలలో తరచూ తగాదాలెందుకు?
- గుండెపోటు వచ్చే అరగంట ముందు శరీరంలో ఏం జరుగుతుంది, ఏ లక్షణాలు కనిపిస్తాయి?
- సుప్రీంకోర్టులోనైనా ఉచితంగా వకీలును పెట్టుకుని వాదించడం ఎలా, ఉచిత న్యాయ సహాయం ఎలా పొందాలి














