విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను తెలంగాణ ప్రభుత్వం కొనగలదా? నిబంధనలు ఏం చెబుతున్నాయి?

స్టీల్‌ప్లాంట్
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

ఉద్యోగ, కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు ఎన్ని అందోళనలు, నిరసనలు చేసినా విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణలో కేంద్ర ప్రభుత్వం వెనుకడుగు వేయట్లేదు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌‌లో కేంద్రానిదే వందశాతం వాటా.

ఈ నేపథ్యంలో తెలంగాణ తరఫున విశాఖ స్టీల్‌ప్లాంట్ కొనుగోలు బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారంటూ ప్రచారమూ సాగుతోంది.

సింగరేణి సంస్థ డైరెక్టర్లు విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు వచ్చి ఇక్కడి అధికారులతో కూడా చర్చించారు.

నిజంగానే తెలంగాణా ప్రభుత్వం స్టీల్‌ప్లాంట్‌ను కొనుగోలు చేస్తుందా? కేంద్ర ప్రభుత్వం ఏదైనా సంస్థ నుంచి తన వాటాలను అమ్ముకుంటే వాటిని రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయవచ్చా? నిబంధనలు ఏం చెప్తున్నాయి?

స్టీల్‌ప్లాంట్ ప్రకటనలో ఏముంది?

2023 మార్చి 27వ తేదీన విశాఖ స్టీల్‌ప్లాంట్ (రాష్ట్రీయ ఇస్ఫాత్ నిగమ్ లిమిటెడ్) పేరుతో ‘ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్’ (ఈవోఐ) ప్రకటన విడుదల చేసింది.

ఈ ప్రకటన విడుదల తర్వాతే స్టీల్‌ప్లాంట్ కొనుగోలు ‘బిడ్స్’ పిలుస్తున్నారంటూ మీడియాలో వార్తల హడావిడి మొదలైంది.

నిజానికి ‘‘కోక్, ఇనుప ఖనిజం సరఫరా చేయండి, లేదా వర్కింగ్ క్యాపిటల్ సమకూర్చండి, దానికి బదులు మేం ఉక్కు ఇస్తాం’’ అన్నది స్టీల్‌ప్లాంట్ విడుదల చేసిన ‘ఎక్స్ ప్రెషెన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్విటేషన్‌’కు అర్థం. ఇది ప్రైవేటీకరణ ప్రక్రియలో భాగం కాదు. కేవలం వర్కింగ్ క్యాపిటల్ సమకూర్చుకునే ప్రయత్నం. ఈవోఐ బిడ్డింగ్ కు చివరి తేదీ ఏప్రిల్ 15, 2023

ఈవోఐ ప్రకటన ప్రకారం ఈ బిడ్లలో పాల్గొనే వారు ఉక్కు ఉత్పత్తికి అవసరమైన ముడి సరుకు అంటే కుకింగ్‌ కోల్‌, ఇనుప ఖనిజం వ్యాపారంలో ఉండాలనేది ఒక నిబంధన.

ఉక్కు ఉత్పత్తికి అవసరమయ్యే ముడి సరుకులో కుకింగ్ కోల్ కూడా ఒకటి.

సింగరేణి కాలరీస్ ఈ వ్యాపారంలోనే ఉంది. అందుకే సింగరేణి కాలరీస్ నుంచి విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు అధికారులు వచ్చి ఇక్కడి అధికారులతో చర్చించారు.

దీంతో తెలంగాణా ప్రభుత్వం విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉందంటూ ప్రచారం ఊపందుకుంది.

ఇదే సమయంలో విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలకు బీఆర్ఎస్ నాయకులు సంఘీభావం తెలుపుతూ నిరాహార దీక్షలు కూడా చేస్తున్నారు.

‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టీల్‌ప్లాంట్‌ను కొనవచ్చు కదా?’

కేంద్ర ప్రభుత్వం తన వాటాలను అమ్మేందుకే నిర్ణయించుకున్నప్పుడు తెలంగాణ ప్రభుత్వమో, మరో ప్రభుత్వమో కొనడం ఎందుకు? ఆ వాటాల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయవచ్చు కదా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది.

కేంద్రం వాటాల విక్రయాల్ని తెరమీదకు తెచ్చినప్పుడు అప్పటి ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డితో బీబీసీ గతంలో మాట్లాడింది.

కేంద్రం తన వాటాల్నిఅమ్మే ప్రక్రియను ముందుకు తెస్తే రాష్ట్ర ప్రభుత్వం కొనేందుకు కూడా ఆలోచన చేస్తుందని ఆయన బీబీసీతో చెప్పారు.

ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఈ అంశంపై ఏమన్నారంటే....

‘’విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. విశాఖ స్టీల్స్‌ను ప్రైవేటుపరం చేయొద్దని అసెంబ్లీలో తీర్మానం కూడా చేశాం.

తెలంగాణ ప్రభుత్వం ఒక బృందాన్ని పంపించి ప్లాంట్‌ నిర్వహణ సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తామని మాత్రమే చెప్పారని భావిస్తున్నా. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు తెలంగాణ ప్రభుత్వం అనుకూలమా? వ్యతిరేకమా?. ఒకవేళ ప్రైవేటికరణకు వ్యతిరేకమైతే, ఏ విధంగా బిడ్‌లో పాల్గొంటారు?

కేంద్రమే ఆ ప్లాంట్‌ను నడపలేకపోయినప్పుడు, రాష్ట్ర ప్రభుత్వం ఎలా నిర్వహించగలుగుతుంది?. అందుకే తెలంగాణకు కూడా అది సాధ్యం కాదు. బీఆర్‌ఎస్‌..రాజకీయాల్లో భాగంగా ఇదంతా చేస్తోంది’’ అని అమర్నాథ్ వ్యాఖ్యానించారు.

స్టీల్ ప్లాంట్

అసలు రాష్ట్రాలు స్టీల్‌ప్లాంట్‌ని కొనవచ్చా?

ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి కేంద్ర ఆర్థికశాఖ 2022 ఏప్రిల్‌ 19న మెమో ద్వారా నియమావళి ప్రకటించింది.

అందులో “51 శాతం, అంతకంటే ఎక్కువ వాటా కలిగి ఉన్నకేంద్ర ప్రభుత్వ సంస్థగానీ, రాష్ట్ర ప్రభుత్వ సంస్థగానీ, లేదా సంయుక్త భాగస్వామ్య సంస్థలు.. ఇతర ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ బిడ్లలో పాల్గొనరాదు” అని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

ఈ నిబంధన ప్రకారం చూస్తే తెలంగాణాతో పాటు ఏ రాష్ట్రం కూడా విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కొనుగోలు చేయలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాము ప్రైవేటీకరణకే వ్యతిరేకం కాబట్టి, ఇక బిడ్లలో పాల్గొనే అవకాశమే లేదని చెబుతోంది.

“కేంద్రం.. ప్రభుత్వాల పని వ్యాపారం చేయడం కాదని, అందుకే నష్టాల్లో ఉన్న కంపెనీల నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్నామని చెబుతోంది.

కేంద్రం అమ్మేస్తున్న వాటాలను రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయడమంటే మళ్లీ రాష్ట్రాలు వ్యాపారం చేస్తున్నట్లే కదా. అందుకే కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ బిడ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాల్గొనరాదు అనే నిబంధన తెచ్చింది” అని ఏయూ ఎకనామిక్స్ డిపార్ట్‌మెంట్ రిటైర్డ్ ప్రొఫెసర్ ఎం. ప్రసాదరావు బీబీసీతో చెప్పారు.

స్టీల్ ప్లాంట్

‘స్టీల్ ప్లాంట్ ఈవోఐకి ఎందుకు వెళ్లింది’

ఈవోఐ ద్వారా బిడ్లను ఆహ్వానిస్తున్న స్టీల్ ప్లాంట్ ముఖ్య ఉద్దేశం బ్లాస్ట్ ఫర్నేస్-3 ని రక్షించుకోవడమే. విశాఖ ఉక్కులో బ్లాస్ట్‌ ఫర్నేస్‌-3 ఏడాదిన్నరగా మూతపడి ఉంది. అవసరమైన నిధులు లేక దానిని మూసేశారు.

మిగతా రెండు ఫర్నేస్‌లు అతి కష్టం మీద నడుస్తున్నా, బీఎఫ్-3 మాత్రం ముడిసరకు లేకపోవడంతో మూతపడింది. కేంద్రం నుంచి కూడా ఎటువంటి సహయం రాకపోవడంతో ‘‘ఎవరైనా ముడి పదార్థాలు సరఫరా చేస్తే... దానికి బదులుగా ఉక్కును ఇస్తాం’’ అంటూ ఈవోఐ ప్రకటన చేయాల్సి వచ్చిందని స్టీల్ ప్లాంట్ అధికారి ఒకరు చెప్పారు.

“ఉక్కులో మూడు బ్లాస్ట్ ఫర్నేసులు ఉన్నాయి. ఇందులో బీఎఫ్-3 పెద్దది. ఇది రోజుకు 7 నుంచి 8 వేల టన్నులు స్టీల్ తయారు చేయగలదు. దీని నిర్వహణకు 3 వేల టన్నుల పైగా కోకింగ్ కోల్ ఉపయోగిస్తారు. దీన్ని నిర్వహించాలంటే మూడు నెలలకు సరిపడా ముడి సరుకు సిద్ధంగా ఉండాలి.

స్లీల్ ప్లాంట్ 2021-22లో రూ. 28 వేల కోట్ల టర్నోవర్‌తో వెయ్యి కోట్లు లాభం పొందగా, బీఎఫ్-3 అందుబాటులో లేని కారణంగా ఒక్క 2022-23లోనే రూ.23 వేల కోట్ల టర్నోవర్‌తో నష్టాల్లోకి వెళ్లింది.

బీఎఫ్-3 వినియోగించినా, వినియోగించకున్నా దాని పరికరాలు దెబ్బతినకుండా కాపాడుకునేందుకు కోట్ల రూపాయలను నిర్వహణ వ్యయంగా ఖర్చు చేయాలి” అని ఉద్యోగ సంఘాల నాయకులు అయోధ్య రామ్ చెప్పారు.

ఈవోఐ ద్వారా ఈ కష్టాల నుంచి గట్టెక్కవచ్చునని అయోధ్యరామ్ ఆశాభావం వ్యక్తంచేశారు.

 విశాఖ కార్మికులు
ఫొటో క్యాప్షన్, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు చాలారోజులుగా నిరసన తెలుపుతున్నారు.

‘స్టీల్ ప్లాంట్‌ బతికించే ప్రయత్నం’

‘‘స్టీల్ ప్లాంట్ కొనుగోలు బిడ్లలో పాల్గొంటాం, విశాఖ స్టీల్ ప్లాంట్‌ను తెలంగాణ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది’’ అనే ప్రకటనలతో పాటు స్టీల్ ప్లాంట్ గేటు వద్ద జరుగుతున్న ఆందోళనల్లో బీఆర్ఎస్ నాయకులు పాల్గొనడం వంటివి కార్మిక సంఘాల్లో ఆశలు రేకేత్తిస్తున్నాయని స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల గుర్తింపు సంఘం అధ్యక్షులు అయోధ్యరామ్ బీబీసీతో అన్నారు.

“విశాఖ స్టీల్ ప్లాంట్‌కు గనులు కేటాయించకుండా, ముడిసరకు సరఫరా చేయకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారు. రూ.5 వేల కోట్లు ఇచ్చి ఆదుకోమన్నా, కనీసం సెయిల్‌లో కలపాలని కోరినా కేంద్రం పట్టించుకోవడం లేదు.

ఈ పరిస్థితుల్లో సింగరేణి డైరెక్టర్లు వచ్చారు. బీఎఫ్-3 నిలదొక్కుకోవడానికి తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు ముందుకొస్తే స్వాగతిస్తాం” అని అయోధ్యరామ్ చెప్పారు.

‘‘ముందు సింగరేణి కాలరీస్‌కు తెలంగాణ ప్రభుత్వం తీర్చాల్సిన బకాయిలు చెల్లించి, అప్పుడు స్టీల్ ప్లాంట్‌ను ఉద్దరించే పని చేయాలని ఆంధ్ర ప్రజలు కేసీఆర్‌కు చెప్పండి’’ అని సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ జనరల్ సెక్రటరీ, ఎన్టీయూసీ జనరల్ సెక్రటరీ జనక్ ప్రసాద్ బీబీసీతో చెప్పారు.

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో, డీమానిటైజేషన్, జీఎస్టీలకు బీజేపీకి జై కొట్టిన కేసీఆర్ ఇప్పుడు రాజకీయాల కోసం విశాఖ స్టీల్ ప్లాంట్‌ని వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

విశాఖ

‘అవకాశం లేదు, బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తోంది’

స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ కోసం మాట్లాడే హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాధవ్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రవేశించేందుకు నాటకాలు ఆడుతోందని ఆయన ఆరోపించారు.

స్టీల్‌ప్లాంట్ ప్రస్తుతం నష్టాల్లో ఉన్నందున బ్యాంకు రుణాలు, ఇతర పెట్టుబడులు వచ్చే అవకాశం లేకపోవడంతో ఈవోఐ ప్రకటన ఇచ్చిందని చెప్పారు.

ఏపీలో బీఆర్ఎస్ రాజకీయాలు, స్టీల్‌ప్లాంట్ బిడ్లపై తెలంగాణ ప్రభుత్వం ఆసక్తి లాంటి అంశాలను పరిశీలిస్తున్న రాజకీయ విశ్లేషకులైన యుగంధర్ రెడ్డితో బీబీసీ మాట్లాడింది.

“తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్‌ల మధ్య సత్సబంధాలు కొనసాగుతూ వస్తున్నాయి. అయితే తాజాగా బీఆర్ఎస్‌తో జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని భావిస్తున్న కేసీఆర్.. ఏపీలో ఎంట్రీకి స్టీల్‌ప్లాంట్ అంశాన్ని ఎంచుకున్నారు.

నిజంగా సమస్యలపైనే పోరాడాలని అనుకుంటే పోలవరం, కడప స్టీల్ ప్లాంట్ అంశాలపై కూడా బీఆర్ఎస్ దృష్టి పెట్టొచ్చు. కానీ జగన్ కు ఇబ్బంది లేకుండా, బీజేపీని టార్గెట్ చేస్తూ స్టీల్‌ప్లాంట్ అంశాన్ని ఎంచుకుంది.” అని యుగంధర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

పోలవరంతో సహా ఏపీలోని అన్ని సమస్యలపై బీఆర్ఎస్ పోరాడుతుందని, కాకపోతే వెంటిలేటర్ పై ఉన్న స్టీల్‌ప్లాంట్ అంశాన్ని ముందుగా ఎంచుకున్నామని విశాఖ బీఆర్ఎస్ నాయకులు జగన్ మురారి బీబీసీతో అన్నారు.

స్టీల్‌ప్లాంట్‌ను కాపాడాలనే చిత్తశుద్ది బీఆర్ఎస్ పార్టీకి ఉందని తెలిపారు.

వీడియో క్యాప్షన్, స్టీల్ ప్లాంట్ కోసం సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఎందుకు బిడ్ వేశారంటే....

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)