రంజాన్: పెరుగు, యాలకులు, పుదీనా తింటే రోజంతా దాహం వేయదా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఆసియా అన్సార్
- హోదా, బీబీసీ ఉర్దూ
రంజాన్ మాసంలో సెహ్రీ భోజనమైనా లేదా ఇఫ్తార్ విందులోనైనా ఇంట్లో ప్రతీ ఒక్కరి ఇష్టాఇష్టాలు పరిగణలోకి తీసుకొని ప్రతీరోజూ ఆహారంలో కొత్త వంటకాలను జోడించడం సంప్రదాయంలో భాగంగా మారింది.
ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం, రంజాన్ మాసం కొన్నిసార్లు వేసవిలో, మరికొన్నిసార్లు శీతాకాలంలో వస్తుంది.
రంజాన్ నెలలో చుక్క నీరు కూడా ముట్టకుండా ముస్లింలు కఠిన ఉపవాసం చేస్తారు.
అలాంటప్పుడు వేసవిలో ఉపవాసం ఉన్నప్పుడు దాహం వేస్తే ఏం చేయాలి? అనే ప్రశ్న అందరికీ కలుగుతుంది.
ఈసారి రంజాన్ మాసం మార్చి, ఏప్రిల్ నెలల్లో వచ్చింది.
ఈ సమయంలో పాకిస్తాన్, భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో వాతావరణం కొంత మెరుగ్గానే ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో వేసవి తాపం కనిపిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, SALMA HUSSAIN
రంజాన్ మాసం ప్రారంభమైన వెంటనే ప్రతి ఒక్కరూ దాహం నుంచి తప్పించుకోవడానికి తమకు తోచిన చిట్కాలను స్నేహితులు, బంధువులతో పంచుకోవడం మొదలుపెడతారు.
అందులో భాగంగా దాహాన్ని తగ్గించుకోవడం కోసం సెహ్రీ భోజన సమయంలో యాలకులు, పుదీనా, పెరుగు తినడంతో పాటు బాగా ఎక్కువగా నీరు తాగాలని వారు భావిస్తారు.
మీరు సెహ్రీలో పైన చెప్పిన చిట్కాను పాటిస్తే, 14 గంటల కంటే ఎక్కువ సమయం పాటు ఉపవాసం, దాహం వేయకుండా హాయిగా గడిచిపోతుందని అంటారు.
అయితే, పుదీనా, యాలకులు, పెరుగు తినడం వల్ల రోజంతా దాహం వేయదని అనడంలో ఎంత నిజం ఉంది? నిజంగానే ఈ పదార్థాలు దాహార్తిని తగ్గిస్తాయా?
పై ప్రశ్నలకు సమాధానం కోసం మేం ఇస్లామాబాద్‌లోని షిఫా ఇంటర్నేషనల్ ఆసుపత్రి పోషకాహార నిపుణుడు జైనాబ్ గయూర్‌తో మాట్లాడాం.
ఆయనను ఈ చిట్కాలపై వివరణ కోరడంతో పాటు ద్రవ్యోల్బణం కారణంగా నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిన ఈ తరుణంలో తక్కువ ఖర్చుతో సెహ్రీ, ఇఫ్తార్ భోజనాన్ని ఎలా ముగించాలి? అధిక ఖర్చుకు కారణమయ్యే ఏ పదార్థాలను భోజనం నుంచి తొలగించవచ్చు? అనే అంశాల గురించి కూడా చర్చించాం.

ఫొటో సోర్స్, Getty Images
‘‘పెరుగుతో దాహం తగ్గుతుంది’’
ఇస్లాం సంప్రదాయంలో భోజనాల సమయంలో ఉపయోగించే వస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది.
సెహ్రీ భోజనాన్ని చూసుకుంటే ఖజ్లా ఫెనీ నుంచి పరాటాలు, గుడ్లు, సలాడ్, ముఖ్యంగా మాంసం వంటకాలు, పెరుగు, లస్సీ, మిల్క్‌షేక్‌లతో కూడిన పెద్ద ఆహార జాబితా ఉంటుంది.
అయితే, సెహ్రీ, ఇఫ్తార్‌లో సాధారణంగా ప్రజలు పౌష్టికాహారం తీసుకోరని పోషకాహార నిపుణుడు జైనాబ్ అన్నారు.
సాంప్రదాయ వంటకాలతో పాటు, రోజంతా శక్తిని అందించే ఆహారపదార్థాలను ఈ జాబితాలో చేర్చడం ముఖ్యమని ఆయన అన్నారు. అలాంటి వాటిలో పెరుగు అగ్రస్థానంలో ఉంటుందని చెప్పారు.
‘‘సెహ్రీ సమయంలో పెరుగు తినడం చాలా మంచిది. పాల ఉత్పత్తుల నుంచి లభించే ప్రోటీన్, మన పొట్టలో చాలా సమయం పాటు ఉంటుంది. ఈ కారణంగా చాలా సమయం పాటు ఆకలిగా అనిపించదు.
పెరుగులో పొటాషియం ఉంటుంది. పైగా సోడియం పాళ్లు తక్కువగా ఉండటంతో దాహాం వేయదు.
కొంతమంది పెరుగులో చక్కెర లేదా ఇతర వస్తువులను కలుపుకొని తింటారు. వాటిని కలపకపోయినప్పటికీ మన శక్తి అవసరాలను పెరుగు తీర్చగలదు’’ అని ఆయన వివరించారు.
పచ్చి యాలకులు, పుదీనా తినడం వల్ల ఉపవాసం ఉన్నప్పుడు దాహం తగ్గుతుందా? అనే ప్రశ్నించగా ఆయన సమాధానం చెప్పారు.
‘‘పచ్చి యాలకులు, పుదీనా ఆకులను సలాడ్‌లో తినడం వల్ల ఎలాంటి సమస్య ఉండదు. ఎందుకంటే, ఈ రెండు పదార్థాలు ఎల్లప్పుడూ తాజాదనాన్ని ఇస్తాయి. అంతేగానీ వాటికీ, దాహం తగ్గడానికి ఎలాంటి సంబంధం ఉండదు’’ అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
'టీ, కాఫీ చాలా స్ట్రాంగ్‌గా ఉండకూడదు’’
సాధారణంగా మనం బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకునే ఆహారాన్నే సెహ్రీలో తినడం మంచిదని జైనబ్ అన్నారు. రంజాన్ మాసంలో సాంస్కృతిక ఆహారం పేరుతో అనవసర పదార్థాలను చేర్చుకున్నామని ఆయన అభిప్రాయపడ్డారు.
‘‘ఉపవాస స్థితిలో చాలా గంటల పాటు ఖాళీ కడుపుతో ఉండాలి. అందుకే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దాహం వేయకుండా ఉండాలంటే ఉప్పు తక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి.
సెహ్రీలో పరాఠాలు తింటే పగటిపూట గుండెలో మంట లేదా ఎసిడిటీ వచ్చే ప్రమాదం ఉంది. దానికి బదులుగా చపాతీలతో గుడ్డు తినండి. సలాడ్లు కూడా తీసుకోవచ్చు. వీటివల్ల ఎలాంటి సమస్య ఉండదు.
సెహ్రీ సమయంలో ఊరగాయలు తినొద్దు. ఊరగాయలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. అవి తినడం వల్ల పగటిపూట దాహం వేసే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. డీహైడ్రేషన్ ఏర్పడుతుంది.
సెహ్రీ, ఇఫ్తార్ భోజనాల్లో పెరుగుతో చేసిన చనా చాట్, ఫ్రూట్ చాట్ లేదా దహీ భల్లే, గ్రామ్ సలాడ్ వంటివి తినడం వల్ల శరీరానికి మిల్క్ ప్రొటీన్ అందుతుంది. కానీ, రంజాన్ నెలలో వీటిని తక్కువగా తింటారు.
స్ట్రాంగ్‌గా ఉండే టీ లేదా కాఫీ తాగకూడదు. ఎక్కువ పాలతో తయారు చేసే లేదా అధిక మొత్తంలో కెఫిన్ ఉండే టీ, కాఫీల వల్ల శరీరం నుంచి నీరు వేగంగా బయటకు వెళ్లిపోతుంది. డీహైడ్రేషన్‌కు గురవుతారు’’ అని ఆయన వివరంగా చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
వేపుడు పదార్థాలతో ఇబ్బంది
ఇప్పుడు, ఇఫ్తార్ సమయంలో తినే కొన్ని పదార్థాల గురించి మాట్లాడుకుందాం.
సాంప్రదాయం ప్రకారం, ఇఫ్తార్ విందులో నోరూరించే పకోడి, సమోసా, చికెన్, వెజిటబుల్ రోల్స్, షామీ కబాబ్‌లు వంటి ఇతర వంటకాలు కచ్చితంగా ఉంటాయి. నూనెలో వేయించి తయారు చేయడం వల్ల వీటివల్ల ప్రయోజనాల కంటే హాని ఎక్కువగా కలుగుతుంది.
‘‘రెండు, మూడు ఖర్జూరాలు మనకు తక్షణ శక్తిని ఇస్తాయి. దాహార్తిని తగ్గించడంలో పండ్లు సహాయపడతాయి. ఇఫ్తార్‌లో కూడా పెరుగు పదార్థాలు తినడం వల్ల శరీరానికి చాలా మేలు కలుగుతుంది.
నూనెలో వేయించిన పదార్థాలు జేబుకే కాదు పొట్టకు కూడా భారంగా మారతాయి. నూనెతో చేసిన పదార్థాలు కాకుండా పెరుగుతో కూడిన ఆహారాలు తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. నూనెతో కూడిన ఆహారాలు సాధారణంగా పొట్ట, పేగుల పనితీరుపై ప్రభావం చూపుతాయి. ఫైబర్, పొటాషియం లేకపోవడం వల్ల మలబద్ధకం సమస్య ఎదురవుతుంది’’ అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘లస్సీ, నిమ్మరసం ఆరోగ్యకరం"
ఇఫ్తార్ సమయంలో చల్లటి షర్బత్‌లు తీసుకోవడం ఆరోగ్యానికి హానికరమని నిపుణులు అంటున్నారు. రోజంతా ఖాళీ కడుపుతో ఉండి, ఒక్కసారిగా శీతల పానీయాలు తీసుకుంటే పొట్టలో ఇబ్బందులు ఎదురవుతాయని జైనబ్ అన్నారు.
ఇఫ్తార్‌లో ముందుగా నీరు తీసుకోవాలని ఆయన సూచించారు. ఆ సమయంలో జ్యూస్, శీతల పానీయాల కంటే మిల్క్ షేక్, లస్సీ, నిమర్మరసం మంచివని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ఐపీఎల్ 2023: టోర్నీని రసవత్తరంగా మార్చబోతున్న 'ఇంపాక్ట్ ప్లేయర్' రూల్ ఏంటి?
- సెమాగ్లుటైడ్: బరువు తగ్గించే ఈ ఇంజెక్షన్‌కు అంత డిమాండ్ ఎందుకు?
- తెలంగాణ: ఆదివాసీలు పరిశ్రమలు పెట్టేందుకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం పొందడం ఎలా?
- ‘‘ఆయన నాలుగేళ్లుగా నీళ్లు పోసుకోలేదు... అడవిలోనే ఒంటరి జీవితం... అటవీ ఏనుగులున్నా భయపడలేదు’’
- 'జీన్ ఎడిటెడ్ ఫుడ్' అంటే ఏంటి? అది తినడం ఆరోగ్యానికి మంచిదేనా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














