18 మంది మహిళలపై 2 రోజులపాటు అత్యాచారం...30 ఏళ్లకు పైగా సాగిన విచారణ...

వాచ్ఛాతీ
    • రచయిత, ప్రమీలా కృష్ణన్
    • హోదా, బీబీసీ తమిళ్

‘‘అప్పటికి నా వయసు 13 ఏళ్లు. నేను చాలా చిన్నదాన్ని వదిలి పెట్టమని వేడుకున్నాను. కానీ, వారు కనికరం చూపలేదు. వారికి అక్కా చెల్లెళ్లు, తోబుట్టువులు ఉన్నారో లేదో తెలియదు. వారు మాతో దారుణంగా ప్రవర్తించారు. మాపై అత్యాచారాలు చేశారు. దారుణంగా కొట్టారు. ఆ రోజు రాత్రంతా గ్రామంలో ఏడుపులు, అరుపులు అలా వినిపిస్తూనే ఉండేవి.’’

1992 జూన్ 20 రాత్రినాటి ఘటనలను గుర్తుచేసుకుంటూ ఒక అత్యాచార బాధితురాలు చెప్పిన మాటలివీ.

భారత్‌లో కలకలం రేపిన కేసుల్లో వాఛాతీ అత్యాచార కేసు కూడా ఒకటి. దీనిపై మూడు దశాబ్దాలుగా కోర్టులు దర్యాప్తు చేపట్టాయి. మొత్తంగా ఆనాడు తమిళనాడులోని వాఛాతీ గ్రామానికి చెందిన 18 మంది మహిళలు అత్యాచారానికి గురయ్యారు. మరో వంద మందిపై దాడులు జరిగాయి. తమిళనాడు పోలీసు, అటవీ విభాగం అధికారులు ఈ అత్యాచారాలు, దాడులు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు.

ఆనాడు గంధపు చెక్కల అక్రమ రవాణా ఆరోపణలపై వాఛాతీ గ్రామానికి పోలీసులు, అటవీ విభాగం అధికారులు వెళ్లారు.

వాఛాతీ

వాయువ్య తమిళనాడులోని ధర్మపురి జిల్లా సీథేరి కనుమల్లో ఉండే వాఛాతీ ఒక ఆదివాసీ గ్రామం. ఇక్కడ గంధం చెట్లు ఎక్కువగా కనిపిస్తాయి.

1992 జూన్ 20న మొదలై రెండు రోజులపాటు ఈ అత్యాచారాలు కొనసాగాయి. దళిత వర్గానికి చెందిన మహిళలపై అత్యాచారాలు చేయడంతోపాటు వీరి ఇళ్లను ధ్వంసం చేశారు. పశువులను కూడా హతమార్చారు.

2011లో స్పెషల్ ట్రయల్ కోర్టు ఈ కేసులో తీర్పు నిచ్చింది. దళితులపై అకృత్యాలకు పాల్పడినట్లు 215 మంది అటవీ, పోలీసు విభాగం అధికారులను దోషులుగా నిర్ధారించింది. అయితే, కోర్టు విచారణ సమయంలోనే మరో 54 మంది అధికారులు మరణించారు.

దోషులుగా నిరూపితమైన అధికారులు మద్రాసు హైకోర్టులో అప్పీలు చేసుకున్నారు. త్వరలో ఈ కేసులో హైకోర్టు తీర్పు నిచ్చే అవకాశముంది.

‘‘మాపై అత్యాచారం చేశారు. కొట్టారు. ఆ ఘటనలు జరిగి 30 ఏళ్లు కావచ్చు. కానీ, ఆ గాయాలు ఎప్పటికీ మానవు. మేం వాటిని మరచిపోలేం’’అని ఆనాడు అత్యాచారానికి గురైన ఒక మహిళ చెప్పారు.

పెద్ద మర్రిచెట్టు కింద కూర్చొని వారు మాతో మాట్లాడారు. ఆ ఘటనలు నిన్నే జరిగినట్లు వారు మాకు వివరించారు. మాట్లాడేటప్పుడు వారి కంట కన్నీరు అలా కారుతూనే ఉంది. వాటిని గుర్తుచేసుకున్న ప్రతిసారీ తాము గజగజ వణుకుతుంటామని వారు వివరించారు. ఆ రోజు మొత్తం తమకు ఏమీ తినాలని కూడా అనిపించదని చెప్పారు.

వీడియో క్యాప్షన్, వాఛాతీ: 30ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్న మహిళలు
వాఛాతీ గ్రామం

కీలకమైన కేసు..

90ల్లో గంధం చెక్కలను అక్రమంగా తరలించే వీరప్పన్‌ పట్టుకునేందుకు తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించేది. దీనిలో భాగంగానే వాయువ్య తమిళనాడులోని సీథేరి కనుమలు, సత్యమంగళం అభయారణ్యానికి అనుకుని ఉండే ప్రాంతాలు, గ్రామాల్లో ప్రభుత్వం సోదాలు చేపట్టేది. అలా సోదాలు చేపట్టిన ప్రాంతాల్లో వాఛాతీ గ్రామం కూడా ఒకటి.

సోదాల సమయంలో గ్రామస్థులను ప్రశ్నించేవారు. కొన్నిసార్లు అధికారులు దారుణంగా హింసించేవారు కూడా.

1992 జూన్ 20నాటి సోదాలూ కూడా అలాంటివే. అక్రమంగా గంధం చెక్కలను తరలిస్తున్నారనే ఆరోపణలపై వాఛాతీ గిరిజనులను విచారించేందుకు అధికారులు వచ్చారు. అయితే, వీరికి, గ్రామస్థులకు మధ్య గొడవ జరిగింది.

ఈ గొడవ కొట్లాట వరకూ వెళ్లింది. దాంతో కొన్ని గంటల్లోనే వందల మంది పోలీసులు, అటవీ అధికారులు, కొందరు రెవెన్యూ సిబ్బంది వాఛాతీ గ్రామంలోకి ప్రవేశించారు. ఇళ్లను ధ్వంసం చేస్తూ ఇక్కడ 18 మంది మహిళలపై వారు అత్యాచారాలు చేశారు.

వాచ్ఛాతీ

ఆనాడు అత్యాచారానికి గురైనవారిలో స్కూలుకు వెళ్లే ఒక అమ్మాయి కూడా ఉంది. ఆ ఘటన తర్వాత తాను బడి మానేయాల్సి వచ్చిందని ఆమె చెప్పారు.

‘‘చెరువుకు సమీపంలో మాపై అత్యాచారం చేశారు. ఆ సమయంలో మాకు స్పృహ లేదు. ఆ తర్వాత మమ్మల్ని అటవీ విభాగానికి చెందిన పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆ రాత్రి మాకు నిద్ర లేదు. నేను స్కూలుకు వెళ్లే అమ్మాయిని, చిన్నదాన్ని, నన్ను వదిలేయండని వేడుకున్నాను. కానీ, ఒక ఫారెస్ట్ రేంజర్ దారుణంగా తిట్టాడు. చదువుకుని ఏం చేస్తావని ప్రశ్నించాడు. మా అక్క, అమ్మ, పిన్ని, చిన్నాన్నతోపాటు నన్ను వారు సాలెం జైలుకు తీసుకెళ్లారు’’అని ఆమె చెప్పారు.

సోదాల్లో వేధింపులకు గురైన బాధితుల జీవితాలపై రచయిత, అడ్వొకేట్ ఎస్ బాలమురుగణ్ కొన్ని పుస్తకాలు రాశారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘సోదాల్లో అత్యాచారాలను ఆయుధాలుగా ఉపయోగించేవారు. అయితే, సీపీఎం నాయకుల సాయంతో కొందరు బాధిత మహిళలు అధికారులపై కేసులు పెట్టారు. అలా ఈ అత్యాచారాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసు తర్వాత గిరిజనులు తాము ఎదుర్కొంటున్న వేధింపుల గురించి మాట్లాడటం మొదలుపెట్టారు’’అని ఆయన చెప్పారు.

మహిళలు

దారుణ హింస..

ఒక బృందంలోని మహిళలపై వరుస అత్యాచారాలు జరిగినప్పుడు, మరొక బృందంలోని మహిళలను కర్రలతో తీవ్రంగా కొట్టారు. ఆ దాడుల తర్వాత 90 మంది మహిళలు, 20 మంది పిల్లలను నెల రోజులపాటు జైలులో పెట్టారు. కొందరిని మూడు నెలలపాటు అలా జైలులోనే ఉంచారు.

ఆ దాడుల్లో అత్యాచారానికి గురైన వారిలో ఎనిమిది నెలల గర్భిణి కూడా ఉన్నారు. ఆ రోజు ఏం జరిగిందో ఆమె వివరించారు.

‘‘నా కడుపులో బిడ్డ పెరుగుతోందని తెలిసినప్పటికీ, నన్ను తీవ్రంగా కొట్టారు. బూతులు తిట్టారు. నేను నా పెద్ద కుమార్తె చేయి గట్టిగా పట్టుకున్నాను. అప్పటికే దాడుల నుంచి తప్పించుకునేందుకు మా ఇంట్లోనే మగవారంతా అడవుల్లోకి పరుగులు తీశారు. దీంతో మమ్మల్ని ఆదుకునేవారు లేకుండా పోయారు. గ్రామంలో కొందరు వృద్ధులు, పిల్లలు మాత్రమే మిగిలారు. అందరూ భయంతోనే ఉండేవారు. మూడు నెలలపాటు నేను జైలులో ఉన్నాను. పాప కూడా జైలులోనే పుట్టింది. అందుకే తనకు జైల్ రాణి అని పేరు పెట్టాం. కానీ, కొన్ని నెలలకే తను చనిపోయింది’’అని ఆమె చెప్పారు.

దాడి తర్వాత తన భుజాలు ఎలా బలహీనమయ్యాయో ఆమె చూపించారు. మాట్లాడేటప్పుడు ఆమె గజగజ వణికారు. మొహంలో ఇప్పటికీ భయం కనిపిస్తోంది. మిగతా 17 మంది బాధిత మహిళలదీ ఇదే పరిస్థితి.

1992 జూన్ 20నాడు రాత్రి కొందరు గ్రామస్థులు ఇక్కడి నుంచి ప్రాణాలతో సమీప గ్రామాలకు పరుగులు తీశారు. వారు నెలలపాటు అక్కడే ఉండిపోయారు. అయితే, గ్రామంలోని వారి ఇళ్లకు అధికారులు నిప్పు పెట్టారు. పశువులను హతమార్చారు. గ్రామంలోని మంచినీటి బావిలో పశువులను చంపి పడేశారు.

‘‘ఆ బావి నుంచి మేం నీరు తీసుకోలేకపోయాం. ఆ నీరు తాగడానికి పనికి వచ్చేదికాదు. అందులో జంతువుల కళేబరాలు కనిపించేవి. నాకు ముగ్గురు పిల్లలు. వారికి పెట్టడానికి తిండి కూడా దొరికేదికాదు. ఆహారపు ధాన్యాల్లో వారు గాజు పెంకులు కలిపారు. మట్టి పాత్రలను ముక్కలు చేశారు. బట్టలకు నిప్పు పెట్టారు’’అని ఒక గ్రామస్థుడు నాటి పరిస్థితిని గుర్తుచేసుకున్నారు.

వాచ్ఛాతీ

ఎందుకు ఆలస్యం?

‘‘ఈ గ్రామంలో దాదాపు అందరూ ఏదో ఒక విధంగా వేధింపులను ఎదుర్కొన్నారు. మళ్లీ వీరు సాధారణ జీవితం గడపడానికి దాదాపు దశాబ్దం పట్టింది’’అని బాధితుల తరఫున పోరాడిన సీపీఎం నాయకుడు పీ శణ్ముగం చెప్పారు.

‘‘చాలా మంది మహిళలు దీని గురించి మాట్లాడటానికి భయపడేవారు. కోర్టులో మెజిస్ట్రేట్ ముందు నోరు విప్పొద్దని వారిని భయపెట్టారు. జీవితాంతం జైలులోనే మగ్గిపోవాల్సి ఉంటుందని బెదిరించారు. అయితే, మేం ఇలాంటి అక్రమ సోదాలకు వ్యతిరేకంగా అక్కడ నిరసనలు చేటప్టాం. దీంతో అక్కడి మహిళలకు కాస్త ధైర్యం వచ్చింది. మేం మద్రాస్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసినప్పుడు.. వందల మంది అధికారులు అలా ప్రవర్తించి ఉండరని మా పిటిషన్‌ను తోసిపుచ్చారు’’అని ఆయన చెప్పారు.

దీంతో వీరు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అప్పుడు ఈ రిట్ పిటిషన్‌పై విచారణ చేపట్టాలని మద్రాసు హైకోర్టుకు సుప్రీం కోర్టు సూచించింది. అనంతరం ఈ కేసులో 269 మంది అధికారులపై అభియోగాలతో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఒక అభియోగపత్రం దాఖలు చేసింది. 20ఏళ్ల విచారణ సమయంలో 54 మంది అధికారులు మరణించారు.

ఈ కేసులో ట్రయల్ కోర్టు 2011లో 215 మంది అధికారులను దోషులుగా నిర్ధారిస్తూ తీర్పు నిచ్చింది. వీరిలో 12 మందికి పదేళ్ల జైలు శిక్ష విధించారు. ఐదుగురికి ఏడేళ్ల జైలు శిక్ష విధించారు. మిగతవారికి రెండు నుంచి పదేళ్ల మధ్య జైలు శిక్ష విధించారు.

వాచ్ఛాతీ
ఫొటో క్యాప్షన్, అడ్వొకేట్ గాంధీకుమార్

హైకోర్టులో అప్పీలు

దోషులుగా నిరూపితమైన 215 మంది అధికారుల్లో కొందరు తమకు ఏ పాపమూ తెలియదని కోర్టులో చెప్పారు. ‘‘మేం మా డ్యూటీ చేస్తుండగా, వీరప్పన్ ముఠాలో భాగమైన కొందరు గ్రామస్థులు మమ్మల్ని అడ్డుకున్నారు. మేం దానికి ప్రతిస్పందించాం’’అని చెప్పారు.

అలా 43 మంది దోషులు హైకోర్టులో తీర్పును సవాల్ చేశారు. వారి తరఫున వాదనలు వినిపించిన అడ్వొకేట్ గాంధీకుమార్ బీబీసీతో మాట్లాడారు. ‘‘ఆ రోజు డ్యూటీలో లేని వారి పేర్లు కూడా సీబీఐ అభియోగపత్రంలో పేర్కొన్నారు. వారిలో ఒక అధికారి మెడికల్ లీవ్‌పై వెళ్లారు. కానీ, ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించారు. అత్యాచార బాధితులమని కొందరు చెబుతున్న మాటలు చాలా అనుమానాస్పదంగా ఉన్నాయి’’అని ఆయన వ్యాఖ్యానించారు.

వీడియో క్యాప్షన్, లఖీంపుర్ ఖీరీ: దళిత అక్కాచెల్లెళ్ళు చెట్లకు వేలాడుతూ కనిపించారు, అసలేం జరిగింది?

గ్రామం ఇప్పుడెలా ఉంది?

1992 జూన్ నాటి పరిస్థితులను దాటి వాఛాతీ గ్రామం చాలా ముందుకు వచ్చింది. నేడు అక్కడ పూరిళ్లు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. పిల్లలందరూ స్కూలుకు వెళ్తున్నారు.

కొన్ని జనరల్ స్టోర్‌లు కూడా కనిపిస్తున్నాయి. గ్రామ యువత కొత్త కొత్త బైక్‌లపై తిరుగుతూ కనిపిస్తున్నారు. గ్రామంలో చాలా మందికి సెల్‌ఫోన్లు ఉన్నాయి. దాదాపు అందరి ఇళ్లలోనూ టీవీలు కనిపిస్తున్నాయి.

దగ్గర్లోని నూలు మిల్లులో చాలా మంది పనిచేస్తున్నారు. మరోవైపు గ్రామానికి చెందిన ఐదుగురు యువకులు పోలీసు విభాగంలో ఇటీవల చేరారు.

1992 జూన్‌నాటి దారుణాలను చూసిన అదే మర్రిచెట్టు కింద నేడు కొందరు మహిళలు కూర్చొని మాట్లాడుకుంటున్నారు.

వాఛాతీ అత్యాాచారం ఘటన:

  • ఎప్పుడు జరిగింది: 1992 జూన్ 20
  • గిరిజన బాధితుల సంఖ్య: 217
  • మహిళలు: 94, పిల్లలు: 28
  • అత్యాచార బాధితులు: 18 మంది మహిళలు
  • దోషులుగా నిరూపితమైన అధికారులు: 269 మంది
  • అత్యాచార దోషులు: 17 మంది
  • విచారణ సమయంలో మరణించిన అధికారులు: 54 మంది
  • ఎఫ్ఐఆర్ నమోదు: 1995
  • ట్రయల్ కోర్టు ఏర్పాటు: 1995
  • ట్రయల్ కోర్టు తీర్పు: 2011
  • మద్రాసు హైకోర్టు తీర్పు: మరికొన్ని వారాల్లో వచ్చే అవకాశం
వీడియో క్యాప్షన్, లింగవివక్షతో మహిళలు హత్యకు గురైన కేసులను శోధించే డిటెక్టివ్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)