మిషన్ వాత్సల్య: తల్లిదండ్రులు లేని పిల్లలకు నెలకు రూ.4,000 ఆర్థిక సాయం, దరఖాస్తుకు 15వ తేదీ వరకు గడువు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఎ. కిశోర్‌బాబు
- హోదా, బీబీసీ కోసం
తల్లిదండ్రులను కోల్పోయి పిల్లలు, అయినవాళ్లు చూడక, నిరాదరణకు గురై, నిరాశ్రయులైన బాలలకు ఈ దేశంలో ఎంతోమంది ఉన్నారు.
అలాంటి పిల్లలు దేశంలో ఎంతమంది ఉన్నారని కచ్చితంగా చెప్పే అధికారిక గణాంకాలు లేవు. అయితే, 2021లో ఒక అంచనా ప్రకారం దేశ జనాభాలో 30 మిలియన్ల మందికిపైగా ఇలాంటి వారుంటారు.
ఈ విషయంలో దాఖలైన ఒక పిటిషన్‌పైన విచారించిన సుప్రీం కోర్టు అనాథపిల్లల గణాంకాలు సేకరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించడంతో అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి పిల్లల రిజిస్టర్‌కు పోర్టల్ తెరచారు. 2022 మార్చి 23వ తేదీ వరకు 1,53,827 మంది అనాథ బాలలు అధికారికంగా దీనిలో నమోదు చేసుకున్నారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
ఇలాంటి అనాథ పిల్లల సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక పథకం అమలు చేస్తోంది. దాని పేరే ‘మిషన్ వాత్సల్య’. 18 ఏళ్లలోపు అనాథ పిల్లలకు ఈ పథకం కింద ప్రతి నెలా 4,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తున్నారు.
ఇంతకీ మిషన్ వాత్సల్య అంటే ఏమిటి? ఈ పథకం కింద ఆర్థిక భృతి పొందాలంటే ఉండాల్సిన అర్హతలు ఏమిటి? దీనికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఏమేమి పత్రాలు పొందుపరచాలి? తదితర వివరాలు పూర్తిగా తెలుసుకుందాం.

ఫొటో సోర్స్, Getty Images
మిషన్ వాత్సల్య అంటే ఏంటి?
ఈ పథకానికి కేంద్రం 60 శాతం నిధులు ఇస్తే, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు 40 శాతం నిధులు భరిస్తాయి. ఈశాన్య రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మాత్రం 90 శాతం కేంద్రం, 10 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి.
ఈ పథకానికి అర్హులైనవారు దరఖాస్తు చేసుకోవాలని తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది.
ఎప్పటిలోగా దరఖాస్తు చేసుకోవాలి?
ఈ నెల 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.
ఎవర్ని సంప్రదించాలి?
ఆంధ్రప్రదేశ్‌లో అయితే అర్హులైనవారు తమకు దగ్గర్లోని గ్రామ, వార్డు సచివాలయ అధికారులు, గ్రామ వాలంటీర్లు, అంగన్వాడీ సిబ్బంది, దగ్గర్లోని ప్రభుత్వ బడిలోని ఉపాధ్యాయులను, మహిళా పోలీసు వాలంటీర్లను సంప్రదించవచ్చు.
ఎవరు ఎంపిక చేస్తారు?
వచ్చిన దరఖాస్తులను జిల్లా కలెక్టరు అధ్యక్షతన జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారిత అధికారి, సీడబ్ల్యూసీ అధికారి, డీసీపీఓ, ఎన్ఐసీ పీఓ, శిశు గృహ సంక్షేమాధికారి, జిల్లాలోని ఒక స్వచ్ఛంద సంస్థకు చెందిన అధికారి తదితరు సభ్యుల పర్యవేక్షణలోని కమిటీ ఎంపిక చేస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
మిషన్ వాత్సల్య పథకానికి ఎవరు అర్హులు?
- తల్లి లేదా తండ్రి, లేదా తల్లిదండ్రులను ఇద్దర్నీ కోల్పోయిన అనాథ బాలలు
- వితంతువుల పిల్లలు, విడాకులు తీసుకున్న దంపతుల పిల్లలు
- తల్లిదండ్రులు కోల్పోయి ఇతర కుటుంబాల్లో నివసిస్తున్న పిల్లలు
- ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న తల్లిదండ్రుల పిల్లలు
- ఆర్థికంగా, శారీరకంగా బలహీనులై తమ బిడ్డలను పెంచలేని తల్లిదండ్రుల పిల్లలు
- ఇల్లులేని బాలలు, ప్రకృతి వైపరీత్యాలకు బాధితులైన బాలలు, బాల కార్మికులు, బాల్యవివాహ బాధిత బాలలు, హెచ్ఐవీ/ఎయిడ్స్ బాధిత బాలలు, అంగవైకల్యం ఉన్న బాలలు, అక్రమ రవాణాకు (ట్రాఫికింగ్) గురైన బాలలు,
- ఇంటి నుంచి తప్పిపోయి లేదా పారిపోయి వచ్చేసిన బాలలు, బాల యాచకులు,
- పీఎం కేర్ ఫర్ చిల్డ్రన్ పథకం మంజూరైన పిల్లలు
- కోవిడ్-19తో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు
వయో పరిమితి ఎంత?
18 సంవత్సరాలలోపు వయసు ఉండాలి.
ఆదాయ పరిమితి ఎంతుండాలి?
రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు ఈ పథకం వర్తించదు.
గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలకు వారి కుటుంబ వార్షికాదాయం రూ.72,000కు మించి ఉండకూడదు.
పట్టణ ప్రాంతాల్లోని పిల్లలకు వారి కుటుంబ వార్షికాదాయం రూ.96,000కు మించి ఉండకూడదు.

ఫొటో సోర్స్, Getty Images
నెలకు ఎంత భృతి ఇస్తారు? ఎప్పటి వరకు ఇస్తారు?
ఈ పథకం కింద అనాథ బాలలకు ప్రతి నెల రూ.4000 ఆర్థిక భృతి అందజేస్తారు
ఆ బాలుడు లేదా బాలికకు 18 ఏళ్ల వయసు వచ్చేంత వరకు ఈ భృతి అందజేస్తారు.
లేదా ఈ మిషన్ వాత్సల్య పథకం ముగిసేంత వరకు లేదా ఆ బాలలు ఇన్‌స్టిట్యూట్ (సీసీఐ)లో చేరినప్పుడు ఈ ఆర్థిక సాయం నిలిపివేస్తారు.
పిల్లలు 30 రోజులకు మించి బడికి హాజరు కాకపోతే ఈ పథకం నిలిపివేస్తారు. (అయితే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల విషయంలో మాత్రం మినహాయింపు ఉంటుంది)
ఈ పథకానికి అర్హులైన పిల్లలు భవిష్యత్తులో ఏదైనా హాస్టల్‌లో చేరితే అప్పటి నుంచి ఈ పథకం నిలిపివేస్తారు.
తల్లి మరణించింది తండ్రి వేరే వివాహం చేసుకున్నాడు. ఆ తండ్రి బిడ్డలకు ఈ పథకం వర్తిస్తుందా?
వర్తంచదు. ఎందుకంటే ఆ బాలలకు పినతల్లి ఉంటుంది కాబట్టి..
స్టడీ సర్టిఫికెట్ ఎప్పటిది సమర్పించాలి?
2022-2023 విద్యా సంవత్సరానికి సంబంధించిన స్టడీ సర్టిఫికెట్ మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది

ఫొటో సోర్స్, Aarabu Ahmad Sultan
ఏఏ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది?
- జనన ధ్రువీకరణ పత్రం
- ఆధార్ కార్డు
- తల్లి ఆధార్ కార్డు, తండ్రి ఆధార్ కార్డు
- తల్లి లేదా తండ్రి మరణ ధ్రువీకరణ పత్రం, మరణానికి కారణం తెలిపే పత్రాలు
- బాలుడు లేదా బాలిక సంరక్షకుడి (గార్డియన్) ఆధార్ కార్డు
- రేషన్ కార్డు లేదా బియ్యం కార్డు
- కుల ధ్రువీకరణ పత్రం
- బాలుడు లేదా బాలిక పాస్‌పోర్టు సైజు ఫోటో
- స్టడీ సర్టిఫికెట్
- ఆదాయ ధ్రువీకరణ పత్రం
జాయింట్ అకౌంటు తప్పనిసరిగా ఉండాల్సిందేనా?
బాలుడు లేదా బాలిక వ్యక్తిగత బ్యాంకు అకౌంటుతో పాటుగా వారి సంరక్షకుడు లేదా సంరక్షకురాలితో కలిసిన జాయింట్ అకౌంటు ఖాతా వివరాలు తప్పనిసరిగా పొందుపరచాలి.
తల్లిదండ్రలు కోల్పోయి బడికి వెళ్లకుండా ఉన్న బాలలకు పథకం వర్తిస్తుందా?
వర్తించదు. తల్లి దండ్రులు కోల్పోయిన అనాథ పిల్లలు తప్పనిసరిగా బడికి వెళుతూ ఉండాలి. అలాంటి వారికే ఈ పథకం వర్తిస్తుంది.
ముఖ్యంగా గుర్తించుకోవాల్సింది, బడికెళుతున్న బాలలు ఏదైనా ప్రభుత్వ వసతి గృహాల్లో ఉన్నట్లయితే వారికి కూడా ఈ పథకం వర్తించదు
ఈ పథకం కింద ఏటా ప్రతి నెలా రూ.4000 ఇస్తారా?
ఇది స్పాన్సర్‌షిప్ ప్రోగ్రామ్ కమిటీ నిర్ణయంపైన ఆధారపడి ఉంటుంది. ఈ పథకం పొందుతున్న బాలలు వివరాలు, పరిస్థితిని ఈ కమిటీ ఏటా సమీక్షిస్తుంది. ఈ కమిటీ సిఫారసుల మేరకు ఈ పథకాన్ని ఆ సంవత్సరం పొడిగించవచ్చు లేదా నిలిపివేయచ్చు.
దరఖాస్తు చేసుకునే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
మొదటి నాలుగు కాలాల్లో చిరునామా నింపాలి.
తండ్రి మరణించినా లేదా బతికున్నప్పటికీ తప్పనిసరిగా తండ్రి పేరు కచ్చితంగా రాయాల్సిందే.
తల్లిదండ్రులు ఇద్దరు చనిపోతే ఆ బాలలకు సంరక్షకుడిగా ఎవరున్నారో వారి పేరు వారి ఆధార్ నంబరు కచ్చితంగా పొందుపరచాలి
పిల్లల జనన ధ్రువీకరణ పత్రాలకు సంబంధించి గ్రామ పంచాయతీ కార్యాలయం లేదా మున్సిపల్ కార్యాలయం లేదా పాఠశాల నుంచి పొందిన సర్టిఫికెట్లు సమర్పించాలి.
పిల్లల సంరక్షకుడికి బ్యాంకు ఖాతాలు ఏదైనా జాతీయ బ్యాంకులో ఉంటే మంచిది.
వివరాలకు ఎవర్ని సంప్రదించాలి?
ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నవారు మీకు దగ్గర్లోని వార్డు లేదా గ్రామ వాలంటీర్‌ను సంప్రదించవచ్చు. లేదా మీకు దగ్గర్లోని గ్రామ సచివాలయాన్ని సంప్రదిస్తే అక్కడి అధికారులు మీకు సహాయం చేస్తారు.
మిగిలిన ప్రాంతాల్లోని వారైతే మీకు దగ్గర్లోని అంగన్వాడీ కార్యకర్తలను, స్త్రీ మరి శిశు సంక్షేమ శాఖ అధికారులను సంప్రదించవచ్చు.
ఆంధ్రప్రదేశ్ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కాల్ సెంటర్ 1098కు ఫోన్‌చేసి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
- 18మంది మహిళలపై 2 రోజులపాటు అత్యాచారం...30ఏళ్లకు పైగా సాగిన విచారణ
- ఆర్ఈఈ: చైనాలో ఈ ఖనిజం ఉత్పత్తి నిలిచిపోతే అనంతపురం, చిత్తూరు జిల్లాలే కీలకం అవుతాయా?
- 30 ఏళ్లు దాటిన మహిళలు కచ్చితంగా చేయించుకోవాల్సిన 5 పరీక్షలు
- దెబ్బ తగిలిన ప్రతిసారీ టీటీ ఇంజెక్షన్ తీసుకోవాలా, అసలు ఎప్పుడు అవసరం?
- సికింద్రాబాద్- తిరుపతి వందే భారత్ ఎక్స్ ప్రెస్ టైమింగ్స్ ఏంటి, టికెట్ ధర ఎంత, ఎక్కడెక్కడ ఆగుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















