అతీక్ అహ్మద్, అష్రఫ్ హత్య: వారిని కాల్చి చంపిన నిందితుల నేర చరిత్ర ఏమిటి?

అతీక్ అహ్మద్, అష్రఫ్‌ల హత్య

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి వస్తున్న సమయంలో హత్యకు గురైన అతీక్ అహ్మద్, అష్రఫ్‌ అహ్మద్
    • రచయిత, అనంత్ ఝణాణే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మాఫియా డాన్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్, ఆయన సోదరుడు అష్రఫ్ అహ్మద్‌లను ఏప్రిల్ 15 రాత్రి పోలీసుల సమక్షంలో, మీడియా ఎదుటే హత్య చేయడం ప్రయాగ్‌రాజ్‌లో మాత్రమే కాక, దేశ, విదేశాల్లో చర్చనీయాంశమైంది.

అతీక్, అష్రఫ్‌ గ్యాంగ్‌ల స్థానంలో ఉత్తర్ ప్రదేశ్‌లో తమకంటూ ఒక నేర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకునేందుకు, 'పేరు' సంపాదించేందుకు నిందితులు లవ్‌లేష్, సన్నీ, అరుణ్‌ వీరిద్దరిపై దాడికి పాల్పడట్టు ఈ కేసు ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు రాశారు.

అతీక్, అష్రఫ్ హత్య తర్వాత ప్రయాగ్‌రాజ్‌తో పాటు ఉత్తర ప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో సెక్షన్ 144 విధించారు.

చాలా జిల్లాల్లో పోలీసులు ఫ్లాగ్ మార్చ్‌లు చేపట్టారు. ఘజియాబాద్, గోరఖ్‌పూర్, ఫరూఖాబాద్‌ లాంటి పలు సెన్సిటివ్ ప్రాంతాల్లో ఈ మార్చ్‌లు జరిగాయి.

కట్టుదిట్టమైన భద్రతా చర్యల మధ్య ప్రయాగ్‌రాజ్‌లోని కసారి మసారి శ్మశానంలో ఈ సోదరులిద్దరికి ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు.

అతీక్ అహ్మద్ ఇద్దరు మైనర్ కొడుకుల్ని పోలీసులు అంత్యక్రియల కార్యక్రమానికి తీసుకొచ్చారు.

అతీక్, అష్రఫ్‌లపై కాల్పులు జరిపిన నిందితుల ఇళ్ల బయట పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. నిందితుల ఇంటికి వెళ్లే వీధులన్నీ పోలీసులు సీల్ చేసినట్లు టీవీ ఛానళ్లు చెబుతున్నాయి.

అతీక్ హత్య కేసులో నిందితులు

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, పోలీసులు విడుదల చేసిన నిందితుల ఫోటో

ముగ్గురు నిందితుల్లో ఒకరైన సన్నీ ఇంటి బయట పోలీసులున్న వీడియోలు కూడా బయటికి వచ్చాయి.

ఈ ఘటన తర్వాత ప్రయాగ్‌రాజ్‌లోని ప్రజలు ఇళ్ల నుంచి బయటికి వచ్చేందుకు ఇష్టపడటం లేదు.

వచ్చే రెండు రోజులు కూడా ప్రయాగ్‌రాజ్‌లో ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉండవని కొన్ని కథనాలు సూచిస్తున్నాయి.

ఇంతకూ ఈ ముగ్గురు నిందితులు లవ్‌లేష్ తివారి, సన్నీ సింగ్, అరుణ్ కుమార్ మౌర్య నేరచరిత్ర ఏమిటి? వారిపై ఉన్న కేసులు ఏమిటి?

లవ్‌లేష్ తివారి

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, కాల్పులు జరుపుతున్న లవ్‌లేష్ తివారి

లవ్‌లేష్ తివారి నేర చరిత్రేంటి?

జిల్లా పోలీసు అధికారుల నుంచి బీబీసీ సేకరించిన సమాచారం ప్రకారం, బాందాకు చెందిన లవ్‌లేష్ తివారి వయసు 22 ఏళ్లు.

ఆయనపై ఇప్పటి వరకు నాలుగు కేసులు నమోదై ఉన్నాయి.

మూడు కేసులు దాడికి సంబంధించినవి కాగా, ఒక కేసు అమ్మాయిని వేధించిన కేసు.

లవ్‌లేష్ తండ్రి యజ్ఞ తివారి కూడా స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఈ కేసుల గురించి తెలిపారు.

పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం లవ్‌లేష్ మాదక ద్రవ్యాలకు బానిస. తన కుటుంబంతో కలిసి ఉండటం లేదు.

ముందు కేసుల్లో కూడా లవ్‌లేష్‌పై ఛార్జ్‌షీటు దాఖలైంది. ఈ కేసుల్లో బెయిల్‌పై ప్రస్తుతం జైలు బయట ఉన్నారు లవ్‌లేష్.

ఈ కేసుల్లో లవ్‌లేష్ నుంచి ఎలాంటి ఆయుధాన్నీ పోలీసులు స్వాధీనం చేసుకోలేదు.

పోలీసు కస్టడీలో సన్నీ సింగ్

ఫొటో సోర్స్, ANI

సన్నీ సింగ్‌పై ఎన్ని కేసులున్నాయి?

మీర్‌పూర్‌కి చెందిన పురానా అలియాస్ సన్నీ సింగ్ వయసు 23 ఏళ్లు.

ఈయనపై ఇప్పటికే 14 కేసులు ఉన్నాయి.

ఆయుధాల చట్టం, హత్య, దాడి, దొంగతనం, గ్యాంగ్‌స్టర్ చట్టం సహా వివిధ సెక్షన్ల కింద ఈయనపై కేసులు రిజిస్టర్ అయ్యాయి.

బెయిలుటపై బయటకు వచ్చిన సన్నీ సింగ్, ఆ తర్వాత పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నారు.

2022 నుంచి సన్నీ కనిపించడం లేదని పోలీసులు చెప్పారు. పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లోని బులంద్ షహర్‌లో గ్యాంగ్‌స్టర్ కార్యకలాపాలు నిర్వహించే సుందర్ భాటి గ్యాంగ్‌లో చేరినట్టు తెలిపారు.

నోయిడా, ఘజియాబాద్‌లో సుందర్ భాటి గ్యాంగ్‌పై పలు కేసులు దాఖలయ్యాయి.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం, సన్నీ సింగ్‌పై 14 కేసుల్లో ఛార్జ్‌షీటు దాఖలైంది. 2021లో బెయిల్‌పై విడుదలయ్యారు. ఆ తర్వాత తిరిగి జైలుకి వెళ్లలేదు.

అరుణ్ కుమార్ మౌర్య

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, పోలీసు కస్టడీలో అరుణ్ కుమార్ మౌర్య

అరుణ్ కుమార్ మౌర్య ఎవరు?

కాస్‌గంజ్‌కి చెందిన అరుణ్ కుమార్ మౌర్యపై కాస్‌గంజ్‌లో ఎలాంటి కేసూ లేదని పోలీసులు తెలిపారు.

ఆరు నెలలుగా అరుణ్ కాస్‌గంజ్‌లో ఉండటం లేదు. ఆయన హరియాణాలోని పానిపట్‌లో ఉంటున్నారు.

కాస్‌గంజ్ కతర్వాదిలోని ఆయన కుటుంబ సభ్యులను పోలీసులు సంప్రదించారు.

ముగ్గురు అన్నదమ్ముల్లో అరుణ్ కుమార్ చిన్నవాడని ఊరువాళ్లు చెప్పారు. ఈయన ఇద్దరు సోదరులు దిల్లీలో స్క్రాప్ డీలర్లుగా పనిచేస్తున్నారు.

20 ఏళ్ల క్రితమే అరుణ్ తల్లిదండ్రులు చనిపోయినట్లు స్థానిక మీడియాకు ఊరిపెద్ద వికాస్ కుమార్ చౌహాన్ చెప్పారు.

ఆయన తాత, అంకుల్‌తో పానిపట్‌లో అరుణ్ కుమార్ ఉంటున్నారని తెలిపారు.

ఒక పిస్టల్ తయారీ కేసులో పానిపట్ పోలీసులు 2022 ఫిబ్రవరి 4న అరుణ్ మౌర్యను అరెస్ట్ చేశారు.

అతీక్ అహ్మద్, అష్రఫ్‌ల హత్య

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, అతీక్ అహ్మద్, అష్రఫ్‌ల హత్య

అతీక్ అహ్మద్, అష్రఫ్ అహ్మద్‌ హత్య కేసు ముఖ్యాంశాలు

  • వైద్య పరీక్షల కోసం అతీక్ అహ్మద్, అష్రఫ్‌లను ఏప్రిల్ 15 రాత్రి ఆస్పత్రికి తీసుకొచ్చారు.
  • వారు పోలీసు జీపు దిగగానే మీడియా చుట్టుముట్టింది. ప్రశ్నలు వేయడం ప్రారంభించారు జర్నలిస్ట్‌లు. ఆ సమయంలోనే జర్నలిస్ట్‌ల మాదిరి వచ్చిన నిందితులు కాల్పులు జరిపారు.
  • ఈ కాల్పుల్లో అతీక్ అహ్మద్, అష్రఫ్ అహ్మద్‌ అక్కడికక్కడే మరణించారు. ఈ కాల్పుల్లో ఒక కానిస్టేబుల్, జర్నలిస్ట్ గాయపడ్డారు.
  • పిస్టల్‌‌ను కిందపడేసి ముగ్గురు నిందితులు పోలీసులకు లొంగిపోయారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.
  • ఈ ఘటన తర్వాత ఉత్తర ప్రదేశ్ రాష్ట్రమంతా సెక్షన్ 144 విధించారు. హై అలర్ట్ జారీ చేశారు.
  • రాష్ట్రంలో శాంతి, భద్రతల విషయంపై విపక్షాలు యోగి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి.
  • ఈ ముగ్గురి నిందితుల్ని కోర్టులో హాజరు పరిచారు. వారిని 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ‌కి కోర్టు పంపింది.
  • అతీక్ అహ్మద్, అష్రఫ్ అహ్మద్‌లకు పోస్ట్‌మార్టం నిర్వహించి, అంత్యక్రియలు నిర్వహించారు.
  • ఈ మొత్తం ఘటనపై జ్యూడిషియల్ విచారణ నిర్వహించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు యూపీ ప్రభుత్వం తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)