ఆంధ్రప్రదేశ్: మిరియాలను ఎక్కడ సాగు చేయొచ్చు? పెట్టుబడి ఎంత, ఆదాయం ఎంత?

వీడియో క్యాప్షన్, అక్కడ అసలు పంట కాఫీ కంటే, అంతరపంట మిరియాలే రెట్టింపు లాభాలను ఇస్తున్నాయి. ఎందుకు?
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

తూర్పు కనుమల్లో పండే కాఫీ గింజలకు మంచి డిమాండ్ ఉంది.

ఇక్కడ దాదాపు 2 లక్షల ఎకరాల్లో కాఫీ తోటలున్నాయి. ఈ తోటల్లో అంతరపంటగా మిరియాలు సాగు చేస్తారు గిరిజన రైతులు.

ప్రస్తుతం, అసలు పంట కాఫీ కంటే, అంతరపంట మిరియాలే రెట్టింపు లాభాలను ఇస్తున్నాయి. మిరియాలకు ఇంత డిమాండ్ ఎందుకొచ్చింది? మిరియాల సాగుకు ఐటీడీఏ ఎలాంటి సహకారం అందిస్తోంది?

మూడేళ్లలో రెట్టింపు:

అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిజనులు పండిస్తున్న మిరియాల ధర ప్రస్తుతం కేజీకి రూ. 460 నుంచి రూ. 500 వరకు పలుకుతోంది.

అదే కాఫీ అయితే కేజీ రూ. 250 నుంచి రూ. 290 మాత్రమే. కాఫీ కంటే మిరియాల ధర రెట్టింపు నడుస్తోంది.

మిరియాలకు ఒక్కసారిగా ఈ ధర రాలేదు, గత మూడేళ్లుగా క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం గరిష్టానికి చేరుకుంది.

“మిరియాలకు ఈ ధర ఇంతకు ముందు ఎప్పుడు లేదండీ. 2020లో రూ. 250కి షావుకార్లు కోనేవారు. 2021లో రూ. 300కి చేరింది. 2022 నాటికి రూ. 350 నుంచి రూ. 400 వరకు దళారులు, షావుకార్లు కొనేవారు.

కానీ ఈ ఏడాది మంచి ధర పలుకుతోంది. రూ. 460 నుంచి రూ. 500లు పలుకుతోంది. తూర్పుకనుమల్లో పండే మిరియాల నాణ్యత బాగుండటంతోనే మంచి ధర పలుకుతుందని అనుకుంటున్నాం” అని అనంతగిరి మండలం బీసుపురానికి చెందిన మిరియాల రైతు బాబురావు బీబీసీతో చెప్పారు.

మిరియాలకు ధర ఎక్కువ పలుకుతుండటంతో, ఎక్కువ మంది రైతులు మిరియాల సాగు పట్ల ఆసక్తి చూపుతున్నారు. దీంతో సాగు విస్తీర్ణం కూడా ఏటా పెరుగుతోంది. ఈ ఏడాది మిరియాల సాగు 1.3 లక్షల ఎకరాల్లో సాగుతుందని ఐటీడీఏ చెప్తోంది.

మిరియాలు

ఎండి నల్లగా మారితే అమ్మేస్తాం

కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో మిరియాల ఉత్పత్తి అధికంగా ఉంది. అల్లూరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో భౌగోళిక పరిస్థితులు, నేల, శీతల వాతావరణం వంటివి ఈ పంటకు అనుకూలంగా ఉన్నాయి.

అందుకే చింతపల్లి, గూడెంకొత్తవీధి, పాడేరు, అరకు, అనంతగిరి వంటి ప్రాంతాల్లో మిరియాల సాగు చేయడానికి కుటుంబంలోని పురుషులు, మహిళలు కలిసి కష్టపడతారు.

కాఫీ తోటల్లో నీడ కోసం వేసే సిల్వర్ ఓక్ చెట్లు నిటారుగా పెరుగుతాయి. వీటిని ఆధారంగా చేసుకుని మిరియాల తీగలు అల్లుకుపోతాయి.

పది అడుగులు దాటిన తర్వాత 40 అడుగుల వరకు మిరియాలు పండుతాయి. దీంతో పొడవాటి నిచ్చెనలు వేసుకుని మిరియాలను తీస్తారు.

కింద పడిన మిరియాల గింజలను మహిళలు ఏరుతారు. వాటన్నింటిని గోనె సంచెల్లో నింపుకుని, ఇంటికి తీసుకునిపోయి కాలితో తొక్కుతారు. తొక్కిన తర్వాత వాటిని వారం రోజుల పాటు ఎండబెడతారు. అప్పుడు అవి నల్లగా తయారై, అమ్మకానికి సిద్దమైనట్లే.

“ఒక ఎకరం విస్తీర్ణంలో కాఫీ తోట వేస్తే దాని ద్వారా 150 కిలోల కాఫీ ఉత్పత్తి అవుతుంది. అదే అంతరపంటగా వేసే మిరియాలు ఎకరానికి 200 కిలోల వరకు ఉత్పత్తవుతాయి. పైగా మిరియాల ధర ఎక్కువ. దీంతో మిరియాల సాగు లాభదాయకంగా ఉంది” అని మిరియాల రైతు శంకరరావు బీబీసీతో చెప్పారు.

మిరియాల మొక్క

ఫొటో సోర్స్, Getty Images

ఎక్కువ నిచ్చెనలు కావాలి

మిరియాల గింజల మొక్కలు 40 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. దాంతో వాటిని తీసేందుకు నిచ్చెనలు కావాలి.

ప్రస్తుతం మిరియాల సాగు లాభసాటిగా ఉండటంతో రైతులంతా దీనిపై ఆసక్తి చూపుతున్నారు. పంట చేతికొచ్చే సమయానికి నిచ్చెనలు ప్రధాన అడ్డంకిగా మారుతున్నాయి.

ఐటీడీఏ తరపున ఒక్కో గ్రామానికి ఒక్కటే అల్యూమినియం నిచ్చెన ఇచ్చారని బీసుపురానికి చెందిన గోవింద్ చెప్పారు.

"మిరియాల గింజలను ఎత్తు నుంచి తీయడమే ప్రధాన సమస్య. దీనికి సాధారణ నిచ్చెనలు సరిపోవు. అల్యూమినియంతో చేసిన పొడవాటి నిచ్చెనలు ఐటీడీఏ ఇచ్చింది. కాకపోతే గ్రామానికి ఒకటే ఇచ్చింది. దీంతో ఒకరి తర్వాత మరొక రైతు పని చేసుకోవాల్సి వచ్చి, ఎక్కువ సమయం పడుతోంది. అలా కాకుండా కనీసం ఒక గ్రామానిక మూడు నిచ్చెనలు ఇస్తే బాగుంటుంది” అని గోవింద్ బీబీసీతో అన్నారు.

అలాగే దళారులు చెప్పిన రేటుకే అమ్ముకోవాల్సి వస్తుందని, డిమాండ్ ఉన్నా కూడా అది పండించిన రైతుకు కాకుండా, దళారులకే లాభం చేకూర్చుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఐటీడీఏ రైతులకు మిరియాల సాగు, ధరలపై అవగాహన కల్పించాలని కోరారు.

మిరియాలు

పెట్టుబడి ఎంత అవుతుంది..?

అంతరపంట కాబట్టి పెట్టుబడి పెద్దగా ఉండదు. కాఫీ రైతులకు మిరియాలు మొక్కలు ఉచితంగా ఇస్తారు. మిగతా వారేవరైనా ఆసక్తి చూపితే మొక్క రూ. 10 చొప్పున్న అమ్ముతారు. అలా చూసుకుంటే ఎకరాకి రూ. 20 వేల నుంచి 25 వేలు పెట్టాల్సి వస్తుంది.

ఎన్ని రోజుల తరువాత పంట చేతికి వస్తుంది?

ఆరు నెలలు

ఆదాయం ఎంత రావొచ్చు?

ఎకరాకు 200 కిలోల దిగుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు. అలాగే కిలో మిరియాల ధర ప్రస్తుతం రూ.460 నుంచి రూ.500 వరకు ఉందని అంటున్నారు.

ఈ లెక్కన చూస్తే ఎకరాకు రూ.92,000 నుంచి రూ.1,00,000 వరకు ఆదాయం వస్తుంది.

ఎకరాకు రూ.20,000 నుంచి రూ.25,000 పెట్టుబడి అనుకుంటే రూ.67,000 నుంచి రూ.80,000 వరకు లాభం వచ్చే అవకాశం ఉంది.

రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో పండే అవకాశం ఉందా?

10 నుంచి 20 డిగ్రీల ఉష్ణోగ్రత కనీసం నెల రోజుల పాటు ఉండే ప్రదేశాలు అనుకూలం. కానీ ఏపీలో తూర్పు మన్యంలో కాకుండా మరొ చోట భారీ స్థాయిలో మిరియాల పంట లేదు. దేశంలో కేరళ, కర్ణాటక, బెంగాల్, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, తమిళనాడు, కొంకణ్ ప్రాంతాల్లో మిరియాలు పండిస్తున్నారు.

విదేశాలకు ఎగుమతి చేస్తారా?

ఇప్పటీ వరకు ఐటీడీఏ మిరియాలను డైరెక్టుగా కొనుగోలు చేయడం లేదు కాబట్టి విదేశాలకు ఎగుమతి చేయడం లేదు. కానీ దళారులు కొని వాటిని అమ్ముతారు. త్వరలోనే మిరియాలను ఐటీడీఏ కొనేందుకు సిద్ధమవుతోంది.

భారతదేశంలో మార్కెట్ సైజ్ ఎంత?

ఇండియా స్పైస్ బోర్డు అంచనాల ప్రకారం ప్రపంచ మిరియాల ఎగుమతుల్లో భారత్ వాటా 50 నుంచి 54 శాతం ఉండవచ్చు.

నేషనల్ హార్టికల్చర్ బోర్డ్ 2021-22 గణాంకాల ప్రకారం... దేశవ్యాప్తంగా మిరియాల సాగులో ఆంధ్రప్రదేశ్ 7వ స్థానంలో ఉంది. ఉత్పత్తిలో వాటా 0.28శాతంగా ఉంది.

మిరియాల ఉత్పత్తిలో టాప్-5 రాష్ట్రాలు:

  • కర్నాటక-60.46%
  • కేరళ-32.60%
  • అస్సాం-3.05%
  • తమిళనాడు-1.42%
  • మేఘాలయ-0.85%
మిరియాలు

దళారులే ధర నిర్ణయిస్తారు: రైతులు

ఐటీడీఏ మిరియాలకు సరైన ధర కల్పించి కొనుగోలు చేస్తే తమకు దళారుల బెడద తప్పుతుందని మిరియాల రైతులు బీబీసీతో చెప్పారు.

ఐటీడీఏ మిరియాలకు ధర నిర్ణయించి కొనుగోలు చేయడం లేదు. కాఫీ గింజలను మాత్రమే కొనుగోలు చేస్తుంది. దాంతో లాభదాయంగా ఉన్నప్పటికీ, మిరియాల సాగు చేసిన గిరిజన రైతులకు దళారుల బెడద తప్పడం లేదు. వాళ్లు నిర్ణయించిన ధర, వారు ఎంత చెప్పితే అంతే అన్నట్లుగా అమ్మాల్సి వస్తుందని రైతులు బీబీసీతో చెప్పారు.

“మిరియాల సాగు బాగుండటం, ఏటా ధర పెరగడంతో.. ధర నిర్ణయించి, మిరియాలను ఐటీడీఏ కొనుగోలు చేస్తే, దళారుల నిర్ణయించే ధరకే అమ్ముకోవాల్సిన పరిస్థితి తప్పుతుంది. మార్కెట్ రేటుపై అవగాహన ఉండే రైతులకు మంచి ధర ఇస్తున్నారు. అవగాహన లేని వారికి తక్కువ ధర ఇస్తున్నారు. అందుకే ఐటీడీఏ మిరియాల సాగుపై అవగాహన కల్పించి, ధరను నిర్ణయిస్తే బాగుంటుంది” అని లంబన్న అనే మిరియాల రైతు అన్నారు.

“ఏళ్లుగా కాఫీ గింజలను పండిస్తున్నాం. కానీ గత మూడేళ్లుగా కాఫీ కంటే మిరియాలు ఎక్కువ లాభాల్ని తెస్తోంది. గతేడాది రూ. లక్షా 50 వేలు లాభం వచ్చింది. ధరపై సరైన అవగాహన ఉంటే రూ. 2 లక్షల వరకు వచ్చి ఉండేదని ఇప్పుడు తెలిసింది” అని బీసుపురానికి చెందిన గెమ్మిలి లక్ష్మీ చెప్పారు.

మిరియాలు

మిరియాల ధరపై త్వరలో నిర్ణయం

సుగంధ ద్రవ్యాల తయారీలో ఎక్కువగా వినియోగించే మిరియాలకు అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. అలాగే ఐటీడీఏ పాడేరు పరిధిలో మిరియాల పంటకు అనుకూలమైన వాతావరణం ఉండటంతో, అంతర్జాతీయ మార్కెట్ డిమాండ్‌ను అందిపుచ్చుకునేందుకు మిరియాల సాగుపై ఐటీడీఏ కూడా దృష్టి పెట్టినట్లు పీవో రోణంకి గోపాలకృష్ణ బీబీసీతో చెప్పారు.

“పన్నియూర్ 1 జాతి మిరియాల సాగు చేపడితే, ఎకరాకి 300 కేజీలకు పైగా మిరియాల దిగుబడి వస్తుంది. అదే కరిముండ, శక్తి వంటి తదితర రకాలైతే రెట్టింపు దిగుబడి వచ్చే అవకాశముంది. పైగా మన ఏజెన్సీలోని వాతావరణం ఈ పంటకు అనుకూలం. మిరియాల సాగు విస్తీర్ణం పెంపునకు ఐటీడీఏ దృష్టి సారించింది. దీంతో త్వరలోనే మిరియాల ధరను కూడా నిర్ణయించి, కాఫీ గింజల్లాగే మిరియాలను కూడా రైతుల నుంచి ఐటీడీఏ కొనుగోలు చేస్తుంది.”

మిరియాలు

కేరళ నుంచి కొత్త రకాలు

తూర్పు కనుమల్లోని గిరిజన రైతులు సుమారు 25 ఏళ్ల కిందటి నుంచి కాఫీతో పాటు అంతరపంటగా మిరియాల పంటను సాగు చేస్తున్నారు.

గిరిజన రైతులకు అత్యధిక దిగుబడినిచ్చే మేలిజాతి మొక్కలను పంపిణీ చేయాలని కేరళ కాలికట్‌ సుగంధ ద్రవ్య పంట బోర్డు నుంచి ఏడు రకాల మొక్కలను ఐటీడీఏ దిగుమతి చేసుకుంది.

వీటిని చింతపల్లిలోని ఉద్యానవన శిక్షణ కేంద్రంలో పెంచి, అధ్యయనం చేసి, అవి బాగా పెరగడంతో వాటినే రైతులకు పంపిణీని చేస్తున్నారు.

తూర్పు కనుమల్లోని గిరిజనులు ఎక్కువగా పన్నియూర్ అనే జాతి మిరియాలను సాగుకి వాడతారు. అయితే ఇప్పుడు వాటికంటే ఎక్కువ దిగుబడికి అవకాశముండే కరిముండ, శక్తి, శ్రీకర, పంచమి, పౌర్ణమి, మలబార్‌ ఎక్సెల్‌, సుబ్కర రకాల రైతులకు పంపిణీ చేస్తున్నారు.

“కాఫీ తోటలు కలిగిన రైతులకు ఉచితంగా, కాఫీ తోటలు లేని రైతులకు ఒక్కొక్క మొక్క రూ.10 చొప్పున్న ఇస్తున్నాం. రానున్న రోజుల్లో కాఫీతో సమాంతరంగా గిరిజన రైతులు మిరియాల సాగు చేపట్టే విధంగా అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తున్నాం” అని ఐటీడీఏ పీవో రోణంకి గోపాలకృష్ణ బీబీసీతో చెప్పారు.

అలాగే గిరిజన రైతులకు మిరియాల సాగులో మెలకువలపై ఐటీడీఏ ఉద్యానశాఖ అధికారులు శిక్షణ ఇస్తున్నారని తెలిపారు.

కాఫీ

కాఫీతో పాటే మిరియాలు

మన్యంలో కాఫీ సాగుకు సంబంధించి పదేళ్ల కాల వ్యవధితో కూడిన భారీ ప్రాజెక్ట్‌కు గత ప్రభుత్వం సబ్ ప్లాన్ ద్వారా రూ. 526 కోట్ల వ్యయంతో రూపకల్పన చేసింది.

2015-2016లో మొదలైన ఈ ప్రాజెక్టు 2024-2025 వరకూ అమల్లో ఉంటుంది. ప్రస్తుతం ఉన్న 1.50 లక్షల ఎకరాల్లో కాఫీ సాగుకు అదనంగా వచ్చే ఐదేళ్లలో మరో లక్ష ఎకరాల్లో కాఫీ తోటల విస్తరణ లక్ష్యంగా ప్రాజెక్టు అమలవుతోంది. దీనితో పాటే కాఫీతోటల్లో అంతరపంటైన మిరియాల సాగునూ ప్రోత్సహిస్తున్నారు.

చింతపల్లి వ్యవసాయ పరిశోధన కేంద్రం మిరియాల్లో కొన్ని మేలురకాలను గుర్తించింది. మిరియాల్లోని అనుకూలమైన రకాలపై పరిశోధనలు చేసి, వాటిలో ఏవైతే అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మన్యం ప్రాంతానికి అనుకూలంగా ఉంటాయో, అధిక దిగుబడిని ఇస్తాయో గుర్తించి, వాటిని రైతులకు సిఫార్సు చేస్తోంది.

ఇలా మిరియాల సాగు ద్వారా రైతులకు వస్తున్న లాభాలను దృష్టిలో పెట్టుకుని, అలాగే అంతర్జాతీయ మార్కెట్‌కు అనుకూలంగా ఉండే మిరియాలను సాగు చేయించే విధంగా రైతులను ప్రొత్సహిస్తోంది ఐటీడీఏ.

ఇవి కూడా చదవండి: