ఒకరి కంటే ఎక్కువ మందితో సెక్స్ చేయమంటారు, శారీరకంగా హింసిస్తారు, అండర్ వరల్డ్ సెక్స్ ఊబిలో కూరుకుపోయిన మహిళల వేదన

ఫొటో సోర్స్, LEYLA JEYTE
- రచయిత, మోహమద్ గబోబే, లైలా మహమోద్
- హోదా, మోగదిషు, లండన్
సోమాలియాలో కొన్నేళ్ల పాటు సాగిన అంతర్యుద్ధం తర్వాత రాజధాని నగరం మొగాదిషులో తాము అండర్ వరల్డ్ సెక్స్ వర్క్‌లో ఎలా చిక్కుకుపోయారో ఇద్దరు మహిళలు బీబీసీకి వివరించారు.
వారి వ్యక్తిగత భద్రత మేరకు పేర్లను బీబీసీ మార్చివేసింది.
లిడో బీచ్‌తో ప్రజలను ఆకట్టుకునే మొగాదిషుకి వాణిజ్య నగరంగా కూడా పేరుంది.
రిసార్ట్‌లు, హోటల్స్, పెద్ద పెద్ద రెస్టారెంట్లు, వ్యాపారాలు, రుచికరమైన ఆహారం ఈ నగరానికి ప్రత్యేక ఆకర్షణ.
అయితే, ఇవి మాత్రమే కాదు.. పార్టీలు, డ్రగ్‌లు, లైంగిక నేరాలు కూడా ఈ నగరానికి మరో పార్శ్వంగా కనిపిస్తుంటాయి.
నగరానికి మరోవైపున్న ఈ అండర్ వరల్డ్‌లో అందరూ యువతులే. అంతేకాక, పేదవారు.
ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న ఈ దేశంలో వెనుకబడిన వారు, పేద మహిళలు ఈ సెక్స్ వర్క్ అండర్ వరల్డ్‌లో కూరుకుపోతున్నారు.
22 ఏళ్ల ఫర్దౌసా మూడేళ్లుగా సెక్స్ వర్కర్‌గా పనిచేస్తున్నారు. మొగాదిషులోని వార్దింగ్లే జిల్లాలో ఒక అపార్ట్‌మెంట్‌లో ఎర్రటి కర్టెన్లకు వెనుకాల ఉన్న చీకటి గదిలో కూర్చుని ఉన్నారు.
తన మృదువైన స్వరంతో ఈ అండర్ వరల్డ్ సెక్స్ ఊబిలో తానెలా చిక్కుకుపోయారో బీబీసీకి వివరించారు.
ఫర్దౌసా తనకు 19 ఏళ్లు ఉన్నప్పుడు ఇంటి నుంచి పారిపోయి వచ్చారు. అయితే, సోమాలి సమాజంలో పెళ్లి కాకుండా ఒక యువతి ఇంటి నుంచి బయటికి రావడమన్నది చాలా అరుదు.
ఇంట్లో హింసాత్మక పరిస్థితులు ఉండటం, కుటుంబ తీరు బాగోలేని సమయంలోనే వారు ఇంటి నుంచి బయటికొచ్చి బతుకుతుంటారు. ఇటీవల కాలంలో ఇలాంటి కేసులు ఆ సమాజంలో పెరుగుతున్నాయి కూడా.
‘‘తొలుత నేను ఇంటి నుంచి పారిపోవాలనుకోవలేదు. కానీ, నా తండ్రితో కలిసి నేను జీవించలేకపోయాను. ఇక ఎక్కువ కాలం నా సవతి తల్లి పెట్టే బాధలను భరించలేననుకున్నాను’’ అని ఫర్దౌసా చెప్పారు.
ఫర్దౌసా తల్లి చనిపోయిన తర్వాత ఆమె తండ్రి మరో మహిళను వివాహం చేసుకున్నారు. ఆ సమయంలో ఫర్దౌసా చాలా చిన్న అమ్మాయి.
ఇన్నేళ్లలో ఆమె తన సవతి తల్లి పెట్టే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. సవతి తల్లి కూతుర్ని ఇన్ని ఇబ్బందులు పెడుతున్నప్పటికీ, తన తండ్రి మాత్రం ఆమెకు ఎప్పుడూ సపోర్టు చేయలేదు. సవతి తల్లి వైపే నిల్చునే వారు.

ఫొటో సోర్స్, LEYLA JEYTE
ఇంటిని విడిచిపెట్టిన తర్వాత ఫర్దౌసా కొత్త స్నేహితులను కలిశారు. వారు తనకి సాయం చేస్తారని ఫర్దౌసా భావించారు.
‘‘వారు నా గురించి కేర్ తీసుకుంటారని నేను అనుకున్నాను. కానీ, నేను వెనుతిరిగి చూసుకుంటే, వారసలు నాకు నిజమైన స్నేహితులే కాదు’’ అని అన్నారు.
మోర్పైన్, ట్రెమడాల్, పెథిడిన్ వంటి డ్రగ్‌లకు క్రమంగా ఫర్దౌసా బానిసయ్యారు. లిడో బీచ్‌లో రహస్యంగా జరిగే పార్టీలకు వెళ్లాల్సి వచ్చేది. అక్కడే ఆమె సెక్స్ వర్కర్‌గా మారాల్సి వచ్చింది.
మోగదిషులోని రహస్యంగా సాగే ఈ అక్రమ సెక్స్ జీవితంలో ఫర్దౌసా కూడా చిక్కుకోవాల్సి వచ్చింది. హోటల్స్ నుంచి కనీసం ఊరు పేరు తెలియని వ్యక్తుల ఇళ్లకు కూడా ఆమె వెళ్లాల్సి వచ్చేది. వారి ప్రైవేట్ నివాసాల్లో కలవాల్సి వచ్చేది.
ప్రస్తుతం తనకు చాలా మంది కస్టమర్లున్నారని, వారు ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు ఫర్దౌసా.
‘‘నా ఫోన్ రింగ్ అవుతుందేమోనని నేను వేచిచూస్తుంటా. ఫోన్ రింగ్ అయితే సెక్స్‌లో పాల్గొనేందుకు ఆ వ్యక్తితో కలిసి బయటికి వెళ్తా. చాలా సార్లు, పురుషులు సిద్ధంగా ఉన్నప్పుడు నా స్నేహితులు కూడా కాల్ చేస్తుంటారు’’ అని ఫర్దౌసా చెప్పారు.
నా అవసరాలకు డబ్బులు కావాలి
తన జీవితంలో అన్ని రంగాలకు, వర్గాలకు చెందిన వ్యక్తుల్ని కలిసినట్లు ఫర్దౌసా చెప్పారు.
‘‘ఈ పురుషులు తొలుత నా స్నేహితులకి పరిచయం. వారికి మిత్రులు కూడా. కానీ, వారు ఆ తర్వాత ఇతర వ్యక్తులతో సెక్స్‌లో పాల్గొనడం ప్రారంభించారు. వారి మధ్యలో ఏం జరిగిందో నాకు తెలియదు. నగరంలో నివసించే ఇతర యువతుల మాదిరిగానే నా అవసరాలను తీర్చుకునేందుకు నాకు డబ్బులు కావాల్సి ఉంది.’’ అని ఫర్దౌసా చెప్పారు.
అయితే, ఈ సెక్స్ వర్క్ గురించి ఎలాంటి అధికారిక డేటా లేదు. కానీ ఫర్దౌసా, ఇతరుల నుంచి తీసుకున్న సమాచారం మేరకు, నగరంలో ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఈ సెక్స్ వర్క్ నడుస్తుందో తెలుస్తుంది. చాలా మంది యువత ఈ ఊబిలో కూరుకుపోయారు.
హోడాన్ అనే 23 ఏళ్ల అమ్మాయి కూడా గత రెండున్నరేళ్లుగా సెక్స్ వర్కర్‌గా పనిచేస్తున్నారు.
హోడాన్ కూడా తన ఇంటి నుంచి పారిపోయి, మోగదిషు అండర్ గ్రౌండ్ సెక్స్‌లో చిక్కుకుపోయారు. ఎలాంటి ఆర్థిక సపోర్టు లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వీరు ఈ జీవితంలో భాగమైపోయారు.
‘‘నేను చాలా రాత్రుళ్లు హోటల్స్‌లోనే గడిపాను. చాలా మంది యువత కూడా ఇలానే గడపాల్సి వస్తుంది. వివిధ రకాల పురుషుల్ని ఇక్కడ మీరు కలుసుకుంటారు. కానీ కొంత మంది వ్యక్తులతో మాత్రం పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి.’’ హోడాన్ చెప్పారు.
సోమాలియాలో సెక్స్ వర్క్ అనేది అక్రమం. ఈ అమ్మాయిలు తమకు తాముగా ఇబ్బందుల్లో కూడా పడుతున్నారు. ఈ సమయంలో అధికారుల నుంచి సాయం కూడా దొరకదు.
ఈ విషయంపై బీబీసీ మహిళా, మానవ హక్కుల అభివృద్ధి మంత్రిత్వ శాఖను, పోలీసు అధికారులను సంప్రదించింది. కానీ వారు స్పందించలేదు.
చాలా సార్లు అమ్మాయిలు చాలా తీవ్రంగా వేధించబడతారు. లైంగిక ప్రక్రియలో పాల్గొనే సమయంలో పురుషులు వారి శరీరాలపై చేసిన గాయాలతోనే అమ్మాయిలు తిరిగి వస్తుంటారని హోడాన్ చెప్పారు.

ఫొటో సోర్స్, LEYLA JEYTE
ఈ వృత్తిలోకి కొత్తగా వచ్చిన వారు నమ్మిన వ్యక్తుల నుంచే తీవ్రంగా వేధింపులకు గురవుతున్నారని హోడాన్ అన్నారు.
ఫర్దౌసా కూడా ఈ లైంగిక హింసను ఎదుర్కొన్నారు.
‘‘ప్రారంభంలో వారు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్లి సెక్స్‌లో పాల్గొనేదాన్ని. కానీ, ఒక రాత్రి చాలా భయానకంగా గడిచింది. తీవ్రంగా కొట్టారు. నా ముఖంపై కొట్టారు. ముఖమంతా రక్తంతో తడిసిపోయింది. ఇదంతా కూడా వారు చెప్పిన ధరకు నేను అంగీకరించలేదని చేశారు’’ అని ఫర్దౌసా చెప్పారు.
‘‘అప్పటి నుంచి, ఏ వ్యక్తితో కూడా నేను వారు చెప్పిన ప్రదేశానికి వెళ్లడం లేదు. ఇది చాలా ప్రమాదకరం. నేను ఎక్కడైతే వేధింపులకు గురికానని నమ్ముతానో ఆ హోటల్స్‌ను మాత్రమే నేను ఎంపిక చేసుకుంటూ ఉంటాను. ఒకవేళ ఏదైనా ప్రమాదం ఎదురై, సాయమడిగితే ఎవరైనా వచ్చేలా ఉండాలి’’ అని అన్నారు.
సెక్స్ వర్క్ చేస్తోన్న చాలా మంది మహిళలు అదృష్టవంతులు కారు. ఈ పురుషులతో కలిసి సెక్స్‌లో పాల్గొనేందుకు వారి ఇళ్లకి, లేదా ప్రైవేట్ ప్లేస్‌లకి వెళ్లినప్పుడు వేధింపులకు గురవుతున్నారు. కొన్నిసార్లు ఒకరి కంటే ఎక్కువ మంది పురుషులు వీరితో సెక్స్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఫర్దౌసా చెప్పారు.
ఇలా వీరిని వీడియోల్లో చిత్రీకరించి, ఆ తర్వాత బ్లాక్ మెయిల్ చేస్తుంటారని కూడా తెలిపారు.
వారు చెప్పే ప్రతి పనికి తలొగ్గాల్సి వస్తుందన్నారు.
ముఖం చూపించడం చాలా కష్టంగా ఉంటుంది
డ్రగ్ ఇచ్చిన తర్వాత సెక్స్ వర్కర్లతో ఇలా చేయిస్తారని హోడాన్ చెప్పారు. ఆ తర్వాత లాభాలను తమతో పంచుకోవాలని వేధింపులకు గురి చేస్తారని అన్నారు.
‘‘ఒకవేళ వారు ఇవ్వకపోతే, వారిని ఆ పురుషులు కొడతారు. శారీరకంగా హింసిస్తారు. ఆ వీడియోను ఒక ఆయుధంగా వాడుకుంటూ ఇబ్బందులకు గురిచేస్తుంటారు. కొన్ని సార్లు, యువతుల మధ్యలో టోర్నమెంట్‌లాగా ఈ వీడియోను ఇతరులకు షేర్ చేస్తుంటారు. ఇదొక డిజిటల్ బ్లాక్ మెయిల్’’ అని ఆమె అన్నారు.
సోమాలి మహిళలకు జరుగుతోన్న ఇలాంటి బ్లాక్‌మెయిల్‌పై బ్రిటీష్ టీవీ నెట్‌వర్క్ ఛానల్ 4 ఒక నివేదికను కూడా విడుదల చేసింది. ‘‘నాకు తెలిసిన చాలా మంది అమ్మాయిలకు ఇది జరుగుతుంది. ఒప్పుకోవడానికి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కానీ, ఆ తర్వాత ఏం జరుగుతుందో మాకందరికీ తెలుసు. ఈ జీవితంలోనే మేము ఎంతో కాలంగా ఉన్నాం’’ అని హోదాన్ అన్నారు.
2019 నుంచి 2020 మధ్య కాలంలో లైంగిక హింస భారీగా పెరిగినట్టు ఐక్యరాజ్య సమితి నివేదిక కూడా గుర్తించింది. చట్టాలు బలహీనంగా ఉన్న దగ్గర ఇలాంటి చోటు చేసుకుంటున్నాయని పేర్కొంది. బాధితులకు తక్కువగా లేదా అసలు సపోర్టు దొరకడం లేదని వెల్లడించింది.
సోమాలి సమాజంలో సెక్స్ వర్క్‌లో ఉన్న మహిళలు ఎక్కువగా ఈ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోమాలియాలో తమ లాంటి వారికి అసలు సపోర్టే దొరకదన్నారు ఫర్దౌసా. ఎవరూ కూడా సాయం చేసేందుకు ముందుకు రారని అన్నారు. సామాజిక ఒత్తిళ్లు మరింత ప్రమాదకరంగా మారుస్తున్నాయని చెప్పారు.
సోమాలియాలో చాలా మహిళా సంస్థలున్నాయి. బీబీసీ వారిని సంప్రదించినప్పుడు, ఇది చాలా సున్నితమైన అంశం కావడంతో దీనిపై స్పందించేందుకు వారు నిరాకరించారు.
తమకి సంస్థలు, పరిపాలన వ్యవస్థలు సహకరిస్తే చాలా మంది మహిళలు ఈ ప్రమాదకరమైన వృత్తిలోకి రారని హోడాన్, ఫర్దౌసా నొక్కి చెప్పారు.
డ్రగ్స్‌కి బానిసై చాలా మంది మహిళలు మరింత ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. రాత్రి పూట కనీసం వారికి నిద్రపోయేందుకు స్థలం కూడా ఉందని ఫర్దౌసా చెప్పారు.
లిడో బీచ్ ప్రాంతంలోని వీధుల్లో, ఇతర ప్రాంతాల్లో వారు నిద్రపోతుంటారని, ఇతరులు పురుషులతో వెళ్లడం వల్ల కనీసం పడుకునేందుకు స్థలం దొరుకుతుందన్నారు.
ఫర్దౌసా తన పక్కనున్న మరో అమ్మాయిని కూడా చూపించింది. తన పేరు అమినా, ఆమె కూడా సెక్స్ వర్కర్. అయితే, గర్భవతి కావడంతో ప్రస్తుతం ఆమె ఈ పనిని ఆపివేసిందని ఫర్దౌసా చెప్పారు.
‘‘అమినా ఎప్పుడూ ఈ జీవితం విడిచిపెట్టి, తిరిగి ఇంటికెళ్లాలని చెబుతూ ఉంటుంది. కానీ ఇది అంత తేలిక కాదు. మీ ప్రియమైన వారికి ముఖం చూపించడం చాలా కష్టంగా ఉంటుంది. ఈ మూడేళ్లలో ఒక్కసారి కూడా నేను నా కుటుంబాన్ని చూడలేదు’’ అని ఫర్దౌసా చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- కత్తిపీటతో హత్య చేసేందుకు మా నాన్నే ప్రయత్నించారు – కులం, గౌరవం, ప్రేమ కథ
- ‘రంగమార్తాండ' రివ్యూ: గుండె లోతుల్లోని ఉద్వేగాన్ని బయటకు లాక్కొచ్చే సినిమా
- అదానీ గ్రూప్ బొగ్గు గనికి వ్యతిరేకంగా ఛత్తీస్‌గఢ్‌లో గిరిజనులు ఏడాదిగా ఎందుకు నిరసనలు చేస్తున్నారు?
- ఉగాది: మనం ఉన్నది 2023లో కాదు.. 1945 లేదా 2080
- వడగళ్ల వానలు ఎందుకు పడతాయి? అవి వేసవిలోనే ఎందుకు ఎక్కువ?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














