రొయ్యలు: టెక్నాలజీ సాయంతో దిగుబడి పెంచుకోవచ్చా, ఎలా?

ఫొటో సోర్స్, AQUACONNECT
- రచయిత, ప్రీతి గుప్తా, బెన్ మోరిస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
కొన్ని తరాల నుంచీ దేబబ్రత ఖూంటియా కుటుంబం చేపల వేటపైనే ఆధారపడి జీవిస్తోంది. బంగాళాఖాతంతోపాటు పశ్చిమ బెంగాల్‌లోని మేదినీపుర్‌లోని నదుల్లో వీరు చేపలు పడుతుంటారు.
ఏడాదికి తాము పది టన్నుల వరకు చేపలు పట్టుకోగలిగే వారమని ఆయన గుర్తు చేసుకున్నారు. వీటిని మార్కెట్‌లో అమ్ముకోవడంతోపాటు ఇంట్లో కూడా ఎక్కువగానే వండుకుని తినేవారు.
కానీ, ఇప్పుడు ఆ రోజులు ముగిసిపోయాయి, చేపల సంఖ్య తగ్గిపోయింది. నేడు టమాటాలు, వంకాయలు సాగు చేసుకుంటూ దేబబ్రత జీవిస్తున్నారు.
ఈ పరిస్థితికి కారణం ‘‘రొయ్యల (ష్రింప్) అతి సాగు’’ అని ఆయన చెప్పారు.
రొయ్యల సాగుతో లాభాలు వస్తాయని చాలా మంది రైతులు ఆ వైపు వచ్చేశారని ఆయన అన్నారు. అయితే, ఈ సాగు కోసం రొయ్యల చెరువులు నిర్మించాలి. రొయ్య పిల్లలకు ఆహారం పెట్టాలి. సాగులో పెద్దయెత్తున యాంటీబయోటిక్స్‌ను ఉపయోగించాలి.
రొయ్యలు పూర్తిగా పెరిగిన తర్వాత ఆ చెరువుల్లో నీటిని పరిసరాల్లోని నదుల్లోకి విడిచిపెడతారు. అయితే, ఆ నీటిని శుద్ధి చేయకుండా నదుల్లోకి వదిలేస్తున్నారని, ఫలితంగా కాలుష్యం పెరిగిపోతోందని దేబబ్రత అన్నారు.
‘‘ఆ నీరు నల్లగా ఉంటుంది. విపరీతమైన వాసన వస్తుంది’’అని ఆయన చెప్పారు. ఆ నీటి వల్ల తన కూరగాయల సాగు కూడా ప్రభావితం అవుతోందని ఆయన వివరించారు.
రొయ్యల సాగుతో పర్యావరణం దెబ్బతింటోందని ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో పర్యావరణవేత్తలు ఇలానే ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
అయితే, ఆందోళనలు వ్యక్తం అవుతున్నప్పటికీ, భారత్‌లో రొయ్యల సాగు తగ్గే సూచనలేమీ కనిపించడం లేదు.

సమస్య ఏమిటి?
ఈ వార్త మొదట్లో రొయ్యల అతి సాగు అనేచోట మేం ‘‘ష్రింప్’’అని బ్రాకెట్‌లో కూడా రాశాం. ఎందుకంటే చాలా మంది ప్రాన్స్, ష్రింప్ పదాలను ఒకేలా చూస్తుంటారు.
సౌథంప్టన్ యూనివర్సిటీలో 43 ఏళ్లుగా జెన్సీ మలిన్‌సన్ అక్వేరియం బాధ్యతలు చూసుకుంటున్నారు. ఈ రెండింటి మధ్య తేడాలను ఆయన వివరించారు.
- ష్రింప్స్ అనేవి కాస్త చిన్నగా ఉంటాయి. ప్రాన్స్ కాస్త పెద్దవి.
- ష్రింప్స్ నేలపై పూర్తిగా శరీరాన్ని ఆన్చి నిలబడతాయి. వీటి కాళ్లు పక్కకు ఉంటాయి. వీటిపై బూడిద రంగు లేదా నల్లని మచ్చలు ఉంటాయి.
- ప్రాన్స్ విషయానికి వస్తే, ఇవి కాళ్లపై నిలబడతాయి. వీటి శరీరం వంపు తిరిగి ఉంటుంది.
- ప్రాన్స్ చూడటానికి కాస్త ట్రాన్స్‌పరెంట్‌గా కనిపిస్తాయి. వీటిపై కొన్ని ఎరుపు, పచ్చ రంగుల మచ్చలు ఉంటాయి.

ఫొటో సోర్స్, DEBABRATA KHUNTIA
‘‘ష్రింప్ ఫార్మింగ్’’తో గ్రామీణ ప్రాంతాల్లో రైతుల ఆదాయం పెరుగుతోంది. ఎగుమతుల్లోనూ ఇవి ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.
ఫ్రొజెన్ ష్రింప్ ఎగుమతుల్లో భారత్ మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ వీటిపై ఏడాదికి దాదాపు 5 బిలియన్ డాలర్లు (రూ.4,13,82 కోట్ల) వరకు వాణిజ్యం జరుగుతోంది. మరోవైపు ఆక్వా ఉత్పత్తుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది.
అయితే, పర్యావరణానికి హాని కలిగించకుండా కూడా ఈ సాగును చేపట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు.
‘‘దాదాపు పది లక్షల మంది గ్రామీణ రైతులు, తీర ప్రాంత వాసులు రొయ్యలు, చేపల సాగుపై ఆధారపడుతున్నారు. అయితే, సంప్రదాయ విధానాల్లో చాలా మంది అధిక దిగుబడి సాధించలేకపోతున్నారు. వ్యాధులను కూడా అరికట్టలేకపోతున్నారు’’అని అక్వా కనెక్ట్ సంస్థ ఫౌండర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాజమనోహర్ సోమసుందరం అన్నారు.
2017లో మొదలైన ఈ సంస్థ యాప్ సాయంతో మత్స్యరంగ రైతులకు సలహాలు, సూచనలు అందిస్తోంది. ఈ కంపెనీ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్‌ను అభివృద్ధి చేసింది.
నీటి నాణ్యతను ఎలా మెరుగుపరచాలి? చేపలు, రొయ్యలకు ఆహారం ఎలా పెట్టాలి? అందుబాటులోనున్న వనరులను ఎలా మెరుగ్గా ఉపయోగించుకోవాలి? లాంటి అంశాలపై ఈ టూల్ సూచనలు, సలహాలు ఇస్తుంది.
అయితే, భారత్‌లోని ఆక్వా కల్చర్ చాలా అశాస్త్రీయంగా జరుగుతోందని సోమసుందరం అన్నారు. టెక్నాలజీతో ప్రస్తుత సమస్యలకు కళ్లెం వేయొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, AQUACONNECT
ప్రత్యామ్నాయం ఏమిటి?
ప్రస్తుతం భారత్‌లోని చేపల, రొయ్యల సాగు ఎక్కువగా చెరువులు, ‘సీ కేజ్’లలో జరుగుతోంది. అయితే, వీటిని మరో మార్గంలో కూడా నిర్వహించొచ్చు.
రీసర్య్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టమ్ (ఆర్ఏఎస్)ల ద్వారా ట్యాంకుల్లో వీటిని పెంచొచ్చు. ఫలితంగా నీటిని నిరంతం వడపోస్తూ పర్యవేక్షించొచ్చు. దీనిలో నీటి వృథా కూడా తగ్గించుకోవచ్చు.
పైగా ఇక్కడ పరిస్థితులను జాగ్రత్తగా పర్యవేక్షించొచ్చు. దీంతో పర్యావరణం కలుషితమయ్యే ముప్పును తగ్గించుకునే అవకాశం ఉంది.
దీనికి సంప్రదాయ జల వనరులతో ఎలాంటి సంబంధమూ ఉండదు. ట్యాంకులను ఎక్కడ కావాలంటే అక్కడ ఏర్పాటుచేసుకోవచ్చు. ఫలితంగా పెద్దపెద్ద నగరాల్లోనూ మార్కెట్‌కు దగ్గరగా చేపలు, రొయ్యలు పెంచుకోవచ్చు.
షాజీ బేబీ జాన్ భారత్‌లోని ప్రముఖ ఆక్వా పరిశ్రమల్లో ఒకటైన కింగ్స్ ఇన్‌ఫ్రా వెంచర్స్‌కు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.
రొయ్యల సాగు కోసం ఆర్ఏఎస్ వ్యవస్థను షాజీ సంస్థ అభివృద్ధి చేసింది. ఒక జపాన్ సంస్థతో కలిసి రెండు పైలట్ ప్లాంట్లను వీరు అభివృద్ధి చేశారు. వీటిలో ఒకటి ఇండోర్, మరొకటి అవుట్ డోర్ సాగు కోసం సిద్ధం చేశారు.
వీటిలో నీటిని మెరుగ్గా పర్యవేక్షించడానికి వీలు పడటంతో, రొయ్యలను కూడా మెరుగ్గా పర్యవేక్షించొచ్చని షాజీ చెప్పారు.
ఏడాదిలో ఐదుసార్లు ఆర్ఏఎస్‌తో రొయ్యల దిగుబడి వస్తుందని ఆయన చెప్పారు. అదే చెరువుల్లో అయితే, రెండు సార్లు మాత్రమే దిగుబడి వస్తుంది.
ఈ విధానంలో వెయ్యి చ.మీ. ప్రాంగణంలో ఏడాదికి 45 టన్నుల వరకు రొయ్యలను ఉత్పత్తి చేయొచ్చు.
‘‘అన్నింటినీ మనం మెరుగ్గా నియంత్రించొచ్చు. ఫలితంగా దిగుబడి మెరుగ్గా ఉంటుంది. నష్టాలు కూడా తక్కువ’’అని షాజీ వివరించారు.
అయితే, ఈ టెక్నాలజీ ప్రస్తుతం కాస్త ఖరీదైనది. అయితే, భారత్‌లో ఇది ఎంతవరకు పని చేస్తుందని కూడా ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.

ఫొటో సోర్స్, AQUACONNET
ఇక్కడ కాస్త కష్టమే..
‘‘ఇక్కడ ఆర్ఏఎస్‌కు అంత ఆశాజనక ఫలితాలు ఉండకపోవచ్చు’’అని సొసైటీ ఆఫ్ ఆక్వాకల్చర్ ప్రొఫెషనల్స్ ప్రెసిడెంట్ విక్టర్ సురేశ్ అన్నారు.
‘‘అది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. పెద్ద నగరాలు, ఖరీదైన చేపలకు అది సరిపోతుంది. కానీ, ఇక్కడి రైతులకు అంత ఖర్చు భరించే స్థోమత ఉండదు’’అని ఆయన వివరించారు.
‘‘భారత్‌లో కొన్ని లక్షల టన్నుల రొయ్యలను చిన్నచిన్న రైతులను పెంచుతూ, ఎగుమతులకు పంపిస్తుంటారు. వీరికి చెరువులే అనుకూలంగా, అందుబాటులో ఉంటాయి’’అని ఆయన చెప్పారు.
అయితే, మొదట్లో ఈ విధానానికి ఖర్చు ఎక్కువ అయ్యే మాట వాస్తవమేనని, కానీ, ఒక్కో రొయ్య పెంపకానికి అయ్యే ఖర్చును మొత్తంగా చూస్తే, సంప్రదాయ విధానం కంటే ఇదే మెరుగ్గా ఉంటుందని షాజీ వివరించారు.
మరోవైపు విద్యుత్ కోసం సౌర విద్యుత్‌ను ఉపయోగిస్తే, కార్బన ఉద్గారాలు కూడా చాలా తక్కువగా ఉంటాయని చెప్పారు.
‘‘మేం సుస్థిర, పర్యావరణహిత విధానాలపై పనిచేస్తున్నాం. ఇక్కడ యాంటీబయోటిక్స్ ఉపయోగం, వ్యర్థాలు ఉండవు’’అని ఆయన అన్నారు.
అయితే, ఏ టెక్నాలజీతోనైనా రైతులు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుందని సోమసుందరం అన్నారు.
‘‘రొయ్యల సాగులో సమస్యలు ఎక్కువ ఉంటాయి. టెక్నాలజీతో మనం చూపే పరిష్కారాలు ఒక్కోసారి భారీ నష్టాలకు కూడా దారితీయొచ్చు. అందుకే రైతులు టెక్నాలజీ విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచిస్తుంటారు’’అని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- రష్యా, యుక్రెయిన్ యుద్ధంలో పుతిన్ ఫెయిలయ్యారా... అసలు ఆయన టార్గెట్ ఏంటి?
- ఏజ్ ఆఫ్ కన్సెంట్: సెక్స్‌కు సమ్మతి తెలపాలంటే కనీస వయసు ఎంత ఉండాలి?
- అదానీ గ్రూప్ నుంచి భారీ ధరలకు ‘విద్యుత్ కొనుగోలు’ ఒప్పందం... ఇరకాటంలో బంగ్లాదేశ్
- తుర్కియే-సిరియా: భూకంప బాధితులు ఎందుకు సరిహద్దులకు వస్తున్నారు?– బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- రోహిణీ సింధూరి-రూపా మౌద్గిల్: ఈ ఇద్దరు మహిళా ఆఫీసర్ల మధ్య గొడవేంటి, కర్ణాటక ప్రభుత్వం ఏం చేసింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















