ముసిరి: మసాలా దినుసులకు పేరుగాంచిన ఈ దక్షిణాది రేవు పట్టణం ఎలా మాయమైంది?

ముసిరి
  • 2000 ఏళ్లనాటి తమిళ సంగం సాహిత్యంలో ముసిరి గురించి ప్రస్తావన ఉంది.
  • 14వ శతాబ్దంలో ఈ వాణిజ్య రేవు పట్టణం మ్యాప్‌లో నుంచి మాయమైంది.
  • అయితే, కేరళలోని పట్టణమ్ అనే ప్రాంతంలో చేపట్టిన తవ్వకాల్లో ఆసియా, ఐరోపా, ఆఫ్రికాల్లోని భిన్న సంస్కృతులకు చెందిన వస్తువులు బయటపడ్డాయి.
  • బంగారు ఆభరణాలు, పూసలు, చేర రాజుల నాణేలు పట్టణమ్ తీరంలో లభ్యమయ్యాయి.
  • రోమన్ ప్రభువు ఆగస్టస్ సీజర్ దగ్గర ఉండే రాజముద్ర తరహా ఉంగరమూ ఇక్కడ లభ్యమైంది.
  • ముసిరి, పట్టణమ్ ఒకటేనా?
ముసిరి

దక్షిణ భారత దేశంలోని ఒకప్పటి ప్రముఖ రేవు పట్టణం ముసిరి కథ పురావస్తు శాస్త్రవేత్తలకు నేటికీ అంతుచిక్కడం లేదు. ఒకప్పుడు సముద్ర వాణిజ్యానికి ఈ పట్టణం ప్రధాన కేంద్రంగా ఉండేది.

ప్రాంతీయ పరిశ్రమలు, వాణిజ్యం అభివృద్ధిలో ముసిరి ముఖ్య పాత్ర పోషించింది. ఈ నగరానికి సంబంధించిన విశేషాలతో బీబీసీ రీల్ ఒక కథనం పబ్లిష్ చేసింది.

రోమన్ రచయిత ప్లీనీ ద ఎల్డర్ ఈ ముసిరి పట్టణాన్ని ‘‘భారత్ తొలి మార్కెట్’’గా తన రచనల్లో ప్రస్తావించారు.

ఈ పట్టణం నుంచే సుగంధ ద్రవ్యాలు, విలువైన రాళ్లు, ఏనుగు దంతాలు, సిల్క్ లాంటి వస్తువుల వాణిజ్యం కొనసాగేది.

అయితే, 14వ శతాబ్దంలో ఈ రేవు పట్టణం ఒక్కసారిగా మ్యాప్ నుంచి కనుమరుగైంది.

ఈ పట్టణం ఎక్కడ ఉండేది? ఎలా ఉండేది? లాంటి ప్రశ్నలకు సమాధానాలపై ఇప్పటికీ పురావస్తు శాఖ అధికారుల్లో ఏకాభిప్రాయం లేదు.

ముసిరి

ఫొటో సోర్స్, Getty Images

మసాలా దినుసుల వాణిజ్యం

పశ్చిమాన ఆరేబియా తీరంలోని కేరళలో మలబార్ ప్రాంతంలో ఈ నగరం ఉండొచ్చని పురావస్తు శాఖ అధికారులు భావిస్తున్నారు. పశ్చిమ దేశాలతో మసాలా దినుసుల వాణిజ్యంలో ఇది ప్రధాన పాత్ర పోషించేది. అయితే, 14వ శతాబ్దంలో ఆ వాణిజ్యం ఒక్కసారిగా ఆగిపోయింది.

ప్రముఖ వాణిజ్య మార్గాల్లోని కీలకమైన పట్టణాల్లో ముసిరి కూడా ఒకటి. దీని గురించి 2000 ఏళ్లనాటి తమిళ సంగం సాహిత్యంలో ప్రస్తావన కూడా ఉంది.

దక్షిణ భారతం, పర్షియా, పశ్చిమాసియా, ఉత్తర ఆఫ్రికాతోపాటు మధ్యదరా సముద్ర ప్రాంతంలోని రోమన్ సామ్రాజ్యంతోనూ ముసిరికి వాణిజ్య సంబంధాలుండేవి.

రెండో శతాబ్దంలో రోమన్ సామ్రాజ్యం రూపొందించిన మ్యాపుల్లోనూ ముసిరి గురించి ప్రస్తావన ఉంది.

ముసిరి ఇక్కడే ఉండేదని కేరళలోని కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసర్చ్ చైర్మన్ డాక్టర్ బీకే మైఖెల్ తరగన్ కూడా నొక్కి చెప్పారు. ఈ రేవు పట్టణానికి రోమన్ నౌకలు వచ్చేవన్నారు.

‘‘మిరియాలను వెతుక్కుంటూ రోమన్లు ఇక్కడకు వచ్చారు. అప్పట్లో పశ్చిమ ప్రాంతాల్లో మిరియాలను బంగారంతో సమానంగా చూసేవారు. అందుకే మిరియాలను ‘బ్లాక్ గోల్డ్’గా చెప్పేవారు’’ అని తరగన్ వివరించారు.

అప్పట్లోనే పశ్చిమ దేశాల వంటల్లో మిరియాలు తప్పనిసరి దినుసుగా మారిపోయాయి. దీంతో ఎలాంటి సవాళ్లనైనా ఎదురించి వీటిని తీసుకెళ్లేందుకు వాణిజ్యకారులు వచ్చేవారు.

ముసిరి

ఈ నగరానికి ఏమైంది?

14వ శతాబ్దంలో ఈ రేవు పట్టణం మాయం కావడానికి కారణాలపై చరిత్రకారులు భిన్న వాదనలు వినిపిస్తున్నారు.

రోమన్ సామ్రాజ్యం పతనం కావడంతో ఈ రేవు పట్టణం కూడా మ్యాప్‌ల నుంచి మాయం అయిందని కొందరు వివరిస్తున్నారు.

1341లో పెరియార్ వరదలు ఈ పట్టణాన్ని ధ్వంసం చేశాయని మరికొందరు చెబుతున్నారు.

ముసిరి పట్టణం ఎక్కడ ఉండేదని మనం ఇప్పుడు అన్వేషణ చేపడితే ఈ అధ్యయనం వివాదానికి కేంద్ర బిందువు అవుతుంది.

నిజానికి దీని కోసం 2006-2007లో దక్షిణ భారత దేశంలో తవ్వకాలు జరిపారు. కేరళలో ఎర్నాకుళం తీరంలో పట్టణమ్‌ అనే ప్రాంతంలో ఈ తవ్వకాలు జరిగాయి. దీంతో మధ్యదరా, ఐరోపా దేశాలతో ఈ ప్రాంతానికి గట్టి వాణిజ్య సంబంధాలుండేవనే ఆధారాలు బయటపడ్డాయి.

వీటి గురించి మాట్లాడుతూ.. ‘‘ముసిరి రేవు పట్టణాన్ని మేం గుర్తించాం’’ అని డాక్టర్ బెన్నీ కురియాకోస్ అప్పట్లో మీడియాతో చెప్పారు.

‘’12 దశల్లో జరిగిన పట్టణం తవ్వకాల్లో నేను కూడా పాల్గొన్నాను. వీటిలో భిన్న సంస్కృతులకు సంబంధించిన ఆధారాలు మాకు దొరికాయి’’ అని డా. బీజే చెరియన్ చెప్పారు.

‘‘ఆనాడు ఆసియా, యూరప్, ఆఫ్రికాలలోని 37 సంస్కృతులకు సంబంధించి బయటపడిన వస్తువులతో ఇవి సరిపోలుతున్నాయి. ప్రపంచంలోని భిన్న ప్రాంతాలకు చెందిన వస్తువులు ఇక్కడ మాకు దొరికాయి. ఆ తర్వాత కార్బన్ డేటింగ్ నిర్వహించాం. అప్పుడే ఇవి ముసిరి పట్టణానికి చెందినవి అయ్యుండొచ్చనే నిర్ధరణకు వచ్చాం’’ అని చెరియన్ వివరించారు.

ముసిరి

తవ్వకాల్లో ఏం దొరికాయి?

పట్టణమ్ తవ్వకాల్లో బంగారు ఆభరణాలు, గాజు పూసల నుంచి చేర రాజుల నాణేలు కూడా బయటపడ్డాయి.

రోమన్ సామ్రాజ్యానికి సంబంధించిన ఒక రాజ ముద్ర తరహా ఉంగరం కూడా 2020లో బయటపడింది. రోమన్ చక్రవర్తి కాకముందు ఇలాంటి ఒక ఉంగరం ఆగస్టస్ సీజర్ దగ్గర కూడా ఉండేది.

ప్రపంచంలో మరెక్కడా కనిపించని కొన్ని వస్తువులు కూడా పట్టణమ్‌లో కనిపించాయి. దీనికి అర్థం ఏమిటి?

బహుశా ముసిరి నగరంలో ఈ పట్టణమ్ ప్రాంతం కూడా భాగమై ఉండొచ్చా?

‘‘బహుశా ఆ నగరం నేటి న్యూయార్క్, లేదా షాంఘై లేదా ముంబయి తరహాలో ప్రధాన పాత్ర పోషించి ఉండొచ్చు’’ అని చెరియన్ అన్నారు.

ముసిరి

ఫొటో సోర్స్, Getty Images

ఎవరు ఏం అంటున్నారు?

తవ్వకాల్లో లభించిన ఆధారాలను పరిశీలించిన తర్వాత, ఎర్నాకుళంలోని పట్టణమ్ ప్రాంతం ముసిరి పట్టణంలో భాగమై ఉండొచ్చని కొందరు చరిత్రకారులు చెబుతున్నారు.

అది ముసిరి విలసిల్లిన చోటుకాదని కొందరు చరిత్రకారులు విభేదిస్తున్నారు.

దీంతో అసలు పట్టణమ్, ముసిరి ఒకేటేనా కాదా? అనే చర్చ పెరిగింది. దీనిపై బెన్నీ కురియాకో మాట్లాడుతూ.. ముసిరి చాలా పెద్ద పట్టణమని చెప్పారు.

‘‘అక్కడ నదికి రెండు వైపులా తీరాలను కలిపి ముసిరి పట్టణం ఉండొచ్చు. ఇంకా భూమి కింద చాలా ప్రాంతం కప్పుకుపోయి ఉండొచ్చు. బహుశా ఆ చుట్టుపక్కల తవ్వకాలు చేపడితే, అది బయటపడొచ్చు’’ అని ఆయన చెప్పారు.

పశ్చిమ ఆసియాలోని కొన్ని పురాతన నాగరికతలతో ముసిరికి సంబంధాలు ఉండేవి. ఆ తర్వాత పోర్చుగీసు, డచ్ వాసులు కూడా ఇక్కడకు వచ్చి ఉండొచ్చు.

‘‘ముసిరికి చాలా పెద్ద వాణిజ్య చరిత్ర ఉండేది’’ అని ముసిరి హెరిటేజ్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ మనోజ్ గినీ చెప్పారు.

వీడియో క్యాప్షన్, ఈ గుడి ముందున్న గరుడ స్తంభం టిప్పు సుల్తాన్ ప్రాణాలు కాపాడిందా?

కోచి నుంచి ముసిరి

14వ శతాబ్దంలో ముసిరి ఒక్కసారిగా మాయమైంది. ఆ తర్వాత ఇక్కడ ప్రధాన రేవు పట్టణంగా కోచి అవతరించింది. అయితే, ఈ రెండు ప్రాంతాల మధ్య నేటికీ కొన్ని సంబంధాలు మనకు కనిపిస్తాయి.

2012లో కోచి-ముసిరి ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫెస్టివల్‌ను కోచిలో నిర్వహించారు. ఒకప్పటి సాంస్కృతిక పట్టణాన్ని నేటి ఆధునిక సంస్కృతితో మేళవించడమే దీని లక్ష్యం.

‘‘అటుకోచి, ఇటు ముసిరి.. రెండు భిన్న సంస్కృతులకు నిలయం. ఇక్కడ సంస్కృతి, వాణిజ్యం మాత్రమే కాదు.. మతపరమైన విలువలు కూడా. లౌకికవాదానికి ఈ పట్టణాలు పెట్టింది పేరు. ఆర్ట్‌ ఫెస్టివల్‌కు ప్రపంచంలోని భిన్న ప్రాంతాలకు చెందిన కళాకారులు వచ్చారు’’ అని ఆర్ట్ ఫెస్టివల్ ప్రెసిడెంట్, డైరెక్టర్ బోస్ కృష్ణమాచారి చెప్పారు.

‘‘ముసిరి తల్లి లాంటిది. కోచి బిడ్డ. ఈ రెండింటి మధ్య పేగు బంధం ఉంది’’ అని ఆయన అన్నారు.

ముసిరి ఎక్కడ ఉండేదనే ప్రశ్నకు భిన్న సమాధానాలు వచ్చినప్పటికీ, అది దక్షిణ భారత దేశంలో ఉండేదని మాత్రం అందరూ అంగీకరిస్తారు.

ఇక్కడ భిన్న సంస్కృతులు విలసిల్లాయి. వస్తువులు, ఆలోచనలను శతాబ్దాల పాటు ఇక్కడ పంచుకున్నారు. భారత్ తొలి మార్కెట్ మ్యాప్ నుంచి కనుమరుగై ఉండొచ్చు. కానీ, ఆ సంస్కృతి, వారసత్వ సంపద నేటికీ ఇక్కడ కనిపిస్తుంది.

వీడియో క్యాప్షన్, రామసేతు రాముడి కాలంలో జరిగిన నిర్మాణమా, ప్రకృతి సిద్ధమా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)