‘‘హిందూ మహాసముద్రంలో ఇదొక శ్మశానవాటిక... కానీ శవాల లెక్క ఉండదు’’

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మరీనా దరాస్
- హోదా, బీబీసీ న్యూస్
ఫ్రెంచ్ పౌరసత్వం తీసుకోవడానికి జరిగే 'ముందస్తు విచారణ'కు క్రిస్టియన్ అల్లీ మౌసా (42) సిద్ధమయ్యారు.
తన జన్మ హక్కుగా భావిస్తున్న యూరోపియన్ పాస్‌పోర్టును పొందడానికి ఏళ్లపాటు క్రిస్టియన్ న్యాయపరమైన ఖర్చులూ భరించాడు.
క్రిస్టియన్ తండ్రి ఫ్రెంచ్ భూభాగంలోని హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఉన్న మయోట్ ద్వీపానికి చెందిన ఫ్రెంచ్ పౌరుడు.
అయితే, క్రిస్టియన్ మయోట్‌కు 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న మడగాస్కర్ ద్వీపంలో పుట్టి పెరిగారు. దీంతో ఫ్రెంచ్ పౌరుడిగా గుర్తింపు పొందడానికి ఆయన ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
క్రిస్టియన్ ఏళ్లుగా ఫ్రెంచ్ భూభాగంలో అనధికారికంగా నివసిస్తున్నారు, అక్కడే పని చేస్తున్నారు.
అయితే క్రిస్టియన్ పౌరసత్వ విచారణకు వారాలు మాత్రమే మిగిలి ఉండగా, అకస్మాత్తుగా ఆయన్ని ఫ్రెంచ్ బార్డర్ పోలీసులు అరెస్టు చేసి మడగాస్కర్‌కు తిరిగి పంపించారు.
కోర్టు విచారణకు సమయానికి రావడానికి క్రిస్టియన్ ఓ పడవలో రావాల్సి వచ్చింది.

''బూట్లు తీసుకురమ్మన్నాడు, అంతలోనే తీసుకెళ్లిపోయారు''
మయోట్ ద్వీపంలో దాదాపు 3 లక్షల మంది నివసిస్తున్నారు. అది పగడపు దిబ్బలు, మడుగులకు ప్రసిద్ధి చెందింది.
ఆఫ్రికాలోని ఆగ్నేయ తీరంలో పొరుగున ఉన్న మడగాస్కర్, కొమొరోస్ దీవులతో పోలిస్తే ఇది కొంచెం సంపన్నమైందే. కానీ, ఫ్రాన్స్‌లో మాత్రం పేద దీవి.
రిజిస్టర్ చేసుకోని కార్మికుల మాదిరే క్రిస్టియన్ తన భార్య, పిల్లలను మడగాస్కర్‌లో చూసుకుంటున్నారు.
క్రిస్టియన్ గురించి ఆయన బంధువొకరు వివరించారు. భద్రతా కారణాల దృష్ట్యా మేం వారి పేర్లు బయటపెట్టడం లేదు.
"వారు [సరిహద్దు పోలీసులు] లోపలికి ప్రవేశించారు. క్రిస్టియన్‌ను తీసుకెళ్లాలని చూశారు" అని ఆయన బంధువు చెప్పారు.
"క్రిస్టియన్ నన్ను వెళ్లి తన బూట్లు తీసుకురమ్మని అడిగాడు. అయితే నేను తిరిగి వచ్చే సమయానికి, పోలీసులు ఆయన్ను తీసుకెళ్లిపోయారు" అని తెలిపారు.
వాళ్లు క్రిస్టియన్‌ను రాజధానిలోని నిర్బంధ కేంద్రానికి తరలించారు.
"మేం ఫోన్‌లో మాట్లాడాం. అతను ఏడుస్తున్నాడు. మడగాస్కర్‌కు తిరిగి వెళ్లడం ఇష్టం లేదన్నాడు" అని బంధువు గుర్తుచేసుకున్నారు.
క్రిస్టియన్ బహిష్కరణను ఆపడానికి 'అత్యవసర విజ్ఞప్తి'ని ప్రారంభించిన ఒక న్యాయవాదిని ఈ బంధువు సంప్రదించారు.
క్రిస్టియన్ మరుసటి రోజు ఉదయం 11 గంటలకు న్యాయమూర్తి ముందు హాజరు కావాలి.
అయితే ఆయన అప్పుడు మడగాస్కర్‌కు వెళ్లే విమానంలో ఉన్నాడు. ఆయనను నిర్బంధించిన 48 గంటల కంటే తక్కువ సమయంలోనే ఇదంతా జరిగింది.
క్రిస్టియన్ భార్య, పిల్లలు మడగాస్కర్‌లోనే ఉన్నారు. అయితే తన కుటుంబ పోషణకు సరిపోయేంత డబ్బును అక్కడ సంపాందించలేడని క్రిస్టియన్‌కు తెలుసు.

మడగాస్కర్‌లో సంపాదన అంత తక్కువా?
ప్రపంచ బ్యాంకు తాజా గణాంకాల ప్రకారం మడగాస్కర్‌లో నివసిస్తున్న ప్రతి ఐదుగురిలో నలుగురు రోజుకు రూ.176 కంటే తక్కువ ఆదాయంతో జీవిస్తున్నారు.
అంతేకాదు ఫ్రెంచ్ అధికారికంగా వెల్లడించిన గణాంకాల ప్రకారం మాయోట్ నివాసితులలో 42 శాతం మంది నెలకు రూ. 14,300 కంటే తక్కువ ఆదాయంతోనే బతుకుతున్నారు.
ఫ్రెంచ్ పాస్‌పోర్ట్ తనకు చట్టబద్ధమైన నివాసిగా మారడానికి , మరిన్ని అవకాశాలను పొందేందుకు వీలు కల్పిస్తుందని క్రిస్టియన్‌కు తెలుసు.
కాబట్టి ఆయన ఎవరికీ చెప్పకుండా తన విచారణ కోసం తిరిగి రావాలని నిర్ణయించుకున్నాడు.
క్రిస్టియన్ బంధువు మాట్లాడుతూ "అతను మయోట్‌కు తిరిగి వెళ్లాలనుకుంటున్నాడని నాకు తెలియదు.
క్రిస్టియన్ నాతో గానీ లేదా ఆయన స్నేహితులకు గానీ ఏమీ చెప్పలేదు. అనారోగ్యంతో ఉన్నానని, మందులు అవసరమని డబ్బు అడిగాడు. అక్కడ తాగునీరు కూడా లేదన్నాడు.
ఆయన చనిపోయాడని చెప్పడానికి అధికారులు నాకు ఫోన్ చేశారు. ఆ సమయంలో నేను అధికారులతో 'అది అతను కాదు. అతను కాదు' అన్నాను. వారు ఫోటోలు పంపారు. నేను ఆయన ముఖాన్ని గుర్తించాను" అని వివరించారు.

'ఆ మడుగులో 10,000 మంది మృతి'
మార్చి 12న మడగాస్కర్ తీరంలో మునిగిపోయిన 34 మందిలో క్రిస్టియన్ ఒకరు.
స్థానికంగా 'క్వాస్సా క్వాస్సా' అని పిలిచే చిన్న ఫిషింగ్ బోట్‌లో ఆయన ఇలా ప్రయాణం చేయడం ఇది మూడోసారి.
"ద్వీపం చుట్టూ ఉన్న మడుగు బహిరంగ స్మశానవాటిక" అని మయోట్టేలోని ప్రభుత్వేతర సంస్థ అయిన హ్యూమన్ రైట్స్ లీగ్‌కు చెందిన డేనియల్ గ్రోస్ అన్నారు.
"నేను 2012లో వచ్చినప్పుడు, అక్కడ సుమారు 10,000 మంది మరణించినట్లు అంచనా అని అధికారులు చెప్పేవారు.
నేడూ వాళ్లు అదే నంబర్ చెబుతారు. మడుగు వద్ద ఎంతమంది చనిపోయారో లెక్కించడానికెవరూ ప్రయత్నించలేదు" అని చెప్పారు.
పొరుగున ఉన్న కొమొరోస్ దీవుల నుంచి మాయోట్‌కు వలసలు పెరిగాయి. దీంతో అల్లర్లు, అశాంతికి నిలయంగా మాయోట్ వార్తల్లో నిలుస్తోంది. ఇది ప్రజాసేవలపై ఒత్తిడి సైతం తెస్తోంది.
కాగా, ఆ ద్వీపంలో నివసించే ప్రతి ఇద్దరిలో ఒకరు 'విదేశీ' అని ఫ్రెంచ్ ప్రభుత్వం చెబుతోంది.
కఠినంగా వ్యవహరిస్తామని కూడా ప్రతిజ్ఞ చేసింది. అంతేకాదు ఏడాదికి 24,000 మందిని బహిష్కరిస్తోంది.
కొమొరోస్ దీవుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని పారిస్‌కు మాయోట్ ఫ్రెంచ్ ఎంపీ ఎస్టేల్ యూసౌఫా పిలుపునిచ్చారు.
"రహస్య వలసలను నిలవరించడానికి జాతీయ నావికాదళం శాశ్వత స్థావరాన్ని ఆ ద్వీపంలో ఏర్పాటు చేయాలని మేం కోరుతున్నాం" అని సెంటర్-రైట్ డిప్యూటీ జనవరిలో ఫ్రెంచ్ టీవీ ఛానెల్ అయిన బీఎఫ్ఎంటీవీతో చెప్పారు.
కానీ, పిల్లల విషయంలో హక్కుల సంఘాలు ఆందోళన చెందుతున్నాయి.
తన పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక తండ్రి రాజధాని నగరంలో మమౌద్‌జౌలోని ఒక డిటెన్షన్ సెంటర్ వెలుపల పైకి కిందికి తిరుగుతున్నాడు.
తన 13 ఏళ్ల కుమార్తె లోపల ఉందని, కుటుంబ సభ్యుడితో పాటు అరెస్టు చేసినట్లు ఆయన చెప్పారు.
"ఆమె మైనర్, పాఠశాలలో ఉండాలి. కానీ, ఇలా బంధించడం సాధారణ విషయం కాదు.
ఆమెకు మంచి భవిష్యత్తును అందించడానికి మేం చేయగలిగినదంతా చేస్తున్నాం" అని తెలిపారు.
ఆపరేషన్ 'వుయంబుషు'
ఫ్రెంచ్ ప్రభుత్వం రంజాన్ తర్వాత మెజారిటీ ముస్లిం ద్వీపంలో గల చట్టవిరుద్ధమైన నివాసాలు లేదా గుడిసెల కాలనీలను కూల్చివేయాలని యోచిస్తోంది.
'ఆపరేషన్ వుయంబుషు'లో భాగంగా ఉన్న 1,300 మంది అధికారులకు ద్వీపంలో పోలీసు, పారామిలిటరీ పోలీసుల ఉనికి భరోసా ఇచ్చింది.
రాజధానికి ఉత్తరాన, మజికావో అనే మురికివాడలో, స్థానిక అధికారులు ఇప్పటికే కొన్ని నివాసాలను గుర్తిస్తున్నారు.
15 సంవత్సరాలుగా అక్కడ నివసిస్తున్న ఫాతిమా మాట్లాడుతూ "మేం నిరంతరం ముప్పుతో జీవిస్తున్నాం.
మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఈ స్థలం నాశనం అవుతుందని అన్నారు'' అని గుర్తుచేసుకున్నారు.
ఫాతిమాకు ద్వీపంలో ఉండటానికి వీలు కల్పించే రెసిడెన్సీ అనుమతి ఉంది. కానీ, ఫ్రాన్స్‌కు అయితే లేదు.
ఫ్రెంచ్ చట్టం ప్రకారం ప్రభుత్వం ఎవరి ఇళ్లు అయితే ధ్వంసం చేస్తుందో వారికి "తగిన ప్రత్యామ్నాయ వసతి" కల్పించాలి.
కొంతమంది నివాసితులకు 6 నెలల పాటు అత్యవసర వసతినైతే అందించింది. అయితే స్పష్టమైన పునరావాస ప్రణాళిక మాత్రం చెప్పలేదు.
మరోవైపు ఫ్రెంచ్ అడ్మినిస్ట్రేషన్ దీనిపై స్పందించడానికి నిరాకరించింది.
ఫ్రెంచ్ బలవంతపు చర్యలను డేనియల్ గ్రోస్ తీవ్రంగా విమర్శించారు.
"మీరు ప్రజలను తరిమేస్తే, వారు తిరిగి వస్తే ఆశ్చర్యపోనవసరం లేదు. రోజు వందల మందిని బహిష్కరిస్తున్నా,
అదే సమయంలో అదే సంఖ్యలో పడవల్లో జనాలొస్తున్నారు.
వలసల విషయంలో ఏదో ఒకటి చేస్తున్నట్లు తమ ప్రజలకు నిరూపించాలని ఫ్రెంచ్ కోరుకుంటోంది" అని డేనియల్ గ్రోస్ వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- ఐపీఎల్ 2023: టోర్నీని రసవత్తరంగా మార్చబోతున్న 'ఇంపాక్ట్ ప్లేయర్' రూల్ ఏంటి?
- సెమాగ్లుటైడ్: బరువు తగ్గించే ఈ ఇంజెక్షన్‌కు అంత డిమాండ్ ఎందుకు?
- తెలంగాణ: ఆదివాసీలు పరిశ్రమలు పెట్టేందుకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం పొందడం ఎలా?
- ‘‘ఆయన నాలుగేళ్లుగా నీళ్లు పోసుకోలేదు... అడవిలోనే ఒంటరి జీవితం... అటవీ ఏనుగులున్నా భయపడలేదు’’
- 'జీన్ ఎడిటెడ్ ఫుడ్' అంటే ఏంటి? అది తినడం ఆరోగ్యానికి మంచిదేనా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















