ఆర్ఈఈ: చైనాలో ఈ ఖనిజం ఉత్పత్తి నిలిచిపోతే అనంతపురం, చిత్తూరు జిల్లాలే కీలకం అవుతాయా?

అనంతపురంలో రాళ్లు
    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మనం నిత్య వాడే సెల్ ఫోన్, టీవీలు, ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఎంతో కీలకం.

ముఖ్యంగా స్క్రీన్ డిస్‌ప్లేలో ఎక్కువగా వాడుతుంటారు. సెమీ కండక్టర్ పరిశ్రమలో విరివిగా వినియోగిస్తుంటారు.

ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ భూమిలో లభించే అరుదైన మూలకాల

(రేర్ ఎర్త్ ఎలిమెంట్స్-ఆర్ఈఈ)ను ఆంధ్రప్రదేశ్ లో ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

హైదరాబాద్ లోని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌‌స్టిట్యూట్(ఎన్జీఆర్ఐ)కి చెందిన సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ పి.వి.సుందరరాజు బృందం ఆర్ఈఈపై కీలక పరిశోధన చేసింది.

వీరి పరిశోధనలో అనంతపురం, చిత్తూరు జిల్లాలో పెద్ద ఎత్తున ఆర్ఈఈ నిల్వలు ఉన్నట్లు గుర్తించారు.

అనంతపురం జిల్లాలోని దంచర్ల, దండువారిపల్లి, పెద్దఒడుగూర్, రెడ్డిపల్లి, చింతలచెరువు, చిత్తూరు జిల్లాలోని పులికొండ మండలాల్లో నిల్వలు కనుగొన్నారు.

గామా పరికరంతో ఆర్ఈఈల ప్రాథమిక గుర్తింపు

అసలు ఏమిటీ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్

పేరుకు తగ్గట్లుగానే ఇవి భూమిలో అరుదుగా దొరుకుతాయి. వీటికి ప్రకాశించే గుణంతోపాటు రసాయన చర్యలను వేగవంతం చేసే తత్వం కలిగి ఉంటాయి.

ఇవి రసాయన శాస్త్రంలోని పీరియాడిక్ టేబుల్ లో లాంథనాయిడ్స్ సిరీస్ లో కనిపిస్తాయి.

ఈ ఆర్ఈఈలను లేటెస్ట్ టెక్నాలజీలలో వినియోగిస్తున్నారు.

దీనిపై ఎన్‌జీ‌ఆర్‌ఐ శాస్త్రవేత్త పి.వి.సుందరరాజు బీబీసీతో మాట్లాడారు. ‘‘ఆర్ఈఈలతో తయారీ రంగంలో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. గాలి మరలు(టర్బయిన్లు), సోలార్ ప్యానల్స్, సెల్ ఫోన్లు, సెమీ కండక్టర్లు, ఏవియేషన్, ఆటోమొబైల్, స్పేస్ టెక్నాలజీ, మెడికల్ టెక్నాలజీ.. ఇలా ఎన్నో టెక్నాలజీలలో వస్తువుల తయారీకి ఉపయోగిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ అధికంగా ఉంది. సరఫరా తక్కువగా ఉంది. అందుకే వీటి నిల్వలు కనిపెట్టడం కీలకంగా మారింది.

దేశంలో ఇప్పటివరకు ఆర్ఈఈ ల ఉత్పత్తి దాదాపుగా బీచ్ శాండ్(సముద్ర తీరంలోని ఇసుక) నుంచి ఎక్కువగా చేస్తున్నారు. భూమిలో వాటి నిల్వలు ఉన్నట్లు మా పరిశోధనలో గుర్తించాం.’’ అని చెప్పారు.

‘‘అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోని రాళ్లలో అల్లనైట్, సెరియేట్, థోరేట్, కొలంబైట్, ట్యాంటలైట్, అపటైట్, జిర్కాన్, మోనజైట్, ఫ్లోరైట్ వంటి 15 రకాల ఆర్ఈఈలు ఉన్నట్లు గుర్తించాం’’ అని సుందరరాజు వెల్లడించారు.

దానచర్ల ప్రాంతంలో ఎన్ జీ ఆర్ ఐ శాస్త్రవేత్త సుందర్ రాజు

అనంతపురం, చిత్తూరులోనే ఎందుకు

అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోనే ఆర్ఈఈలపై పరిశోధన చేయాలనే ఎందుకు ఆలోచన వచ్చింది..?

ఇదే ప్రశ్నను సుందరరాజును బీబీసీ అడిగింది.

దానికి సమాధానం ఇచ్చారు.

అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని మండలాల్లో సైనైట్ రాక్ గనులు ఉన్నట్లు గతంలోనే సురేష్ అనే పరిశోధకుడి బృందం గుర్తించింది.

సైనైట్ రాక్ లలో ఆర్ఈఈలు ఉండవచ్చనే ఆలోచనతో మా పరిశోధన మొదలైంది.

ఆ రాళ్లలో ఆర్ఈఈ లు ఉన్నాయా, లేవా అనే విషయం తెలుసుకునేందుకు ఎన్నోసార్లు రెండు జిల్లాల్లో పర్యటించాం.

చేతితో పట్టుకునే గామా రే పరికరంతో ఆర్ఈఈల ఉనికిని తెలుసుకునే ప్రయత్నం చేశాం.

ఆ పరికరం ఇచ్చిన క్లూస్ ఆధారంగా వందల శాంపిల్స్ అక్కడి నుంచి సేకరించాం. వాటిని తీసుకువచ్చి ల్యాబ్ లో టెస్టు చేశాం.

సన్నటి సెక్షన్(కట్) చేయడం, మైక్రోస్కోపిక్, ఈపీఎంఏ, ఎస్ఈఎం, ఈడీఆర్ఎక్స్ఆర్ఎఫ్, పీఎక్స్ఆర్డీ వంటి పద్ధతులలో శాంపిల్స్ స్టడీ చేసి ఆర్ఈఈలు కనుగొన్నాం’’ అని సుందరరాజు బీబీసీకి చెప్పారు.

పులికొండ ప్రాంతంలో శాస్త్రవేత్తల బృందం

ప్రాజెక్టు ఎలా మొదలైందంటే

ఇప్పటికే అందుబాటులో ఉన్న ఆర్ఈఈ లకు ప్రత్యామ్నాయంగా మరిన్ని ఆర్ఈఈ లను గుర్తించేందుకు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(సీఎస్ఐఆర్) నిర్ణయించింది.

అలా సీఎస్ఐఆర్ నుంచి సుందరరాజుకు ప్రాజెక్టు లభించింది.

ఆరేళ్లపాటు పరిశోధనలు చేసి ఆర్ఈఈ లను గుర్తించి సీఎస్ఐఆర్ కు అందించారు.

‘‘అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఆర్ఈఈలు పీపీఎం స్థాయి నుంచి పర్సంటేజీ వరకు ఉన్నాయి. అంటే పెద్ద ఎత్తున నిల్వలు ఉన్నట్లుగా చెప్పవచ్చు. ముఖ్యంగా దంచర్ల ప్రాంతంలో దాదాపు 18 చదరపు కిలోమీటర్ల పరిధిలో సెనైట్ రాక్ గనులు ఉన్నాయి. ఇక్కడ కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.’’ అని చెప్పారు సుందరరాజు.

‘‘ఈ ఆర్ఈఈలు ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి..? ఎంత లోతుకు ఉన్నాయనే విషయాన్ని డీప్ డ్రిల్లింగ్ చేస్తేనే తెలుస్తుంది. అక్కడైతే పెద్దఎత్తున నిల్వలు ఉన్నట్లు భావిస్తున్నాం. దీనిపై మరింత అధ్యయనం జరగాల్సి ఉంది.’’ అని చెప్పారు సుందరరాజు.

RRE

ఫొటో సోర్స్, Getty Images

చైనా ఎగుమతి నిలిపివేస్తే..

ప్రపంచంలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉత్పత్తిలో చైనా టాప్.

ఆర్ఈఈ లు చైనాకు మంచి ఆదాయ వనరు. అక్కడ మట్టిలోనే లభిస్తున్నాయి. వీటిని బయటకు వెలికితీయడం సులువుగా ఉండటంతో తక్కువ ఖర్చవుతోంది.

ప్రపంచవ్యాప్తంగా లభించే ఆర్ఈఈలపై ఎలిమెంట్స్.విజువల్ క్యాపిటలిస్ట్.కామ్ 2020లో అధ్యయన నివేదిక విడుదల చేసింది.

దీని ప్రకారం ప్రపంచంలోనే అత్యధికంగా చైనాలో ఏటా 4.4 కోట్ల టన్నులు,

వియత్నాంలో 2.2 కోట్ల టన్నుల నిల్వలు ఉన్నాయి.

ఈ జాబితాలో ఇండియాలో 69లక్షల టన్నుల నిల్వలు ఉన్నట్లు ఇప్పటివరకు గుర్తించారు.

2020 సంవత్సరంలో చైనా 1.40లక్షల టన్నుల ఆర్ఈఈలను ఉత్పత్తి చేసింది.

ఉత్పత్తి పరంగా చైనా, అమెరికా, మియన్మార్, ఆస్ట్రేలియా, మడగాస్కర్ తర్వాత ఆరో స్థానంలో ఇండియా ఉంది.

ఆ ఏడాది ఇండియా కేవలం ౩వేల టన్నులే ఉత్పత్తి చేయగలిగింది.

ప్రపంచంలోని ఎన్నో దేశాలకు చైనా నుంచే ఆర్ఈఈలు ఎగుమతి అవుతున్నాయి. ఇండియా సహా అనేక దేశాలు చైనాపైనే ఆధారపడుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

భవిష్యత్తులో చైనా నుంచి ఉత్పత్తి నిలిచిపోతే వాటిపై ఆధారపడి నడిచే పరిశ్రమలపై తీవ్ర ప్రభావం పడుతుంది.

చైనా నుంచి దిగుమతులు క్రమంగా తగ్గించుకుంటూ మన దేశంలోనే ఆర్ఈఈలను వెలికితీయాలని శాస్త్రవేత్తలు, పరిశ్రమల నిర్వాహకులు చెప్పేమాట.

‘‘ప్రస్తుతం ఆర్ఈఈ లను విదేశాల నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాం. అందుకే మన దేశంలో వాటి నిల్వలు గుర్తించడం కీలకంగా మారింది. అనంతపురం, చిత్తూరులో వాటిని గుర్తించాం. మా పరిశోధన పూర్తయ్యింది. సీఎస్ఐఆర్ కు నివేదిక అందజేశాం. వారు తదుపరి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది’’ అని సుందరరాజు బీబీసీకి చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)