బంగ్లాదేశ్: 'బియ్యం కొనుక్కునే పరిస్థితి లేదు' అని రాసిన జర్నలిస్టును జైల్లో పెట్టారు

సంసుజ్జామన్ షామ్స్‌

ఫొటో సోర్స్, SAZID HOSSAIN

    • రచయిత, అణ్బరసన్ ఎతిరాజన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

బంగ్లాదేశ్‌లో ఒక ప్రముఖ వార్తాపత్రికలో పనిచేస్తున్న జర్నలిస్టును జైల్లో పెట్టారు. ఆ దేశంలో ఆహర పదార్థాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని ఆయన రాసిన కథనం వైరల్ కావడంతో, అది "తప్పుడు" ప్రచారమని ఆరోపిస్తూ జైలు శిక్ష విధించారు.

'ప్రొథొమ్ అలో' అనే దినపత్రికలో పనిచేస్తున్న సంసుజ్జామన్ షామ్స్‌ను అదుపులోకి తీసుకున్న మర్నాడు కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు బెయిల్ ఇవ్వలేదు.

బంగ్లాదేశ్ స్వాతంత్ర్యదినోత్సవం మార్చి 26 నాడు షామ్స్‌ రాసిన కథనం "ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోసిందనే" ఆరోపణలు వచ్చాయి.

హక్కుల కార్యకర్తలు షామ్స్‌ అరెస్టును ఖండించారు. ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరిస్తోందని ఆరోపించారు.అయితే, ప్రభుత్వం ఈ అరోపణలను తోసిపుచ్చింది.

2009 నుంచి అధికారంలో ఉన్న అవామీ లీగ్ పాలనలో పత్రికా స్వేచ్ఛ తగ్గుతూ వస్తోందని మీడియా హక్కుల సంఘాలు హెచ్చరించాయి.

'రిపోర్టర్స్ వితవుట్ బోర్డర్స్' ఆర్గనైజేషన్ గత ఏడాది విడుదల చేసిన 'వరల్డ్ ప్రెస్ ఫ్రీడం' సూచికలో.. మొత్తం 180 దేశాలలో రష్యా, అఫ్గానిస్తాన్ దిగువున బంగ్లాదేశ్ 162వ స్థానంలో ఉంది.

ప్రొథొమ్ అలో పత్రిక బంగ్లాదేశ్‌లో అతిపెద్ద, అత్యంత ప్రభావవంతమైన దినపత్రిక.

షామ్స్‌‌ను ఎన్నాళ్లు జైల్లో ఉంచుతారన్న దానిపై స్పష్టతలేదు.

బుధవారం సాధారణ దుస్తుల్లో ఉన్న అధికారులు ఢాకాలోని షామ్స్ ఇంటికి వెళ్లి ఆయన్ను అరెస్ట్ చేశారు.

పత్రిక యజమానులకు సుమారు 30 గంటల పాటు షామ్స్ ఆచూకీ తెలియలేదు. పోలీసులు, ఇతర భద్రతా సంస్థలు కూడా షామ్స్ గురించి ఎలాంటి సమాచారం అందలేదని చెప్పాయి.

బంగ్లాదేశ్

ఫొటో సోర్స్, Getty Images

షామ్స్ కథనంలో ఏముంది?

సామాన్య ప్రజలు తమ జీవితాల గురించి చెప్పిన విషయాలను స్వాతంత్ర్యదినోత్సవం నాడు షామ్స్ తన కథనంలో పొందుపరిచారు.

దానిలో ఒక కూలీ "బియ్యం కొనుకునే పరిస్థితి లేనప్పుడు స్వతంత్రం వచ్చి ఏం లాభం?" అని అన్నారు.

అంతకంతకు పెరుగుతున్న ఆహార ధరల గురించి ఆయన వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది.

రష్యా-యుక్రెయిన్ యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా ఆహార పదార్థాల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి.

ప్రొథొమ్ అలో పత్రికలో వచ్చిన ఈ కథనాన్ని చాలామంది షేర్ చేశారు. ఆ పత్రిక ఈ కథనాన్ని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసినప్పుడు వేరే వ్యక్తి ఫొటోను ప్రచురించింది.

"తప్పు జరిగిందని తెలుసుకున్న వెంటనే మేం ఆ పోస్ట్ తొలగించాం. దానిపై స్పష్టతనిస్తూ మరొక రిపోర్టును జతచేశాం" అని పేపర్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సజ్జాద్ షరీఫ్ బీబీసీకి తెలిపారు.

"కానీ, అసలు కథనంలో రాసిన అంశాలకు మేం కట్టుబడి ఉన్నాం. ఆహార ధరలపై కూలీ చేసిన వ్యాఖ్య యధార్థం" అని ఆయన అన్నారు.

అయితే, ప్రభుత్వంలో ఉన్న అవామీ లీగ్ మద్దతుదారులు.. పత్రిక కల్పిత వ్యాఖ్యలు ప్రచురించిందని, దేశం ప్రతిష్టను దిగజార్చిందని ఆరోపించారు.

పోలీసులు పత్రిక ఎడిటర్ మతియుర్ రెహమాన్, ఒక వీడియో జర్నలిస్ట్, మరికొందరిపై వివాదాస్పద డిజిటల్ సెక్యూరిటీ యాక్ట్ (డీఎస్ఏ) కింద దర్యాప్తు ప్రారంభించారు.

షామ్స్ "వాస్తవాలను వక్రీకరిస్తూ తప్పుదారి పట్టించే కథనాన్ని రాశారని" న్యాయ మంత్రి అనిసుల్ హక్ అన్నారు.

ఒక స్వతంత్ర వ్యక్తి కేసు ఫైల్ చేశారని, ప్రభుత్వం కాదని ఆయన చెప్పారు.

పత్రిక ఎడిటర్, పబ్లిషర్‌కు కూడా ఇందులో భాగం ఉంటుందని, అందుకే పోలీసులు వారిని విచారిస్తున్నారని అన్నారు.

బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా

బంగ్లాదేశ్‌లో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, మానవ హక్కుల పరిరక్షకులు, మీడియా సిబ్బందిని వేధింపులకు గురిచేస్తున్నారనే ఆందోళనల మధ్య తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి.

ఢాకాలోని పశ్చిమ దేశాల సమూహం ప్రారంభించిన చొరవ 'మీడియా ఫ్రీడం కొయిలిషన్'.. షామ్స్ అరెస్ట్‌పై మీడియా స్వేచ్ఛను అణచివేస్తున్న చర్యలపై ఆందోళన వ్యక్తంచేసింది.

షేక్ హసీనా ప్రభుత్వాన్ని విమర్శించే కథనాల విషయంలో ఒత్తిడికి గురవుతున్నామని, డీఎస్ఏ అందరిలో ఒకరకమైన భయాన్ని సృష్టించిందని బంగ్లాదేశ్ జర్నలిస్టులు అంటున్నారు.

2018లో అమలులోకి వచ్చినప్పటి నుంచి డీఎస్ఏ కింద సుమారు 280 మంది జర్నలిస్టులపై కేసులు నమోదు చేశారని మీడియా హక్కుల సంఘాలు చెబుతున్నాయి.

ఈ చట్టానికి సంబంధించిన ఆందోళనలపై ప్రభుత్వం, మీడియా సంస్థలతో కలిసి పనిచేస్తోందని అనిసుల్ హక్ చెప్పారు.

ఇవి కూడా చదవండి: