NCERT: మొఘలుల చరిత్రను పాఠాల నుంచి ఎందుకు తొలగించారు?

ఫొటో సోర్స్, NCERT
- రచయిత, దిల్‌నవాజ్ పాషా
- హోదా, బీబీసీ ప్రతినిధి
NCERT (నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్) హేతుబద్దీకరణలో భాగంగా 12వ తరగతి చరిత్ర పుస్తకాల నుంచి ‘‘మొఘల్ సామ్రాజ్యం’’ అనే పాఠాన్ని తొలగించింది.
ఇదొక్కటే కాకుండా సిలబస్‌లో చేసిన ఇతర మార్పులూ ఇప్పుడు వివాదాస్పదం అయ్యాయి.
ఎన్‌సీఈఆర్‌టీ, 12వ తరగతి చరిత్ర పుస్తకాన్ని ‘‘థీమ్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ’’ అనే పేరుతో మూడు భాగాలుగా ప్రచురించింది.
ఇందులో రెండో భాగంలోని తొమ్మిదో అధ్యాయంగా ఉన్న ‘‘కింగ్ అండ్ హిస్టరీ, మొఘల్ దర్బార్’’ అనే పాఠ్యాంశాన్ని పుస్తకం నుంచి తొలగించింది.
కొత్త చరిత్ర పుస్తకాల్లో మొఘల్ పాలకులకు సంబంధించిన ఈ 28 పేజీల అధ్యాయం ఇప్పుడు లేదు. కొత్త చరిత్ర పుస్తకాలు, ఎన్‌సీఈఆర్‌టీ వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి.
సిలబస్ నుంచి మొఘల్ పాఠాలను తొలగిస్తూ ఎన్‌సీఈఆర్‌టీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని భారత చరిత్ర నుంచి మొఘల్‌లను చెరిపివేసే ప్రయత్నంగా పరిగణిస్తున్నారు.
విద్యార్థులపై సిలబస్ భారాన్ని తగ్గించేందుకే ఇలా చేశామని ఎన్‌సీఈఆర్‌టీ చెబుతోంది.
అయితే, 12వ తరగతి చరిత్ర పుస్తకాల్లో మొఘలుల ప్రస్తావన కనిపించే అధ్యాయాలు ఇంకా ఉన్నాయి.
అయిదో అధ్యాయంలో యాత్రికుల దృక్కోణం నుంచి భారత చరిత్రను చెప్పారు. ఈ అధ్యాయంలో పది నుంచి పదిహేడవ శతాబ్దం నాటి భారత్ స్థితిగతుల గురించి ప్రస్తావించారు.
ఆరో అధ్యాయం భక్తి, సూఫీ సంప్రదాయాలపై దృష్టి సారించింది. ఈ అధ్యాయంలో కూడా మొఘల్ కాలం నాటి సంగ్రహావలోకనం ఉంది.
‘‘రైతులు, భూస్వాములు, దేశం, వ్యవసాయ సమాజం’’ అనే పేరిట ఉన్న ఎనిమిదో అధ్యాయంలో కూడా మొఘల్ కాలం నాటి ప్రస్తావన ఉంది.

ఫొటో సోర్స్, NCERT
మార్పులు ఎందుకు?
చరిత్ర పుస్తకంలో చేసిన మార్పులను సమర్థిస్తూ మీడియాతో ఎన్‌సీఈఆర్‌టీ చీఫ్ దినేష్ సక్లానీ మాట్లాడారు.
‘‘మొఘలులను చరిత్ర నుంచి తొలగించలేదు. కానీ, విద్యార్థులపై సిలబస్ భారాన్ని తీసివేయడం కోసం కొన్ని పాఠ్యాంశాలను తగ్గించారు.
ఇది సిలబస్ హేతుబద్ధీకరణ కాదు. పాఠ్యపుస్తక హేతుబద్ధీకరణ. కోవిడ్ మహమ్మారి కారణంగా విద్యార్థులు చాలా నష్టపోయారని, వారిపై చాలా ఒత్తిడి నెలకొందని గతేడాదే మేం చెప్పాం. విద్యార్థులపై సిలబస్ భారాన్ని తగ్గించాలని అనుకున్నాం. నిపుణుల సలహా మేరకు ఈ మార్పులు చేశాం.
పాఠ్యపుస్తక హేతుబద్ధీకరణలో భాగంగా చరిత్ర పుస్తకంతో పాటు పొలిటికల్ సైన్స్ నుంచి కూడా పాఠ్యాంశాలను తొలగించారు.
పొలిటికల్ సైన్స్ పుస్తకంలో నుంచి హిందుత్వవాదుల పట్ల మహాత్మగాంధీకి ఉన్న అయిష్టత, గాంధీ హత్య తర్వాత ఆర్‌ఎస్‌ఎస్‌పై నిషేధం వంటి వాక్యాలను తీసేశారు.
మహాత్మాగాంధీని చంపిన నాథూరామ్ గాడ్సే గురించి పుస్తకంలో రాసిన ‘‘ ఆయన పుణే బ్రాహ్మణుడు’’ అనే వాక్యాన్ని కూడా తొలగించారు.
అలాగే, 11వ తరగతి సోషియాలజీ పుస్తకం నుంచి 2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించిన అంశాలను కూడా తీసేశారు.
ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లో చేసిన ఈ మార్పులపై బీజేపీయేతర పాలిత రాష్ట్రాలు, ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి.

ఫొటో సోర్స్, Getty Images
వ్యతిరేకత ఎందుకు?
రాజస్థాన్, కేరళ, పశ్చిమ బెంగాల్ విద్యాశాఖ మంత్రులు ఎన్‌సీఈఆర్‌టీ తీసుకొచ్చిన ఈ మార్పులను తీవ్రంగా వ్యతిరేకించినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం పేర్కొంది.
రాష్ట్రంలోని విద్యాలయాల్లో ఈ మార్పులను అమలు చేయడాని కంటే ముందు వీటిని క్షుణ్ణంగా సమీక్షించనున్నట్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు చెప్పారు.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, ఎన్‌సీఈఆర్‌టీ చేసిన ఈ మార్పులకు మద్దతు ఇచ్చింది.
కొత్త విద్యా విధానంలో భాగంగా ఈ మార్పులు జరిగాయని, ఎన్‌సీఈఆర్‌టీ ఇచ్చిన సిలబస్‌ను ఉన్నది ఉన్నట్లుగా వాడతామని, తమ వైపు నుంచి ఎలాంటి మార్పు ఉండబోదని యూపీ విద్యాశాఖ మంత్రి గులాబ్ దేవి అన్నారు.
మతతత్వ ధోరణితో చరిత్రను తిరగరాయడం ఎక్కువైందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు.
ఎన్‌సీఈఆర్‌టీ అంటే ‘‘నేషనల్ కౌన్సిల్ ఫర్ ఇరాడికేషన్ ఆఫ్ రేషనాలిటీ అండ్ ట్రుత్’’ అంటూ కొత్త భాష్యం చెప్పారు సీపీఐ నాయకుడు డి. రాజా.

ఫొటో సోర్స్, NCERT
మార్పుల వెనుక కారణాలు
ఎన్‌సీఈఆర్‌టీ, కొత్త పుస్తకాలను తయారు చేసి పాఠశాలలకు పంపినప్పుడు అందులోని తప్పులను ఎత్తి చూపుతూ చాలా మంది పిల్లలు, కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయుల నుంచి సూచనలు వస్తాయి. సాధారణంగా వీటిని దృష్టిలో ఉంచుకుని పాఠ్యపుస్తకాల్లో మార్పులు చేస్తారు.
చరిత్ర పుస్తకాల్లో లేదా ఇతర సబ్జెక్టుల్లో గతంలో కూడా మార్పులు జరిగాయి. ఎన్‌సీఈఆర్‌టీ నిపుణులు ఈ మార్పుల గురించి చర్చించి, తర్వాత ఆయా మార్పులు చేయాల్సిందిగా పుస్తక రచయితలకు సూచనలు ఇస్తారు.
బీజేపీకి సన్నిహితుడిగా గుర్తింపు ఉన్న ఎన్‌సీఈఆర్‌టీ మాజీ ఛైర్మన్ జేఎస్ రాజ్‌పుత్ మాట్లాడుతూ, ‘‘ఎన్‌సీఈఆర్‌టీ అనేది నిపుణులతో కూడిన ఒక పెద్ద సంస్థ. సాధారణంగా అకడమిక్ ప్రాతిపదికన మాత్రమే ఎన్‌సీఈఆర్‌టీ మార్పులు చేస్తుంది. ఎవరి భావాజాలాన్నైనా చరిత్రలో చొప్పిస్తే, దాన్ని కచ్చితంగా చరిత్ర నుంచి తొలగించాలి. కానీ, మొఘల్ చరిత్ర అనేది ప్రపంచ చరిత్ర. దాన్ని పూర్తిగా తొలగించలేరు. దాన్ని హేతుబద్దీకరించాలి.
అయితే, మొఘల్ కాలం నాటి చరిత్రను చాలా ఎక్కువగా బోధించినట్లు నాకు అనిపిస్తుంది. మొఘల్ చరిత్ర చదువుతున్నప్పుడు, మొఘల్ కాలంలో తప్ప మిగతా సమయంలో హిందుస్థాన్‌కు పెద్దగా ప్రాధాన్యత లేదన్నట్లుగా అనిపిస్తుంది. కొత్త విద్యా విధానం ఆధారంగానే తాజా మార్పులు చేస్తున్నారు’’ అని ఆయన వివరించారు.
భారత చరిత్రలో మొఘలులు కీలక భాగమని, వారిని చరిత్ర పుస్తకాల నుంచి తొలగించలేమని రాజ్‌పుత్ అన్నారు. కానీ, వారి గురించిన సమాచారాన్ని తగ్గించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
1999-2004 మధ్య ఎన్‌సీఈఆర్‌టీకి అధిపతిగా జేఎస్ రాజ్‌పుత్ వ్యవహరించారు.
పుస్తకాల్లో పాఠ్యాంశాల మార్పుల వివాదం తర్వాత ఎన్‌సీఈఆర్‌టీ విశ్వసనీయతపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఒక నిర్దిష్ట భావజాలాన్ని ప్రోత్సహించేందుకే ఎన్‌సీఈఆర్‌టీ ఇలాంటి మార్పులు చేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఫొటో సోర్స్, NCERT
‘‘తప్పుడు చరిత్రను బోధించినట్లే’’
పుస్తకాల్లో ఈ మార్పును భారతదేశం నుంచి మొఘల్ చరిత్రను తుడిచిపెట్టే ప్రయత్నంగా చాలా మంది చూస్తున్నారు.
ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సెక్రటరీ, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ చరిత్ర ప్రొఫెసర్ సయ్యద్ అలీ నదీమ్ రెజావి మాట్లాడుతూ, ‘‘చరిత్ర మారుతూనే ఉంటుంది. కాబట్టి, కొంత కాలం తర్వాత పిల్లలకు బోధించే అంశాలను మార్చాల్సిన అవసరం ఉంది. మార్పులు చేయడం పెద్ద విషయం ఏమీ కాదు. అవి జరుగుతూనే ఉంటాయి. ఈ మార్పులు ఎల్లప్పుడూ వాస్తవాల ఆధారంగా, కొత్త సమాచారం ఆధారంగా జరుగుతుంటాయి. కానీ, దురదృష్టవశాత్తు గత చాలా సంవత్సరాలుగా చరిత్రను ఇష్ట ప్రకారం రాయడానికి ప్రయత్నిస్తున్నారు. ఒక విధంగా చరిత్రను క్రమంగా చెరిపేసి, దాని స్థానంలో కల్పితాలను రాస్తున్నారు.
చరిత్రకు ఒక భిన్నమైన దృక్కోణాన్ని అందించడానికి 2014 నుంచి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతకుముందు, అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో చరిత్ర పుస్తకాలను మార్చడానికి ప్రయత్నాలు జరిగాయి. అయితే, వాస్తవాల ఆధారంగా అప్పుడు మార్పులు చేశారు. కానీ ఇప్పుడు ఒక విధంగా కల్పిత చరిత్రను సృష్టించే ప్రయత్నం జరుగుతోంది’’ అన్నారు ప్రొఫెసర్ రెజావి.
చరిత్ర నుంచి మెఘలుల పాలన కాలాన్ని తొలగించలేరని, ఒకవేళ అలా చేస్తే పిల్లలకు తప్పుడు సమాచారం ఇచ్చినట్లేనని ఆయన అభిప్రాయపడ్డారు.
‘‘మహారాణా ప్రతాప్‌ను హీరోగా చూపాలని ప్రయత్నిస్తున్నారు. కానీ, మహారాణా ప్రతాప్‌ని ఒంటరిగా చూపిస్తూ ఆయనను హీరోని చేయలేరు. అక్కడ అక్బర్ ప్రస్తావన అవసరం. ఎందుకంటే అప్పుడు అక్బర్ చేసిన కృషి చాలా ఉంది. మత సామరస్యం కోసం సహనశీల సమాజాన్ని రూపుదిద్దడం కోసం అక్బర్ చేసిన పనులను చరిత్ర నుంచి తొలగించారు’’ అని ప్రొఫెసర్ రెజీవి వివరించారు.
ఇవి కూడా చదవండి:
- ఇరాక్ వార్@20: సద్దాం పాలనే నయమని సర్వేలో తేల్చిన ప్రజలు
- ‘‘హిందూ మహాసముద్రంలో ఇదొక సముద్రపు శ్మశానవాటిక... కానీ శవాల లెక్క ఉండదు’’
- తెలుగు రాష్ట్రాల్లో కోళ్ల ఫారాలు ఎందుకు మూతపడుతున్నాయి?
- 72 మంది ముస్లింలను చంపిన కేసులో ఒక్కరినీ పట్టుకోలేకపోయారా, బాధితులు ఏమన్నారు?
- సీక్రెట్ : మనం చెప్పిన అబద్ధాలే మన రహస్యాలా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








