ఏమిటీ తెల్ల బంగారం? దీని కోసం అమెరికా, చైనాల మధ్య ఇంత పోటీ ఎందుకు?

లిథియం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సెసిలియా బారియా
    • హోదా, బీబీసీ న్యూస్

ప్రపంచమంతా పర్యావరణానికి అనుకూలమైన హరిత ఇంధనాల దిశగా చూస్తున్న వేళ లాటిన్ అమెరికాలోని మూడు దేశాల్లో భారీ నిల్వలు బయటపడ్డాయి.

ప్రపంచంలో ఉన్న మొత్తం లిథియం ఖనిజ నిల్వల్లో సగం అర్జెంటీనా, చిలీ, బొలీవియాలోనే ఉన్నాయి. ప్రపంచానికి లిథియం ట్రయాంగిల్‌గా ఈ మూడు దేశాలు మారాయి. దీంతో ప్రపంచ దేశాలు, పెట్టుబడిదారుల దృష్టి లాటిన్ అమెరికా దేశాలపై పడింది.

ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల్లో వినియోగించే ఈ ఖనిజం, భవిష్యత్ ఇంధన అవసరాలను తీర్చగలదని భావిస్తున్నారు. లిథియం మార్కెట్ అంతర్జాతీయంగా నిరంతరం పెరుగుతూ పోతోంది. చాలా మంది ఈ రంగంలో అడుగుపెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

అంతటి ప్రాముఖ్యమున్న ఈ లిథియం నిక్షేపాలను సొంతం చేసుకునేందుకు అమెరికా, చైనా లాంటి దేశాలు ఏ అవకాశం వదులుకునేందుకు సిద్ధంగా లేవు.

''కొత్త ఇంధనాల దిశగా ప్రపంచం ముందుకు సాగుతోంది. అందుకు అవసరమైన ఖనిజాలపై నియంత్రణ సాధించేందుకు ప్రపంచంలోని అగ్ర రాజ్యాలు పోటీపడుతున్నాయి. ఇది యుద్ధభూమిగా మారింది'' అని ప్రఖ్యాత థింక్ ట్యాంక్ సంస్థ విల్సన్ సెంటర్‌లో లాటిన్ అమెరికా ప్రోగ్రామ్ డైరెక్టర్ బెంజమిన్ గైడాన్ చెప్పారు.

''చైనా ఇప్పటికే తన ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ విషయంలో అమెరికా కాస్త వెనకబడింది. కానీ, ఇప్పుడు చైనా కంటే వెనక ఉండేందుకు అమెరికా సిద్ధంగా లేదు'' అని బెంజమిన్ అన్నారు.

అమెరికా వర్సెస్ చైనా

ఫొటో సోర్స్, Getty Images

చైనా ప్రయత్నాలు

‘తెల్ల బంగారం’గా చెబుతున్న ఈ లిథియం నిక్షేపాలు ప్రపంచంలోని ఏ మూలన ఉన్నా కనుగొనేందుకు చైనా కంపెనీలు కొన్నేళ్లుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అందుకోసం ప్రపంచంలో దొరికే లిథియంలో 60 శాతం నిక్షేపాలున్న లాటిన్ అమెరికా దేశాల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి.

అమెరికన్ జియోలాజికల్ సర్వే నివేదిక 2022 ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 86 మిలియన్ (8.6 కోట్లు) టన్నుల లిథియం నిక్షేపాలున్నట్లు గుర్తించారు. లాటిన్ అమెరికాలోని బొలీవియాలో భారీగా లిథియం నిక్షేపాలున్నట్లు గుర్తించారు. అర్జెంటీనా, చిలీ, అమెరికా, ఆస్ట్రేలియా, మెక్సికో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

భారత్‌లోని జమ్మూ కశ్మీర్‌లోనూ 5.9 మిలియన్ టన్నుల లిథియం నిల్వలు ఉన్నట్లు కనుగొన్నట్లు ఇటీవలే ప్రభుత్వం వెల్లడించింది.

లిథియం తవ్వకాలు, భారీగా ఉత్పత్తి చేయడంలో చిలీ మొదటి వరుసలో నిలుస్తోంది. 1.7 మిలియన్(17 లక్షలు) టన్నుల లిథియం నిక్షేపాలతో ఉత్తర అమెరికా మార్కెట్‌లో మెక్సికో కీలకంగా మారింది. భౌగోళికంగానూ అమెరికా, కెనడాకు దగ్గరగా ఉండడంతో బ్యాటరీ కార్ల తయారీ కేంద్రంగా మారుతోంది.

అతిపెద్ద కార్ల కంపెనీలు టెస్లా, బీఎండబ్ల్యూ ఇటీవల మెక్సికోలో కార్ల తయారీ కేంద్రాలను నెలకొల్పాయి.

లిథియం

ఫొటో సోర్స్, Getty Images

భారీగా లిథియం నిక్షేపాలున్న దేశాలు

(అమెరికా జియోలాజికల్ సర్వే లెక్కల ప్రకారం)

  • బొలీవియా - 21 మిలియన్ టన్నులు (2.1 కోట్ల టన్నులు)
  • అర్జెంటీనా - 193 మిలియన్ టన్నులు (1.93 కోట్ల టన్నులు)
  • చిలీ - 9.6 మిలియన్ టన్నులు (96 లక్షల టన్నులు)
  • ఆస్ట్రేలియా - 6.4 మిలియన్ టన్నులు (64 లక్షల టన్నులు)
  • చైనా - 5.1 మిలియన్ టన్నులు (51 లక్షల టన్నులు)
  • కాంగో - 3 మిలియన్ టన్నులు (30 లక్షల టన్నులు)
  • కెనడా - 2.9 మిలియన్ టన్నులు (29 లక్షల టన్నులు)
  • జెర్మనీ - 2.7 మిలియన్ టన్నులు (27 లక్షల టన్నులు)
  • మెక్సికో - 1.7 మిలియన్ టన్నులు (17 లక్షల టన్నులు)
  • బ్రెజిల్ - 4.7 మిలియన్ టన్నులు (47 లక్షల టన్నులు)
బ్యాటరీ

ఫొటో సోర్స్, REUTERS/PATRICIA PINTO

అమెరికా ఏం చేస్తోంది?

లాటిన్ అమెరికాలో చైనా పెట్టుబడులు పెంచుతోందని 2022 మార్చిలో అమెరికా సదరన్ కమాండ్ హెడ్ జనరల్ లారా రిచర్డ్ సన్ పార్లమెంట్ ఆర్మ్‌డ్ సర్వీసెస్ కమిటీ దృష్టికి తీసుకెళ్లారు.

''లాటిన్ అమెరికా, కరీబియన్ ప్రాంతాల్లో చైనా ఆర్థికంగా, ద్వైపాక్షికంగా తన పరిధిని విస్తృతం చేసుకుంటోంది. సాంకేతికత, సమాచారం, సాయుధ బలగాల విషయంలో బలపడుతోంది'' అని ఆయన హెచ్చరించారు.

''అది ఖనిజ నిక్షేపాలతో నిండిన ప్రాంతం. దానిని మన శత్రువులు అడ్వాంటేజ్‌గా తీసుకునే అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో వాళ్లు పెట్టుబడులు పెడుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ, నిజానికి వనరులను దోచుకుంటున్నారు'' అని చెప్పారు.

లిథియం ట్రయాంగిల్‌గా చెబుతున్న అర్జెంటీనా, బొలీవియా, చిలీలోని లిథియం నిక్షేపాల వ్యవహారంలో చైనా దూకుడుగా వ్యవహరిస్తోంది. లిథియం వెలికితీతకు అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తోంది.

చైనా

ఫొటో సోర్స్, Getty Images

ముందే పసిగట్టిన చైనా

ఇంధన రంగంలో సంప్రదాయ ఇంధనాల(హైడ్రోకార్బన్స్)కు బదులుగా ప్రత్యామ్నాయ దిశగా అమెరికా సహా మరికొన్ని దేశాలు ఆలోచించే నాటికే చైనా ఆ దిశగా అడుగులు వేసింది. రానున్న రోజుల్లో ప్రపంచ మార్కెట్‌లో కీలకం కానున్న లిథియం నిక్షేపాలపై కన్నేసింది.

2001 నుంచే చైనా తన సుదీర్ఘ ప్రణాళికను సిద్ధం చేసింది. సస్టైనబుల్ ఎనర్జీ (పర్యావరణ అనుకూల సుస్థిర ఇంధనం) ప్రాధాన్యతను గుర్తించి తన ఐదేళ్ల ప్రణాళికలో భాగంగా పెట్టుబడులు పెట్టడం ప్రారంభించింది. 2002 నుంచే ఎలక్ట్రిక్ కార్ల తయారీలో పెట్టబడులు పెడుతోంది.

''చాలా ఖనిజాల కోసం చైనా విదేశాలపై ఎక్కువగా ఆధారపడుతోంది. ఒకవేళ ఈ పరిస్థితిలో అంతర్జాతీయంగా మార్పులు వస్తే, అది ఆర్థిక భద్రత, జాతీయ భద్రతపై కూడా ప్రభావం చూపుతుంది'' అని చైనా సహజ వనరుల మంత్రి వాంగ్ గ్వాంగ్వా ఈ ఏడాది జనవరిలో జిన్హువా వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

2016లో చైనా నేషనల్ మినరల్ రిసోర్సెస్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. అందులో 24 రకాల ముఖ్యమైన ఖనిజాలను పొందుపరిచింది. వాటిలో చమురు, సహజ వాయువు, బొగ్గు, షేల్ గ్యాస్, ఇనుము, రాగి, అల్యూమినియం, బంగారం, నికెల్, కోబాల్ట్ లిథియం ఇంకా కొన్ని ఖనిజాలున్నాయి.

''దేశ రక్షణ, దేశ ఆర్థిక భద్రతకు ఈ ఖనిజాలు చాలా అవసరం. కొత్తగా అభివృద్ధి చెందుతున్న వ్యాపారాల్లో ఈ ఖనిజాలు వ్యూహాత్మకంగా ముఖ్యమైనవి'' అని మినరల్ రిసోర్సెస్ ప్లాన్‌లో చైనా పేర్కొంది.

లిథియం

ఫొటో సోర్స్, Getty Images

లాటిన్ అమెరికాలో విపరీతంగా పెరిగిన చైనా పెట్టుబడులు

ఒకవైపు దక్షిణ అమెరికా దేశాల్లోని మైనింగ్‌లో చైనా పెట్టబడులు పెంచుతోంది. అదే సమయంలో చైనా టెక్నాలజీతోపాటు భారీ పెట్టుబడులను తమ దేశంలో పరిశ్రమల అభివృద్ధికి ఉపయోగించుకోవాలని ‘లిథియం ట్రయాంగిల్’ దేశాలు భావిస్తున్నాయి.

గత ఫిబ్రవరిలో బొలీవియా ప్రభుత్వంతో లిథియం కోసం సీఏటీఎల్, బీఆర్‌యూఎన్‌పీ, సీఎంఓసీలతో బిలియన్ డాలర్ల ఒప్పందం కుదర్చుకుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా 2025 నాటికి భారీ స్థాయిలో ఇక్కడి నుంచి లిథియం ఎగుమతి చేయనున్నారు.

మరోవైపు లిథియం విషయంలో అర్జెంటీనా, చైనాల మధ్య బంధాలు కూడా బలోపేతం అవుతున్నాయి. 2022లోనే అర్జెంటీనాలోని సల్టా, కాటామక్రా, జుజురీలలో భిన్న ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెడుతున్నట్లు తొమ్మిది చైనా కంపెనీలు ప్రకటించాయి.

గత ఏడాది జూన్‌లో ఒక చైనా కంపెనీ రెండు లిథియం కార్బొనేట్ ఫ్యాక్టరీల కోసం అర్జెంటీనా ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ చైనా కంపెని ఫోక్స్‌వ్యాగన్, గిలీలకు కూడా బ్యాటరీలు సరఫరా చేస్తుంది.

గత ఏడాది చిలీ ప్రభుత్వంతో ఒక చైనా కంపెనీ లిథియం మైనింగ్ కోసం ఒప్పందం కుదుర్చుకుంది. దీనిలో భాగంగా 80 వేల టన్నుల లిథియంను మైనింగ్ చేసుకునే అవకాశం ఆ సంస్థకు దక్కింది. చిలీలోని అంతోఫగాస్తాలోని ఏర్పాటుచేస్తున్న లిథియం ఇండస్ట్రియల్ పార్క్‌లో భారీ పెట్టుబడులు పెడుతున్నట్లు చాలా చైనా కంపెనీలు ప్రకటించాయి.

వీడియో క్యాప్షన్, చైనా స్పాంజ్ సిటీలు.. ఈ నగరాలు వరదలకు భయపడవు

అగ్ర దేశాల మధ్య పోరు..

‘‘హరిత ఇంధనానికి సంబంధించిన ప్రధాన ఖనిజాలు, ఇతర టెక్నాలజీలకు చెందిన సరఫరా గొలుసుల్లో తమ స్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలని అమెరికా చూస్తోంది’’ అని అట్లాంటిక్ కౌన్సిల్‌లోని లాటిన్ అమెరికా సెంటర్‌లో ప్రొఫెసర్ పెపె జాంగ్ చెప్పారు. అందుకే టెక్నాలజీతోపాటు జియోపొలిటికల్‌గానూ అమెరికా, చైనాల మధ్య పోరుకు ఇది కారణం అవుతోందని ఆయన అన్నారు.

‘‘అయితే, ఈ పోటీలో చైనా వేగంగా ముందుకు వెళ్తోంది. లాటిన్ అమెరికా దేశాల్లోని చైనా పెట్టుబడులు ఇక్కడ ప్రధాన పాత్ర పోషించే అవకాశముంది’’ అని జాంగ్ వివరించారు.

2020, 2021లలో చైనా ఈ రంగంలో 1.1 బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టింది. ఈ ఏడాది ఇవి మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

‘‘ఒక్క జనవరిలోనే చైనా కంపెనీలు బొలీవియాలో బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయి’’ అని ఒక పరిశోధకుడు చెప్పారు.

గత బుధవారం బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డా సిల్వా చైనా పర్యటకు వచ్చారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో ఆయన చర్చలు జరిపారు. 20 ద్వైపాక్షిక ఒప్పందాలపై వీరిద్దరూ సంతకాలు చేశారు.

వీడియో క్యాప్షన్, ఈ దేశాన్ని సముద్రం మింగేస్తోంది.. ఎక్కడికి వెళ్లాలో తేల్చుకోని ప్రజలు

జాతీయ భద్రత..

చైనా తరహాలోనే అమెరికా కూడా వ్యూహాత్మక కారణాలను దృష్టిలో ఉంచుకొని ప్రధాన ఖనిజాలకు తొలి ప్రాధాన్యం ఇస్తోంది.

గత ఏడాది అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దీనిపై ఒక ప్రకటన కూడా చేశారు. ‘‘చాలా కొత్త టెక్నాలజీలకు ఈ ఖనిజాలు కీలకం. ఇవి దేశ భద్రత, ఆర్థిక అభివృద్ధిలోనూ ప్రధాన పాత్ర పోషిస్తాయి’’ అని ఆయన చెప్పారు.

బైడెన్ తన ప్రకటనలో ప్రస్తావించిన ఖనిజాల్లో లిథియం, కోబాల్ట్ లాంటి ఖనిజాలు కూడా ఉన్నాయి. కంప్యూటర్లు, గృహోపకరణాలతోపాటు బ్యాటరీలు, సోలార్ ప్యానెల్స్, విద్యుత్ కార్ల తయారీకి ఈ ఖనిజాలు చాలా ముఖ్యమని ఆయన అన్నారు.

ఉద్గారాలకు కారణమయ్యే ఇంధన వనరులను తగ్గించి, పునరుత్పాదక ఇంధనం వైపుగా ప్రపంచంలోని అన్ని దేశాలూ ముందుకు వెళ్తున్నాయని ఆయన చెప్పారు. అంటే వచ్చే దశాబ్దాల్లో వీటి డిమాండు 400 నుంచి 600 శాతం వరకూ పెరిగే అవకాశం ఉంటుంది.

అదే సమయంలో బ్యాటరీ టెక్నాలజీలో కీలకమయ్యే లిథియం, గ్రాఫైట్‌ల డిమాండ్ కూడా 4000 శాతం పెరిగే అవకాశముంది.

వీడియో క్యాప్షన్, డ్యాన్స్‌తో విద్యుత్ ఉత్పత్తి.. అందుబాటులోకి సరికొత్త టెక్నాలజీ

అమెరికా వర్సెస్ చైనా

చైనా, అమెరికాల మధ్య ఈ పోటీలో చైనా ముందున్నట్లు కనిపిస్తోందని బెంజమిన్ అన్నారు.

‘‘ఇందులో చైనా ఒక అడుగు ముందున ఉంది. ఎందుకంటే ఇప్పటికే చాలా లాటిన్ అమెరికా దేశాల్లో బ్యాటరీల ఉత్పత్తి కోసం చైనా పెట్టుబడులు పెట్టింది. కానీ, అమెరికా మాత్రం తమ కంపెనీలకు అవసరమైన ఖనిజాలను మాత్రమే ఈ దేశాల నుంచి కొనుగోలు చేస్తోంది’’ అని ఆయన చెప్పారు.

‘‘నేడు లాటిన్ అమెరికా దేశాల ముందు రెండు మార్గాలున్నాయి. వీటిలో మొదటిది నేరుగా ఖనిజాలను అమెరికాకు విక్రయించడం. రెండోది చైనా పెట్టుబడులను ఆహ్వానించి తమ దేశంలో పరిశ్రమలను అభివృద్ధి చేసుకోవడం. వారికి రెండోది కాస్త ఆకర్షణీయంగా అనిపించొచ్చు’’ అని ఆయన అన్నారు.

‘‘అయితే, అమెరికా కూడా చైనాపై పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో నేడు రెండు అగ్ర దేశాల మధ్య దక్షిణ అమెరికా నలిగిపోతోంది’’ అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)